ఒక జ్ఞాపకమై మిగిలే ఉంటా
ఒక జ్ఞాపకం పువ్వులా
విరిసింది
పుష్పమై పరిమళించిన
జ్ఞాపకం
నా గుండియను
ముద్దాడింది
నిశి చీకటిలో పవళించిన
నన్ను
ఓ కన్నీటి చుక్క దీపమై
వెలిగి
మనసారా పలకరించింది
మరణం దేహాన్ని అంతం
చేసినా
ఒక అందమైన జ్ఞాపకంలా
నిలిచిన
నా సమాధి నా కథలను
లోకానికి చాటుతోంది
అవును
అది నా సమాధి
నిజం చెప్పాలంటే అది
నా మందిరం
అది ఒక ప్రేమ మందిరం
శిథిలమైదానంలో
రాలుపూల తోటలో
కీచురాళ్ళ సవ్వడిలో
కూలిపోయి పాడుబడి
నశించిన కట్టడాల నడుమ
అప్పుడే కట్టిన నా
మందిరంలో
నేను శయనించగా
శిలలను దాటుతూ
మట్టివాసనను మోసుకుంటూ
నా ఎదపై రాలిన ఒక
కన్నీటి చుక్క
జ్ఞాపకపుష్పమై ఎగసింది
ఒక పుష్పం మరిన్ని
పుష్పాలకు ప్రాణం పోసి
ఇక జ్ఞాపకం మరిన్ని
జ్ఞాపకాలకు ఊపిరిపోస్తే
నా మందిరంపై పూలవానే
కురిసింది
నా అనుభవాలను
అనుభూతులను
ఎగసిపడే ఆవేశపు శిఖలను
నా ఆక్రందనలను
పదిలంగా దాచుకున్న నా
సమాధి
కాదు కాదు
నా ప్రేమమందిరం
నిత్యం ఒక జ్ఞాపకమై
నా చరిత్రకు సాక్ష్యమై
మిగిలే ఉంటుంది
మనస్వినీ
No comments:
Post a Comment