Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 31 March 2016

లిప్తపాటు నువ్వు లేకపోతే

లిప్తపాటు నువ్వు లేకపోతే


నువ్వు నవ్వితేనే
నా పెదాలు విచ్చుకుంటాయి
నీ కన్నులు వెలిగితేనే
నాపై వెన్నెల కురుస్తుంది
ముభావం నువ్వైతే
నా భావం మారిపోతుంది
నీతోనే అన్నీ
నీలోనే అన్నీ
అవునని ఆరాధించినా
కాదని మొరాయించినా
ఇదే నిజం
లిప్తపాటు నువ్వు కానరాకపోతే
ఎక్కడున్నావోనని
ఆరాతీస్తుంది మనసు
నువ్వెక్కడ వుంటే అక్కడే
పరిభ్రమిస్తుంది మనసు
పనిలో నువ్వుంటే
చివుక్కుమంటుంది మనసు
శ్రమిస్తున్న నిన్ను చూసి
లోలోనే చింతిస్తుంది మనసు
నీపై నా భావం నీకు తెలుసు
నీపై నా ఆరాధనా నీకు తెలుసు
అయినా ఎందుకో ఈ అంతరాలు
అర్ధమే కాని అంతరంగాలు
ఇప్పుడు నా మానసం హృదయవిదారకం
మనస్వినీ

కవులు రాయని అక్షరం నేను

కవులు రాయని అక్షరం నేను


రవి చూడని క్షేత్రం నా హృదయం
కవులు రాయని అక్షరం నా మానసం
అర్థం కాని భావం నా అంతరంగం
తప్పు నా హృదయానిదా
నేరం నా మనసుదా
అర్థమే కాని అంతరంగానిదా
లోపం నాలోనే ఉందా
పాపం నా మనసే చేసిందా
కనులతో తప్ప మనసుతో చూడలేని మనుషులదా
ఆవేశమే తప్ప ఆలోచనే లేని మనసుదా
నా మనసుకు తెలుసు అన్నీ
మనసు లోతును గ్రహించని
మనసు ఎగసిపడినా
నాపై లేని నిందలు మోసినా
అర్థమే కాని ఆరోపణలు గుప్పించినా
ఏమి చేయగలను
నా మనసును చూసే శక్తి లేదని
సరిపెట్టుకోవటమే ఇప్పుడు
నా జీవితం
మనస్వినీ

Tuesday 29 March 2016

టైం మిషిన్ కావాలి

టైం మిషిన్ కావాలి


వెళ్లి పోవాలని వుంది
మరలా అక్కడికే వెళ్లాలని వుంది
ఆ నులివెచ్చని పొద్దును
మళ్ళీ ముద్దాడాలని వుంది
ఆ చల్లని సాయం సంధ్యలో
మళ్ళీ సేదతీరాలని వుంది
గతం తాలూకు ఘడియలను
చుంబించాలని వుంది
చాచిన చేతులనుంచి
చేయూతనిచ్చే దశను
మళ్ళీ చేరాలని వుంది
ఆనందం ఘడియల లోతులను
మళ్ళీ చవి చూడాలని వుంది
నా ఆనందం
అందరికీ మహదానందంలా
పంచి ఇవ్వాలని వుంది
జారిపోయిన వైభవ శిఖరాన్ని
మళ్ళీ నిలబెట్టాలని వుంది
విరిగిపోయి కరిగిపోయి కలగా మిగిలిన
అనుభూతులను
మళ్ళీ కళ్ళలో నింపుకోవాలని వుంది
నా పెదాల నవ్వులను
అందరి చిరునవ్వులుగా
మలుచుకోవాలని వుంది
ఏం చేయను
కాలాన్ని వెనక్కి తీసుకెళ్ళే
టైం మిషిన్ నాదగ్గర లేదుగా
మనస్వినీ

