Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 31 July 2021

నేనింకా మరణించలేదు

 

నేనింకా మరణించలేదు



తడబడ్డానేమో

నడక ఆగిపోలేదు

పడిపోయానేమో

ఓడిపోలేదు

గమ్యం మారిందేమో

ప్రయాణం ఆగిపోలేదు

వైభవం మసకబారిందేమో

వ్యక్తిత్వం మారనేలేదు

ఏ కంటికీ కనిపించటం లేదేమో

నేనింకా మరణించలేదు

సజీవ దృశ్యాన్నై కాలమనే

యవనికపై బలమైన

ముద్ర వేస్తూనే ఉంటా..

Thursday 29 July 2021

గడియారం నవ్వింది

 

గడియారం నవ్వింది

హోరుమని వీస్తున్న తూఫాను గాలికి దయ్యాల్లా ఊగుతున్న చెట్లు

హాహాకారం చేస్తున్నాయి...

ఎందుకో చిన్న బోయిన పున్నమి

చంద్రుడు మబ్బు చాటున

ముసుగేసుకున్నాడు...

గుడ్డి దీపాల వెలుగులను కూడా మింగేయాలని

చిమ్మ చీకటి నోరు తెరిచి

విశ్వరూపం చూపిస్తోంది...

ఏదో తెలిసిన సందడి

నా వీనులను లీలగా తాకుతోంది

అవును అది చిరుమువ్వల సవ్వడే

అది చెవులలో ఏదో మంత్రం వేస్తోంది...

చెవిపై ఏదో నెమలి ఈక

నాట్యం చేస్తున్న గిలిగింత...

ఏదో వెచ్చని శ్వాస మెల్లగా ఊపిరిలో కరిగిపోతున్న

పులకింత...

బాగా పరిచయమున్న

స్వరమేదో ఆచేతనమైన మెదడులోకి చేరి చేతన పుట్టించిన కలవరింత...

ఎక్కడో సముద్రుడు ఒళ్ళు విరుచుకున్నట్టున్నాడు

ఓ పెద్ద అల విరుచుకుపడిందేమో

గుండెల్లో ఒక్కసారిగా సునామీ

పొంగింది..

కళ్ళు తెరిచి కాలగమనం వైపు దృష్టి సారిస్తే

దుష్ట రాక్షసి గడియారం

నన్ను చూసి ఫక్కున నవ్వింది...

Tuesday 27 July 2021

తడిచిన పుస్తకం

 

తడిచిన పుస్తకం

ఒక్కో పేజీని తిరగేసి చూసావని తెలుసు

ప్రతి పేజీని నీ వేళ్ళతో తడిమినప్పుడు నా గుండెను

మీటినట్టు అనిపించటం

నాకు తెలుసు...

చూసుకో జాగ్రత్తగా

ఆ వేళ్ళకు ఏదో వెచ్చని తడి తగిలినట్టుంది

అది నా కన్నీరని నాకు తెలుసు...

నా హృదయాంతరాల

సునామీలో ఉబికిన ఆ కన్నీరు తడియారే లోపలే

నా శ్వాస ఆగిపోతుందనీ తెలుసు...

నా అక్షరాల విలువ తెలియని నువ్వు

నా మనసు పుస్తకాన్ని చూస్తూ

నీకు తోచిన భాష్యాలనే

జీవితాంతం శోధిస్తూ ఉంటావనీ తెలుసు...

నిప్పురవ్వలు

 

నిప్పురవ్వలు


నిండు పున్నమి వెన్నెలలో అందమైన ఆడపిల్లలై ఆడుకోవటం తెలిసిన నా అక్షరాలకు

మండుటెండలో భగభగమని మండటమూ తెలుసు...

మంచు కురిసేవేళలో పువ్వులా పరిమళించే నా అక్షరాలకు

చెమట చుక్కలను ముద్దాడటమూ తెలుసు...

జడివానలా కురిసే నా అక్షరాలకు

మండే కొలిమిలో నిప్పురవ్వలై

ఎగసిపడటమూ తెలుసు...

నేను మరణించినా

నా అక్షరాలు

వసంత మేఘాలై గర్జిస్తూనే ఉంటాయి...

