Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 29 April 2021

భారత్ వెలిగిపోతోంది

 

భారత్ వెలిగిపోతోంది


ఎవడురా నాదేశం అంధాకారంలో మగ్గిపోయిందని కూసాడు...

ఎవడురా నాదేశం రాతియుగంలోకి జారిపోయిందని ఏడిచాడు...

కళ్ళు తెరిచి చూడు

భారత్ వెలిగిపోతోంది...

ఎర్రటి చితిమంటల్లో సమిదలై మండుతున్న భారతీయ మృతదేహాలు

కాగడాలుగా మండుతూ

నాదేశాన్ని వెలిగిస్తున్నాయి...

సైన్స్ కే సవాలు విసురతూ

గోమూత్రమే దివ్య ఔషదమని చాటుతూ

ప్రపంచానికి కొత్త వెలుగులు ప్రసాదిస్తోంది

నాదేశం...

ఉందో లేదో తెలియని కరోనాకు వెరవక

ఎన్నికలనూ మేళాలను ఘనంగా నిర్వహిస్తూ

గుండె ధైర్యాన్ని చూపుతోంది

నా దేశం...

మంటల్లో పేలుతున్న కాపాళాల ధ్వనులు మంగళ వాయిద్యాలుగా

ధర్మం కోసం యాభయ్ ఆరు ఇంచుల ఛాతీ విరుచుకుని విజయోత్సవాలు జరుపుకుంటోంది నాదేశం...

చూడరా కళ్ళు విప్పుకుని

వెలిగిపోతోంది భారతదేశం...

Tuesday 27 April 2021

సిగ్గుందా మీకు

 

సిగ్గుందా మీకు

కొంచమన్నా సిగ్గు శరం ఉందా అని డైరెక్టుగా అడుగుతున్నా... ఇందాక fb లో ఓ మిత్రుడి పోస్టు చూసి స్పందించి రాస్తున్నా ఇది.. మన పక్కదేశాల్లో కరోనా తక్కువ ఉంది అని ఆయన అంటే పాకిస్తాన్ కు వెళ్ళిపో మరి అని ఒక లత్కోర్ గాడు కామెంట్ చేసాడు. పోనీ ఆ పోస్టు పెట్టిన పెద్దమనిషి ముస్లిమా అంటే కానే కాదు.. పోనీ హిందూ మత వ్యతిరేక పోస్తా అంటే కానే కాదు. అంకెలు చెప్పిన వాస్తవాలే ఆయన చెప్పాడు. చర్చించటమే తెలియని మూర్ఖ భక్తులు అడ్డంగా వాదిస్తే ఎలా.. నిజమేగా పాకిస్తాన్, బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో కరోనా కేసులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఒకే అవి చాలా చిన్న దేశాలు వాటితో మనకు పోలికా అని ప్రశ్నించే మేధావులు ఉన్నారు. సరే కరోనాకు పుట్టినిల్లు అని చెబుతున్న చైనాలో కేసులు ఎందుకు నామమాత్రంగా ఉన్నాయి. ఏం అక్కడ కూడా జనాభా తక్కువే అని అంటారా ఏంటి.. మరీ ఇంత మూఢ భక్తి అయితే ఎలా? ముందు మీ అయ్యను అడగండి కరోనా టైంలో ఎన్నికలకు ఎలా వెళ్ళావని.. ఎందుకు వేలాది మందితో ర్యాలీలు చేస్తున్నావని.. ఇలాంటి టైంలో కుంభమేళా అవసరం ఏంటి... అన్నీ తెలిసినా ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు పెట్టలేదు, ఏం బెంగాల్ ఓట్లు పోతాయనా.. మొదటి దశ అప్పుడు హౌలాగాడు ట్రంప్ కోసం కరోనాకు గేట్లు తెరిచారు. గుప్పెడంత మంది జమాతీలపై తోసేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు కుంభీలు జాంబీలై తిరుగుతున్నా ఒక్కడూ మాట్లాడడుఎందుకు?మొదటి నుంచి కరోనాపై ఒక ప్లానంటూ లేదు. ఒకడు గోమూత్రం అంటాడు, మరొకడు బురదలో పందిలా దొర్లితే కరోనా రాదంటాడు, పెద్దాయనేమో చప్పట్లు కొడుతూ సామాన్యుడికి అర్ధం కానీ భాషలో సొల్లు చెబుతుంటాడు. మీరేమో దేశం కోసం ధర్మం కోసం అంటూ ఎదురుదాడికి సిద్ధమైపోతారు. ఏముంది కరోనాకు గేట్లు తెరిచారు కాదు కాదు సరిహద్దులు చెరిపేసి స్వాగతం పలికారు. ఇప్పుడు వ్యాక్సిన్ వ్యాపారం చేస్తున్నారు. టీ అయినా టీకా అయినా మీకు వ్యాపారమే కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టి గృహ నిర్బంధం చేస్తారు. దేశం కోసం ధర్మం కోసం భరించాలి ప్రశ్నిస్తే పప్పాకు కోపం వస్తుందిమరి... అయినా ఆయనకేంటి హాయిగానే ఉంటాడు మీలాంటి మూర్ఖులు ఉన్నంతకాలం......