Monday 28 March 2016

ఎంత మధురం ఆ శుభోదయం

ఎంత మధురం ఆ శుభోదయం


వెచ్చని కోర్కెలు రగిలిన ఉదయభానుడు
నిశి దుప్పటిలో సేదతీరుతున్న పుడమికన్యపై
తన చిలిపి కిరణాల బాణాలు విసురుతున్న వేళ
బడలికతో నిదురించిన పుడమి
నులివెచ్చని కొంటె స్పర్శకు
తనువు సవరించుకుంటున్న తరుణం
పక్షుల కువకువలకు కనులు తెరిచిన నేను
పక్కనే ముడుచుకున్న పద్మంలా
కెరటాలను కడుపులో దాచుకున్న కడలిలా
సేదతీరిన పాలరాతి శిల్పంలా
నిదురిస్తున్న రతీదేవిలా నిన్ను చూశా
ఇంకా నీ నుదుటి మీద చెమట చుక్కల ఆనవాళ్ళు
రాతిరి కథలను చెప్పకనే చెబుతున్నాయి
ఇంకా తమ భారం తీరలేదని
అలసటగా కదులుతున్న కనురెప్పలు
విరిసీ విరియని పెదాలు
నువ్వింకా సేదతీరలేదని చెబుతున్నాయి
నిన్ను చూసిన నేను
గాలిని కూడా సవ్వడి చేయనీయకుండా
మెల్లగా నీపై వాలి
నా పెదాలతో నీ నుదుటిపై సంతకం చేస్తుంటే
ఒక్క ఉదుటున నీవు
నన్ను నీ బాహువుల్లోకి బంధిస్తే
ఆ శుభోదయం
ఎంత మధురం
మనస్వినీ

పువ్వులా పిడుగులా

పువ్వులా పిడుగులా


మేఘ మాలికల సంగమంలో
జనియించెను అగ్నిధార
పచ్చని పుడమిపై
ఎగసేను జ్వాల
రగిలిన మంటలో
నోరువిప్పిన అగ్ని గుండంలో
నివురులా మారెను నేల
అది ప్రకృతి
అది దాని ధర్మం
మనసులు మేఘమాలికలు కాకున్నా
ఈ రాపిడి ఎందుకు
ఇరుమనసుల సంఘర్షణ ఎందుకు
ముద్దాడే మనసుల మధ్య ఆవేశమనే అగ్గి ఎందుకు
మేఘాలకు మనసు లేదు
భావాలు లేవు
ప్రకృతి నిర్దేశిత క్రీడ అది
పిడిగులు మబ్బుల నైజం
శతకోటి భావాల సమూహాలు మనసులు
మనసుల మధ్య అంతరం ఎందుకు
ఆలోచనలకు అందని ఆవేశం ఎందుకు
మేఘాలు తమ ధర్మం పాటిస్తే
దగ్గరయినా దూరమని భావించే మనసులు
వికృత దిశలో పయనం ఎందుకు
ఎగసిపడిన ఆవేశంలో
అర్థం లేని ఆవేదనలో
పొంతన కుదరని వాదనలో
శరపరంపర ప్రశ్నలతో
మనసులు సంఘర్షణకు గురైతే
ఆ మనసుల పొదరిళ్ళలో
పిడుగులు కాక
పువ్వులు వికసిస్తాయా
మనస్వినీ

Saturday 26 March 2016

వందనం అభివందనం

వందనం అభివందనం

నా అక్షరాన్ని
ఒక పువ్వుగా మలుచుకుని
ముద్దాడిన నీకు వందనం
నా భావాన్ని ఒక ముల్లుగా అనుకుని
బాధపడిన నీకూ ఒక వందనం
నా కవితను మనసుతో చూసి
ఒక్క చుక్క రాల్చిన మనసుకు అభివందనం
నా అక్షరాలను మనసు పుష్పాలుగా గుర్తించిన
మనసుకో వందనం
నా మనసు రొదలను చూసి లాలించిన
మంచిమనసుకూ వందనం
నవ్వుకున్న వారికీ
గేలి చేసినవారికీ
బాధపడిన వారికీ
ఒదార్పునిచ్చిన వారికీ
నా ఐదు వందల కవితలను ఆదరించిన అందరికీ
నా భావనకు మూలమై
నా కవితకు ఆలవాలమై
నా జవమూ జీవమై
అక్షరమాలికకు ప్రాణమై నిలిచిన
మనస్వినికి శతకోటి వందనం

