Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 30 December 2015

ఆగిన అన్వేషణ

ఆగిన అన్వేషణ 

జీవనగమనంలో
అడుగు తీసి అడుగువేస్తూనే ఉన్నా
ప్రతి అడుగునూ
ప్రగతిబాటగా మలుచుకున్నా
అందరూ ఉన్నా
ఎవరూ లేని అనాధగా
ఏదో తెలియని వెలితితో
ఎవరికోసమో ఎదురుచూస్తూ
నడుస్తూనే ఉన్నా
ఒక్కసారిగా అడుగులు ఆగిపోయాయి
ఎన్నాళ్ళో వేచిన ఉదయం
కనులముంగిట వాలింది
నా నిరంతర అన్వేషణ
నా అంతరంగ శోధన
నా ముంగిట నిలిచింది
భావం మొలకలు వేసిన ఆది ఘడియ నుంచి
అప్పటిదాకా
నేను కన్న కలలు
నేను అల్లుకున్న ఆశల పందిళ్ళు
అన్నీ నిజమైపోయాయి
ఎక్కడా లేని ఊహా సుందరి
కలల వేదికలో
కల్పనల ముంగిలిలో
మనోఫలకం లో
చెరగని ముద్ర వేసిన
మనస్విని
ఊహల తెరలను తెంచి
వాస్తవమై నిలిచింది
అవును
నా కల ఫలించింది
అక్షరమాలికలుగా అల్లుకున్న
నా భావాలన్నీ
ఒక ముద్దలా మారి
సుందరమైన ఆకృతికి
ప్రాణం పోశాయా అనిపించింది
నిజమే
తను నా ఊహా సుందరే
కలల లోకం వీడి
నాలోకంలోకి అడుగిడిన
నా హృదయ నాయికే
నాటి నుంచి నేటి దాకా
నాలో అదే ఆరాధన
అదే భావన
తనను తనలాగే ఊహించుకున్నా
తనలాగే ప్రేమిస్తున్నా
నన్ను నన్నుగా ప్రేమించినా
నాలో లోపాలే ఎత్తి చూపినా
అదే ప్రేమ
అదే ఆరాధన
అదే భావం
నాలో సజీవంగా ఉంటుంది
ఎందుకంటే ఇప్పుడు
నా అడుగులు ఆగిపోయాయి
ఇక్కడే
ఇలాగే ఉంటాను
అంతం నన్ను ముద్దడినా
నా అడుగులు
ఇంకా ముందుకు సాగవు
ఇప్పుడు
నా అన్వేషణ ఆగిపోయింది
మనస్వినీ

Monday 28 December 2015

మనసంటే...

మనసంటే... 

ఎవరికి తెలుసు మనసంటే...
ఎవరు చూసారు మనసు నిండా
మనసుని...
ఎవరు చదివారు సమగ్రంగా
మనసుని...
ఎవరు తడిమారు మనసులోని
భావాలని...
ప్రియమైన మనిషి
అప్రియంగా పలికితే
కనులనుండి వెచ్చగా
జారిపడే కన్నీటి చుక్కే
మనసు...
అశ్రువులు ఇంకిపోయి
రుధిర భాష్పాలు కురిస్తే
అదీ మనసే...
మాటలు మరిచి
చేష్టలు ఉడిగి
మౌనంగా మిగిలిపోయే
కనుల భాష మనసే...
కన్నులలో మెరిసే వెలుగులూ
పెదాలపై జిలుగులూ
మనసే...
హృదయవిదారక ఆక్రందనలూ
విరిసే నవ్వుల పువ్వులూ
గిల్లి కజ్జాలు
కొంటె కవ్వింతలూ
మనసే...
మనసైన మనసు స్పందనలకు
ప్రతిస్పందనలూ
మనసే...
జీవన గమనంలో భావాల సమాహారం
మనసే...
మనసును మనసుగా చదివే గుణం
ఒక దైవిక వరమే
మనస్వినీ...

