Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 18 February 2017

నాలోనే నీవు

నాలోనే నీవు
నీవు నడియాడిన నా లోగిలిలో
నీ మువ్వల సవ్వడియే
వీనులను తాకుతోంది
శృతి చేసిన వీణలా...
నీవు శ్వాసించిన నా పరిసరాల్లో
నీ పరిమళమే నాసికను తాకుతోంది
విచ్చుకున్న మల్లె వాసనలా...
నీవు విసిరిన నవ్వుల పువ్వులలో
నీ అలికిడే వినిపిస్తోంది
నిశబ్దాన్ని ఛేదించిన మురళీరవంలా...
నీవు తాకిన నా కనురెప్పల్లో
నీ రూపమే కదలాడుతోంది
బాపూ గీసిన బొమ్మలా...
ఎవరు చెప్పారు
నువ్విప్పుడు నాతో లేవని
నా మనసు చెబుతోంది
నువ్వు నిత్యం నాలోనే ఉన్నావని
మనస్వినీ ...

నాలోనే నేనున్నా

నాలోనే నేనున్నా
 
ఓ  విషపు చూపులో
ఓ వంకర నవ్వులో
ఓ కుట్రలో
ఓ మోసంలో
ఓ నమ్మక ద్రోహంలో
ఎగసిపడే ఆవేశంలో
రగిలే మాటల మంటల్లో
అర్థం తెలియని పరిణామంలో
అంతుచిక్కని అంతరంగంలో
గజిబిజి మనుషుల మాయాజాలంలో
నన్ను వెతకవద్దు
నన్ను వెతకాలంటే నాలోనే వెతుకు
ఒట్టేసి చెబుతున్నా
పిచ్చిసమాజమా
నన్ను నాలో కాక
మరెక్కడో వెతికితే
నన్నెప్పటికీ వెతకలేవు

Sunday 5 February 2017

మనసుదుప్పటి కప్పనా

మనసుదుప్పటి కప్పనా
మండుటెండలో
ఎడారి వీధుల్లో ఒంటరిగానే నడుస్తున్నా
నాపక్కనే నడుస్తున్నట్టుగా
అందమైన పాదాల ముద్రలు
నాతో నువ్వే నడుస్తున్నావనిపిస్తోంది
మరి నీ పాదాలకు గొడుగుపట్టనా
ప్రియతమా...
కటికచీకటిలో నిశాచర జీవినై
భయపడుతూనే ముందుకు నడుస్తున్నా
నా చెవుల్లో ఏదో మంద్రమైన సవ్వడి
నువ్వే గుసగుసలాడున్నావనిపిస్తోంది
ధైర్యమై నువ్వు తోడు నిలిచావనిపిస్తోంది  
నేస్తమా...
ఎండుటాకుల నడుమ నడక నేర్చిన నేను
శిశిరంలోనూ అడుగులు వేస్తున్నా
ఎముకలుకొరికే చలిలో ముందుకే నడుస్తున్నా
ఏదో తెలియని నులివెచ్చని శ్వాస
నువ్వు సహచర అడుగులు వేస్తున్నావనిపిస్తోంది
చలిలో వణికే నీ నీడకు
మనసుదుప్పటి కప్పనా
ప్రాణమా...
కాలానికి అతీతమైన బాటసారికి
నీ అడుగులజాడలు
పూలబాటలు కావా
జీవితమా...