సమాధిని నేను

సమాధిని నేను

కన్నుల వెన్నెలను కాను
పెదాలపై మెరుపును కాను
గమ్యానికి లక్ష్యమూ కాను
ఆరాధ్యుడినీ కాను
ఆరాధనకు నోచుకోను
అడుగులకు బాటను కాను
వాడిన పెదాల సంకేతం నేను
కనుల చిందే కన్నీరును నేను
బాటలు లేని అడుగును నేను
నిశ్చలం నేను
నిర్జీవం నేను
ఆర్తిగా ఎదురు చూస్తున్న శూన్యం నేను
విరిసిన కుసుమాల కోసం
నిరీక్షిస్తున్న మట్టి కుప్పను నేను
నన్ను ముద్దాడే కుసుమాలు
భక్తితో జారవిడిచే
కన్నీటి చుక్కలకోసం
దాహంగా ఎదురుచూసే
సమాధిని నేను

శిరస్సువంచిన శిఖరం

శిరస్సువంచిన శిఖరం 

నిప్పు పెట్టిన వారు లేరు
ఆజ్యంపోసిన వారు కానరారు
బడబాగ్నిలా మంటలు లేచాయి
దావాలనంలా చుట్టుముట్టాయి
ఆశల సౌధం కాలిపోయింది
పలుగూ పారా పట్టలేదు ఎవరూ
పునాదులు పెకిలించలేదు ఎవరూ
పుడమి ప్రకంపించింది
నేల బీటలు వారింది
ఒక శిఖరం నేలను ముద్దాడింది
దహనమైన సౌధంలో
మిగిలిపోయిన బూడిదలో
కాలిపోయిన గతాన్ని వెతుక్కుంటున్నా
కూలిన శిఖరం శిథిలాల్లో
కూరుకుపోయిన ఆశలను ఏరుకుంటున్నా
వెక్కిరిస్తున్న గతంతో మాటలు కలుపుతున్నా
కరిగిపోయిన ఆశలను దోసిటపట్టాలని చూస్తున్నా
మెదడుతో కాక మనసుతో నడిచిన
శిథిల జీవితాన్ని మరలా కుప్పగా పోసుకుంటున్నా
దుమ్ముపట్టిన శిథిలాలు
బూడిదగా మారిన ఆనవాళ్ళు
మనసును మెలియపెడుతూ ఉంటే
అప్రయత్నంగానే వెనక్కి తిరిగి చూసా
ముసిముసి నవ్వుల సమాజం కనిపిస్తోంది
మనస్వినీ

Friday 25 March 2016

దప్పిక తీరేనా

దప్పిక తీరేనా

పూదోటల్లో విహరించిన భ్రమరం
ఎండుటాకుల్లో చిక్కుకుపోయింది
తేనీయ కాదు
చుక్క నీటికోసం
రెక్కలు విప్పుతున్నది
వాలిన రెక్కలను మరలా ఆడించేందుకు
నానాయాతన పడుతున్నది
ఎదురుగా అగుపించే
చెలమలను గాంచి
కొత్త ఊపిరులు పోసుకుంది
చుక్క నీటికోసం
చిట్టి గొంతు దప్పిక కోసం
పడి లేచిన కెరటంలా
సునామీలా ఎగదన్నే
పిల్లవాయువులను చీల్చుకుంటూ
అది ముందుకు సాగుతున్నది
ఆ భ్రమరం దప్పిక తీరేనా
కొత్త ఊపిరులు అందేనా
అవి నీటి చెలమలు కాదు
ఎండమావులని
పాపం అది తెలుసుకోలేకపోయింది
మనస్వినీ

