Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 28 November 2016

కంటినిండా నిద్రపోతున్నా

కంటినిండా నిద్రపోతున్నా

నేను నిద్రపోతున్నా
కంటినిండా సుఖంగా నిద్రపోతున్నా
నమో చెప్పిన సత్యమిది
నమ్మితీరాల్సిందే
భజన పరుల గానమిది
విని తరించాల్సిందే...
అవును
నేను సుఖంగా నిద్రపోతున్నా
పేగుల కేకలు జోలపాడుతుంటే
ఎండిన డొక్కలు డోలు వాయిస్తుంటే
రేపటి ఆశలదుప్పటి కప్పుకుని
సుఖంగా నిద్రపోతున్నా...
పని దొరకదని తెలిసినా చావని ఆశతో
అడ్డాలో నిలబడి పనిచ్చే ఆసామికోసం
కళ్ళు కాయలు చేసుకుంటూ
అలసిన దేహం సొమ్మసిల్లి పడిపోతే
కళ్ళు తిరిగాయని మీరనుకుంటారు
కాదు కాదు కానే కాదు
నేను నడిరోడ్డుమీద సుఖంగా నిద్రపోతున్నా...
కార్ఖానాలు మూతబడి
రవాణాలు నిలిచిపోయి
మోతబరువు తప్పిందని
లారీ నీడలో హమాలినై నేలపై పడిఉన్నా
శూన్యమైన నింగిని చూస్తూ
నమో చెప్పినట్లు ఇది సుఖం కాక ఇంకేంటి...
కూరగాయాలకు మందు లేదు
వంట సరుకులకు దిక్కు లేదు
పేరుమీద బ్యాంకు అక్కౌంటు లేదు
అక్కౌంటు ఉంటే రొక్కం లేదు
అయినా ఆన్ లైన్ షాపింగ్ కోసం ఎదురు చూస్తున్నా
రేపటి బిర్యానీ కోసం
ఇప్పుడు పప్పన్నం త్యాగం చేస్తున్నా
పేదలకే దేశభక్తి అన్న సూత్రాన్ని నిజం చేస్తూ...
పది పందికొక్కులు పంటను నాశనం చేస్తున్నాయి
పెరిగిన పంటలో కలుపు మొక్కలు కనిపిస్తున్నాయి
నమో మందుతో పంట నాశనమయ్యింది
కలుపుమొక్కల గింజలు ఏరుతున్నా
తిండి గింజలు దొరుకుతాయేమోనన్న ఆశతో...
ఆశనే శ్వాసగా తీసుకుంటున్నా
ఆశనే అన్నంగా తింటున్నా
ఆశనే మంచినీళ్ళుగా తాగుతున్నా
నిజంగానే అచ్ఛాదిన్ వస్తుందన్న ఆశతో...
గుండె మంటలు బయటికి రావట్లేదు
ఆకలి కేకలు ఎవరికీ వినిపించట్లేదు
నా కళ్ళలో నీరు కానరావటం లేదు
ఎందుకంటే నేను సుఖంగా
కంటినిండా నిద్రపోతున్నా ...
నమో చెప్పింది సత్యం
భజనపరులదే న్యాయం
నమ్మక తప్పదు
నమ్మకం కుదరలేదా
మీ కళ్ళు డాక్టర్ కి చూపించుకొండి
మీ బ్రెయిన్ కి పరీక్షలు చేయమనండి
ఏదీ కాకపోతే
మెంటల్ హాస్పిటల్ లో చేరిపోండి
నేను మాత్రం ఏమీ చేయలేను
ఎందుకంటే
నేను కంటినిండా నిద్రపోతున్నా

