Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 27 July 2020

ఇక ఆపేస్తున్నా


ఇక ఆపేస్తున్నా

ఎందుకో నన్ను నేను ఒకసారి ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనిపించింది.. అందుకే గత కొన్నిరోజులుగా నా జర్నలిజం ప్రస్థానంలోని విశేషాలను ఒక్కొక్కటిగా రాస్తూ ఉన్నా.. అయితే వీటిపై నా శ్రీమతి వాణీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు రహస్యంగా ఉన్న విషయాలు ఓపెన్ కావడం వల్ల నాకు కొత్త సమస్యలు రావచ్చని ఆమె భయం. మా అమ్మాయి కూడా తల్లి అభిప్రాయాన్ని బలపరుస్తోంది. అందుకే సబ్జెక్ట్ కు బ్రేక్ వేసేస్తున్నా.. ఎందుకంటే ఇప్పటివరకు ఇరవై శాతం మాత్రమే రాసాను. ఇంకా చాలా ఉంది. ప్రమాదకరమైన ఘటనలున్నాయి. నిజమే అవన్నీ రాస్తే కొత్త సమస్యలు రావచ్చు. రాస్తాను కానీ ఇప్పుడే రివీల్ చేయను. అవన్నీ మిమ్మల్ని ఏదో ఒక రూపంలో పలకరిస్తాయి.అప్పటికి నేనుండకపోవచ్చు. అయితే సరదా సంఘటనలు గుర్తుకు వస్తే అవి రాస్తాను సరదాగానే. ఇప్పటి దాకా రాసినవాటికి స్పందించిన సహృదయులకు ధన్యవాదాలు 🙏

ఆపరేషన్ చర్లపల్లి జైల్(PART-20)

