Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 30 December 2020

ప్రకృతివరం లక్నవరం..

 

ప్రకృతివరం లక్నవరం..







అక్కడ అడుగు పెట్టగానే ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టు ఉంటుంది.. నాలుగువైపులా ఎత్తన కొండలు... మధ్యలో నిండుకుండలా అందమైన సరస్సు... అక్కడక్కడా విసిరేసినట్లుగా కనిపించే అందమైన దీవులు.. పకృతి కాంత పచ్చ ముసుగు వేసుకుందా అనిపించేలా ఆకుపచ్చ అందాలు... ఉషస్సువేళ సరస్సును ముద్దాడే భానుడి వెండి కిరణాలు... వీనుల విందైన పక్షుల కువకువలు... ఎంత ముచ్చటైన భానోదయం... వరంగల్ కు సమీపంలో గోవిందరావుపేట మండలం పరిధిలో సుమారు పది ఎకరాల వైశాల్యంలో అందమైన పదమూడు దీవులతో ప్రకృతి కాంత సొగసులో మణి మకుటంలా విరాజిల్లుతున్న లక్నవరం సరస్సు అందచందాలు ఇవి...

అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది

అవును అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. మొదటిసారి లక్నవరం నేను మా వాణితో కలిసివెళ్ళా.. అప్పుడు కాళేశ్వరం వెళ్లి తిరిగివస్తూ లక్నవరం వెళ్లాం.. నేనే కార్ డ్రైవ్ చేసి ఉండటం వల్ల ఆలసట అనిపించటం.. అప్పటికే సాయంత్రం కావడం వంటి కారణాలతో  అక్కడ ఎక్కువ సేపు ఉండలేదు. కానీ అక్కడ ఉన్నంతసేపు మేము ఏదో వేరే లోకంలో ఉన్నట్టు ఫీల్ అయ్యాం... కానీ సమయం అంతగా లేకపోవటం కారణంగా తొందరగానే తిరిగి వచ్చేసాం మళ్ళీ రావాలనే బలమైన కాంక్షతో... అనుకోకుండా పదిరోజుల వ్యవధిలోనే ఫ్రెండ్స్ తో కలిసి మళ్ళీ లక్నవరం చేరుకున్నా.. ఒకరోజు స్టే చేసాం అక్కడ.. ఇక్కడ ఉషోదయం ఒక అద్భుతం.. పర్యాటక శాఖ నిర్మించిన రోప్ వేలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ.. నీటిలో విన్యాసాలు చేసే స్పీడ్ బోట్లు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంట్రెన్స్ లో మొదటి దీవిపై అందంగా నిర్మించిన హరిత కాటేజీల్లో బస చేయడం ఒక అందమైన అనుభవం.. అన్నింటికి మించి ప్రకృతి ఒడిలో సేద తీరాలనే మనసున్నవారికి ఇదో అందమైన అనుభవం.. హైదరాబాద్ నుంచి లక్నవరం కారులో వెళ్లాలంటే వరంగల్ లోకి ఎంటర్ కాకుండా నేరుగా ములుగు రోడ్డుపైనుంచి వెళ్ళవచ్చు.. మెయిన్ రోడ్డు పై చలవాయి ఏరియానుంచి రైట్ టర్న్ అయితే అక్కడికి చేరుకోవచ్చు. దాదాపు ఐదారు కిలోమీటర్లు మాత్రం గతుకులతో కూడిన ఘాట్ రోడ్డు ఉంటుంది. కానీ అక్కడ అడుగు పెట్టగానే అన్ని మర్చిపోతాం. అయితే స్టే చేయాలనుకుంటే మాత్రం ఆన్ లైన్ లోనే రూమ్ బుక్ చేసుకోవాలి. కాదనుకుంటే ఉదయం వెళ్లి సాయంత్రం దాకా హాయిగా ఎంజాయ్ చేయవచ్చు.. నేనైతే మళ్ళీ వెళతా ఖచ్చితంగా... ఎందుకంటే ప్రకృతి కాంత చేతులు చాచి మరలా మరలా రమ్మంటోంది మరి. నేను ప్రకృతి ప్రేమికుడినేగా

ప్రేయసిని చేరకుండా ఉండగలనా...