Saturday 26 November 2016

నా మనసులోని నువ్వు లా

నా మనసులోని నువ్వు లా
ఎలా ఉంటావో తెలియదు నువ్వు
నువ్వంటే తెలియని నాకు
ఒక అందమైన భావం నువ్వు
నా అక్షరాల పూదోటలో
రెక్కలు విప్పిన తొలి పుష్పం నువ్వు
నువ్వలా ఉంటావో
ఇలా ఉంటావో
ఎలా ఉంటావో తెలియకున్నా
నా మనసులా ఉంటావని
నా మనసులాగే నవ్వుతావని
ఊహల పందిళ్ళు అల్లుకున్నా
నా ఊహలకు ఆకారం నువ్వు
నా అక్షర వేదికకు అందమైన నిలయం నువ్వు
మనసు భాషకు తీయని అక్షరం నువ్వు
కలలు  సాకారమయ్యాయో
ఊహలకే ఆకారం వచ్చిందో
జీవన సంధ్యలో ఉషస్సులా కలిసావు నువ్వు
మోడువారిన మానును పలకరించిన
నవ వసంతంలా
అమావాస్య కమ్మిన జీవితాన్ని వెలిగించిన
నిండు పున్నమిలా
అవును
పున్నమి చందమామలా కలిసావు నువ్వు
వసివాడిన తోటలో
విరిసిన గులాబీవై  
జీవన పరిమళాలు అద్దావు నువ్వు
నాకు తెలుసు
అందమైన గులాబీకి ముళ్లుంటాయనీ
అవి గుచ్చుకుంటాయనీ
ముళ్ళు గుచ్చుకున్న వేళ వేదనకు గురైనా
గులాబీ పరిమళాలు మరువలేను నేను
అప్పుడు నువ్వు తెలియకున్నా
నీకోసమే అక్షర కుసుమాలు సాగు చేసుకున్నా
ఇప్పుడు నువ్వు
నా మనసులో నువ్వులా
నా ముందు నడియాడుతున్నా
అక్షరమాలలు అల్లుతున్నా నేను
నాకు తెలుసు
నీకోసమే పుట్టిన నా అక్షరం
నీకోసమే అంతమవుతుంది
మనస్వినీ 

Thursday 24 November 2016

నీకిది న్యాయమా

నీకిది న్యాయమా

పరుగులాంటి నడకే కావాలని అన్నావు
ఉగ్గుపాల ధైర్యమే కోరావు
ముక్కుసూటి తనమే ఊపిరి అన్నావు
నిజాయితే అడుగుజాడలని అన్నావు
తడబడే అడుగులపై భారం మోపావు
బాధ్యతల బాటలో మార్గాలు చెరిపేసావు
ముళ్ళ బాటలు వేసి ముందుకు నడవమన్నావు
నేనింకా అడుగు తీసి అడుగే వెయ్యలేదు
నువ్వు పరుగులు తీస్తున్నావు
జీవితమా
నీకిది న్యాయమా

చీకటి పక్షి

చీకటి పక్షి

ఎక్కడుంది గమ్యం
ఎందుకు తడబడింది పయనం
శశిని చూస్తూ నిశిన జారిందా
నిశి రక్కసి శశిని మింగిందా
అంతులేని గజిబిజి పయనం
వెలుగుతాకని మానసం...
చీకటి పక్షుల కువకువలు
నల్లని మనసుల గుసగుసలు
అంతులేని వికృత క్రీడలు
అలుపే లేని ఆరాటాలు
ఎందాక సాగేనీ పయనం...
వీడలేమని వెంటాడే నిన్నటి మరకలు
రోజూ వికసించే చీకటి పుష్పాలు
చీకటి మరకలను వీడేనా పుష్పం
మరలా వికసించేనా హృదయం...
కలకలం రేపేను పరుల భాష్యం
మనసున రగిలెను అగ్ని గుండం
చేష్టలుడుగిన మానసం
దిక్కుతోచని అయోమయం...
ఆగదేమో ఈ పయనం
చీకటినుంచి మరో చీకటి ఆహ్వానం
కొన్ని జీవితాలింతే
మరణమనే చీకటిలోనే
సత్యాక్షరాలు లిఖిస్తాయి
మనస్వినీ...

Tuesday 22 November 2016

మనసు విజయం

మనసు విజయం 

ఎవరితో ఈ సమరం
ఎవరితో ఈ రణం
కనిపించే శతృవుతోనా
కానరాని శతృవుతోనా
ఉన్నారో లేరో తెలియని దుష్టులతోనా
ఉండీ లేనట్టి వైరులతోనా
ఎవరితో సమరం
ఎందుకు ఈ యుద్ధం
ఎవరిపై నా కరవాలం
ఎవరిపై నా పోరాటం
నాపైనే నా సమరమా
నాలోని శతృవుతోనే యుద్ధమా
నాపై నేనే గెలుస్తున్నానా
నన్ను నేనే ఓడిస్తానా
గెలుస్తున్నానో లేదో తెలియదు
ఓడిపోతున్నానేమో అర్థమే కాదు
అయినా ఎందుకు గెలుపు తీరాల ఆరాటం
ఎందుకు మదిలో నైరాశ్యం  
ఏది గెలుపో
ఏది ఓటమో తెలియనే తెలియదు
ఎక్కడో శూన్యం నుంచి జనియించిన
పరాజయ సంకేతం గుండెను తాకుతోంది
మనసు విజయానికి సంకేతమై
మనస్వినీ 

