Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 30 June 2016

సరదా సరదా సిగరెట్టు

సరదా సరదా సిగరెట్టు
 
సరదాగానే మొదలయ్యింది
చిద్విలాసంగా మెరిసింది
కొంచెం వెగటుగా
ఆపై మత్తుగా
పసందైన రుచినేదో ఇచ్చింది
అయినా వద్దనే అనుకున్నా
వదులుకోలేకపోయా
నలుగురిలో నేనున్నా
సమావేశాల్లో బిజీగా ఉన్నా
వెసులుబాటు వేళ అటే మరలేది మనసు
అవును
అప్పట్లో సిగరెట్ నాకు స్టేటస్ సింబల్
ఇప్పుడు అదే నాకు వ్యసనం
మానలేకపోతున్నా
అనేక కలతలు
అప్పుడప్పుడూ సూటి పోటి మాటలు
అంతులేని అవమానాలు
కనులనిండా కన్నీళ్లు
నావాళ్ళ ఆవేదనకు అర్థం ఉంది
వాళ్ళ మాటల్లో న్యాయం ఉంది
నన్ను గుండెల్లో పెట్టుకునే వాళ్ళే
విమర్శల బాణాలు విసిరుతున్నారు
అయినా ఎందుకు భరిస్తున్నా
ఎందుకు సిగరెట్ మానలేకపోతున్నా
దమ్ములో ఉన్న కిక్కు తెలియక మాట్లాడుతున్నారా
ఏమీ లేకున్నా నేనే కిక్కులో మునిగిపోయానా
బాధ్యతలు మరిచి కిక్కులో మునిగి
నన్ను నేను వంచించుకుంటున్నానా
నాలో మార్పు రాదా
నేను ఈ వ్యసనాన్ని గెలవలేనా
వ్యసనమే నన్ను ఓడిస్తుందా
ఏమో ఏదైనా జరగొచ్చు
గుర్రము ఎగరనూ వచ్చు కదా
మనస్వినీ

మారని మనిషి

మారని మనిషి

ఎలా సముదాయించను మనసును
కొత్తగా ఆలోచించమని
ఎలా చెప్పను నా అక్షరాలకు
వేరే ఏదైనా రాయమని
ఏమని వివరించను నా భావాలకు
మరో భావం విరచించమని
ఎలా మారమని కోరను అంతరంగాన్ని
అంతరం ఏదైనా చూడమని
భావాల సుమాహారం నా మానసం
అంతరంగాల సుడిగుండం నా హృదయం
వికసించిన మంచు పుష్పం నా అక్షరం
భావానికి అక్షర రూపం
అంతరంగంలో ఎగిసిపడే కెరటం
మనసులో విరిసే పుష్పం
అన్నీ నీవే అయితే
మరో భావం ఎలా పుడుతుంది నాలో
కనులనుండి జారిపడే కన్నీటి చుక్కలో
మనసులో రేగే వేదనలో
మది పులకింతలో
పెదాలపై నర్తించే చిరునవ్వులో
నా ఓటమిలో
నా విజయంలో
నీలినింగి తారకలో
ఎగిసిపడే కెరటంలో
వింజామరలు వీచే పిల్లగాలిలో
పుడమిని తాకే చినుకులో
మనసును దోచే మట్టివాసనలో
ప్రకృతి సమస్తంలో
నాకు నువ్వే కనిపిస్తే
నా అక్షరాలకు నీవే ప్రాణం పోస్తే
నీ గురించి కాకుండా
ఇంకేం రాయగలను
నేను మారని మనిషిని
మనస్వినీ

Wednesday 29 June 2016

కలర్ ఫుల్ ఫోటో

కలర్ ఫుల్ ఫోటో

నిన్ను చూడక ముందు
నీవు నాలో కలవక ముందు
నేను నీలో లీనం కాక ముందు
నా మనసును ఒక బొమ్మలా భావిస్తే
అది నలుపూ తెలుపుల
ఛాయాచిత్రమే
రెండు రంగుల మిశ్రమమే...
రేయీ పగలు జీవితంలో
నిత్యం తెల్లవారేది
నిస్సారంగానే చీకటి పొడిచేది...
పున్నమి చంద్రుడు మొలిచినా
అడవి గాచిన వెన్నెలే అది
వసంతంలో విరులు పూసినా
మనసుకు తగలని ప్లాస్టిక్ పువ్వులే అవి...
నవ్వేది నా మోము
ముభావంగా ఉండేది నా మనసు
బ్లాక్ అండ్ వైట్ ఫోటోలా...
ఇప్పుడు రంగులు మారాయి
తెలుపులో కొత్త రంగులు చేరాయి
నలుపును మెరుపుల ఎరుపు కమ్మేసింది
మనసు చిత్రం మారింది
కలర్ ఫుల్ ఫోటోలా...
ఇప్పుడు
నా కన్నుల వెలుగు
పెదాలపై నవ్వుల సొబగులు
మోములో లీలగా మెరిసే గర్వం
ఒకటేమిటి
నా మనసు చిత్రంలో
రంగులన్నీ నీవే
మనస్వినీ...

