Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 29 November 2020

ఇలాగైతే ఎట్టా...

 

ఇలాగైతే ఎట్టా...

 

అర్ధరాత్రి మెలకువ వచ్చింది.. ఏదో ఆలోచిస్తుంటే రెండు మంచి లైన్స్ మైండ్ లోకి వచ్చాయి.. నీ మొహానికి మంచి లైన్స్ కూడానా అని మొహం మీద అనేయకండి మనసు బాధపడుతుంది. సరే విషయానికి వస్తే మంచి లైన్స్ మైండ్ లోకి వచ్చాయిగా అదేనండీ నాకు మాత్రమే మంచి లైన్స్... పొద్దున్నే రాసుకుని పోస్టు చేద్దామని అనుకుని పడుకున్నా.. అదేంటో లేచాక ఒక్క లైనూ గుర్తుకువచ్చి చావటంలేదెందుకో.. ప్రతి రోజూ ఇదే తంతు. రోజూ నైట్ ఆలోచనలు వస్తాయి పొద్దున్నే మరిచిపోతా.. రాత్రే రాసి చావచ్చుగా అని అనుకుంటే బద్దకం.. ఏం చేయను అద్భుతమైన భావుకత (అదే నా దృష్టిలో) శూన్యంలో కలిసిపోతోంది. నా కష్టం పగవాళ్లకు మాత్రమే వస్తే బాగుండు...

పిచ్చోడే నయం

 

పిచ్చోడే నయం



దేవుడు నిజంగా ఉంటే

మరణించాక నన్ను

తన దర్బార్ లో నిలబెట్టి

ఏం కావాలో కోరుకో అంటూ వరం ప్రసాదిస్తే...

అప్పుడు నేను చిన్న దరఖాస్తు పెట్టుకుంటాను

నాకు మళ్ళీ మానవ జన్మ ఇస్తే

ఒక పిచ్చోడిలా పుట్టించు అని వేడుకుంటాను...

ఎందుకో తెలుసా

అప్పుడు లోకం చేసే గాయాలు నా మనసుకు తగలవు

అన్నింటికీ హాయిగా నవ్వుకోవచ్చు

చాటుగా కాకుండా

అందరిముందు గుండెలు పగిలేలా ఏడవవచ్చు

నాకోసం ఏడ్చేవారుండరు

ఎవరికోసమూ నేను ఏడ్చే అవసరమూ రాదు...

ఎందుకంటే ఈ లోకంలో

పిచ్చోడి జీవితమే ఎంతో నయం...

పాదాభివందనం

 

పాదాభివందనం

         


        

నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నామని      

అనుకుంటారు

అలా చూసుకునే క్రమంలో

నన్ను భరించడం అలవాటు చేసుకుంటున్నారని తెలుసుకోరు

నన్ను ఆకాశానికి ఎత్తుతున్నామని అనుకుంటారు

నా మనసు మాత్రం వారి పాదాలను ముద్దాడుతోందని గుర్తించరు

నన్ను ప్రేమించే మనసుకు

నిత్యం నా పాదాభివందనం 🙏

Wednesday 25 November 2020

తలరాత ( ఇది చదవకండి )

 

తలరాత

( ఇది చదవకండి )