Thursday 22 July 2021

అమ్మ పాదాల చెంత

 

అమ్మ పాదాల చెంత



సాయం సమయం

వర్షం ఆగకుండా కురుస్తోంది

నాకేం ఇబ్బంది అనిపించలేదు

అక్కడే నిలబడి ఆ ప్రాంతాన్ని

తదేకంగా చూస్తున్నా...

నా చెంపల మీదుగా జారుతున్న వాన నీటిలో

నా కన్నీరు కూడా కలిసిపోయిందని నాకు తెలుస్తూనే ఉంది..

నాతో ఉన్న నావాళ్లు మతపరమైన కార్యక్రమం చేసుకుంటున్నారు

నా మనసు అదేమీ పట్టించుకోవటం లేదు...

ఏదో తెలియని బాధ గుండెను మెలియపెడుతోంది

తల భారమైన భావన తెలిసిపోతూనే ఉంది...

తడిచిన నా కళ్ళు దృష్టిని మరల్చుకోలేదు

ఆర్తిగా ఆవేదనగా ఒకే చోట లగ్నమై నిలిచాయి...

ఆ చోటు అమ్మ విశ్రమిస్తున్న చోటు

అది అమ్మ సమాధి

ఆ సమాధి పొరలలోనే అమ్మ నిదురిస్తోంది...

మనసు ఎంత భావుకమైనా

నాకు తెలుసు ఆ మట్టిలో అమ్మ లేనే లేదని

అమ్మ దేహం ఎప్పుడో మట్టిలో కలిసిపోయిందని...

అయినా అక్కడ అమ్మ నిద్ర పోతోందనే మనసు నమ్ముతోంది

అమ్మ ఆప్యాయంగా పిలుస్తున్నట్టే అనిపించింది...

మనసుకు సర్ది చెప్పి

రెండు అడుగులు వెనక్కి వేసా

అమ్మ పాదాల చెంత చదును చేసిన నేల కనిపించింది

నేనూ ఇక్కడే విశ్రాంతి తీసుకుంటే బావుంటుందని అనిపించింది

అంటే ఆమ్మ పాదాల చెంత ఆ ఖాళీ స్థలం నాదేనని తీర్మానించుకున్నా...

పక్కనే ఉన్న నా కొడుకుతో

మెల్లని స్వరంతో చెప్పా

డాడీ నేను మరణించాక

నన్ను ఈ ప్రాంతంలోనే సమాధి చేయాలని

అలా అన్నప్పుడు తన ముఖంలోని భావాలను చూడాలని అనిపించలేదు

ధైర్యం చాలలేదేమో...

అమ్మకు మనసులోనే వీడ్కోలు చెప్పి స్మశానం లోనుండి బయటికి అడుగులు వేసా భారంగా

కలుస్తాం అమ్మా త్వరలోనే అని మనసులో అనుకుంటూ...

Tuesday 20 July 2021

చెడ్డీ బనీయను

 

చెడ్డీ బనీయను

ఫేస్ బుక్ లో AG Datta గారి చెడ్డి బనియను స్టోరీ పోస్టు చదివాక రాయాలనిపించింది... ఆయన చిన్నప్పుడు ఇంటి పరిసరాల్లో ఉన్నప్పుడు చెడ్డి బనియన్ మాత్రమే వేసుకునే వారు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళేటప్పుడు మాత్రమే ప్యాంటూ షర్టూ వేసుకునేవారట... నేను కూడా అంతే ఏడవతరగతి వరకు కూడా చెడ్డి బనియన్ మీదే ఊరంతా తిరిగేవాడిని. స్కూల్ కి కూడా అలానే వెళ్ళేవాడిని, కాకపోతే ఒక షర్ట్ వేసుకునేవాడిని స్కూల్ లో ఉన్నంత సేపు..గవర్నమెంటు స్కూల్ కదా డ్రెస్సింగ్ గురించి పట్టించుకునేవారు కాదు. ఊర్లో చెడ్డి మీద తిరుగుతున్నప్పుడు చాలామంది ఆటపట్టించేవారు. పొడుగ్గా ఉండటం వల్ల చెడ్డి మీద అసహ్యంగా ఉండేదని నాకూ తెలుసు. అయినా అంతే...చెడ్డి బనియనే మన వస్త్రాలంకరణ.. పదో తరగతిలో స్కూల్ కు వెళ్ళినప్పుడు మాత్రం ప్యాంటూ షర్టూ వేసుకునేవాడిని.. ఇంటికొస్తే మళ్ళీ అదే అవతారం.. ఊర్లో కొందరు తిట్టే దాకా వెళ్ళింది పరిస్థితి ప్యాంటు వేసుకోవచ్చు కదరా అని... అయినా చాలా కాలం అలాగే కొనసాగించాను.. అలాగని చెడ్డి మీద తిరగటం నాకు షోకు కాదు.. అసలు నా దగ్గర అవి తప్ప వేరే బట్టలు ఉండేవి కాదు.. మనం గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టలేదు కదా.. చిన్నప్పుడే నాన్న పోవడం, ఆయన వ్యాపార సహచరులు హ్యాండ్ ఇవ్వటం వంటి కారణాలతో భరించరాని పేదరికం అనుభవించాం.. ఆ చెడ్డి బనియను కూడా అమ్మ కుట్టినవే.. ఒకటే జత ప్యాంటు, షర్టు ఉండేవి. పండగరోజో, ఎవరైనా పెళ్ళికి పిలిస్తేనో వేసుకోవచ్చని భద్రంగా దాచుకునే వాడిని.. కానీ చెడ్డి మీద తిరిగినన్ని రోజులు నేనెంత వేదన అనుభవించానో నాకే తెలుసు. ఎందుకంటే పొడుగ్గా,బక్కగా ఉండటం కారణంగా నేను అసహ్యంగా కనపడేవాడిని.. ఇప్పుడు దత్తగారి పోస్టు వల్ల నాటి రోజులు గుర్తుకు వచ్చాయి....