Friday 23 April 2021

ఇప్పుడు కాకపొతే ఇంకెప్పుడు?

 

ఇప్పుడు కాకపొతే ఇంకెప్పుడు?


హే రామ్ అంటూ హృదయావిదారకంగా రోదిస్తున్న నీ భక్తులను చూడు...

యా అల్లాహ్ అంటూ గుండెలు పగిలేలా ఆర్తనాదాలు చేస్తున్న నీ జాతిని చూడు...

దయామయ ప్రభువా అంటూ విలపిస్తున్న నీ బిడ్డలను చూడు...

అదిగో అక్కడ కాలుతున్న దేహం నుదుటన మెరుస్తున్న తిలకం నీ నామ సంకేతమేగా...

తలపై తెల్లని టోపీతో ఒరిగిపోయిన ఆ తండ్రి నుదుటిపై నల్లని మచ్చలు నీకు సజ్దా చేసిన గురుతులేగా...

శవపేటికలో నిదురిస్తున్న ఆ మనిషి గుండెపై కాంతులీనే శిలువ నీ వైభవ చిహ్నమేగా...

కరోనా రక్కసి మానవాళిని కబళిస్తోంది

శిలావిగ్రహం ధ్వంసం చేసి తేజోమూర్తివై కదలిరాలేవా

మసీదు గోడలను పెకిలించి కాంతిరేఖవై నడిచి రాలేవా

ఇనుపముళ్లను పెకిలించి శిలువనుంచి దిగి రాలేవా...

బూజుపట్టిన నీ పుస్తకాల పుటల్లో కాల్పనిక కథగానే

మిగిలిపోతావా...

ఉన్నావా అసలు

ఉంటే నీ శక్తిని చూపలేవా

ఇప్పుడు కాకపొతే ఇంకెప్పుడు?

Tuesday 20 April 2021

చంపేయండి అందరినీ

 