అవును చదవకండి.. మనోభావాలు తోలూ తొక్కా దేవుడూ దెయ్యం వంటి ఫీలింగ్స్ తో సొంత వ్యక్తిత్వం లేకుండా పోయినవాళ్లు దయచేసి ఇది చదవకండి. తీవ్ర ప్రస్టేషన్ లో ఉన్నా నోడౌట్ ఫ్రస్టేషన్ లో ఉన్నప్పుడే సూటిగా మాట్లాడతా ఎవడి మనోభావాలు దేనిలో కలిసిపోయినా నాకు అనవసరం. అవగాహన ఉన్నోళ్లు చర్చించవచ్చు. మైండ్ తిక్క తిక్కగా ఉంటోంది తలరాత అన్న మాట వింటుంటే.. ఎవరిని కదిపినా ఎవరితో మాట్లాడినా ఏం చేస్తాం మన తలరాత అని నిట్టూర్చడం పరిపాటి. ఇందాక tv లో ఒక సీరియల్ కు సంబంధించిన యాడ్ లోనూ తలరాత అనే మాట వినిపించింది. పిచ్చి కోపం వచ్చింది ఆ మాట చెవిలో పడగానే.. అసలు ఈ తలరాత అంటే ఏంటి..? అందరూ తలరాత మీద భారం ఎందుకు వేస్తున్నారు.. మన మత సాంప్రదాయాల ప్రకారం విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.. తకదీర్ మే జో లిఖా హై వహీ హోగా అని అంటారు.. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. మరి ఇలాంటప్పుడు చీమ తప్పేముంది అంతా దైవ లీల అని సరిపెట్టుకోవచ్చుగా.. జీవితంలో మనం మంచి కొంతే చేస్తాం. ప్రతి నిమిషం ఏదో ఒక చెడు చేస్తూనే ఉంటాం. అలాంటప్పుడు అక్కడ మన తప్పేముంది? మన నుదుటి రాత అమలవుతోంది అని అనుకోవచ్చుగా.. ఉదాహరణకు ఒక హత్య జరుగుతుంది. హంతకుడు దేవుడి ఆజ్ఞను నెరవేర్చాడని సన్మానాలు ఎందుకు చేయం.. చచ్చినోడు వాడి రాత ప్రకారమే పోయాడని అనుకోకుండా చంపినోడికి శిక్షలు ఎందుకు? ఒక అమ్మాయి పెళ్ళి కాగానే విధవగా మారిపోతుంది. విధిరాత ప్రకారం ఆ మొగుడుపోతే అదే విధిరాతను నుదుటన మోస్తూ దేవుడి ఆజ్ఞను భరిస్తున్న ఆ అమ్మాయి నష్ట జాతకురాలు ఎలా అవుతుంది.. దేవుడి ఆజ్ఞకు ప్రతినిధిగా ఉన్న ఆమెను పూజించాలి గాని నష్ట జాతకురాలంటూ దూరం పెట్టడం ఎందుకు. ఇది విధిరాతను ధిక్కరించటం కాదా ఇది దైవ నింద కాదా? నేను మంచోడినో చెడ్డోడినో నాకు తెలుసు. కొంతమందికి నా పనులు చెడ్డగా అనిపించవచ్చు. ద్రోహిగానో పాపిగానో మోసగాడిగానో కొందరికి అనిపించవచ్చు. అరే బై దీంట్లో నా తప్పేముంది తలరాత ప్రకారమే నేను చేస్తున్నా అనుకుని నన్ను గౌరవించవచ్చు కదా. మోసం ద్రోహం కుట్ర హత్య ఇలాంటి ఘోరాలు విధిరాత ప్రకారమే జరుగుతున్నప్పుడు దేవుడి ఆదేశాలను గుర్తించకుండా మంచోళ్ళు చెడ్డోళ్లు అంటూ భేదభావాలేందుకు? దేవుడు రాసిందే అమలవుతుంది ఏది జరిగినా దేవుడి ఆదేశమే అనేది నిజమే అయితే మరి పాపాలు చేయమని రాయడం ఎందుకు మళ్ళీ శిక్షలు ఎందుకు? ఇదంత దైవ లీల మంచి చెడు గుర్తించే మెదడు మనిషికి ఇచ్చాడు దేవుడు అని వాదిస్తారు కొందరు. అంటే దేవుడు ఏం రాశాడో పట్టించుకోకుండా మనిషి సొంతంగా ఆలోచించి చేయాలన్నమాట. అయితే ఇక్కడ తలరాత ఏమయినట్లు?

