Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 30 November 2017

మనసు లేఖను నువ్వే రాసుకో

మనసు లేఖను నువ్వే రాసుకో

మెరిసే నక్షత్రాలను అక్షరాలుగా మార్చుకోనా
నవ్వే పువ్వులను నా భావాలుగా మలుచుకోనా
చందమామకు నా మనసు గోడును చెప్పుకోనా
వెండివెన్నెలలో కలిపి నా శ్వాసను తెలుపుకోనా
నీలి నింగి మబ్బులతో నా సందేశం పంపనా
చల్లని చిరుగాలికి నా మనసు విప్పి చూపనా
ప్రేమలేఖ రాయాలని ఉంది అక్షరాలను వెతికి పట్టనా
చెదిరిపోయి పరుగులుతీస్తున్న అక్షరాలకు తలవంచనా
మనసుమాట చెప్పాలని ఉంది మౌనానికి సవ్వడి నేర్పనా
ఏ భాషలో చెప్పాలో తెలియక తెలియని పాండిత్యం నేర్చుకోనా
హృదయ సవ్వడి చెప్పేందుకు మాటలు లేవు నాలో
ప్రేమలేఖ రాసేందుకు అక్షరాలే లేవు నాలో
నా మనసు పుస్తకం తెరిచిపెడుతున్నా
అక్షరాలను కూర్చి నా మనసు లేఖను నువ్వే రాసుకో

Thursday 23 November 2017

కరిగిపోనీ నన్ను చుక్కలు చుక్కలుగా

కరిగిపోనీ నన్ను చుక్కలు చుక్కలుగా
 
ఎందుకింత తొందర ఈ కాలానికి
గడియారం ముళ్ళు ఎందుకు పరుగులు తీస్తున్నాయి...
సూరీడుకి ఇంత తొందర ఎందుకు
చల్లని వెన్నెలను తాగేసేందుకు ఉబలాటపడుతున్నాడు...
నిశిపరదాలు ఎందుకు తాము కరుగుతూ
ప్రభాత కిరణాలకోసం తహతహలాడుతున్నాయి...
సమయం నా ఆరాటానికి ఎందుకు హద్దులు గీస్తోంది
కాలం ఎందుకు వేగిరపడుతున్నది ...
ఇప్పుడే వచ్చావు అప్పుడే వెళ్ళిపోయే ఆత్రం ఎందుకు
నేనింకా మనసు నిండా నిన్ను చూడనే లేదు...
ఘడియలను క్షణాలుగా నీ బింకంలోనే కరిగించావు
వాలిన కనురెప్పల మాటున సగం వెన్నెల రేయిని దోచేసావు...
నీ అధరమధురిమలను మౌనానికే అరువిచ్చావు
ఎగసిపడే పరువాలతో కవ్విస్తూ
దరికి చేరితే దూరం జరుగుతావు...
మనసుతో మనసును మాట్లాడించి
పొగరుతో సొగసును కరిగించి
వయసు సమరానికి నగారా మోగితే
వేళకానే కాదంటూ కాలం ఉరుకులు పెడుతోంది...
కాలమా నీకెందుకు ఇంత తొందర
ఆగిపో పూబంతి నా చెంత ఉండగా
కరిగిపోనీ నన్ను చుక్కలు చుక్కలుగా ...

