Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 30 April 2016

మాయాలోకం

మాయాలోకం 

అది మరో ప్రపంచం
భూగ్రహానికి దూరంగా
అంతరిక్షంలో ఎక్కడో విసిరేసినట్లున్న
అందమైన ప్రపంచం
కొత్తలోకంలోకి అడుగుపెట్టాను
కాళ్ళకు నేల తగులుతోంది
మన భూమిలాగానే
ఎదురుగా ఒక అందమైన జలాశయం
పచ్చని తోటలు
విచ్చుకున్న మారాకులు
అలా తలతిప్పిచూస్తే
ఎండిపోయిన చెట్లూ చెలమలు
మట్టి దిబ్బలూ
కంకర రాళ్ళూ
అది ఒక వాడిన వసంతం
జలాశయాన్ని వదిలేసి
వాడిన వసంతంవైపే అడుగు కదిపాను
కంకర రాళ్ళను దాటి
చిన్న నీటి చెలమను చేరా
మనసారా దప్పిక తీర్చుకున్నా
వెనక్కి తరిగి చూస్తే
ఆ జలాశయం కానరాలేదు
అది ఒక ఎండమావి
అలా ముందుకు నడిచాను
ఎదురుగా ఒక మేక కనిపించింది
జాగ్రత్తగా తప్పించుకున్నా
నాకు తెలుసు అది మేక కాదు పులియని
నేను నడిచే బాటలో
అందమైన పూల తివాచి
రకరకాల పువ్వులు
సుగంధపరిమళాలు
ఆ బాటలో నడవలేదు నేను
నాకు తెలుసు
ఆ పువ్వుల మాటున ముళ్ళున్నాయని
సేద తీరాలని చూసాను
ఎదురుగా అందమైన భవనం
పక్కనే పాడుబడ్డ పూరిల్లు
శిథిల గుడిసెలోకి వెళ్లి నడుం వాల్చా
నాకు తెలుసు ఆ భవనంలో
ప్రశాంతత లేదని
కళ్ళు మూతబడే వేళలో
ఎదురుగా ఓ ఆకారం
మంద్రంగా పలకరించింది
మాలోకంలోకి వచ్చిన నీవు
వింతగా ప్రవర్తిస్తున్నావు
జలాశయాన్ని కాదన్నావు
మేకను చూసి భయపడ్డావు
పూలబాట వద్దనుకున్నావు
భవంతిని వీడి గుడిసె నీడన చేరావు
ఏమిటి నీ మర్మమని
అప్పుడు బదులిచ్చాను చిరునవ్వుతో
నాలోకమున బతికిన అనుభవం
నన్నిలా మార్చిందని
భూలోకమనే మాయాలోకమున ఉన్న వింతలు
ఈ లోకమున ఉన్నాయా అని
కుట్రలు
దగాలు
మేకవన్నె పులులు
మాయమాటలు
దొంగ నాటకాలు
వీటన్నింటి ముందు
మీలోకమెంత
మీ మాయాజాలామెంత
నా బదులు నచ్చిందో లేదో తెలియదు
ఆ ఆకారం మాయమయ్యింది
నాకూ మెలకువ వచ్చింది
మనస్వినీ 

Friday 29 April 2016

సమిధ

సమిధ

అనుభూతుల వెల్లువలో
పునీతమయ్యింది మనసు
ప్రతి ఘడియలో కుసుమాలను
సేకరించుకుంది మనసు
కుసుమాలను అంటిన కొన్ని ముళ్ళు
భావనలను తాకితే
ఏం పాపం చేసింది మనసు
అనుభవపుష్పాల పరిమళాలకు
పులకించింది మనసు
అనుభవాలకు తలవంచిందే గాని
తూలనాడలేదు మనసు
గుచ్చుకున్న ముళ్ళ తాకిడికి
వేదనతో మూలిగింది మనసు
తనను తాను నిలదీసిందేగాని
మరో మనసును గురి చేయలేదు మనసు
అనుభూతుల తోటలో
అనుభవాల సుడిలో
ఒక సమిధగానే మారింది మనసు