ఎందుకంటే అక్కడ చూడాల్సింది ఇంకా చాలానే ఉంది

Wednesday 23 December 2020

HAPPY BIRTHDAY MAMMA 🌹❤️🌹❤️🌹❤️🌹❤️🌹

HAPPY BIRTHDAY MAMMA

🌹❤🌹❤🌹❤🌹❤🌹



ఎంత ఎదిగిపోయావు మమ్మా...

చిట్టిపొట్టి అడుగులు

తడబడే నడకలు

ముద్దు ముద్దు మాటలు

ఇంకా మరిచిపోనే లేదు

ఇప్పుడు నా చాతీని తాకే  ఎత్తుకు ఎదిగిన నిన్ను చూస్తుంటే గుండె ఉప్పొంగిపోతోంది

మమ్మా చూడాలని ఉంది

నీ విజయశిఖరాలను

ఉంటానో లేదో తెలియదు

ఉన్నా లేకున్నా

ఉందో లేదో తెలియని

మరోలోకం నుంచి

నీ వైభవాలను చూస్తానేమో...

HAPPY BIRTHDAY MAMMA

🌹❤🌹❤🌹❤🌹❤🌹


Saturday 19 December 2020

ఐ డోంట్ కేర్

 

ఐ డోంట్ కేర్



ఐదు పదుల మైలురాళ్ళను ఆడుతూ పాడుతూ దాటలేదు నేను.

ఊహా తెలిసిన నాటి నుంచి ప్రతి క్షణం పోరాటంతోనే సాగింది.

ఎందుకంటే నేను గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు. తాత ముత్తాతల ఆస్తి పాస్తులు వారసత్వంగా రాలేదు. ప్రతిదినం వేదన, అవహేళన అవమానాలను దిగమింగుకుని పేదరికం స్థాయినుంచి మధ్యతరగతి స్థాయికి ఎగబాకాను. ఎవడిని ముంచకుండా ఎవడి మీద ఆధారపడకుండా ఒక వైభవంగా ఎదిగాను. ఎన్ని మలుపులు చూడలేదు ఎన్ని కుట్రలు అనుభవించలేదు అన్నీ జరిగాయి. మనుషుల్ని చూసాను మనుషుల మనసుల్ని చూసాను మనసుల మతలబులూ చదివాను. అన్నీ తట్టుకుని శిఖరమై నిలిచాను. నన్నెవరూ ఏమీ చేయలేకపోయారు. నా వైభవశిఖరాన్ని నేనే కుప్పకూల్చుకున్నా.. ఇప్పుడు కూడా అంతే నన్ను తొక్కేవాళ్ళు నన్ను నాశనం చేసేవాళ్ళు పుట్టలేదు. ఏం చేసుకోవాలన్నా నన్ను నేనే... ఇంతకన్నా ఏం జరుగుతుంది. జరిగితే జరగనీ.. ఇన్ని తట్టుకున్నోడిని ఈ జీవితం చేస్తున్న తాటాకు చప్పుళ్లకు బెదురుతానా!!!

ఐ డోంట్ కేర్..

Thursday 10 December 2020

నరకానికి సై...

 

నరకానికి సై...


నీకో  విషయం చెప్పనా

గమ్యమేమిటో నాకు అవసరం లేదు

మైలు రాళ్లు లెక్కించను

మలుపులు ఎన్నయినా పట్టించుకోను

నీ తీయని సాంగత్యంలో

జర్నీ చేస్తున్న విషయమే నాకు ముఖ్యం

చిరునవ్వుల వంతెనలు కడుతూ ఉండు చాలు

నీతో నరకానికైనా

నవ్వుతూ నడిచివస్తా...

Friday 4 December 2020

ప్రగతిభవన్ పై సర్జికల్ స్ట్రైక్

 