నిజానికి తలరాత దేవుడేమీ రాయడు. మన తలరాత మనమే రాసుకుంటున్నాం. ఎదుటివాడి తలరాతను మనమే మార్చేస్తున్నాం. ఒక మంచోడు కనిపించగానే నేను దొంగ దొంగ అని అరుస్తాను, నా చుట్టూ ఉన్న పదిమందిలో ఐదుగురు అది నమ్మినా ఆ మంచోడి తలరాతను నేను మార్చేసినట్టే. అలాగే నా రాతనూ మరొకరు మార్చేసేయొచ్చు. ఇక్కడ బలవంతుడు బలహీనుడి తలరాత మారుస్తాడు. ఒక్కోసారి బలహీనుడు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బలవంతుడి తలరాతనూ మార్చిపడేస్తాడు. కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు ఎవరి తలరాతనైనా మార్చేస్తారు. అయితే అందరి తలరాతను మార్చగలిగే ఏకైక శక్తి డబ్బు మాత్రమే. ఇక్కడ మంచి చెడూ ఏదీ లేదు మారుతున్న తలరాతల్లో మంచోడు చెడ్డోడు కావచ్చు చెడ్డోడు మంచోడు కావచ్చు. మనం అన్నీ చేస్తూ విధి మీద నిందలేస్తాం. ఈ ప్రపంచంలో ఒకడి తలరాతను మరొకడు రాస్తూ బిజీగా ఉన్నంతకాలం ఉన్నాడో  లేడో తెలియని దేవుడి రాతలు నిందలు మోయాల్సిందే....

Sunday 22 November 2020

అమ్మ వచ్చింది...

 

అమ్మ వచ్చింది...


మెయిన్ గేటు దగ్గర ఏదో చప్పుడయింది.. గేటు తీసుకుని అమ్మ లోపలికి వస్తోంది.. కొంగులో ఏదో దాచుకుని వచ్చింది.. బెడ్ మీద నా పక్కనే కూర్చుని ఇవి తిను అంటూ నాలుగు యాపిల్స్, ఒక స్వీట్ బన్ చేతిలో పెట్టింది ఆప్యాయంగా.. ఎందుకో నా వైపు చూస్తూ తిట్లు మొదలు పెట్టింది... ఎలా తయ్యారయ్యావో చూడు కాళ్ళు చేతులు ఎంత  సన్నబడ్డాయి.. టైం కు తింటే ఏమయ్యింది... ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు అంటూ క్లాస్ మొదలు పెట్టింది.. నేను యాపిల్ తింటూ అమ్మ క్లాసు వింటున్నా నవ్వుతూనే నాకిది అలవాటే గనుక.. అంతలోనే బుజ్జగింపు మొదలు పెట్టింది టైమ్ కు తినాలి బేటా అంటూ... సరే మమ్మా అంటూ క్రీమ్ బన్ తినేసా.. సరే నేను వెళ్తా అంటూ తన సంచీ తీసి వంద రూపాయల నోటు చేతిలో పెట్టింది.. ఎందుకమ్మా ఇది అని అడిగా.. అవి తెప్పించుకో.. అని మెల్లగా చెప్పింది.. అమ్మ అవి అన్నదంటే సిగరెట్లు అని అర్ధం.. డబ్బులు చేతిలో పెట్టి గేటువైపు కదిలింది.. ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చింది.. ఇదంతా కలా.. అవును కలే.. ఈ లోకంలో లేని అమ్మ ఎలా వస్తుంది.. కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి.. ఇదంత కలే అయినా మా అమ్మ బతికున్నప్పుడు  తరచుగా ఇలానే చేసేది.. సిగరెట్లు తాగొద్దని తిడుతూనే పైసలున్నాయో లేవో అనుకుని చేతిలో డబ్బులు పెట్టేది.. రాత్రి మూడ్ బాగాలేదు.. మూడ్ బాలేనప్పుడు ఎందుకో అమ్మ గుర్తుకు వస్తుంది.. అదే కారణమేమో రాత్రి అమ్మ కలలోకి వచ్చింది..

అప్పుడప్పుడు అనిపిస్తుంది అమ్మ నిజంగా తిరిగి వస్తే

అమ్మ పట్ల నేనేమన్నా తప్పుగా వ్యవహరించి ఉంటే కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడగాలని..

అమ్మ ఒడిలో తలపెట్టి మనసారా ఏడవాలని...

