పాపం పసివాడినే
తొలకరి భావాలు
పలకరించిన నాటి నుంచి
అన్ని భావాలను పదిలం
చేసుకున్నా
ఆలోచనలు అంకురించిన
తొలి ఉదయం నుంచి
అన్ని ఆలోచనలూ
మనసులోనే దాచుకున్నా
ఎవరితోనైనా
పంచుకోవాలనీ
మనసు వేదన
తగ్గించుకోవాలనీ
అనునిత్యం వేదన పడ్డా
భావాలు పంచుకునే మనసు
లేక
మనసు లోతులను తడిమే
మనిషిలేక
అల్లకల్లోలమైన నా
మనసుతో
తెల్లకాగితంపై
అక్షరాలు రాసుకున్నా
వయసు పెరుగుతూనే ఉంది
తరుగుతున్న జీవితంలా
తప్పటడుగుల నాడే
బాధ్యతలు
చుట్టుముట్టినా
జీవనం మలుపులు
తిరిగినా
మనసులోని పసితనం ఛాయలు
పోలేదు
భావావేశ తరంగాలు
సద్దుమణగలేదు
ఎవరికి చెప్పుకోవాలి
మనసును ఎవరికి
పంచుకోవాలి
మథనం ఆగలేదు
ఉనికేలేని ఓ తోడును
వెతుక్కున్నా
కానరాని మనసును
నేస్తంగా మలుచుకున్నా
ఊహాలోకంలో నడియాడే
సుందరిని
ప్రేయసిగా చూసుకున్నా
ఒక వ్యక్తిగా
ఒక శిఖరంలా నేను
నిలిచినా
నా మనసు మాత్రం
కానరాని ఆ సుందరికే
ప్రణమిల్లేది
ఓ పసిపాపగా
పరవశించేది
నా దీక్షకు దేవుడే
తలవంచాడేమో
నా మనసు రోదనకు దేవుడి
మనసు కరిగిందేమో
ఊహ నిజమయ్యింది
ఊహా సుందరి
దిగివచ్చింది
సాంత్వన నాకు
స్వంతమయ్యింది
నేడూ అక్షరాలు
రాస్తున్నా
నేడూ భావాలు
పదిలపరుస్తున్నా
ఇప్పుడు నా అక్షరాలు
ఊహలు కాదు
నా భావాలు కల్పితాలు
కాదు
మనసు పరిష్వంగంలో
జనియించే
పుష్పాలే నా అక్షరాలు
నీ ఒడిలో పసిబిడ్డనై అలరారే
నేను
నిత్యం చిన్నారినే
పాపం పసివాడినే కదా
మనస్విని
No comments:
Post a Comment