Tuesday 28 June 2016

బంగారు బొమ్మ

బంగారు బొమ్మ

తొలిసారి
అవును తొలిసారి ఇలా చూసాను నిన్ను
అది నువ్వేనా
నిజంగా నువ్వేనా
ఎన్నడూ చూడని రూపం
ఊహకే అందని ప్రతిరూపం
రోజూ చూస్తున్నా నిన్ను
దగ్గరగా చాలా దగ్గరగా
నాలోనే నీవుగా
నిత్యం చూసే రూపమే
నిత్యం అదే దర్శనం
అవును
నువ్వే
నవ్వుతూ తుళ్ళుతూ
నన్ను ఏడిపిస్తూ
చిరాకు పడుతూ
హాస్యం కురిపిస్తూ
జవ్వనిలా
ప్రియురాలిలా
సఖిలా
జవరాలిలా
ప్రియసతిగా
నవ్వులు చిందించే నీలో
అంతలోనే ఇంతమార్పా
అవును నీలో చాలా మార్పు చూసా
ఒక్కసారిగా
గుండె ఆగిపొయిందా అనిపించింది
నా కనులముందే అలంకరణ చేసుకున్నా
అంతలా పట్టించుకోని నేను
ఎలా ఉన్నానూ అంటూ నువ్వు పలకరించగానే
ఒకింత సంభ్రమం
అవును
మరో లోకం కనులముందు కదలాడింది
దివినుంచి భువికి దిగిన దేవకన్యలా
నాకోసమే నేలరాలిన తారకలా
మురిపించే అతిలోక సుందరిలా
కనులముందు నిలిచావు
కొత్తగా చూసాను నిన్ను
జడలో నవ్వుతున్న మల్లెలు
స్వర్ణకర్ణాభరణాల మెరుపులతో
వెలుగుతున్న మోము
రాజసం కురిపించే చీర సొగసులు
మెరుపులు చిందించే కమర్ పట్టీ సొబగులు
స్వర్ణ కంకణాల గలగలలు
పదమంజీరాల సవ్వడులు
పెళ్లి రోజు ఆడపిల్లలా
కనులముందు దేవకాంతలా
నిన్నలా చూస్తూనే ఉండిపోయా
దివ్య సౌందర్యమే నీది
పసిడి వెలుగుల్లో నువ్వు
ఎంతగా మెరిసినా
ఆ పసిడికి నీవల్లే మరింత అందం వచ్చింది
మనస్వినీ

Sunday 26 June 2016

పెళ్లిరోజు శుభాకాంక్షలు మనస్వినీ...

పెళ్లిరోజు శుభాకాంక్షలు మనస్వినీ...