Wednesday 23 December 2015

అమ్మఒడి

అమ్మఒడి

గడియారంలో పెద్దముల్లు
పదిసార్లు కూడా గమ్యం దాటలేదు
పట్టుమని పదినిమిషాలు కూడా
గడవలేదు
అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన
చిన్నపిల్లాడిలా
ఆటలాడి అలసిన
పసివాడిలా
అమ్మ ఒడిలో
తల ఆనించాను
ఏవేవో భావాలు
ఎన్నెన్నో ఊసులు
మరెన్నో కథలు
ఇంకెన్నో గొడవలు
మనసుపొరల్లో
బొమ్మల్లా కదలాడాయి
అన్నీ చెప్పాలని అనిపించింది
రోజూ ఆడుకునే దోస్తు
తిట్టాడని చెప్పాలనిపించింది
పరుగులు తీయలేక కిందపడి
మోచేతికి తగిలిన గాయం
చూపాలనిపించింది
పూదోటలో పుష్పం కోయబోయి
చేతికి గుచ్చుకున్న ముళ్ళు
చూపించాలనిపించింది
నేను చేసిన చిలిపి పనులు
నేను చేసిన సరదాలు
ఎవరో పెట్టిన చివాట్లు
అన్నీ విడమర్చి చెప్పాలనిపించింది
అమ్మతో మనసు పంచుకోవాలనీ
అందరిపై చాడీలు చెప్పాలనీ
మనసు ఉబలాటపడిపోయింది
నా కన్న బంగారం అని
అమ్మ నోట వినాలని
అనిపించింది
మనసుపొరల్లో చెలరేగిన భావాలు
కన్నీటి పొరలుగా దూకి వస్తుంటే
కష్టంగానైనా అదిమిపెట్టుకున్నా
నా మౌనభాష
అమ్మమనసుకు చేరిందేమో
నా తల నిమురుతున్న
ఆ చేతి స్పర్శ
అన్నింటికీ
సమాధానం చెప్పేసింది
అవును
అమ్మ ఒడిలో నేను ఎన్నటికీ
పసిబిడ్డనే
మనస్వినీ

Tuesday 22 December 2015

అక్షరాలే లేని భావం

అక్షరాలే లేని భావం

జనియించిందా ఆ అక్షరం
అంకురించిందా ఆ భావం
ఉరకలు వేసిందా ఆ రాగం
ఎక్కడుంది ఆ అక్షరం
ఎక్కడ పుట్టింది ఆ భావం
ఎక్కడ వినిపించింది ఆ రాగం
లేదు ఆ అక్షరం ఇంకా పుట్టలేదు
ఆ భావం ఇంకా చిగురించలేదు
ఆ రాగం ఇంకా ఎవరూ పాడలేదు
ఎవరు రాయగలరు నీలోని భావాన్ని
ఎవరు తడిమి చూడగలరు నీలోని అంతరంగాన్ని
పెదాలపై చిరునవ్వు తొణికిసలాడుతున్నా
కళ్ళలో మెరుపులు కాంతులీనుతున్నా
అందరిలో ఒకరిలా
గలగలా నవ్వుతున్నా
ఉరకలేసే గోదారివే అనిపిస్తున్నా
ఎవరు చూసారు నీలోని వేదనని
ఎవరి మనసు చూసింది నీ రోదనని
నీ ఆక్రందనకు అక్షరం ఉందా
నీ ఆవేదనకు భావం ఉందా
నీ మానసిక కల్లోలానికి అక్షర సంకెలలు వేసే
కవిత్వం పుట్టిందా
అమ్మవు నీవు
మనసు లోతున ఆక్రందనవు నీవు
నీతోటలో  వికసించిన పుష్పం కోసం
మూగగా రోధించే ఆక్రందనవు నీవు
ఆలిగా
జవరాలిగా
సహచరిగా
మార్గదర్శిగా నడిచే నీలో నేను
నిత్యం చూసేది అమ్మనే
అమ్మగా నువ్వు అజరామరం
నీలో అమ్మతనానికి
నా భావంలో
అక్షరాలు లేనే  లేవు
మనస్వినీ

