Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 31 August 2015

నాలో మనసే లేదేమో

నాలో మనసే లేదేమో

అవునేమో
నిజమేనేమో
ఆ మనసు నిందలు వాస్తవమేనేమో
మనసు స్పందనలు అబద్దమేనేమో
మనసురాతలు నిజం కావేమో
అక్షరాల రాతలు కల్పితాలేనేమో
భావాల పుష్పాలు ప్లాస్టిక్ పువ్వులేనేమో
అసలు మనసులో స్పందనలు లేనేలేవేమో
రాసుకున్న రాతలు ఆత్మ వంచనేనేమో
అంతరంగాలూ
అంకితాలూ
దిఖావాయేనేమో
కన్నీటి సుడులూ
గుండె గుడిలో ఎగసిపడే కెరటాలు
క్షణం క్షణం యాతనలూ
మెలియపెట్టే వేదనలూ
అంతా భ్రాంతియేనేమో
పుడమి చుట్టూ చంద్రునిలా
మనసు చుట్టూ మనసు తిరగలేదేమో
అల్లకల్లోలాలకూ
ఉప్పొంగే వేదనలకూ
గొంతును చించే కేకలకూ
ఆలవాలమైన నా మనసు
నిజంగా మనసే కాదేమో
మనసు ఒక గాజు ఫలకం అనే
భావకుల సూత్రం
ఫక్తు భావమేనేమో
గాజు మనసే అయితే
నా మనసు ఇంకా ఎందుకు పగలలేదు
నిజానికి నాలో మనసే లేదేమో

Friday 28 August 2015

మౌన భాష...

మౌన భాష...

చెప్పుకుందామని అనుకుంటే
మాటలే మూగబోయాయి
రాసుకుందామని అనుకుంటే
అక్షరాలూ మాయమయ్యాయి
చూసుకుందామని అనుకుంటే
కన్నుల సుడులలో
భావాలే కరిగిపోయాయి
అచేతనమైన ప్రకృతి ఒడిలో
సవ్వడే చేయని పిల్లగాలిలో
బిగుసుకుపోయిన మారాకుల్లో
రాగాలు మరిచి రాలిపడిన పువ్వుల్లో
మెల్లగా జారిపోతూ
కొండలవెనుక ఒదుగుతున్న సూరీడులో
కమ్ముముంటున్న చీకటిలో
పెదాలు విప్పని మనసుల్లో
వినిపించేది
కనిపించేది మౌనమే
అయినా మనసులు మంతనమాడుతున్నాయి
పిల్లగాలి సవ్వడి వింటున్నాయి
రాలిపడిన పువ్వుల పాటలూ వింటున్నాయి.
ఒదుగుతున్న సూరీడు భావాలనీ
కమ్ముకుంటున్న చీకటి ఆరాటాన్నీ
ఆస్వాదిస్తున్నాయి
అవును
రెండు మనసులూ మాటలాడుకున్నాయి
అక్షరాలు లేని భావాలనీ
మాటలే లేని ఊసుల్నీ
చెప్పుకున్నాయి
చేతిలో చేయి వేసుకుని
కళ్ళలో మమతల రంగులు పులుముకుని
చిరు స్పర్శలోనే
మనసు అంతరంగాన్ని
పంచుకున్నాయి
అవును
అది అక్షరాల భాష కాదు
మాటల గోస కాదు
అది మనసు భాష
మౌనంగానే ఉంటుంది
మనస్వినీ