Saturday 18 November 2017

తేరీ తలాష్ ఆజ్ భీ హై

తేరీ తలాష్ ఆజ్ భీ హై

ఆజ్ భీ మేరీ నిగాహ్ ఆస్మాన్ కీ ప్యాసీ హై...
బేచైన్ మన్ కో ఆజ్ భీ తేరీ తలాష్ హై...
ఊహ తెలిసిన నాటినుంచి నీకోసమే
ఎదురుచూసాను
చుక్కలతో మెరిసే ఆకాశంనుంచి
మిలమిలా మెరిసే ఒకతారకలా దిగివస్తావని...
ఊహలకే పరిమితమైన నువ్వు
నిజంగా లేవని తెలిసినా
ప్రతి పున్నమి వెన్నెలలో నిన్ను వెతికాను
అందమైన ఆడపిల్లలా ఆడుకుంటున్నావేమోనని...
చిన్న వయస్సులో పిచ్చి కల్పనలేమిటని లోకం నవ్వినా
భావుకతలోనే మునిగితేలాను
ఊహాసుందరి కనిపిస్తుందేమోనని...
తిరుగుతున్న గడియారం ముళ్ళ ఆదేశాలను పాటిస్తూ
క్యాలెండర్ పేజీలు  మారుతున్నా
పరిమాణాలకు నేను తలవంచినా
శోధన మానుకోలేదు
కల నిజం చేస్తూ నువ్వు వస్తావని...
అందమైన పూదోటలా ఒక పువ్వు మనసును తాకితే
పులకించిపోయింది హృదయం
నువ్వు వచ్చేసావనీ...
ఊహాసుందరి నిజమై మనసును తాకితే
రక్తం కారేదాకా తెలియలేదు
గుండెకు గుచ్చుకుంది పువ్వుకాదు ఒక ముల్లని...
నా పిచ్చికాకపోతే మరేంటి
ఊహలలో నాతో ఆడుకునే నువ్వు
నిజమై ఎలా వస్తావు...
ఒక అందమైన భావపుష్పమై
మధురమైన స్వప్నమై
నా కనురెప్పలపైనే ఉండిపో
ఎప్పటికీ నిజమై రాకు
ఒక కలగానే నువ్వు అందంగా ఉంటావు
నేను మాత్రం తుది శ్వాసదాకా
నీకోసం నిరీక్షిస్తూనే ఉంటా...

Thursday 16 November 2017

అంతా నిజమే

అంతా నిజమే

నీ ప్రేమ నిజం కాకపోవచ్చు
నేను ప్రేమించింది నిజమే
నీ అనురాగం ఒక మాయ కావచ్చు
నా అనుభూతులన్నీ నిజాలే
నీ కనులలో నారూపం చెదిరిపోవచ్చు
నా కళ్ళలో నీ రూపం మాయకాదు
కలలన్నీ కాల్పనిక గాథలే అని నువ్వు సరిపెట్టుకోవచ్చు
నా కనురెప్పలపై కలల తాలూకు తడి ఇంకా ఆరనే లేదు
అన్నీ నువ్వు తేలికగానే మరిచిపోవచ్చు
నా జ్ఞాపకాలన్నీ పచ్చి నిజాలే

Monday 13 November 2017

చలిమంటలు వేసి పో

చలిమంటలు వేసి పో

శరదృతువు సరసమాడుతోంది
వడివడిగా వస్తున్న హేమంతం గుబులురేపుతోంది
శిశిరం ఆలోచనే కలవరం కలిగిస్తోంది
రుతువులన్నీ కలిసి కత్తికడుతున్నాయి
మంచు తీగలుగా మారిన
శీతల శరములు దేహాన్ని గుచ్చుకుంటున్నాయి
ఘనీభవించిన రుధిరం కరుగుతూ బుసలు కొడుతోంది
శరతుడికే సవాలు విసురుతూ
మెరుపుతీగవై కదిలిరా
హేమంతుడిని నిలువరిస్తూ
పరువాల సెగలతో అభిసారికవై దరికి రా
వయసు సమరానికి శంఖం ఊది
సొగసు వెలుగులతో కాగడా వెలిగించి
తనువుల రణంతో అగ్గిని పుట్టించి
శిశిరాన్నీ కరిగించి పో
ఒంటరిదైన మనసుకు
జతలేని తనువుకు
ఎవరో తెలియని నువ్వే నేనై
చలిమంటలు వేసి పో 

Wednesday 8 November 2017

పావురంతో ప్రేమలేఖ

పావురంతో ప్రేమలేఖ

కాకితో కబురు పంపమాకు
అది రెండుముక్కలు చెప్పి ఎగిరిపోతుంది
పావురంతో ప్రేమలేఖ పంపు
అది నీ మనసు మొత్తం చదివి వినిపిస్తుంది
నీలి మేఘమాలికలను నమ్ముకోమాకు
అవి ఉరుములై మెరిసి మాయమైపోతాయి
చల్లని వెన్నెల జాబిలికి మనసు కథలు చెప్పు
అవి రేయంతా నాతోనే ఉండిపోతాయి
నీతోటలో పూచిన గులాబీలను పంపమాకు
రెండు ఘడియల్లోనే అవి వాడిపోతాయి
నీ మనసులో ఉదయించిన అక్షర పుష్పాలను పంపు
అవి నా మనసులో నిత్యం పరిమళిస్తూనే ఉంటాయి
నిన్ను సుతారంగా తాకి జారిపోతున్న
పిల్లగాలులను అదిలించమాకు
అవి నీ శ్వాసను అరువుతెచ్చి నాకు
కొత్త ఊపిర్లు అందిస్తూనే ఉంటాయి