Saturday 19 December 2015

నువ్వంటే నాకిష్టం లేదు

నువ్వంటే నాకిష్టం లేదు

నీ తీయని పలుకుల మధురిమ
నాకిష్టం లేదు
నీ కన్నుల వెన్నెల
నా కిష్టం లేదు
నీ కురుల సోయగాలు
నాకిష్టం లేదు
నీ మేని వంపుల పరువాలు
నాకిష్టం లేదు
నీదన్నది ఏదీ
నాకిష్టం లేదు
నీ ఆలోచన
నీ అంతరంగం
నీ భావం
నీ లాస్యం
నీ హాస్యం
ఏదీ నాకిష్టం లేదు
అవును
నువ్వంటే నాకిష్టం లేదు
నీలో దేనినీ
నేనిష్టపడటం లేదు
నీలో సర్వమూ
నాకు ఇష్టం కాదు
అదంతా నా ప్రేమ
ఇష్టాన్ని జయించిన భావం నాది
నీ సర్వములో నా ప్రేమను నింపుకున్నా
ఇష్టమనే పునాదిలో
ప్రేమను బంధీ చేయలేను
ఇప్పుడు ఇష్టపడిన దానిని
రేపు నేను ఇష్టపడను
అందుకే
నేను నిన్ను ఇష్టపడను
ఇష్టం ఎప్పుడైనా మారవచ్చు
నీపై నాకున్న ప్రేమ
నా కడదాకా గుండెల్లో
దాగి ఉంటుంది
మనస్వినీ

Wednesday 16 December 2015

ముబారక్ మనసా

ముబారక్ మనసా

వేకువజామున
నీలినింగి కాన్వాసుపై
సలాము చేసే
వేగు చుక్క
కనులముందు నిలిచిందా
నేలరాలిన తారకమ్మ
పుష్పమై వికసించిందా
కనురెప్పలపై
మెరుపులా అద్దుకున్న స్వప్నం
సాకారమై ముంగిట వాలిందా
మనసులో ముద్రమైన దృశ్యం
నిజమై నేల నిలిచిందా
సమస్తం పాదాక్రాంతమై
ప్రణమిల్లుతున్నదా
అవును స్వప్నం సాకారమయ్యింది
కల నిజమయ్యింది
ముళ్ళ బాటను జయించి
పూదోటను అక్కున చేర్చుకుంది
ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఈవేళ తొలి కిరణం అందించింది
కుట్రలు కుతంత్రాల లోకంలో
కరవాలమై నిలిచి
విజయ శిఖరాలను
అధిరోహించిన మనసుకు
మనసునిండా
నా మనసు చెబుతోంది
ముబారక్
మనస్వినీ

Wednesday 9 December 2015

స్వప్నవేదిక

స్వప్నవేదిక


కనురెప్పల పుటలపై
ఒద్దికైన అక్షరాలు అద్దుకున్నా
సొగసైన అక్షర మాలికలతో
స్వప్నాలనే అల్లుకున్నా
నల్లని చీకటిపై
మెరుపుగీతలు గీస్తున్న
జుగ్నూలను దోసిటపట్టి
స్వప్నాలపై రంగులు దిద్దుకున్నా
ఇంద్రధనుస్సు రంగులను
మరిపించే
ప్రతి స్వప్నంలో
తేలియాడిన రంగుమేఘాలు
ఆవిష్కరించింది
నీ రూపాన్నే
కలల మబ్బులు
మలుపులు తిరుగుతూ
ఆకృతిని వీడుతూ
మరలా పొందుతూ
సంతరించుకునేదీ
నీ రూపాన్నే
అవును
ఇది నిజం
ప్రతి ఘడియలో
నిశి తెరలలో
వెలుగుల జిలుగులలో
నా కన్నులు ఎప్పుడూ
నీ స్వప్నాల వేదికలే
మనస్వినీ