ఆపరేషన్ చర్లపల్లి జైల్(PART-20)
పరిటాల హత్య తర్వాత చర్లపల్లి జైలు సంచలన కేంద్రంగా మారింది. పరిటాల మర్డర్ దర్యాప్తు చర్లపల్లి జైలు చుట్టే తిరిగింది. తన బావ కళ్లల్లో ఆనందం చూడటం కోసమే పరిటాలను చంపానని డబుల్ షూటర్ మొద్దు సీను ప్రకటించిన విషయం తెలిసిందే.. బావ ఎవరో కాదు మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరీ.. పరిటాల హత్య సమయంలో సూరీ చర్లపల్లి జైలులో ఉన్నాడు. జైలు నుంచే సూరీ కథ నడిపించాడని, సూరీ స్కెచ్ నే మొద్దు సీను అమలుపరిచాడని లింక్స్ బయటపడుతున్న సమయం.. జైలులో ఉన్న సూరీ యధేచ్చగా మొబైల్ ఫోన్లు వాడుతున్న విషయం బయటపడింది. సూరీ తన అనుచరులతోపాటు విదేశాల్లో ఉన్న కొందరితో మాట్లాడినట్లు దర్యాప్తు బృందాలు పసిగట్టాయి. దీంతో జైళ్ల శాఖ ఉలిక్కిపడింది. అంతర్గత విచారణలో కొందరు సిబ్బందిని సస్పెండ్ చేసిన జైళ్ల శాఖ అధికారులు దర్యాప్తులో గోప్యత పాటించారు. అసలు చర్లపల్లి జైల్లో ఏం జరుగుతోంది అంటూ ప్రింట్ మీడియా జైళ్ల శాఖను వరుస కథనాలతో కడిగేసింది. అయితే ఎలక్ట్రానిక్ మీడియాలో ఆలా రాయడానికి వీలు లేదు ఎంతసేపూ జైలు మెయిన్ గేటు చూపిస్తూ ఎన్ని కథనాలు ప్రసారం చేస్తాం. పైగా అధికారిక వెర్షన్ అంటే ఎవరో ఒక అధికారి మాకు చిన్న ఇంటర్వ్యూ అయినా ఇవ్వాలి. ఎలక్ట్రానిక్ మీడియాలో సున్నితమైన వార్తలకు ఇది కంపల్సరీ..
సమస్యను అధిగమించాలంటే ఎలాగైనా చర్లపల్లి జైలులోకి ప్రవేశించి ప్రతి అణువునూ షూట్ చేయాలని డిసైడ్ అయ్యాను. పైగా సూరీ కూడా అక్కడే ఉన్నాడాయే..
జైలుకు వెళ్లాను
జైలు కూడూ తిన్నాను
మామూలుగా అధికారులు పరిటాల మర్డర్ తర్వాత జైలు వ్యవహారాలపై మౌనం పాటిస్తున్నారు. నేనూ పదిసార్లు వివిధస్థాయి అధికారులను ట్రై చేసినా అందరూ మాట్లాడేందుకు నిరాకరించారు. ఎలా జైలులోకి వెళ్ళాలి... ఎవరో ఒకరు మాట్లాడాలి.. నాలో పట్టుదల పెరిగింది. అప్పటికి జైలు లోపల విజువల్స్ ఎవరి దగ్గర కూడా లేవు. అంతకుముందు మీడియా వాళ్ళు జైలులోకి వెళ్లినా అధికారిక కార్యక్రమాల కవరేజికే పరిమితం అయ్యారు. లోపల ఖైదీలు ఉండే బ్లాకులు, బ్యారక్ ఫుటేజీ ఎవరిదగ్గరా లేదు. ఎలాగైనా ఇది సాధించాలి అని నాలో కసి పెరిగింది. రూటు మార్చక తప్పలేదు.. జైళ్ల శాఖ డిఐజి Mr అహ్మద్ ను కలిసి కన్విన్స్ చేసాను, చర్లపల్లి జైలులో వసతులు, ఖైదీల సంక్షేమ కార్యక్రమాలపై స్పెషల్ ఫోకస్ చేద్దామని. రెండు రోజుల ప్రయత్నం తర్వాత ఆయన అంగీకరించారు. తేజ న్యూస్ టీమ్ కు అలా చర్లపల్లి జైలులో ఎంట్రీ దొరికింది. నిజంగానే లోపలికి ప్రవేశించగానే ఒక బృందావనంలో అడుగు పెట్టిన ఫీలింగ్ కలిగింది. Mr అహ్మద్ కూడా మాతోనే ఉన్నారు. లోపలికి వెళ్ళగానే ఏం చేయాలో ముందుగానే మా కెమెరామెన్ కు చెప్పి ఉంచాను. ఐదు గంటల పాటు షూటింగ్ జరిగింది. అహ్మద్ గారు చూపించిందంతా షూట్ చేస్తూ మాకు కావాల్సిన ఫుటేజీ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డాం. జైలులోని ప్రతి విభాగం షూట్ చేసాం.. నాకేమో సూరీ ఉన్న మహానది బ్లాక్ కావాలి. అహ్మద్ గారిని అడిగితే వితౌట్ కెమెరా అన్నారు. సరే అంటూ బ్లాక్ చేరుకున్నాం. మా కెమెరామ్యాన్ అక్కడా తన పనితనం చూపించాడు. సూరీ ఉన్న బ్లాక్ తోపాటు ఎస్ తీవ్రవాదులున్న బ్లాక్ నూ షూట్ చేసుకున్నాం. షూటింగ్ మధ్యలోనే జైలు ఫుడ్డుతో లంచ్ చేసాం. సందర్భంగా కొందరు ఖైదీలతో మాట్లాడి విషయాలు సేకరించే ప్రయత్నం చేసాను. అనుకున్నది అనుకున్నట్టే జరిగింది. ఒక మెయిన్ పార్ట్ మిగిలింది. అదే అధికారిక వెర్షన్, అంటే అఫీషియల్ బైట్.. mr అహ్మద్ గారికి మైక్ పెట్టాను. కెమెరా రోల్ అవుతోంది. ఆయన జైలు విశేషాలు సుదీర్ఘంగా చెబుతున్నారు, సడెన్ గా నా ప్రశ్నల చిట్టా విప్పేసా.. కెమెరా రోల్ లో ఉంది ఆయన తప్పించుకోలేకపోయారు. సూరీ వ్యవహారాలు, జైలులో సెల్ ఫోన్ భాగోతం అన్నీ చెప్పేసారు. అంతే నాకు కావాల్సింది దొరికింది . విలువైన ఫుటేజీ, అధికారిక బైట్స్ కావాల్సినంత సరుకు దొరికింది. ఫుటేజీతో ఎన్నో విలువైన స్టోరీలు చేసా. అన్నీ సూపర్ హిట్.. అయితే Mr అహ్మద్ గారికి మాటిచ్చిన ప్రకారం ఒక అరగంట పాజిటివ్ స్టోరీ కూడా ప్రసారం చేసాం. అయితే పరిటాల మర్డర్ సూరీ వ్యవహారం కొనసాగినంత కాలం ఫుటేజీ మాకు ఎక్స్ క్లూజివ్ గా పనికి వచ్చింది. ఇలా చర్లపల్లి జైల్ ఆపరేషన్ ఒక పథకం ప్రకారం సక్సెస్ అయ్యింది.అయితే మా కథనాల ప్రసారం తర్వాత చర్లపల్లి జైలు దగ్గర మీడియాపై ఆంక్షలు కఠినతరం అయ్యాయనేది వేరే విషయం..