Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 22 April 2017

ప్రియనేస్తం

ప్రియనేస్తం
మౌనం ఒక అందమైన నేస్తమై
ఎదుట నిలిచింది
మనసును తట్టిలేపే పుస్తకమై
పలకరించింది
ప్రతి పుటలో ఒక పలకరింత
ప్రతి పేరాలో ఒక తుళ్ళింత
అభిమానాల కేరింత
అవమానాల కవ్వింత
అయినా మౌనమంటే నాకిష్టం కొండంత
అవును
ఇప్పుడు మౌనం నాకు ప్రియమైన
మనసు పుస్తకం

Sunday 9 April 2017

భావసమరం

భావసమరం

మదిని మధురంగా తడుముతున్న
అనుభవాల అనుభూతులు
తీయగా పలకరిస్తున్న
భావపరిమళాలు
సంధ్యావేళలో ఉషోదయపు గీతికల్లా...
అనుభవపుష్పాలను చిదిమేసే
ఆవేశ తరంగాలు
నమ్మకాన్ని వమ్ము చేసే
కరకుదేలిన తూటాలు
భావం మాడి మసైపోతోంది
చితిమంటలలో కాలుతున్న శవంలా ...
పరస్పర విరుద్ధ భావజాల సంఘర్షణలో
ఓటమిని ముద్దాడుతూ
భయంతో పారిపోతున్నా
నా మనసును గుప్పిట పట్టుకుని
అదికూడా కాలిపోతుందేమోనని... 

Wednesday 5 April 2017

ఓటమి

ఓటమి

రెండు చేతులతో ముఖారవిందమును
దాచుకున్నావు
నీ అందాన్ని కానరానీయరాదని
నీకేం తెలుసు
నీ అందం మరింత రెట్టింపయ్యిందని
నీ కరకంకణములు మంచుకొండల మెరుపులైతే
కొండల మాటున దాగిన శశి కిరణాలే నీ కన్నులు
తనివితీరా నీ నయనసోయగాలను చూస్తూ
ఎన్నెన్నో కవితలు రాసుకోవాలని అనుకున్నా
నీ సొగసులకు మెరుగులు దిద్దేలా అక్షరాలను
అల్లుకోవాలని భావాలను వెతుక్కున్నా
భావాలు ఎన్ని మెదిలినా
నీ అందానికి సరితూగే అక్షరాలు మాత్రం
దొరకనేలేదు
జఫర్ గజల్ ను తడిమి చూసా
కృష్ణ శాస్త్రి కవితలు మననం చేసుకున్నా
గులాం అలీ మంద్రభావాలను పరికించి చూసా
చివరకు పంకజ్ ఉధాస్ గానాన్ని గుర్తుచేసుకున్నా
ఎక్కడా భావాలు దొరకలేదు  
అక్షరాలు కుదరలేదు
అప్పుడు తెలిసింది నాకు
నీ కనురెప్పలసొగసుల వెలుగులముందు
సమస్త భావలోకం ఓడిపోయిందని
మనస్వినీ