Tuesday 8 December 2015

నువ్వు

నువ్వు

చందమామను వెన్నెలమ్మ అడిగింది
నేను ఎవరినని
విస్తుబోయిన నెలవంక ఏమని చెబుతుంది
నువ్వు ఎవరివని
కడలి అలలను అలవోకగా ముద్దాడుతూ
ముందుకు నడిపే పవనం అడిగింది
నేనెవరినని
ఎగిపడిన అల నేలను తాకి
దిక్కులు చూసింది
నువ్వెవరివని
హృదయస్పందనలను
ఊపిరి అడిగింది
నేనెవరినని
స్పందనలు మరిచిన హృదయం
పిచ్చి చూపులు చూసింది
నేను ఎవరిని
అంటూ నీలో జనియించిన ప్రశ్న
నాలో ఎన్నెన్నో భావాలకు తెర లేపింది
ఏమని చెప్పను
ఎవరు నువ్వని చెప్పను
అస్తమించే నా జీవన జ్యోతికి
వేగు చుక్కవు నీవు
నన్ను నడిపే శ్వాసలో
ప్రాణాన్ని నింపే ఊపిరి నువ్వు
నా పెదాల చిరునవ్వు నువ్వు
నా కన్నుల్లో గూడుకట్టుకున్న
అందమైన కలవు నువ్వు
నా మానస సరోవరంలో
విరిసిన పద్మం నువ్వు
నువ్వు
అన్నీ నువ్వే
నా కోపం నువ్వు
నా కంట నీరు నువ్వు
నా విజయం నువ్వు
నా అంతం నువ్వు
నిజానికి
నేనే నువ్వు
మనస్వినీ

Monday 7 December 2015

అదే నేను అదే మనసు

అదే నేను అదే మనసు 

నీ కన్నుల వెన్నెలలో
రాలిపడిన నక్షత్రాల పొడిని
నా కనురెప్పలపై
స్వప్నాలుగా అద్దుకున్నా
నీ నవ్వుల రువ్వులలో
పువ్వులను ఏరుకుని
గుండె గుడిలో దాచుకున్నా
తీయని పలుకుల
మధురిమలను
మనసునిండా పులుముకున్నా
ప్రతిక్షణం
ప్రతికణం
ప్రేమసాగరంలో
పునీతం చేసుకున్నా
ఎందుకో ఏమో
ఇప్పుడు మనసుకు భయం వేస్తోంది
అప్పటిలా
ఇప్పుడూ ఉన్నా
ఎక్కడున్నానో
అక్కడే ఉన్నా
కనురప్పలపై నుంచి జారిన
నక్షత్రాల పొడి
కన్నీటి పొరలలో కరిగిపోతోందేమో
అల్లుకున్న స్వప్నాలన్నీ
కన్నీటి చుక్కలతో స్నేహం చేసి
ఆవిరైపోతున్నాయేమో
గుబులుగా ఉంది గుండెలో
దాచుకున్న పువ్వులన్నీ
సుడిగాలి కుట్రలకు
ఎగిరిపోతాయేమో
భయం ఒకవైపు మొలకలు వేస్తున్నా
దానిపక్కనే భరోసా
చిగురిస్తోంది
రాలిపడుతున్న నక్షత్రాల పొడిని
మరలా ఒడిసి పట్టుకుంటా
సుడిగాలికి
గుండె కవాటాలు అడ్డం వేస్తా
ఆ నవ్వుల పువ్వులను
మరలా పూయిస్తా
కఫన్ నీడన నడుస్తున్న నేను
ఆ భరోసా వెంటనే
సాగిపోతూ ఉంటా
మనస్వినీ