అక్షరాల అలజడి

అక్షరాల అలజడి 


ఎందుకు రాయను
రాస్తూనే ఉంటా
అర్థం చేసుకునే వారు చేసుకుంటారు
చేతకాని వారు విమర్శిస్తారు
విమర్శలకు జంకను
పొగడ్తలకు పొంగిపోను
మనసులో ఉన్నదే రాసుకుంటా
మనసు చెప్పిందే రాస్తా
ఎవరు నిర్దేశించగలరు నా రాతల్ని
ఎవరు ఆపగలరు నా భావాలని
గులాబీ పువ్వు తంగేడుపువ్వు రెండూ ఒకటేనా
తంగేడుపై ఎందుకు రాయవు
గులాబీపైనే ఎందుకు రాస్తావంటే
ఏమని చెప్పను
గులాబీయంటే నాకిష్టం
దాని పరిమళం నాకిష్టం
గులాబీ సోయగాలను ఆస్వాదిస్తా
భావాలుగా రాసుకుంటా
గులాబీ ముళ్ళు గుచ్చుకుంటే
వేదనతో అలమటిస్తా
కన్నీటితో అక్షరాలను తడుపుకుంటా
అలా ఎందుకు రాసావని నిలదీస్తే
ఏమని చెప్పను
నా మనసు సొదలుకాక
వేరే ఎలా రాసుకుంటా
పులకించిన భావాలు
విలపించిన అక్షరాలు నా కవితలు
అర్థం చేసుకున్నవారికి
అర్థం చేసుకున్నంత
ఎలాంటి ఘడియలోనూ
ఆగవు నా అక్షరాలు
అవి వికసిస్తూనే ఉంటాయి
రుధిరంలో తడుస్తాయి
పరిమళంలో పులకిస్తాయి
కన్నీరుగా రాలిపడతాయి
అవేశంలో చెలరేగుతాయి
అక్షరాల అలజడిని ఆపతరమా
ఎవరికైనా

Thursday 28 April 2016

థాంక్స్ నీకు

థాంక్స్ నీకు

భూమికి జానెడు ఉంటావు
పదిమందిలో కలిస్తే ఎక్కడుంటావో కనపడవు
ఉయమే లేస్తావు
పూజలెన్నో చేస్తావు
ఆదివారమొస్తే గుడులచుట్టూ తిరుగుతావు
నుదుటిపై ఎప్పుడూ బొట్టు పెట్టుకుంటావు
హిందూవులా చూడలేదు నిన్ను
ముస్లింలా ఫీల్ అవ్వలేదు నేను
మనిషిగా చూసాను
నేస్తమని అభిమానించాను
హితుడవని నమ్మాను
ఎందుకిలా చేసావు
ఎందుకు వంచనకు దిగావు
నేను పలకని పలుకులను
చిలుకపలుకులుగా పలుకుతున్నావు
మనసులో కలకలం రేపావు
ఓ మనసును కలుషితం చేసావు
నీ మనసులో కుట్రలను నా కుట్రలుగా
ఎందుకు చెప్పుకున్నావు
నా జాతిని
నా మతాన్ని
తూలనాడావు
ఇదేనా నీకు పూజల్లో కనపడింది
ఇదేనా నీకు సంస్కారంగా నేర్పింది
ఏమవుతుందిరా ఫూల్
ఎవరు నమ్మితే ఎంత
నమ్మకుంటే ఎంత
నేనేంటో
నా జాతి ఏంటో
దాని ధైర్యమేంటో
నీకు మాత్రం తెలియనిదా
ఒకటి చెప్పగలను నువ్వు మాత్రం హిందూవు కాదు
హిందూ మతంలో ఉన్న సంస్కారం నీలో లేనే లేదు
హిందూ జాతి గొప్పదనం నీలో కానరాదు
హైందవజాతికి నువ్వొక మాయని మచ్చవురా ఫూల్
ఒకవిధంగా నీకు థాంక్స్ చెప్పాలి
నేను ముస్లింనని గుర్తు చేసినందుకు