Thursday 15 July 2021

కత్తి కలవరం.

 

కత్తి కలవరం.


రైటో రాంగో పక్కన పెడితే

అతని ప్రశ్నలో సూటిదనం ఉంది

అతని వాదనలో కరకుదనం ఉంది

అతని చర్చలో అంతుచిక్కని మర్మం ఉంది

అతని విశ్లేషణలో ఒళ్ళు జలదరించే భయం ఉంది

అతని తర్కంలో తిరగబడే విప్లవం ఉంది

అతను భౌతికంగా లేకున్నా  అతని భావజాలం కత్తిలా గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంది

అందుకే  అభిమానించేవారికన్నా

వ్యతిరేకించేవారే

అతని పేరును పదే పదే

కలవరిస్తున్నారు..

Wednesday 14 July 2021

ఒడ్డున కూర్చుని మాట్లాడొద్దు..

 

ఒడ్డున కూర్చుని మాట్లాడొద్దు..

నిన్న ఒక మిత్రుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నా అని ఒక సుదీర్ఘమైన పోస్టు పెట్టాడు. కారణాలు ఏమైనా ఆయన నిజంగానే నిద్రమాత్రలు మింగి ఆపస్మారక స్థితిలో రాచకొండ పోలీసులకు కనిపించారు. ఆయనకు ఏమీ కాలేదు, బాగానే ఉన్నాడు. సంతోషించాల్సిన విషయమే... ఆయన ఎందుకలా చేశారన్నది ఆయన కుటుంబం, సంబంధిత వ్యక్తులు చూసుకుంటారు. అది మనకు అప్రస్తుతం బతికి ఉన్నాడు చాలు. నేను చెప్పే పాయింట్ ఏమిటంటే...

అతను పెట్టిన పోస్టుకు అనూహ్యమైన స్పందన వచ్చింది.. అందరూ ఆయన క్షేమాన్ని కోరుకున్నారు. ఇది  సహజమే. అయితే ఆ పోస్టులో, దానికి అనుబంధంగా పెట్టిన అనేక పోస్టుల్లో కొన్ని కామెంట్లను పరిశీలిద్దాం.. జీవితమంటే యుద్ధం పోరాడాలిగాని చావకూడదు... పిరికితనంతో నిర్ణయాలు తీసుకోవద్దు... ఆత్మహత్య మాహా పాపం... నీ కుటుంబం గురించే ఆలోచించు... నీకు మేమున్నాం ఎలాంటి సహాయానికైనా సిద్ధం... నీ చావుకు కారణమని అనుకుంటున్నవారిని చంపు నువ్వు చావడమేంటి...ఇలాంటి కామెంట్లు, పోస్టులు పెట్టి భరోసా ఇచ్చారు. ఈ ఒక్క విషయంలోనే కాదు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకున్నా, చేసుకుంటాం అని పోస్టు పెట్టినా ఇలాంటి ఓదార్పులే రాలుతుంటాయి. శవాన్ని చూడానికి వెళ్లి అయ్యో ఎంత కష్టం వచ్చింది,నాకైనా చెప్పి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేవాడిని కదా అని అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంటారు...