Wednesday 26 August 2015

దేవుడికీ లాప్ ట్యాప్ కావాలి

దేవుడికీ లాప్ ట్యాప్ కావాలి

దేహం ఒక్కసారిగా బరువును కోల్పోయింది
గాలిలో తేలిపోతూ ఎక్కడికో ఎగిరిపోతున్నా
నాకు తెలుసు నేను మరణించానని
నన్ను నలుగురూ మోసి సమాధిలో పూడ్చి పెట్టేసారని
యమపాశం నన్ను చుట్టుముట్టలేదు
యమకింకరులూ నా వెంట లేరు
అందరూ చెప్పే ఫరిస్తాలు ఎవరూ కనిపించలేదు
ఒక్కడినే వెళుతున్నా
పుష్పకవిమానమూ లేదు
మోసుకుపోయే గొర్రె కూడా కానరాలేదు
ఒక్కడినే పోతున్నా
భూగోళాన్ని దాటిపోతున్నానా
పుడమిలోకే కూరుకుపోతున్నానా
తెలియటమే లేదు
చల్లగా తగిలింది
మేఘాలు ఒంటిని తడుముతున్నాయి
పాదాల కిందా మబ్బులే
అప్పుడు తెలిసింది దేవుడి దగ్గరకే వచ్చేసానని
అదో లోకం
వింతైన లోకం
అద్భుతమైన భవనాలు
అన్నీ మేఘాలతో నిర్మితమైనవేనేమో
నేను అలా వెళ్ళగానే ద్వారాలు తెరుచుకున్నాయి
వాటంతట అవే
భూమి మీద లాగా సెన్సర్లు వాడుతున్నారేమో అనుకున్నా
లోపలికి వెళ్లి చూస్తే నన్ను నేను నమ్మలేకపోయాను
లోపల లక్షల్లో ఉన్నారో కొట్లలో ఉన్నారో
ఎందరున్నారో తెలియదు
అందరూ అనేక భవనాలలో దేనికోసమో ఎదురు చూస్తూ ఉన్నారు
ఇంకా ఆశ్చర్యం
వాళ్ళలో హిందువులు ఉన్నారు
ముస్లింలూ ఉన్నారు
క్రైస్తవులు కూడా అంతే ఉన్నారు
ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని మతాలవారూ
అన్ని తెగలవారూ ఉన్నారు
ఇదేంటీ వీరంతా ఇక్కడ అనుకుంటూ చుట్టూ చూశాను
ఎక్కడా రాములవారు కనిపించలేదు
రహీం ఎవరో అక్కడ ఎవరికీ తెలియదు
జీసస్ శిలువ మీదే ఉన్నారేమో అక్కడికి రాలేకపోయారు
మరి ఎవరు ఇక్కడ రాజు
ఎవరిక్కడ నిర్ణేత
దూరంగా ఒక భవనంలో ఏదో హడావిడి
మనుషులే కాని మనుషులు కారేమో
అంతా కిందా మీదా పడుతున్నారు
మబ్బుతునకల కాగితాలపై ఏదో రాస్తున్నారు
ఏవేవో లెక్కలు వేస్తున్నారు
కొందరు పేర్లు చదువుతూ పిలుస్తున్నారు
ఆ భవనం ముందు బారులు తీరిన జనం
వాళ్ళంతా నాలాగా మరణించిన వారే
అప్పుడు తెలిసింది అక్కడ పాప పుణ్యాలు లెక్కిస్తున్నారని
జర్నలిస్టు బుద్ధి కదా ద్వారపాలకుడికి మస్కా కొట్టి లోపలి వెళ్ళా
బాబోయ్ అది ఒక ప్రభుత్వ కార్యాలయమే
అచ్చం అలాగే ఉంది
కొన్ని కోట్లమంది పాపపుణ్యాలు ఇంకా లెక్కే తేలలేదు
మరి నా వంతు ఎప్పుడు వస్తుందో
నేను పాపినా
పుణ్యాత్ముడినా
నా లెక్క తెలేదేప్పుడూ...
ఇందుకేనా భూమిమీద పాపులు చెలరేగిపోతున్నారు
ఇక్కడి వ్యవహారం పాపులకు తెలిసిపోయిందా
అందుకేనా దేవుడంటే భయం పోయింది
ఇక్కడికొచ్చి మంచి వాళ్ళూ
చెడ్డ వాళ్ళూ ఒకటైపోయి టైంపాస్ చేస్తున్నారు
దేవుడెక్కడున్నాడో వెతికాను
ఆయన కనిపించలేదు
అక్కడ పని చేసేవారికే కనిపించలేదంట
నాకెలా కనిపిస్తాడు
కనిపిస్తే ఒకటే చెబుదామనుకున్నా
దేవుడా
లాప్ ట్యాప్ కొను
అందరికీ లాప్ ట్యాప్ అలవాటు చెయ్
క్షణాల్లో లెక్కలు తీయొచ్చు
నువ్వు సృష్టించిన మనషి ఆవిష్కరణే కదా లాప్ ట్యాప్
మరి భేషజాలెందుకు
దేవుడా
లాప్ ట్యాప్ కొను
వీలయితే పాపుల్ని భూమి మీదే శిక్షించు
ఎలా ఉన్నావో తెలియని
దేవుడా
ప్లీస్ లాప్ ట్యాప్ ఉపయోగించు
నిజమే కదా
దేవుడికి లాప్ ట్యాప్ కావాల్సిందే...