రాక్షసుడిలా మార్చొద్దు

రాక్షసుడిలా మార్చొద్దు


ఎవరు మీరు
దేవుళ్ళా
దేవతలా
మీ మనసులో పుట్టిందే వేదమా
మీరనుకున్నదే శాసనమా
మీరు చెప్పిందే న్యాయమా
మీరు చేసేదే నిజాయితీనా
ఎలా నిర్ణయిస్తారు ఒక వ్యక్తిత్వాన్ని
ఎలా నిర్దేషిస్తారు ఒక జీవితాన్ని
ఎలా తప్పు పడతారు ఒక మనిషిని
ఎలా నిందిస్తారు ఒక జాతిని
ఎందుకు తలవంచాలి మీ కుటిల నీతికి
మీకు తెలియదా మీరు చేసేది తప్పని
మీ మనసుకు తెలియదా మీదే ద్రోహమని
మనీ వస్తుందని అంటే సొంతమనిషిని
పరమనిషి దగ్గరికి పంపే మీరు మనిషి జాతేనా
ఒక జాతిని
ఒక మతాన్ని  బేరీజు వేస్తూ
మనిషి నిజాయితిని నిర్దేశించే మీరు
ఒక్కసారి మీ తల్లిని అడిగి చూడండి
ఏ జాతిలో పుట్టారో
మీ వికృత స్వరూపాలను చూస్తే కోపం కాదు
జాలి వేస్తోంది
నోటికి వచ్చిన ప్రచారంతో తలమునకలై
ముఖాముఖికి బెదిరిపోయే మ్మిమ్మలని చూసి
నవ్వు వస్తోంది
నోరుంది మీకు మాట్లాడండి
మీ నోరు మీ ఇష్టం
ఒక సమయం వస్తుంది
ఒక ఘడియ పలకరిస్తుంది
కనీసం కన్నెత్తి చూసే ధైర్యం కూడా మీకుండదు
జర జాగ్రత్త
మనిషిని రాక్షసుడిలా మార్చొద్దు..

Tuesday 26 April 2016

అన్నీ తెలిసిన మనసే...?

అన్నీ తెలిసిన మనసే...?

నా మనసుని అడిగాను
దేవుడంటే ఎవరని
ఎలా ఉంటాడని
ఎక్కడ ఉంటాడని...
మనసు వినమ్రంగా చెప్పింది
దేవుడు నీలోనే ఉన్నాడని
నీలాగే ఉంటాడనీ
నువ్వే దేవుడివని...
మనసు మాటే నమ్మా
నేనే దేవుడినని అనుకున్నా
దేవుడిలాగే వ్యవహరించా
దేవుడినే అనుకున్నా...
సమాజానికి నచ్చలేదు
నేనే దేవుడినని నమ్మలేదు
బోనులో నిలిపింది సమాజం
ముద్దాయిగా మార్చింది సమాజం...
విచారణ మొదలయ్యింది
అంతులేని ఆరోపణలతో
అర్థంకాని వాదనలతో
నిలదీసింది సమాజం...
ఆరోపణలకు బెదరలేదు నేను
వాదనలకు జంకలేదు నేను
నేనే నిజమని వాదించా
సమాజం ముందు ఓడిపోయా
శిక్ష వేసింది సమాజం
నన్ను రాళ్ళతో కొట్టి చంపమని...
మైదానంలో నిలబెట్టారు నన్ను
అందరూ ఏదేదో అంటున్నారు
మోసగాడినని ఒకరు
ద్రోహి అని మరొకరు
తోచినవిధంగా తిడుతున్నారు
అన్నీ వింటున్నా
చిరునవ్వుతో సమాధానం ఇస్తున్నా...
రాళ్ళ వాన మొదలయ్యింది
సూటిగా విసురుతున్న కంకరరాళ్ళు
దేహాన్ని ఛిద్రం చేస్తున్నాయి
రుధిరం కారుతోంది
ఆశ్చర్యం
కన్నీరు రాలటం లేదు
దేహానికి గాయాలు అవుతున్నా
రక్తం నేలను ముద్దాడుతున్నా
నాలో వేదన లేదు
చింతన లేదు
మనసారా నవ్వుకుంటున్నా నేను...
నేను దేవుడిని
నేను మార్గదర్శిని
సర్వం నేనే
అమాయకజనానికేం తెలుసు
నవ్వుతూనే ఉన్నా నేను...
విసురుగా వచ్చి తగులుతున్న రాళ్ళ మధ్యలో
ఒక పువ్వు కనిపించింది
అంతే వేగంగా నా గుండెను తాకింది
ఛిద్రమైపోయింది నా గుండె 
ముక్కలైపోయింది నా దేహం
నేనేమిటో నాకు చెప్పి
అన్నీ తెలిసిన మనసే ఆ పువ్వును విసిరితే
అది నాకు రాయిలా తగలదా
మనస్వినీ...