అభినందనలు నీకు అని అభిమానం చూపనా
థాంక్యూ అంటూ నుదుటన చుంబించనా
కృతజ్ఞతలు చెబుతూ
తలవంచి ప్రణమిల్లనా...
ఎలా తెలుపను మదిలో భావాలను
ఎలా పంచుకోను కమ్మని బాసలను
నా జీవితంలో అడుగిడిన నిన్ను
ఏమని కొనియాడను...
నీ అనురాగానికి భాష్యం పలుకగలనా
నీ అనుబంధానికి నిర్వచనం ఇవ్వగలనా
ఎలా పంచుకోను మనసు భావాలను...
నీతో పంచుకున్న ఘడియలు
నేను పొందిన మధురిమలు
ఎన్నెన్ని రాత్రులు
ఎన్ని సరాగాలు
మరిచిపోలేని అనుభూతులు
ఒక్కొక్కటి కనులముందు మెదలుతూనే ఉన్నాయి...
మోడువారిన మనోవృక్షానికి
కొత్త చివురు మొలిచినట్టుగా
ఎండమావుల సీమను తొలకరి  తాకినట్లుగా
నా జీవనంలో అడుగిడిన నీవు
నాకు నెరవేరిన స్వప్నానివే...
కలతలు పలకరించినా
తలవంపులు ముళ్ళ తివాచీలు పరిచినా
సమాజం గాయాలు చేసినా
మమతల లేపనం అద్ది
ఓదార్పుగా నిలిచిన మానవతవే నీవు...
కనుల ఉబికిన నీటిని రెప్పల మాటున దాచి
మనసున రేగిన అగ్గిని చిరునవ్వుతో ఆర్పి
నీలో నీవు కుమిలిపోతూ
నాకేమీ తెలియనీయకుండా
మనసులో కుమిలిపోతూ
నా వేదనను తనదిగా మలుచుకుంటూ
నాతో నడుస్తున్న నీవు
నిజంగా నాకు తోడూ నీడవే...
బదులుగా నీకేమివ్వగలను
బహుమతిగా ఏమిచ్చుకోగలను
కానుకగా ఏమి తేగలను
నీ ఔన్నత్య శిఖరానికి తలతూగే
బహుమానం ఉందా...
పెళ్లి రోజు కానుకగా ఏమివ్వగలను
మనసున కొలువైన నీకు
తుది ఘడియ దాకా ప్రేమించటం తప్ప...
నీకు చెప్పాలో
నాకు నేను చెప్పుకోవాలో
మనిద్దరికీ కలిపి చెప్పుకోవాలో
తెలియదుగానీ
పెళ్లిరోజు శుభాకాంక్షలు  
మనస్వినీ...

Saturday 25 June 2016

ఈ పండగ నీదే

ఈ పండగ నీదే

ప్లాస్టిక్ పువ్వుల్లో వాసన ఎందుకు చూస్తావు
ఎండమావుల్లో నీటిని ఎందుకు వెతుకుతావు
లేని ఆనందం కోసం బాధను ఎందుకు ముద్దాడుతావు
ఒక్కరోజు ఆనందం కోసం ఏడాదంతా ఎందుకు ఏడుస్తావు  
సగటు మనిషిని నేను
సగటు ప్రశ్నలే నావి
ఎవరు చెప్పారు నీకు ఇలా చేయమని
ఎక్కడ రాసి ఉంది ఇలాగే ఉండాలని
ఇస్లాం ఇలా చెప్పిందా
దివ్య ఖురాన్ లో రాసి ఉందా
అలా చెప్పి ఉంటే
అలా రాసి ఉంటే
హితమెలా అవుతుంది నీకు
ఖురాన్ అవతరించిన మాసం
పవిత్ర రంజాన్
ఆచరించు దైవవాణిని
పాటించు నీ ధర్మాన్ని
సగటు మనిషీ మరిచిపోకు నీ వాస్తవాన్ని
పండగ చేసుకో
ఆనందంగా ఉండు
అందరితో కలిసిపో
అయితే
ఆ పండగ ఆనందం వెనుక
విషాదాన్ని ఎందుకు దాస్తున్నావు
చిరునవ్వుల సలాం మాటున
వేదనను ఎందుకు సమాధి చేస్తున్నావు
నిజం తెలుసుకో
నిజాయితీగా మసులుకో
ఇఫ్తార్ విందుకోసం పండ్లు ఫలాలే ఎందుకు
లేనివాటి కోసం అప్పులు ఎందుకు
పండగ రోజు కొత్త బట్టలే ఎందుకు
పర్వదినం పేరుతో కొత్త అప్పులు ఎందుకు
అప్పులకోసం అభిమానాన్ని తాకట్టు పెడతావెందుకు
ఒక్కరోజు వేడుక కోసం
సంవత్సరం పొడుగునా వేదన ఎందుకు
ఈ పండగ ఎందుకు చేసుకున్నానా అనే రోదన ఎందుకు
రంజాన్ నీ ఆనందం కోసమే
ఖురాన్ నీ జీవితం కోసమే
మనీతో ముడిపడి లేదు నీ ఆనందం
ఎక్కడో అప్పులు తెచ్చి
ఏదో అమ్ముకుని
ఆడంబరాలు చేయాలని లేదు ఖురాన్ లో
కొత్త బట్టలతోనే ఈద్ నమాజు అని
ఎక్కడా చెప్పలేదు దేవుడు
నిజాయితిగా దేవుడిని నమ్మి
చిరిగిన బట్టలున్నా సరే
ఈద్గాహ్ లో తలవంచు
కోటీశ్వరుడి మాట తెలియదు గానీ
ఆ దైవం నీ నమాజునే స్వీకరిస్తాడు
నీ ఇంట్లో షీర్ ఖుర్మా ఘుమఘుమలు లేకున్నా
ఆ దేవుడి పరిమళం నీతోనే ఉంటుంది
పండగ పేరుతో నీకు వేదన కలిగితే
అది దేవుడికీ వేదనే
నీకు సత్తా ఉంటే పదిమంది ఆనందంలో పాలు పంచుకో
లేమిలో నువ్వుంటే ఉన్నదే నిజమని నమ్ముకో
ఒక్కరోజు ఆనందంకోసం
నిత్యం వేదనలెందుకు
గుండెరగిలే అవమానాలెందుకు
సగటు ముస్లింగా నేను చెప్పేది నిజమేకదా  
మనస్వినీ 