ప్రగతిభవన్ పై సర్జికల్ స్ట్రైక్


గ్రేటర్ ఫలితాలు నిస్సందేహంగా  సర్జికల్ స్ట్రైకే... కాకపొతే బండి సంజయ్ చెప్పినట్లు ఇది పాతబస్తీపై జరగలేదు. ప్రగతిభవన్ పై జరిగిన స్ట్రైక్ ఇది.. అయితే ఇంత జరిగినా తెరాస నేతల ఆలోచనల్లో మార్పు వచ్చినట్లు కానరావడం లేదు. ఓటమి విశ్లేషణలో మూసధోరణిలోనే మాట్లాడుతున్నారు. బిజెపి మతపరమైన భావోద్వేగాల ఆధారంగానే గెలిచిందని వాదిస్తున్నారు. కాదని నేను అంటాను. బిజెపికి మతం ఒక ప్లస్ పాయింట్ అయితే అయ్యి ఉండవచ్చు. అంతేగానీ అది ఒకటే కారణమని చెప్పడం సరికాదు. ఖచ్చితంగా తెరాస వైఫల్యాలే ఇందుకు కారణం. ఒకవేళ మతమే కారణం ఐతే బిజెపికి ఖచ్చితంగా వంద సీట్లు గెలిచి ఉండేది.అలా జరగలేదే. హిందూవులంతా మతావేశంతో ఊగిపోలేదే.. మతం బిజెపికి ఒక అదనపు బలంగానే ఉపయోగపడి ఉండవచ్చు. కానీ మతం పేరుమీదే గెలిచిందని అనలేము. ఎందుకంటే ప్రజలు ఎక్కడ నిర్లక్ష్యనికి గురయ్యారో బిజెపి అక్కడ మెరుగైన ఫలితాలు సాధించింది. ముఖ్యంగా వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బిజెపి దూసుకుపోయింది. దీనర్ధం ఏమిటి. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేగా.. గ్రేటర్ అంతటా బిజెపి గెలిచిందా లేదే.. కొన్ని చోట్ల గెలిచినా అది వన్ సైడ్ గా అంటే ఏకపక్ష మెజారిటీ సాధించలేదే. మతమే ప్రభావితం చేసి ఉంటే తెరాసకు ఇన్ని సీట్లు వచ్చి ఉండేవా.. ఇంకా ఈ మతం ముసుగుతో వైఫల్యాలను కప్పి పూచుకోవడం ఎందుకు. Trs ఒంటెద్దు పోకడలు, సర్వం మేమే అన్న అహంకారం, ప్రజాసమస్యలను సకాలంలో గుర్తించకుండా తెలంగాణా సెంటిమెంట్ నే నమ్ముకోవడం వంటి కారణాలతో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేయడం కూడా బీజేపీకి కలిసి వచ్చింది. ఖచ్చితంగా ఇది తెరాస  వైఫల్యమే. ఇవే్మీ ఆలోచించకుండా బీజేపీ మతం కార్డుతోనే గెలిచిందని ఇంకా వాదించడం తెరాసకే చెల్లింది. ఒకటి నిజం గ్రేటర్ ప్రజలు మొత్తంగా మతం వెంట పరుగులు తీయలేదు. మజ్లీస్ డివిజన్లకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కొంత ప్రభావం కనిపించిన మాట నిజమే. గత ఎన్నికల్లోనూ బిజెపి మతం అనే కార్డును ప్రయోగించింది మరి అప్పుడు ఎందుకు గెలవలేదు. ఎవరు ఎన్ని కార్డులు ప్రయోగించిన్నా గ్రేటర్ ప్రజలు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు. తెరాస నేతలు తమ ధోరణి మార్చుకోకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పక్కన చేరినా ఆశ్చర్యం లేదు.

Tuesday 1 December 2020

ప్రజాస్వామ్యానికి మరణశాసనం

 