ఇదంతా నాన్సెన్స్ అంటాను నేను...

జీవితమంటే యుద్ధం అట, యుద్ధం చేస్తూనే ఉండాలట.. ఎవరి మీద యుద్ధం చేయాలి అయినవాళ్లే మోసం చేస్తే ఎవరితో పోరాడాలి.. ఆ పోరాటానికి ఈ లోకం ఆమోదం వేయదు కదా సరికొత్త నిందలు వేస్తుంది. అందుకే మనిషి అస్త్ర సన్యాసం చేస్తాడు.. ఆత్మ హత్య పిరికితనం ఎలా అవుతుంది.. పిరికి వాళ్ళు భయంతో చంపుతుంటారు, ధైర్యం ఉన్నోడే తనను తాను చంపుకుంటాడు. ఈ ధైర్యం అందరిలో ఉండదులే.. సరే ఆత్మ హత్య తప్పే అనుకుందాం.. మరి చావు మాట రాగానే సానుభూతి ఒలకబోసే వాళ్ళు అతను బతికి ఉంటే నిజంగా ఆదుకుంటారా.. అవసరానికి పది రూపాయలు అడిగితే తిరిగి ఎప్పుడిస్తావ్ ఎలా ఇస్తావ్ అని యక్ష ప్రశ్నలు వేసే బంధు మిత్రులు ఓ అభాగ్యుడిని ఆదుకుంటారా? చస్తాడేమో అని అనుమానమున్నా రూపాయి సహాయం చేయరు గాని చస్తే మాత్రం ఇంటికి వచ్చి మొసలి కన్నీరు కారుస్తారు.ఎవరో కొందరు మినహాయిస్తే అందరూ చచ్చేదాకా ఎదురుచూసే వాళ్ళే.... చితికిపోయిన మనిషి అందరి సహాయమూ కోరడు, తనకు బాగా సన్నిహితులనే అడుగుతాడు. మనీ విషయం రాగానే వారిలో సాన్నిహిత్యం మంచు ముద్దలా కరిగిపోతుంది. మనకెందుకులే తలనెప్పి అనుకుంటూ మొహం చాటేస్తారు. కొందరు నిజంగానే ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు అది వేరే విషయం. కానీ చాలా మంది ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోరు. చచ్చాక మాత్రం అంత్యక్రియలకు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. అయ్యో మా నాన్న చనిపోయాడని విలపించే కొడుకు, మా ఆయన వదిలేసిపోయాడురో దేవుడో అని గుండెలు బాదుకునే పెళ్ళాం.. చావుదగ్గర కన్నీళ్లు పెట్టుకునే బంధువులూ... నిజంగా అతను బతికి ఉన్నప్పుడు భరోసాగా నిలిస్తే ఈ దుస్థితి వచ్చేదా....ఓ నిండు ప్రాణం గాలిలో కలిసేదా.. ఇక చేతిలో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెట్టే బడుద్దాయిలు అవసరం వస్తే నిజంగా సహాయం చేసేవాళ్లేనా.. చస్తున్నవాడికే తెలుసు తను మునుగుతున్న లోతెంతో... ఒడ్డున కూర్చుని మాట్లాడేవాళ్లకు ఏం తెలుస్తుంది...

Monday 12 July 2021

మీరు ఆస్తికులెలా అయ్యారు....?

 

మీరు ఆస్తికులెలా అయ్యారు....?

కత్తి మహేష్ మరణం నేపథ్యంలో fb, ఇతర సోషల్ మీడియాలో దేవుడు, ఆస్తికులు, నాస్తికులు అంటూ టన్నులకొద్దీ చర్చ జరుగుతోంది. నా లిస్టులోనూ చాలామంది చర్చల్లో వీరోచితంగా పోరాడుతూ బట్టలు చింపుకుంటున్నారు.. చర్చ మంచిదే నాకూ కొన్ని సందేహాలున్నాయి. ఎక్కడైనా సమాధానం దొరుకుతుందేమోనని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఎవరివైనా మనోభావాలు గాయపడితే నేను పట్టించుకోను. మనోభావాలదేముంది అవి ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటూనే ఉంటాయి..