Monday 6 November 2017

రాళ్ళు కాదు అవి నాకు పువ్వులే

రాళ్ళు కాదు అవి నాకు పువ్వులే 

రాళ్ళు విసురుతూనే ఉండు
అవి నన్ను పువ్వులుగానే తాకుతూ ఉంటాయి
విధ్వంసమే నీ విధానమైతే
ప్రేమతత్వమే నా సిద్ధాంతం
నిత్యం పరిమళిస్తూనే ఉంటాను
అసత్యశరములు సంధిస్తూనే ఉండు
సత్యకవచము నన్ను కాపాడుతూనే ఉంటుంది
అధర్మానికి నువ్వు ఆలవాలమైతే
ధర్మం నావైపే నిలిచి ఉంది
నా మతాన్ని తూలనాడుతూ ఉండు
మతాలన్నింటికీ నేను తలవంచే ఉంటా
నీ మతములోనే  నీకు దిక్కు లేకున్నా
అన్ని మతాలూ నాతో అభిమానంగానే ఉన్నాయి
ఎక్కడికీ పారిపోలేదు నేను
ఇక్కడే నిలిచి ఉన్నా
తుది శ్వాసదాకా శిఖరమై
నిలబడే ఉంటాను

Friday 3 November 2017

నిన్నే ప్రేమిస్తా

నిన్నే ప్రేమిస్తా 


అవసరార్ధ ప్రేమబాటలో నేస్తమై నడుస్తున్నావు
రాబంధువుల లోకంలో రక్షణకవచమై నిలుస్తున్నావు
నడకలు తడబడితే నడతలు నేర్పుతూ అడుగుజాడలు విడుస్తున్నావు
దారులన్నీ మూసుకుపోతే మార్గదర్శివై దిశను చూపుతున్నావు
కటికచీకటి కమ్ముకుంటే కాగాడాలా వెలుగునిస్తున్నావు
ఎవరు మార్గాలను మార్చుకున్నా నువ్వు మాత్రం నీడలా అనుసరిస్తున్నావు
మోసం దగాల మాయానగరిలో నా వేలుపట్టి నడిపిస్తున్నావు
శ్వాస ఆగిపోయే తరుణంలో గుండెకు కొత్త ఊపిరులు పోస్తున్నావు
ముభావమైన మనసులో కొత్త భావాలు పూయిస్తున్నావు
నవ్వులు మరిచిన పెదాలకు కొత్త నవ్వులు నేర్పుతున్నావు
నన్ను నీలో కలుపుకుని నాలోనే నువ్వు దర్శనమిస్తున్నావు
అందుకే నిత్యం నేను నిన్నే ప్రేమిస్తున్నాను
నీ బాటలోనే నడుస్తున్నాను
నా దేహంలో జీవం ఉన్నంతవరకు
ఓ అంతరాత్మా నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను

Wednesday 1 November 2017

కాటేసిన కల

కాటేసిన కల

నువ్వు లేవన్నది నిజం
నువ్వు రావన్నది సత్యం
అయినా ఎందుకు నువ్వున్నావనిపిస్తున్నది
 నీ పరిమళం నన్ను తడుముతున్న అనుభూతి
నా ఊపిరిని నీ శ్వాస పెనవేసుకున్న భావన
ఇరుతనువులు దరికి చేరిన సుపరిమళం
నన్ను తాకుతున్న గాలిలోనే ఉన్నావా నువ్వు
నన్ను కొంటెగా చూస్తూ నువ్వుతున్నావా నువ్వు
నీ చిరునవ్వుల పువ్వులు
ఎందుకు నా పాదాలను తాకుతున్నాయి
మెత్తని పాదాలతో నా ముంగిట నడియాడుతున్నావా నువ్వు
ఎందుకు నీ పదమంజీరాల సవ్వడి మనసును మీటుతున్నది 
ఎందుకు మనసు ఇంకా భ్రమ పడుతున్నది
ఎందుకు ఎండమావిలో నీటిజాడలు వెతుకుతున్నది 
పిచ్చిది కదా నామనసు
ఇంకా నిజం తెలుసుకోలేకపోతున్నది
మాయాలోకం కరిగిపోయిందని
అందమైన కల కాటేసిందని