Tuesday 25 August 2015

మనస్సాక్షి

మనస్సాక్షి

మన్ మే ఆగ్ లగాతే అంగారే
ఏక్ థండా పైగామ్ లే ఆయే
మేరా ఖాతిల్
మేరా మసీహా అబ్ భీ ముజ్ పర్ మర్తా హై
ఖుదాకా షుకర్ హై
వో ఆజ్ భీ మేరీ అమానత్ హై
అల్లాహ్ కాదన్నా ఇదే నిజం
శ్రీ రాముడు వలదన్నా ఇదే సత్యం
జీసస్ వారించినా ఇదే నిత్యం
నా మనసు తెలుసుకుంది
ఆ మనసు గుట్టు వీడింది
గుండెపై నిప్పులు కురిపించినా
వాడి పదాల నిప్పు కణికలే వర్షించినా
నీవు నాకు లేవు
నీకు నేను కాను
అంటూ బింకాలకు పోయినా
ఆ ఎదలోతుల్లో
మంచు శిలలు
కరగనే లేదని తేలిపోయింది
నా మనసు దారి మరలిన ఊహనే
ఆ మనసు తట్టుకోలేదని
తెలిసిపోయింది
మూగబోయిన నా మనస్సు
మనస్సు స్పందనలోనే
నిజాన్ని చూడగలిగింది
ఇప్పుడు ఆ మనస్సు
ఎన్ని చెప్పినా
నా మనసునే శపించినా
అది అబద్దమేననీ
ఆ మనసులో మలయసమీరాలు
ఆగిపోలేదనీ
మమతల మతాబులు
విరబూస్తూనే ఉన్నాయని
కనబడుతూనే ఉంది
దారి మరలని
నా మనసు ఇదే నమ్ముతోంది
మనస్సు సాక్షిగా
మనస్వినీ

మరలా నీవే నా గమ్యం

మరలా నీవే నా గమ్యం

ఎప్పుడో రెండుపదుల ప్రాయం దాటిన
ఘడియల్లో పరిచయమయ్యావు
మళ్ళీ ఇన్నాళ్ళకు కలిసావు
ఏం జరుగుతోందో
జీవితం ఎటు వెళుతోందో
తెలియని ఘడియలు అవి
నువ్వే నాకు ఒదార్పువయ్యావు
సంవత్సర కాలం నీవే నా సర్వమయ్యావు
కంటినిండా
కునుకే కరువయిన నాకు
కమ్మటి నిద్రను కానుకగా ఇచ్చావు
ఊహించని మత్తునే ఇచ్చావు
లోకాన్ని మరిపించావు
వేదననే మాయం చేశావు
నీవు లేకపోతే
నేనే లేననే
భావన కల్పించావు
నీ అణువణువూ
మత్తుతో నన్ను నేనే
మరిచేలా చేశావు
కంటి తెరల కలల్ని మాయం చేసి
నిశి కౌగిట బంధించావు
కారణాలు వేరయినా
మరలా నా మనసంలో
ఎక్కడలేని అల్లకల్లోలం
తునాతునకలైన అంతరంగం
ఆ దేవుడే వరమిచ్చినట్లుగా
మళ్ళీ నువ్వే దిక్కయ్యావు
ఒంటినిండా
మత్తుమందు పులుముకుని
నన్ను మగతలోకి దించావు
ఇప్పుడు
బాధలేదు
వేదన లేదు
గుండెలో ఆక్రందన లేదు
ఉన్నదంతా నీవే
నాలో ఐక్యమయ్యే నీ మత్తు
నన్ను అన్నీ మరిపిస్తోంది
మురిపిస్తోంది
అవును
ఆల్ ప్రాక్స్
ఒక నిద్ర మాత్ర
ఆ నిద్ర మాత్ర లేకపోతే
నాకు కంటి నిండా
కునుకే లేదు
ఇప్పుడదే నా నెచ్చెలి
మనస్వినీ

