నా మనసింతే
భావరహితమైన సాయం
సంధ్యలో
చల్లని సమీరం
కోరుతుంది
నా మనసు
ఆకురాలిన కాలంలో
పుడమిపై పున్నమి
చంద్రమను ఆశిస్తుంది
నా మనసు
నిశి దుప్పటి తెరలలో
సన్నని కాంతి రేఖలనే
అభిలషిస్తుంది
నా మనసు
తడియారిన పెదాలపై
తళుకులీనే చిరునవ్వులే
కావాలని అంటుంది
నా మనసు
అవును నా మనసు చిత్రమే
బహు విచిత్రమే
ఔనన్నా కాదన్నా
నా కోణంలోనే
ఆలోచిస్తుంది
నా మనసు
ఇంకా కలలు కంటూనే ఉంది
నా మనసు
కంటున్న కలలన్నీ పూలమాలగా
అల్లి
నీకే కానుక ఇస్తుంది
నా మనసు
నీలో భావాలు
నీ అంతరంగాలు
నాకే అంకితం కావాలని
నీ పలుకులు నన్నే
పూజించాలని
సర్వావస్థలయందు నీపలుకులు
నాకు మధురంగానే
ఉండాలని
నీ కన్నుల వెలుగులు
నాకే ప్రణమిల్లాలని
నిత్యం తపిస్తుంది
నా మనసు
ఇది స్వార్ధమే
అనుకుంటే
ఏకపక్షమే అనుకుంటే
నా మనస్సు కాదు
నేనే స్వార్ధపరుడిని
మనస్వినీ
No comments:
Post a Comment