చంపేయండి అందరినీ



కడుపులో చల్ల కదలకుండా ఉన్నోడు ఎన్నైనా మాట్లాడతాడు. లాక్ డౌన్ పెట్టాలనే మేధావులు ఈ కోవకు చెందినవారే.. గతంలో నేను కూడా లాక్ డౌన్ కు అనుకూలమే.. బట్ దాని పర్యవసానాలు ఎంత భయంకరమో తెలుసుకున్నాను.గత లాక్ డౌన్ తోనే మధ్యతరగతి సమాజం సగానికి పైగా మాయమయ్యింది.. ఇప్పుడు అస్సలు లేకుండా చేయాలనే ప్రయత్నమే ఈ లాక్ డౌన్.. పేదోళ్లు ఇంకా దిగజారితే మధ్య తరగతి వాళ్ళు పేదోళ్ల జాబితాలోకి చేరిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ లాక్ డౌన్ అంటే ఎలా? కరోనా వల్ల చావు వస్తుందో లేదో గాని ఈ లాక్ డౌన్ కారణంగా చచ్చిపోవటం ఖాయం. సంపన్నులకేంటి సంవత్సరం తిన్నా తరిగిపోని నిల్వలు వారి ఇంట్లో ఉంటాయి.. లేకపోతే ఈ పాటికే సమకూర్చుకుని ఉంటారు. మహా అయితే వారి వ్యాపారాలు ఇబ్బందికరంగా మారతాయేమో.. తిండికి మాత్రం లోటు ఉండదు. మరి పేదల సంగతి ఏంటి.. ఉద్యోగస్తుల మాట ఏంటి.. కూలీల పరిస్థితి ఏంటి... అడుక్కు తినాలా? పాపం మధ్య తరగతోడు అడుక్కోవడానికి కూడా అర్హత లేనోడు.. లాక్ డౌన్ పెట్టాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళు బాగానే ఉంటారు కడుపులో చల్ల కదలకుండా...సిగ్గుండాలి లాక్ డౌన్ ను సమర్ధించడానికి...

లాక్ డౌన్ పెట్టాలని నిర్ణయం తీసుకునే ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజావ్యతిరేకే నా దృష్టిలో. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది.. మీకు ఎన్నికల పండగలు కావాలి... కుంభమేళాలు జరగాలి.. మీ వరకు ఏదీ ఆగకూడదు.. అన్నీ చేస్తారు, ప్రజల నెత్తిమీద లాక్ డౌన్ రుద్దుతారు.. ప్రజలు నిబంధనలు పాటించడం లేదు అని తెగ ఏడ్చే పాలకులు తాము మాత్రం ఏం చేశారు. గత లాక్ డౌన్ తర్వాత అన్నీ గాలికి వదిలేశారు. మంత్రులు, పోలీసులు, అధికారులు కనీసం మాస్కు పెట్టుకోవడం కూడా మానేశారు. బయటి దేశాల్లో రెండో దశ మొదలైనా మనం మాత్రం ఏం లేనట్టు అన్ని గాలికి వదిలేసాం. మరి సామాన్య జనం ఏం చేస్తారు..? యధా రాజా తథా ప్రజా కదా.. పాలకులకు ముందు చూపు ఉండదు.. పరిస్థితి అదుపు తప్పిందని అంకెలు చూపుతూ లాక్ డౌన్ అంటూ రంకెలు వేస్తారు.. చాలా మంది మూర్ఖులు లాక్ డౌన్ పెట్టాల్సిందే అని వాదిస్తున్నారు మీకేం తెలుసు గరీబోడి బాధలు.. మూడు పూటలా తిని ఏసీ రూముల్లో కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ లాక డౌన్ ను ఎంజాయ్ చేసే బడాబాబులు ఎన్నైనా మాట్లాడతారు. వారి అకౌంట్స్ భారీ అంకెలతో ఫుల్లు ఉంటాయి కాబట్టి.. ఈపాటికే పదేసి మందు బాటిళ్ళు కూడా స్టాక్ చేసుకుని ఉంటారు కదూ...గత లాక్ డౌన్ దెబ్బలనుంచి తేరుకోడానికి ఇంకా నానా పాట్లు పడుతున్న పేద, మధ్యతరగతి, కూలీల సంగతి ఏంటి? చంపేయండి అందరినీ

మీరే ఉండండి ఈ దేశంలో..

నా దగ్గర ఇవి కనిపించవు

 

నా దగ్గర ఇవి కనిపించవు



నమ్మకం

భరోసా

గౌరవం

సంస్కారం

నీతి

నిజాయితీ

త్యాగగుణం

మంచితనం

ఇవేవీ నాదగ్గర కనిపించవు

ఇవన్నీ కొనేంత డబ్బు

నాదగ్గర లేదు మరి...

Saturday 17 April 2021

నా ప్రాణం నిదురిస్తోంది..

 

నా ప్రాణం నిదురిస్తోంది..