సరే విషయానికి వద్దాం..

దేవుడున్నాడా లేడా.. బూజుపట్టిన పుస్తకాల్లో నిజమెంత అబద్ధం ఎంత అనే విషయాలు పక్కన పెడదాం. కాసేపటికి దేవుడు ఉన్నాడనే అనుకుందాం, అనుకోవడంలో తప్పులేదు కదా..

ముందుగా ఇస్లాం ను తీసుకుందాం.. నీతి నిజాయితీకి, శాంతి సామారస్యాలకు దర్పణం ఇస్లాం అని చెప్పుకుంటాం. మరి ఎంతమంది దీనికి కట్టుబడి ఉన్నారు.. ఐదు పూటలా నమాజు చేసేవాళ్ళు తప్పులు చేయటం లేదా? బురఖాల మాటున ముదితలు విచ్చలవిడితనాన్ని ఆస్వాదించటం లేదా? నమాజు చేసే షరాబులు

మోసాలు దగాలు చేయటం లేదా? అంటే వీరికి దేవుడంటే భయమే లేదా? లేక దేవుడు లేనే లేడని వీరి నమ్మకమా? మరి వీరెలా ఆస్తికులయ్యారు. దేశ జనాభాలో సగమంతమంది దేవుళ్ళున్న హిందూ మతంలో తొంభై శాతం మంది ఆస్తికులే కదా... పొద్దున్న లేచి నుదుటిన అడ్డం నామాలు పెట్టుకుని మందికి పంగనామాలు పెడుతున్నావారూ భక్తులేనా? తెల్లారగానే లేచి ఎంతో నిష్ఠతో పూజలు చేస్తూ మొగుడు బయటకు వెళ్ళగానే పరాయివాడితో కులికే మగువలూ ఆస్తికులేనా? నిత్యం దైవనామస్మరణ చేస్తూ మోసాలు,దగాలు చేసే వాళ్లు భక్తులేనా? శాంతి సందేశం క్రైస్తవం... మరి బైబిల్ చదివేవాళ్ళు అందరూ పునీతులేనా? పాస్టర్లే అత్యాచారాలు చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం మరి వీళ్ళకి దేవుడంటే భయం లేదా? లేక దేవుడే లేడని నమ్మకమా? సూటిగా అడుగుతున్నా నువ్వెంత పెద్ద భక్తుడివో భక్తురాలివో కావచ్చు గుండె మీద చెయ్యేసి చెప్పు నీది పరిశుద్ధ ఆత్మనా? నువ్వు తప్పులే చేయలేదా? అబద్ధాలే చెప్పలేదా? ఎవరినీ వంచించలేదా?

చెప్పలేవు కదూ... మరి నీది ఆస్తికత్వం ఎలా అవుతుంది?దేవుడి పేరు ఎత్తే అర్హత నీకుందా అసలు?నాస్తికులు తప్పులు చేయరు అని నేను చెప్పను, నేరాలు ఘోరాలు చేస్తూ ఉండవచ్చు, కానీ వీళ్ళు దేవుడి ముసుగులో మాత్రం మోసాలు చేయరు. అందరూ మోసాలు చేసే వాళ్ళే అయితే మధ్యలో దేవుడెందుకు? ఈ ఆస్తికత్వం, నాస్తికత్వం ఎందుకు? అసలు దేవుడి మార్గంలో పయనిస్తూ తప్పులే చేయని ఆస్తికులున్నారా?

మరి దేవుడు చెప్పింది (దేవుడు చెప్పాడో లేదో )చేయక తమ స్వార్ధం కోసం అడ్డమైన పనులు చేసే మీరు ఆస్తికులు ఎలా అయ్యారు?

మూసుకుని కూర్చోండి అందరూ దొంగలే...

Note : నేను మాత్రం పరిశుద్ధ ఆత్మను కాను.

సుందరకావ్యం

 

సుందరకావ్యం


చిటపట చినుకులు కాస్తా

జడివానలా మారుతున్న

సంధ్యాసమయం....

ఓ వైపు పచ్చదనాల తివాచి పరిచినట్లు

పాడిపంటల సిరులు

మరోవైపు చేతులు చాచిన పిల్ల కెరటాలతో

సవ్వడి చేసే జలసిరులు...