ఏదీ జరగదని తెలుసు

అమ్మ రాదనీ తెలుసు

అయినా మనసెందుకో

ఇప్పుడు అమ్మను బలంగా కోరుకుంటోంది. 😰

Saturday 21 November 2020

ఖల్ నాయక్

 

ఖల్ నాయక్



నాలా నేను జీవిస్తే ఎవరికీ నచ్చను

నాలా నేను లేకపోతే నాకు నేనే నచ్చను

నాకు నేను నచ్చాలా

ఈ లోకానికి నేను నచ్చాలా

ఏమో నాకే తెలియని

అయోమయంలో

ఎవరికీ నచ్చకుండా

నన్ను నేనూ మెచ్చని

ఒక ఖల్ నాయక్ లా 

మిగిలిపోతానేమో...

Thursday 19 November 2020

షరాబీ

 

షరాబీ



అప్పుడే చిగురించిన చందమామను చూసి

మబ్బులతో పయ్యెదలను

సవరించుకున్న ఆకాశంలా

మధుకలశాలుగా కైపును నింపుకున్న కన్నులపై

మత్తుగా వాలుతున్న రెప్పల్లా

లయతప్పిన శ్వాసలో వణికే తీయని అధరాల్లా

మృదు మంజీర సవ్వడిలో తడబడుతున్న పాదపద్మాల్లా

తనువంతా తమకంతో

ఒళ్ళు విరుచుకున్న రతీదేవిలా

నా అక్షరం గతి తప్పుతున్నది ఎందుకో

మధుశాలలో షరాబిలా..

Monday 16 November 2020

నా బాల్యం తిరిగివస్తోందా...?

 

నా బాల్యం తిరిగివస్తోందా...?