ఓ కోయిలా

ఏమిటే నీ గోలా

రోజూ కూస్తూనే ఉన్నావుగా

ఈ ఒక్క ఘడియ సడి చేయక ఉండలేవా

నీ గానామృతం నాకు ప్రియమే

సవ్వడి చేయకు ఈపూట

ఇక్కడ నాకంటే ప్రియమైన

నా సఖి నిద్దురోతోంది....

అదిగో

అక్కడ మసీదులనుంచి

మంద్రమైన స్వరంతో

పిలుపేదో వినిపిస్తోంది

ఓ చిరుగాలీ

ఆ పిలుపును నాకే పరిమితం చేయ్

నా గుండె గడపను తాకిన ఆ స్వరాన్ని నా ఇంటి గడపలోకి మోసుకుపోకు

గదిలో నా ప్రాణానికి

నిద్రాభంగం అవుతదేమో...

తన ప్రశాంతతే నాకు

అన్ని నమాజులకంటే

ప్రియం గనుక...

Thursday 8 April 2021

మినీ డైనో్సార్

 

మినీ డైనో్సార్


అప్పుడప్పుడే కళ్ళు మూతపడుతున్నాయి... ఏసీ చల్లదనం వల్లనేమో అంతా మగతగా ఉంది... ఏవో శబ్దాలు.. ఉలిక్కిపడి లేచాను... ఎవరో తలుపులను భయంకరంగా కొడుతున్నారు.. తలుపులు విరిగిపోతాయా అనిపించింది... అంతలోనే ఏవో భయంకరమైన అరుపులు... జూరాసిక్ పార్క్ లో డైనోసార్లు అరుస్తున్నట్టుగా... అంటే నేను జూరాసిక్ పార్క్ లో నిద్రపోతున్నానా అని ఒక్క క్షణం భయం... ఈ అనుభవం ఒక్కరోజుతో ఆగిపోలేదు.. ప్రతిరాత్రీ నాకు కాళ రాత్రే... కానీ అవి డైనోసార్ల అరుపులు కావు.. మా ముఫాసా గాడు చేస్తున్న వికృత శబ్దాలు అవి.. ముఫాసా అంటే మా పిల్లలు పెంచుకుంటున్న లాబ్ కుక్క... దాన్ని కుక్క అనేకంటే ఒక రాక్షసజీవి అనడం బెటర్.. ఇంట్లో సోఫాలు ఎప్పుడో చించేసాడు.. చెప్పులు షూస్ కొరికేయడం వాడికి మహా సరదా.. ఇంట్లో ఒక ఉన్మాదిలా తిరుగుతూ కనిపించిన వస్తువును నోటకరిచి ఎక్కడో పడేస్తుంటాడు.. ఈ నరకం ఎన్నాళ్ళో... వాడెప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడోనని నన్ను నేను దాచుకుని గడపాల్సిన దుస్థితి...వాడు ప్రశాంతంగా ఉన్న కొద్దిపాటి సమయంలో అబ్బో ఎంత అమాయక జీవి అని అనుకోవాల్సిందే. వాడికళ్ళు కరుణారసంతో  మనల్ని బోల్తా కొట్టించడం ఖాయం.. కానీ అది కొద్దిసేపే...మొన్న వీడి వాక్సిన్ కోసం వెటర్నరీ ఆసుపత్రికి వెళితే నాలాంటి లాబ్ బాధితులు చాలామందే కనిపించారు. ఇక లాబ్ బాధిత సంఘం పెట్టుకోవడమే మిగిలింది..

Thursday 1 April 2021

చూడాలని ఉంది

 

చూడాలని ఉంది



నాకిప్పుడు పెద్దగా ఆశలు ఆకాంక్షలు లేవు

ఆస్తులు అంతస్థులపై వ్యామోహమూ లేదు

నా ఆస్తులు వీరిద్దరూ

మా అమ్మాయి అబ్బాయి... వీరిద్దరూ ఆనందంగా

ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా తమ ఆశయాలు కొనసాగిస్తూ జీవితంలో స్థిరపడాలనే

కోరిక మాత్రం ఉంది..

ఉంటానో ఉండనో

చూస్తానో చూడనో

చూడాలని మాత్రం ఉంది...