Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 17 February 2022

చుక్కేసి పడుకో మనసా

 

చుక్కేసి పడుకో మనసా


నిగ్గదీసి అడిగి నిలదీయాలని ఉంది...

అబద్ధాలను నిప్పుతో కడిగేయాలని ఉంది...

నివురులో సమాధి అయిన నిజాలను నిప్పులా మండించాలని ఉంది...

మాటల మతలబుల చిక్కుముడి విప్పేయాలని ఉంది...

చిరునవ్వుల మాటున దాగిన విషపుష్పాలను నలిపేయాలని ఉంది...

గడిచిన కాలం చేసిన గాయాలను వెలికి తీయాలని ఉంది...

పువ్వులా పరిమళించే నా అక్షరాలను అగ్ని శిఖలుగా సంధించాలని ఉంది...

శాంతి మంత్రం పఠించు

గౌస్ భాయ్

మందేసిన వేళలో అక్షరాలను నిద్రపుచ్చడమే మేలు...

చుక్కేసి కైపెక్కి

ముసుగేసి పడుకో మనసా...

Saturday 12 February 2022

మళ్ళీ ఉదయిస్తా

 

మళ్ళీ ఉదయిస్తా

సాయం సంధ్య వేళలో

వెండివెలుగులు అద్దుకుంటున్నా

పిల్లగాలులతో పరాచికాలాడుతూ...

నాకు తెలుసు

ఈ వెలుగులు శాశ్వతం కాదనీ

నిశికన్య తన కురులతో

నన్ను కమ్ముకుంటుందనీ...

చీకటిపై కొత్త రంగులు

చిమ్ముతూ

సరికొత్త ఉదయాన్నై

మళ్ళీ మళ్ళీ ప్రభవిస్తూనే ఉంటా

నిన్నలో గతాన్ని సమాధి చేస్తూ

రేపటికి కొత్త ఊపిరి పోస్తూ...

Wednesday 9 February 2022

కురిసిపోనీ

 

కురిసిపోనీ

కన్నుల కొలనులో

సునామీ వస్తే రానీ

కనురెప్పల ఆనకట్టలు

తెగితే తెగిపోనీ

పొంగితే పొంగిపోనీ

కురిస్తే కురిసిపోనీ

అయితే

మనసు సంద్రంలో

కాస్త తడియారకుండా చూసుకో

ఎవరికి తెలుసు

రేపు కంటి కలువలు

ఒక చుక్కనీటి కోసం

అలమటించే ఘడియ పలకరిస్తుందేమో....

నవ్వుతుంది నవ్విస్తుంది

 

నవ్వుతుంది నవ్విస్తుంది

 


కనురెప్పల మాటున

దాచుకున్న నీటిపొరలను ఇట్టే పట్టేస్తుంది...

క్షణం క్షణం నా మనసును స్కానింగ్

చేసేస్తుంది...

నా అంతరంగాన్ని క్షుణ్ణంగా చదివేస్తుంది...

నేను ముభావంగా కూర్చుని ఉంటే

ఒక అలలా చుట్టముట్టేస్తుంది...

క్యా హోరా గౌస్ భాయ్ షేక్ అంటూ నా ఆలోచనలకు బ్రేక్ వేసేస్తుంది...

నవ్వుతుంది

నవ్విస్తుంది.

నానా అల్లరి చేస్తుంది

అమ్మలా లాలిస్తుంది

కొండంత భరోసా ఇస్తుంది...

అవును

నా చిట్టితల్లి

నాకు ఒక ధైర్యమై నిలుస్తోంది...

Tuesday 8 February 2022

ఏం చేయను...

 

ఏం చేయను...



మనసులో మండుతున్న మంటలను అక్షరాలుగా సంధించాలని అనుకుంటాను గానీ

శిథిల హృదయంలో ఏ మూలనో మిగిలి ఉన్న అనురాగం అంటుకుని

ఆ అక్షరాలు పుష్పాలై పరిమళిస్తున్నాయి

ఏం చేయను...

మనసును ముక్కలు చేసిన మనసుపై సమరం చేయానుకుంటాను గానీ

చెల్లాచెదురైన మనసు ముక్కలు మూకుమ్మడిగా

ఆ మనసునే ఆరాధిస్తున్నాయి

ఏం చేయను....

Sunday 6 February 2022

పదిలం సుమా

 

పదిలం సుమా

కొంచెం కష్టమే సుమా

మనసులో మమతలు ఏ మూలనైనా ఇంకా మిగిలే ఉంటే

కాలం గీసిన చిత్రంలో నువ్వూ నేనూ విరబూసిన నవ్వులు ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటాయి...

కొంచెం భారంగానే ఉంటుంది

జ్ఞాపకం ఏదైనా మిగిలి ఉంటే

నువ్వూ నేను నడిచిన బాటకు అలవాటు పడిన పాదాలు నీ కొత్త పయనంలో కాస్త తడబడుతూనే ఉంటాయి...

కొంచెం కలవరం ఉంటుంది

వాస్తవాలు చెప్పుకోవాలంటే

అంతరాత్మ మనసు పొరల్లో మౌనంగా రోదిస్తూనే ఉంటుంది...

జాగ్రత్త సుమా

పరిస్థితులను విస్మరించే గుణమున్న నా మనసు ఇంకా నీ పదిలమే కోరుతోంది...