Monday 21 November 2016

దప్పికున్న మేఘం

దప్పికున్న మేఘం
 
దప్పికున్న మేఘం కడలి వైపు ఒరిగింది
దాహార్తి తీర్చమని కెరటాలను తడిమింది...
సొగసైన కెరటాల వలవిసిరిన సాగరిక
మేఘం వైపు చేతులు చాచింది...
పులకించిన కడలి కెరటాల ఆవిరిలో
మేఘం కొత్త ఊపిర్లు పోసుకుంది...
గుండెనిండా ప్రేమ నింపుకున్న మేఘం
అమృత వర్షం కురిపించింది...
తడియారిన దేహంతో దూది పింజమై
విలపించిన మేఘం
తనువును తాకిన వలపు చినుకులతో
కొదమసింహమై చెలరేగింది...
ఒంటిని తాకిన అమృత చినుకులతో
కడలి పరువాల వీణలా మోగింది...
దాహమై నర్తించిన మేఘం
చినుకులా మారి కడలిలో కలిసిపోయింది...
మేఘానికి తెలుసు తన వలపు పోరాటం
ఒక మరణమని...
తీరని దాహం కోసం
దప్పిగొన్న మేఘం
ఎన్నిసార్లయినా మరణిస్తుంది
మనస్వినీ...

Saturday 19 November 2016

మృగాళ్ళ లోకంలో మగాడూ ఉన్నాడు

మృగాళ్ళ లోకంలో మగాడూ ఉన్నాడు

మనసు మగువకే సొంతం కాదు
కన్నీరు అతివకే ఆస్తి కాదు
మృగాళ్ళున్న ఈ లోకంలో
మగాళ్ళూ ఉన్నారు...
గుండెలు బాదుకుని ఏడవకున్నా
గుండెలు పగిలినట్లు మూగగా రోధించే
పురుషులూ ఉన్నారు...
మగువ మనసు విలువ తెలియని దొరల లోకంలో
మనసు దెబ్బకు కుప్పకూలిన
అభాగ్యులూ ఉన్నారు...
ఎవరికి తెలుసు మగవాడి మనసు
ప్రతి మగాడూ కాదు పశువు
మనసున్న మగాడు ఎప్పుడూ బలి పశువు...
తప్పటడుగుల కాలం దాటి
బాధ్యతల లోకంలో అడుగుపెట్టి
కుటుంబమనే శిరోభారం నెత్తిన పెట్టి
ఎన్ని అడుగులు వేస్తేనేం
చివరికి మిగిలేవి నిందలే అయితే
ఆ మగాడికి దిక్కెవరు
ఆ కన్నీళ్లు తుడిచేది ఎవరు...
 జగమంత కుటుంబమని అనుకున్నా
మనసు గోడు వినే వారుండరు
జారుతున్న కనులనీరును
మగాడిననే అహం తాగుతుంటే
మనసు నిండా ఏడవలేక
మనసులోనే కుమిలిపోయే మగ అబలలు
ఎంత మందికి తెలుసు...
నీకేంటి మగాడివి అని అంటుంటే
మగాడిగా పుట్టి బావుకున్నదేమో అంతుచిక్కక
కారు చీకట్లో అడుగులు వేయలేక
అడుగు జాడలు మరువలేక
తప్పటడుగులు కూడా వేయటం చేత కాక
నిర్జీవ మూర్తులై మిగిలిపోయిన
మగాళ్ళ వ్యదార్థ గాథ ఎంత మందికి తెలుసు...
కాని గాని వాడిగా మిగిలి
ఆలి మాటలకు విలవిలలాడుతూ
ఆశగా చూసే కన్నబిడ్డల ఆర్తికి
తల్లడిల్లుతూ
గమ్యమే లేని ప్రస్థానం వైపు అడుగులు వేసే
మగాడి పయనం ఎందరికి తెలుసు...
అతివలకు ఉన్న మనసే మగాడికీ ఉంటుంది
మగాడి కంటిలోనూ కన్నీరే వస్తుంది
మగాడి మనసూ ఓదార్పు కోరుతుంది
ఆ మగాడి మనసు తెలిసేది ఎందరికి...
మృగాళ్ళు ఉన్న ఈ లోకంలో
మనసున్న మగాళ్ళూ ఉన్నారు
మృగాడిని గుర్తించే లోకం
మగాడిని తెలుసుకోకపోవడం
మగాడికి ఒక శాపం

Tuesday 15 November 2016

నేను

నేను
రాబందుల రెక్క్కల నుంచి
జారిపడిన సవ్వడిని నేను
నిశిరక్కసి జడలనుంచి
రాలిపడిన తారకను నేను
ఆకాశానికి నిచ్చెన వేసి
పాము మింగిన పావును నేను
చదరంగపు క్రీడలో
బంధీగా మిగిలిన రాజును నేను
స్వీయ విధ్వంస రణస్థలిలో
ఆయుధము లేని యోధుడిని నేను
కలిమి లేమిల పోరులో
సైన్యమే లేని సేనానిని నేను
నలుదిశలా నలుగురు ఉన్నా
ఎవరూ కానరాని ఒంటరి బాటసారిని నేను
విచ్చుకత్తుల కరాళ నృత్యంలో
తెగిపడిన పువ్వును నేను
నేనుగా పుట్టిన నేను
నేనుగానే మరణిస్తా
మనస్విని 