Friday 24 June 2016

అధినేత్రి

అధినేత్రి

తొలిసారి తనను చూసినప్పుడు
అనిపించింది
తనే నాలో చిగురించిన స్వప్నమని
నా మనసులో కొలువైన మనస్వినియని...
అప్పటికి తనెవరో నాకు తెలియదు
తన వెనుక ఏముందో
తన గతమేమిటో
నాకు తెలియనే తెలియదు...
మలిసారి తను కలిసినప్పుడూ
నాకేమీ తెలియదు
తెలిసింది ఒకటే
అది ప్రేమయని...
ఈ వయసులో ప్రేమ ఏమిటనే తర్కం జోలికి
నేను పోదల్చుకోలేదు
నాలో ఉన్నది వ్యామోహం కాదు
నాలో నిత్యం సమరం చేసే స్వప్నమని
తెలుసుకున్నాను...
తనెవరో తెలియకనే ప్రేమించా
ఎవరో చెబితే విన్న నేను
తననే అడిగా
నీకు కోట్ల ఆస్తి ఉందటగా అని...
అప్పటికి తను నా శ్రీమతే
తను తెలిపేదాకా తెలియదు నాకు తనెవరో
తనకెన్ని ఆస్తులున్నాయో...
అయినా నా ప్రేమ మారలేదు
తనలో నాకు డబ్బు దర్పం కానరాలేదు
నేను తనలో చూసింది
మనసూ మమత
అంతులేని అనురాగమే...
తను స్వయంగా చూపే వరకు తెలియదు నాకు
తనెంత పెద్ద వ్యాపారసామ్రాజ్యానికి అధినేత్రియో...
ఏమీ తెలియనినాడే ప్రేమించా
ఏమీ తెలియకనే
ప్రేయసిగా
ప్రియురాలిగా
స్నేహితురాలిగా
శ్రీమతిగా
మనస్వినిగా
మలుచుకున్నా...
కుక్కమూతి పిందెలు ఎన్ని అర్థాలు తీసినా
మా ప్రేమ నిజం
మా బంధం అజరామరం...
ఏమీ తెలియని స్థితిలో
ఆ ప్రేమకు నేను దాసోహమైతే
ఆస్తివాదం ఎందుకు వచ్చిందో తెలియదు...
అందరిలాగానే
నా కుటుంబంలోనూ కలతలున్నాయి
విభేదాలున్నాయి
అంతరాలున్నాయి
ప్రేమ కలహాల సంగమం మా జీవితం...
ఆస్తులకోసమే వ్యూహం పన్ని ఉంటే
మాలో కలహాలు ఎందుకు
అసలు తెలియనే తెలియని ఆస్తులకోసం
వ్యూహ రచనలు ఎలా చేస్తా...
మనీ కోసం మనుషులను
మమతలను అపహాస్యం చేసే
వంకరమనుషులకు నేను చెప్పేది ఒకటే
యస్...
వయసు మతం ఇవేమీ మాకు తెలియదు
మేము ప్రేమించుకున్నాం
జీవితాలను పంచుకున్నాం
కలిసే ఉంటాం
మనీ మీకు జీవితం కావచ్చు
మనీ కోసమే మీ జీవితం కావచ్చు
మాకు జీవించేందుకే మనీ...
మళ్ళీ మళ్ళీ చెబుతున్నా
చిల్లిగవ్వ లేకున్నా
మరణం కనులముందు నిలిచినా
చివరిశ్వాస వరకు
నా జీవన సామ్రాజ్య అధినేత్రి 
నా మనస్విని...