గొంతులోకి వెచ్చగా జారుతున్న మధురసంతో

పులకించిన నా స్వరం

ఒక అందమైన గజల్ ను అందుకుంటే

వాహ్  ఆ సాయంత్రం ఎంత కమనీయం...

మరలా చిగురించేనా కాల పుష్పం

ఆవిష్కరించేనా

సుందర కావ్యం...

Wednesday 7 July 2021

కనబడలేదా మరో ప్రపంచం

కనబడలేదా మరో ప్రపంచం


మరో ప్రపంచం

మరో ప్రపంచం

మరో ప్రపంచం

ఎక్కడుంది ఈ మరో ప్రపంచమంటూ

సోషల్ మీడియాలో గబ్బు కామెంట్లు పెడుతున్న

పిచ్చి నాయాళ్ళారా

కనపడలేదా మీకు

మరో ప్రపంచం దూతలు...

పాలకుల దమనకాండలో

బడా కంపెనీల వికృత క్రీడలో తాను మరణిస్తూ

నీకోసం సేద్యం చేస్తున్న

రైతన్నలో చూడు

మరో ప్రపంంచం కనిపిస్తుంది...

బ్రెడ్డు ముక్కపై తీయని తేనె రాసుకుంటూ

సుతారంగా పెదాలతో కొరుక్కుతినే ఓ వగలాడీ

ఆ మకరందం కోసం

రక్తం చిందిస్తున్న ఆదివాసీలను చూడు

మరో ప్రపంచం దూతలు కనిపిస్తారు...

నీ ఇంటికి ఇటుకలు మోసే కూలీలు

నీ పాయిఖానా శుభ్రం చేసే బడుగు జీవులు

నీ చెత్తను ఊడ్చేసి నీ వీధులను అద్దంలా మార్చేసే సఫాయి అన్నలు

నీ కార్ టైర్ కు పంక్చర్ రిపేర్ చేసే రోడ్డు సైడు జీవులు

నీ నల్లాలు కుళాయిలు

బొంగూ బోషాణాలు క్లీన్ చేసే ప్లంబర్లు

నీ బొందకు గోతులు తీసే

మట్టి మనుషులు

వీరంతా

మరో ప్రపంచం దూతలే...

అసంఘటిత మరో ప్రపంచం సంఘటితమైన నాడు

మీ ప్రపంచం కుప్ప కూలడం

ఖాయం...


నేలకొరిగిన స్వప్నం

 

నేలకొరిగిన స్వప్నం


కలలపై ఆంక్షలా

స్వాప్నికులపై నిర్భంధమా

పల్లె బతుకుల రేపటి ఆశలపై అఘాయిత్యమా

అణగారిన జీవితాలకు

కారాగార వాసమా

రాజ్యమా

ఇంకా ఎన్నాళ్ళు నీ దమనకాండ

సాహసికుల ఊపిరి తీస్తూ

ప్రశ్నించే గొంతుకలను పిసికేస్తూ

నిర్భంధమే ప్రధాన విధానమైన రాజ్యమా

నీ నిరంకుశ పాలనలో

నేలకొరుగుతున్న స్వప్నాలు

కోట్లాది కొత్త కలలకు

పురుడుపొస్తున్నాయి చూడు..

Thursday 1 July 2021

మనసు జాడలు

 

మనసు జాడలు



జయజయ ధ్వానాలు

హాహాకారాలను జయిస్తూ

కొత్త నిశ్శబ్దం నిద్దుర లేచింది...

జిగేల్ మనే కాంతులు

గుండెలు అదిరే పిడుగులను చెరిపేస్తూ

ఎక్కడో ఒక చీకటి కన్నులు తెరిచింది...

మనసును దోచే రాగాలు

మదిని చీల్చే గీతాలను

సవాలు చేస్తూ

ఓ మౌనవీణ తన తీగలను

సవరించింది...

పూదోట పరిమళాలు

తావిలో దాగిన ముళ్లను

కవ్విస్తూ

రాతి పువ్వు ఒకటి మొగ్గ తొడిగింది...

అభిమానాల మందార మాలలు

అవహేళనల ముళ్ల కిరీటాలకు

జడిసిన ఓ మనసు

మరో లోకం వైపు అడుగులు వేసింది

తనజాడలు తానే చెరిపేసుకుంటూ...