Thursday 10 November 2016

మరొక నేను

మరొక నేను 

నాకు నేను కావాలి
అవును నాకు నేనే కావాలి
నాలాగే నేనుండాలి
అచ్చం నాలాగా నేను కావాలి
నాలాగే ఆలోచించాలి
నా మాటలను నాలాగా వినాలి
నేను నవ్వితే ఆనందం పంచుకోవాలి
నేను ఏడిస్తే బాధను తెలుసుకోవాలి
కన్నీళ్ళకు అర్థం తెలుసుకోవాలి
చిరునవ్వులకు నవ్వులు పంచాలి
నా మనసును తెలుసుకోవాలి
నా మనసుకు నేనే మరో మనసు కావాలి
నన్ను నాలాగా అర్థం చేసుకోవాలి
నన్ను నాలాగా ఓదార్చాలి
నాకు నా స్నేహం కావాలి
నాకు నేను నేస్తమై నిలవాలి
దేవుడా
నానుంచి నన్ను వేరు చేసి
మరో నేనుగా నాకు పరిచయం చెయ్
నాకు నాతో మాటలు కలుపు
నాకు నాతో స్నేహం చేయించు
నాతో నన్ను నడిపించు
నా అడుగు జాడల్లో నన్నే నిలుపు  
భగవాన్
నన్ను వెంటనే క్లోనింగ్ చెయ్
నన్ను నాకే కానుకగా ఇచ్చేయ్ 

Wednesday 9 November 2016

ధన్యవాదాలు మహర్షీ

ధన్యవాదాలు మహర్షీ

నిశబ్దం నీకూ నాకూ మధ్య
ఇది ఎప్పుడూ ఉండేదే
నిన్ను కలిసిన ప్రతిసారీ
నేను మౌనంగానే మాట్లాడాను
మౌనంగానే ప్రశ్నించాను
మౌనంగానే వేడుకున్నాను
మౌనంగానే ఏడిచాను
కనులజారే నీటిని అదిమి పెట్టుకుంటూ...
మౌనంగానే నీ సహాయంకోరాను
వికలమైన మనసును ఒదార్చుకుంటూ...
నా మౌనవేదనకు నువ్వు
మౌనంగానే బదులిస్తున్నావని అనుకున్నా
నా వెనుక నువ్వున్నావని మనసు నిండా నమ్ముతూ...
నీకన్నీ తెలుసని అనుకుంటూనే
నీకన్నీ చెప్పుకున్నా
అండగా నిలుస్తావని అనుకుంటూ...
మౌనంగానే ఉండిపోయిన నువ్వు
మౌనంతోనే ముందుకు నడిపావు
నాలో ఒక అంతర్లీన శక్తిగా నడుస్తూ...
ఇప్పుడూ మౌనంగానే నివేదిస్తున్నా
మౌనంగానే తలవంచి ఉన్నా
నువ్వే అన్నీ అని ఇంకా నమ్ముతూ...
చాలా జరిగాయి జీవితంలో
ఎన్నెన్నో వేదనలు
అంతకు మించిన మధురిమలు
వందలాది పరాజయాలు
అప్పుడప్పుడూ పలకరించిన విజయాలు
మనం మౌనంలోనే
పరిమళాలు వికసించాయని తెలుసు...
మనసుకు ఒదార్పునిచ్చిన నీకు
బతుకుబాటలో తోడు నిలిచిన నీకు
మౌనంగానే ప్రణమిల్లుతున్నా...
మహర్షీ !
ఇంక సెలవు
మరలా నిన్ను ఏదీ కోరను
నాకు నేనుగా ఏదీ అడగను
మౌనమనే ప్రార్థనలో నేను పొందిన అనుభూతులు
చిన్న చిన్న విజయాలు
ఇదే జీవితం కాదని తెలిసిన నేను
నిన్నెలా నిందించగలను...
ఆశీస్సులు అందించే నువ్వు
విధిరాతను మార్చలేవని తెలుసుకున్నా
అందుకే ఇక ఎవరినీ ఏదీ అడగను
మౌనంగానే సెలవ్ తీసుకుంటున్నా...
ఏమో వస్తానేమో మరలా నీ చెంతకు
తలవంచుతానేమో నీ దిశకు
మౌనంగానే పలకరించి
మౌనంగానే మరలి వెళతా
నిన్ను మాత్రం ఏదీ కోరను
మహాత్మా
ధన్యవాదములు