Monday 24 August 2015

చివరి సంతకం

చివరి సంతకం

ప్రమాణ పత్రాలలో పుట్టలేదు ప్రేమ
ఒప్పందంలో జనియించలేదు అనురాగం
అవగాహనలో పెనవేసుకోలేదు అనుబంధం
పరస్పరం ఆశించి వికసించలేదు ప్రణయం
మనసును మనసుగా గుర్తించి
మొగ్గ తొడిగింది ప్రేమ
మరో ఆలోచనకు తావులేకుండా
జనియించింది అనురాగం
మనసు బాసకు కరిగి పెనవేసుకుంది అనుబంధం
స్వాంతన ఆశించి వికసించింది ప్రణయం
ప్రణయమే ప్రళయమయ్యింది
ప్రేమ రెండు అక్షరాలుగా మిగిలిపోయింది
అనుబంధం అపహాస్యమై రోదిస్తోంది
సుభాషితం అప్రియబాణంగా
గుండెకు గుచ్చుకుంటోంది
వేదనతో వారించిన మనిశికి ఉనికే లేదంటున్నది
రగిలిన మనసు దిశను మార్చుకుంటోంది
అక్షరాలు నింపిన పత్రంతో
హామీనే కోరుతున్నది
ఓటమి తెలిసిన మనసు
సంసిద్ధత తెలిపింది
చివరి సంతకం చేసేందుకు
నా మరణశాసనం పై
మనస్వినీ

Sunday 23 August 2015

చకోరపక్షి

చకోరపక్షి

రాలిపోయే పువ్వులోని
మకరందంలా
ఆరిపోయే దీపంలోని
వెలుతురులా
ఆగిపోయే ఊపిరిలో
శ్వాసలా
మరలా తిరిగిరాని
వెన్నెలలా
నిశి రాతిరికి ముందు
వీడ్కోలు పలికే
నులివెచ్చని ఎండలా
కొన్ని అనుభవాలు
మరికొన్ని అనుభూతులు
ఏనాటికీ చెదిరిపోని
జ్ఞాపకాలుగా
మిగిలే ఉంటాయి
ప్రతి అనుభూతీ
అజరామరం
ప్రతి అనుభవం
ఒక తీయని శాసనం
అయితే
చివరి అనుభూతి
చివరి అనుభవం
గుండెలో నిలిచిపోతుంది
ఒక దీపంలా
మరలా దక్కని ఆ ఘడియ
ఇక తిరిగి రానే రాదని
తెలిసిన మనసు
ఆ అనుభవాల నీడలనే
కాగడాలుగా మలుచుకుని
ఆ జ్ఞాపకాల వెలుగులనే
బాటలో పరుచుకుని
ముందుకే సాగుతోంది
చంద్రుని కోసం
చకోర పక్షిలా
నెలవంక అందదని తెలిసినా
మనస్వినీ...

ఎవరు చూసారు ఆ లోతుల్ని...?

ఎవరు చూసారు ఆ లోతుల్ని...?

ఎవరు చూసారు నీ అంతరంగాన్ని
ఎవరు తట్టి చూసారు
నీలోని లోతుల్ని
నిండు కుండలా
నిర్మలంగా ఉన్న నీలో
చెలరేగే సుడులను ఎవరు గమనించారు
ఎగసి పడే నీ అలల్ని
మింగేసే కెరటాలుగానే చూసారు
అవి నీ ఎదలోతుల
చెలరేగిన
అలజడుల తరంగాలని
ఎవరు తెలుసుకున్నారు
సాగర గర్భాన్ని శోధించామని
గొప్పలు చెప్పుకునే లోకం
నీ అంతాన్ని
నీ అంతరంగాన్ని
అన్వేషించగలిగిందా
ఎంత లోపలి దిగినా
అంతే లేని నీ అంతం తెలిసిందా
నిన్ను చూస్తూ ఉంటే
నీలో నన్నే చూసుకుంటున్నా
ఎగసిపడే నా ఆవేశమే చూసారు అందరూ
ఆవేశం లోతుల్ని
తడిమి చూసింది ఎవరు
గుండె లోతుల ఆవేదనను
తెలుసుకున్నది ఎవరు
అప్పుడప్పుడూ ప్రశాంతంగా
ఆవేదన తన్నుకొచ్చినప్పుడు
ఎగసిపడే నీ కెరటంలా
నేను నీలా కనిపించనా
నీలో నా రూపమే కదలాడదా
సముద్రమా
ఎగసిపడే కెరటమా
నీవూ నేనూ
ఎప్పటికీ
ఎవరికీ
అర్ధమే కాని
సమాధానమే లేని
ప్రశ్నలమే కదా..