Monday 25 April 2016

నేస్తమై దిగివస్తా

నేస్తమై దిగివస్తా

ఒళ్ళు విరుచుకుని
ఆకృతిని సవరించుకునే
కరి మబ్బుల సోయగాలను చూడు
మబ్బుల పెదాలను దాటి
కాంతులీనే మెరుపులను చూడు
నేనే కనిపిస్తా
నా చిరునవ్వులే కనిపిస్తాయి
నీ ముంగురులను సవరిస్తూ
ఆర్తిగా పెనవేసుకునే
పిల్లగాలులను పలకరించి చూడు
నీ అణువణువునా
అనుభూతి మొలకలు వేస్తా
మేఘమాలికలను అల్లరిపెడుతున్న
నిండు జాబిల్లిని చూడు
అమృతవర్షమై కురుస్తా
భారమైన మనస్సులా
గుంభనమైన కడలిపై నర్తించే కెరటాలను చూడు
ఎగిసిపడే మనసునై పలకరిస్తా
అప్పుడే వికసించి నవ్వుతున్న పువ్వును చూడు
నీ పెదాల చిరునవ్వునై రాలిపడతా
దప్పికతీర్చే ఆశలపల్లకి
ఎండమావిని తడిమి చూడు
అందమైన స్వప్నమై కరిగిపోతా
ఒంటరితనంతో కబుర్లు చెబుతూ
మనసునిండా కనులుమూసుకో
ఊసులు చెప్పే నేస్తమై దిగివస్తా
నేడున్న నేను
రేపు లేకున్నా
నీతో ఎప్పుడూ ఉంటా
మనస్వినీ

Sunday 24 April 2016

అంతా నీ ఇష్టం

అంతా నీ ఇష్టం

Kya khabar jo yahan 
Gunegaro mein ho 
Wo teri khudrat ke
Shehkaro mein ho!

నలుదిశల సమరంలో
చక్రబంధం వలయంలో
బంధీ అయ్యింది మనసు...
నిశి చీకటి అడుగుజాడల్లో దారితప్పి
వధ్య శిలపై చేరింది మనసు...
నిష్క్రియాపర్వ అంతరంగంతో
పాలుపోని వేదనతో
నీ శరణు కోరింది మనసు...
పువ్వులు ఏరుకోబోయి
ముళ్ళకాటుకు గురై నిన్ను తూలనాడినా
నీ రాతలను ప్రశ్నించినా
నీ మార్గం వీడలేదు మనసు...
నీ ప్రవచిత గ్రంథాన్ని బట్టీ పట్టలేదు
నీ ఆయత్తులను మెదడులో నింపుకోలేదు
నమాజులో రివాజులు పాటించలేదు
నిత్యం తలపై తాజ్ ధరించలేదు
అయినా
నీ సందేశం మరవలేదు మనసు...
ఇమాన్ మార్గంలో
బేఇమాన్ కాలేదు మనసు...
ద్రోహం
మోసం
కుట్ర
చేతకానితనం
బిరుదులతో విచలితమయ్యింది మనసు...
నువ్వు చూపిన మార్గం ద్రోహమైతే
నీ సందేశం మోసమైతే
నేను ద్రోహినే
మోసగాడినే...
తలవంచి ప్రణమిల్లుతున్నా నీ బార్గాహ్ లో
ఇంకా ఏమన్నా జరగనీ
ఎలాంటి నిందలైనా రానీయ్
ఎవరికీ తలవంచను ...
నిన్ను నమ్ముకున్నా
వధ్యశిలను మాయం చేస్తావో
నన్నే అంతం చేస్తావో
అల్లాహ్...
ఇక అంతా నీ ఇష్టం...