ఏమో అవుననే అనిపిస్తోంది... చిన్నప్పుడు నాన్నతో జ్ఞాపకాలు చాలా తక్కువే.. అప్పట్లో నాన్న ఇచ్చే పదిపైసలు ఎంతో అపురూపం.. నాన్న పదిపైసలు ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూసే వాడిని.. ఆ పదిపైసలతో నాకిష్టమైన చిరుతిళ్ళు కొనేవాడిని. నాన్న తొందరగానే వెళ్లిపోయారు. తర్వాత పెద్దన్నయ్య నెలకోసారి తెచ్చే ఖలాకంద్  స్వీట్ కోసం ఎదురుచూసే వాడిని.. ఇక దీపావళి వచ్చిందంటే చిన్నన్న తెచ్చే టపాసులకోసం వారం ముందు నుంచే ఎదురుచూడటం నాకలవాటు. ఎలాగైతేనేం చాలావరకు సరదాలు తీరకుండానే గడిచిపోయింది నా బాల్యం.ఇరుగుపొరుగు పిల్లల సరదాలను చూస్తూ మాకెందుకు లేదు ఇలాంటి జీవితమనుకుంటూ కష్టాలతో ఎదురీదుతూ బాల్యాన్ని దాటేసా.. తర్వాత జర్నలిజంలో స్థిరపడ్డాక నా పిల్లలకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ రానీయలేదు. వాళ్ళు అడగకముందే అన్నీ కొనిచ్చా. ఆఫీసునుంచి వస్తున్నా అంటే  ఇంటికి ఏదో ఒకటి పట్టుకు రావడం అలవాటుగా మారిపోయింది. సరే ఇది చాలామంది చేసేదే ఇందులో నా గొప్ప ఏమీలేదని తెలుసు.. ఎందుకో ఇప్పుడు నా మానసిక పరిస్థితి మారిపోయింది.. అచ్చం చిన్న పిల్లాడిలా ఆలోచిస్తున్నా. ఆ మధ్య మా వాణీ బయటినుంచి వచ్చి నా పక్కన ఒక పార్సిల్ పెట్టింది. వావ్ నాకోసం kfc  చికెన్ తెచ్చింది అని సంబరపడ్డా. కాకపొతే అది ఫుడ్డు కాదు. మా వాణీ నాకోసం  తరచుగా kfc తెస్తుంటుంది కదా అందుకే అలా అనుకున్నానేమో అని నాకు నేను సర్ది చెప్పుకున్నా.. కానీ నిజం ఏమిటంటే నా మనసు చిన్నపిల్లాడిలా ఇలాంటివి కోరుకుంటోంది. అంతెందుకు వాణీ ప్రతిశుక్రవారం సాయంత్రం కూరగాయల మార్కెట్ కు వెళుతుంది. కూరగాయల మార్కెట్ కు వెళ్లిందా అంటే నాకు తినడానికి ఏదో తెస్తోంది అనుకుంటూ ఎదురుచూడటం అలవాటైపోయింది. నిజానికి ఈ నా మనస్సును నా వాణీ పసిగట్టిందేమో అలా వెళ్ళినప్పుడల్లా నేను చిన్నప్పుడు ఇష్టపడినవన్నీ నాకు తెచ్చిస్తోంది.  ఎందుకో నాకు తను ఆ సమయంలో అమ్మలా కనిపిస్తుంది. ఎంతో మురిపెంగా అవన్నీ దాచుకుని మరీ తింటుంటా.. ఎప్పుడైనా అలాంటివి తేకపోతే లోలోపల అలగటం కూడా మొదలయ్యింది. ఇక తాజాగా ఈరోజు ఆఫీసులో ఉన్న మా అబ్బాయికి ఫోన్ చేసి డాడీ  ఫిష్ తినాలనిపిస్తోంది అని అడిగేసాను. ఈమధ్య మా పాపతో మమ్మూ ఏమన్నా తినాలనిపిస్తోంది అని అడిగేస్తున్నా. తను బేకరీ నుంచి క్రీమ్ బన్ తెచ్చిస్తే అపురూపంగా తినేస్తున్నా.. ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నానో నాకే తెలియటం లేదు కానీ చేస్తున్నా.. నా అదృష్టం బాగుండి మా అమ్మ తర్వాత అమ్మలా నా వాణీ నా బొజ్జ నింపడమే పనిగా పెట్టుకుంది. మా వాడైతే ఇంట్లో ఉన్నంత సేపు డాడీ ఏమన్నా తెప్పించనా అని పదే పదే అడుగుతుంటాడు. చిన్న దగ్గు వచ్చినా నా బంగారు తల్లీ కలవరపడుతోంది. విషయం ఏమిటంటే వీటన్నింటినీ నా మనసు ఎంజాయ్ చేస్తోంది. ఇది చిన్న పిల్లల మనస్తత్వం కాకపోతే ఏంటి..  ఇలా ఎందుకు జరుగుతోంది..ఆర్ధికంగా బలహీనుడిని కావడం వల్ల ఇలా ఆలోచిస్తున్నానా.. నా వాళ్ళే కదా నాకు చేయాల్సిందే అనే ఆలోచనా... ఎందుకిలా ఆలోచిస్తున్నా... నేను నావాళ్ళ అవసరాలు తీర్చాలి కానీ నా చిన్నచిన్న ఆశలకోసం మనసు ఎందుకు మారాం చేస్తోంది.  వృద్ధాప్యంలో బాల్యం వస్తుంది అని అంటారు. మరి నాకు యాభై ఏళ్ళేగా.. నా బాల్యం కోయిల ముందే కూస్తోందా..?

Sunday 15 November 2020

ఆడవే నయం

 

ఆడవే నయం



ఆటవిక జాతుల సంచారం

ఆదిమానవుల ఆచారం

ఇదే నేటి జనారణ్య గ్రహచారం

తమ సమూహమే గొప్పదంటూ

మరో సమూహాన్ని సంహరిస్తూ

తన వైభవానికి

మరొకడి జీవితాన్ని పునాదిగా మారుస్తూ

ఆటలాడుకుంటున్న ఆటవికుల ఆధునిక నగరం కంటే

అడవిజంతువులు సంచరించే కీకారణ్యమే ఎంతో కొంత నయం కదా...

Saturday 7 November 2020

జర జాగ్రత్త

 

జర జాగ్రత్త



ఎవరు చెప్పారు ఇది అందమైన లోకమని

నవవసంతాల నిలయమని...

ఎవరు చెప్పారు ఇది

సువిశాల భవన సముదాయ నగరమని...

అందం ఎప్పుడో వికారమైపోయింది

పూదోటల పరిమళాలు లేనే లేవు

కాగితం పూలపై అద్దిన అత్తరువాసనే గుభాళిస్తోంది...