ప్రజాస్వామ్యానికి మరణశాసనం

నిజమే ఇది ప్రజాస్వామ్యానికి మరణశాసనమే...చార్మినార్ సాక్షిగా ఇక్కడి రాజకీయం ప్రజాస్వామ్యానికి మరణశాసనం రాసేసింది.. ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన వారే అధికారంలోకి వస్తారు. అయితే హైదరాబాద్ లో మెజారిటీ ప్రజలు పోలింగ్ ను తిరస్కరించారు. ఖచ్చితంగా ఇది తిరస్కరించడమే. నలభై శాతం ఓట్లతో గెలుపు ఓటములు డిసైడ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అంటే  కొత్తగా వచ్చే పాలకపక్షాన్ని అరవైశాతం మంది ప్రజలు గుర్తించడం లేదనే కదా.. అసలు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది. ప్రజల్లో ఇంతగా నిరాసక్తత ఎందుకు ఏర్పడింది. గతంలో జరిగిన ఎన్నికల్లోనూ ప్రజలు పోలింగ్ కు దూరంగానే ఉన్నా ఈ సారి మాత్రం ఎన్నడూ లేనంత నిరాసక్తత ప్రజల్లో కనిపించింది. ఎందుకిలా జరిగింది అంటే ముందుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ మొదటివారంలోనే ghmc కి ఎన్నికలు జరపాలనే రాజకీయ నిర్ణయాన్ని ప్రజలు తిరస్కరించారు.భారీ వర్షాలు వరదలతో నగరం అతలాకుతలమైన పరిస్థితిలో సడెన్ గా ఎన్నికలు వచ్చి పడ్డాయి. మరో రెండు నెలలు సమయమున్నా ఇంత అర్జంటుగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏంటి?  దుబ్బాకలో బిజెపి కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగిన trs నాయకత్వం bjp మరింతగా బలపడుతుందేమో అనుకుందా.. ఇంత అత్యవసర ఎన్నికలు ఎందుకు... ప్రతిపక్షాలను గుక్కతిప్పుకోనీయకుండా చేయాలని కాదా.. ప్రజలు మానసికంగా సిద్ధపడకముందే ఎన్నికలు జరిపేసారు. ఇదే కారణమేమో హైదరాబాదీ బయటికి రాలేదు. మరో విషయం ఏమిటంటే రాజకీయ పార్టీలు ప్రచారంలో ఊగిపోయాయి. హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామనే దాకా వెళ్ళింది పరిస్థితి.ప్రజల్లో మతపరమైన భావోద్వేగాలు రగిల్చేందుకు ఎంత చేయాలో అంత చేశారు. అయితే ఇక్కడి ప్రజలు మతపరమైన అంశాలను చెత్తబుట్టలో పడేసారు. నిజంగానే మతపరమైన భావోద్వేగాలు ఏర్పడివుంటే ప్రజలు బారులుతీరి ఓటు వేసేవారు. మతకలహాలు జరుగుతాయని ప్రభుత్వం  ప్రచారం చేయడం వల్లనే ఓటింగ్ తగ్గిందని బండి సంజయ్ అంటున్నాడు పాపం ఆయనకు హైద్రాబాద్ గురించి అవగాహన లేదు. ఒకవైపు కత్తిపోట్లు జరుగుతున్నా తొంభై శాతం పోలింగ్ జరిగిన చరిత్ర హైదరాబాద్ కు ఉంది. ఎవడొస్తే ఏముంది అనే ఫీలింగ్ నగరవాసిలో బలపడింది. పోనీ ఓటు వేద్దామంటే ఓటర్ స్లిప్ ఉంటే లిస్టులో ఓటు ఉందో లేదో తెలియని పరిస్థితి. ఈ పాపంలో ఎన్నికల కమిషన్ భాగమే ఎక్కువ. ఇంటింటికి ఓటర్ స్లిప్ పంపిస్తామని చెప్పారు అది ప్రకటనకే పరిమితమయ్యింది. పోనీ ప్రభుత్వ వ్యతిరేకత ఉందా అంటే అదీ లేదు. ఒకవేళ  వ్యతిరేకత ఉంటే ఓటర్లు బారులు తీరి మరీ ఓటు వేసేవారు. వాడూ వీడూ అనికాదు మొత్తం రాజకీయులంటేనే హైదరాబాదీలకు ఏవగింపు వచ్చినట్టుంది. ఇక్కడి ప్రజలను నిందించి లాభం లేదు. బలవంతంగా ఎన్నికలు రుద్దటం,  మతాల పేరుతో నీఛ రాజకీయాలకు పాల్పడటం, ఎవడు ఎప్పుడు ఏ పార్టీ కండువా వేసుకుంటాడో తెలియకపోవటం... ఇలా ఎన్నో ఉన్నాయి కర్ణుడి చావుకు లక్ష కారణాలు ఉన్నట్టు.. మొత్తం మీద ఇక్కడ ప్రజలే గెలిచారు రాజకీయం ఓడింది. అయినా కొత్త పాలకవర్గం ఏర్పడుతుంది మెజారిటీ ప్రజల అభిమతాన్ని అపహాస్యం చేస్తూ... ప్రజాస్వామ్యమా ఇది నీకు మరణశాసనం కాదా...