Thursday 24 March 2016

కథానాయికవే నువ్వు

కథానాయికవే నువ్వు

జాలువారుతున్న అక్షరాలను
పొదివి పట్టుకుంటున్నా
మనసు నింగిలో
నక్షత్రాలుగా అద్దుకున్నా
రాలుతున్న నక్షత్రాల పొడిని
లేపనంగా మలుచుకుని
నీ బొమ్మగా మార్చుకున్నా
రెక్కలు విచ్చుకున్న తొలి అక్షరాన్ని
నీ పూజలో పువ్వులా అల్లుకున్నా
నీలినింగిలో పక్షుల్లా
తోటలో పువ్వులా
నీ పదమంజీరంలా
నీ తీయని పలుకులా
నీ నయనాల వెన్నెలలా
నా ప్రతిభావాన్నీ
నీలోనే చూసుకున్నా
నీకేం తెలుసు
నా భావజగతిలో
నిన్నే మారాణిలా నిలుపుకున్నా
ఒక్కసారి నా మనసులోకి తొంగి చూడు
నేను నీలోనే జీవిస్తున్నా
నీలోనే మరణిస్తున్నా
ఆదినుంచి
అంతం వరకు
నా కథానాయికవు నువ్వే
మనస్వినీ

Wednesday 23 March 2016

మండే గుండెలు

మండే గుండెలు 

పుడమిలా పగిలిన గుండెలో
ఉబికివస్తోంది ఆవేశం
రగిలిన మనసులో
తన్నుకువస్తోంది ఆగ్రహం
కనుచూపుమేరలో కానరాని గమ్యం
సాగని అడుగులకు జాడలే లేని వైనం
కుంగిన మనసుకు చేయూతను ఇవ్వని దైన్యం
కంటివెలుగులకు చీకటిని అద్దిన దృశ్యం
భవితను కాలరాసుకున్న వ్యక్తిత్వం
ఆకలి కేకలను ఆపలేని ధర్మం
అన్నీ కలగలిపి గుండె ఒక అగ్ని గోళం
అవును
మండుతున్న హృదయం నిప్పు కణికలుగా
నిప్పురవ్వలుగా
మండే లావాగా
ఎటు పయనించునో
ఏమి దహియించునో
అర్థమే కాని అయోమయం
ఎవరినో చూసికాదు
ఇప్పుడు
నన్ను చూస్తే నాకే భయం వేస్తుంది
మనస్వినీ

సమాజమా జాగ్రత్త

సమాజమా జాగ్రత్త

ఇదే మంచి తరుణం
మించిన దొరకదు
ఇదే మంచి అవకాశం
ఇదే అసలైన అదను
అవకాశం జారవిడుచుకోకు
దెబ్బ మీద దెబ్బతో
నేలకరిచిన నన్ను మరలా లేవనీయకు
కసితీరా ఆడుకో
తగిలిన గాయంపైనే మరలా దాడి చెయ్
మనసును సమాధి చేసిన నువ్వు
దేహాన్నీ ఖననం చెయ్
కదలనీయకు
తల ఎత్తనీయకు
కనులు తెరవనీయకు
శ్వాస ఆడనీయకు
నలువైపులా కరవాలములు ప్రయోగించు
లేవాలన్న ఆశయాన్ని సంహరించు
సమాజమా ఇది సమరం కాదు
ఇది నువ్వు చేసిన దందయాత్రే
కొనసాగించు నీ జైత్ర యాత్ర
భస్మీపటలం చేయ్ జీవితాన్ని
నువ్వే నిజం
నీ కుట్రలు న్యాయం
నీ ఆటలే ధర్మం
కర్తవ్యాన్ని త్యజించి
భావావేశం మత్తులో మునిగిన మనసుకు
మరణదండన వేయ్
కసితీరా నాశనం చేయ్
ఏమరుపాటుగా ఉన్నావో
మరలా లేస్తా
పడిలేచిన కెరటంలా దూసుకువస్తా
మరోజన్మలా ఉబికి వచ్చే దానవుడి పుట్టుకను
నిలువరించుమా సమాజమా