విశాలమేదీ లేనేలేదు

ఇరుకు మనసున్న మనుషుల సంచారంతో

నగరీకరణ ఇరుకుగా మారిపోయింది...

ఇక్కడ అడుగు తీసి అడుగేయాలంటే జాగ్రత్త సుమా

జీవమున్న మృతకళేబరాలు ప్రతి మలుపులో ఎదురు చూస్తూనే ఉంటాయి...

జర సమల్కే చలో భాయ్

యే దునియా బడీ బే రెహమ్ హై...

Tuesday 3 November 2020

బాబోయ్ ఆడలేడీస్... 😳

 

బాబోయ్ ఆడలేడీస్...  😳



పేదలే.. జీవితంలో అన్నీ కష్టాలే.. కొడుకు టాక్సీ నడుపుతాడు.. అంతంతే ఆదాయం... కానీ ఉండేది మేడలో.. వేసుకునే బట్టలు  జిగేల్ మనేలా ఉంటాయి...

ఇంకోరకం ఫ్యామిలీ ఇంట్లోనే ఉంటారు అందరూ.. ఏవేవో డిస్కషన్స్ జరుగుతుంటాయి. బిజినెస్ లో సమస్యలు.. అయినా అక్కడ అవేవీ కనిపించవు అందరూ సూటు బూటులో ఆడోళ్లయితే ఖరీదైన చీరల్లో కిలోల కొద్ది నగలు దిగేసుకొని ఉంటారు..సేమ్ ఇలాంటిదే మరో ఫ్యామిలీ.. ఇక్కడ ఆడోళ్ళు  కుట్రలు కుతంత్రాల్లో మునిగి తేలుతూ ఉంటారు. నడి వయస్సు స్త్రీలు టన్నులకొద్దీ మేకప్.. కప్ప పెదవులవంటి పెదాలపై ఎర్రగా లిప్ స్టిక్ అప్పుడే రక్తం తాగిన పిశాచాల్లా.. కళ్ళకు భారీ లైనర్ తో దయ్యాల్లా కనిపిస్తారు. మొహాన్ని వికృతంగా మారుస్తూ చిత్రవిచిత్ర హావభావాలతో మాట్లాడుతూ భయం గొలిపేలా ఉంటారు.కొన్ని ఫ్యామిలీస్ లో అందమైన యువతులు ఉంటారు. కళ్ళను గిరగిరా తిప్పుతూ పెదాలను భయంకరంగా చూపుతూ మాటాల్లోనూ చూపుల్లోనూ రగిలిపోతుంటారు. సాటి ఆడది కన్నీళ్లు పెడుతున్నా కుట్రలు కుతంత్రాలు చేస్తూ మానసికంగా శారీరకంగా హింసిస్తూ ఉంటారు. వీరిని చూస్తుంటే వామ్మో ఆడలేడీస్ ఇంత డేంజరా అని భయం వేస్తుంది. ఇంతకీ ఇలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయా అంటే.. ఎందుకు లేవు మన తెలుగు టివి సీరియల్స్ నిండా ఇవేకదా.. టీవిలో సినిమా మధ్యన బ్రేక్ లో వచ్చే ఈ సీరియల్స్ టీజర్లు చూస్తేనే ఇంతగా భయం వేస్తోంది అంటే రోజూ గంటల తరబడి చూసే ఆడవాళ్ళ గుండె ధైర్యానికి జోహార్లు చెప్పాల్సిందే..

Monday 2 November 2020

ఎలా చెప్పను

 

ఎలా చెప్పను



మాటల్లో చెప్పమంటే

ఎలా చెప్పను

ఏమని చెప్పను

కొన్ని అనుభవాలకు

మాటలు ఉండవు

కొన్ని అనుభూతులకు

అక్షరాలు ఉండవు

అక్షరాల్లో రాయలేనిది

నా కన్నుల్లో చదివే ఉంటావుగా

మాటల్లో చెప్పలేనిది

నా చిరుస్పర్శ సవ్వడిలో

వినే ఉంటావుగా

మనస్వినీ...