Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 31 May 2021

అంతా మాయ సుమా

అంతా మాయ సుమా



అంకెల గారడీలు

మహమ్మారి లెక్కలు

పెద్దోడికి తాయిలాలు

పేదోడిపై ఆంక్షలు

సడలింపులు

పొడిగింపులు

మరలా సడలింపులు

బడుగు జీవితంపై

కంటి తుడుపు చర్యలు

ఆగుతూ

సాగుతూ

సాగుతూ ఆగుతూ

పడుతూ లేస్తూ

లేస్తూ పడుతున్న జీవితాలు

అంతా మాయ సుమా!

Saturday 29 May 2021

ఆ మాస్కులు కొనండి..

 

ఆ మాస్కులు కొనండి..


ఉదయం ఆరున్నర గంటల సమయం.. అత్తాపూర్ డిమార్ట్ పక్కనే ఉన్న ఫ్రెష్ మీట్ షాప్ కు వెళ్ళా.. నిజంగానే అది ప్రెష్ గా ఉంటుంది. జనాల రద్దీ కూడా ఉండదు. రెండు కిలోల మరల్ చేపలు కొన్నా.. కటింగ్ కు ఇంకా టైం పడుతుందని బయటకు వచ్చి సిగరెట్ వెలిగించా..ఎదురుగా ఇద్దరు కుర్రాళ్ళు పదేళ్ల వయస్సు ఉంటదేమో డిమార్ట్ కు వచ్చిపోయే వాళ్లకు మాస్కులు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లెంత బతిమాలుకున్నా ఎవరూ కొనటం లేదు. బ్రాండెడ్ మాస్కులు కావు గనుక వారిని ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇది సహజమే.. నేను వారినే చూస్తున్నా.. ఒక్క మాస్కు కొనండి ప్లీస్ అని దాదాపు యాచిస్తున్నట్టే అడుగుతున్నారు.జాలేసింది వాళ్ళను చూస్తుంటే... ఇంతలోనే ఓ కారు దూసుకువచ్చింది.. ఆ పిల్లలు ఆశగా ఆ కారువైపు పరుగులు తీశారు.. కారు డోర్ తీసి ఓ మహిళ దిగింది...సుమారు నలభై ఏళ్ళు ఉంటాయి ఆమెకి.. లావుగా గున్నేనుగులా ఉంటుంది.. నల్లని రంగు.. ఫుల్లు మేకప్.. పెదాలకు ఎర్రటి లిప్స్టిక్ పూసుకుంది. అప్పుడే రక్తం తాగివచ్చిన పిషాచిలా ఉంది.. వాస్తవానికి ఆమె మాస్కు పెట్టుకునే ఉంది.. కారు దిగగానే తీసేసింది ఎందుకో.. బహుషా ఆమె ముఖారవిందం అందరికీ కనపడాలనేమో మాస్కు చేతిలో పట్టుకుంది. ఇక అసలు విషయానికి వద్దాం.. ఆ పిల్లలు ఇద్దరు ఆమెకు దగ్గరగా వెళ్లి మేడం మాస్క్ అంటూ బతిమాలాటం మొదలెట్టారు.. అంతలోనే అమ్మడికి కోపం వచ్చింది.. నా కార్ ని టచ్ చేస్తారా.. మీ బోడి మాస్కులు ఎవరిక్కావాలి అని అరుస్తూ దాదాపు కొట్టినంత పని చేసింది..పిల్లలు ఒక్కసారిగా బెదిరిపోయారు.. నాకు దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కళ్ళలో నీటి సుడులు గమనించాను. నాకు చాలా కోపం వచ్చింది కొంటే కొనాలి లేదా మూసుకుని పోవాలి.. పిల్లలపై అలా విరుచుకుపడటం దేనికి? ఆ కారును టచ్ చేస్తే నేరమా ఘోరమా.. పోనీ అది ఖరీదైన పడవ కారా అంటే అదీ కాదు. డొక్కు స్విఫ్ట్ అది.. అంతకే రెచ్చిపోయింది. ఎంత కోపం వచ్చినా ఏమీ అనలేకపోయా.. ఎందుకంటే అది లేడీ.. ఏమన్నా అంటే నాపై నిందలు వేయొచ్చు.. చూడబోతే దాని వాలకం అలాగే ఉంది. ఆరున్నరకే కిలోల కొద్దీ మేకప్ పూసుకుని రోడ్డు మీదకు వచ్చిందంటే దాని మెంటాలిటీ తెలిసిపోతూనే ఉంది.చిన్నప్పుడు తెలుగువాచకంలో చదువుకున్న పూతన బొమ్మలా ఉంది అమ్మడు. ఆ పిల్లలతో మాట్లాడి ధైర్యం చెప్పా.. మీరేం తప్పు చేయటం లేదు భయపడకండి అని అంటూనే రోజుకి ఎన్ని మాస్కులు అమ్ముతున్నారని అడిగా.. నాలుగు లేదా ఐదు భయ్యా అని బదులిచ్చారు. దినమంతా ఏండా వానా లెక్క చేయక మాస్కులు అమ్మినా చెరో యాభై రూపాయలే మిగులుతాయంట. మనసు చివుక్కు మంది. డబ్బులు కావాలా అని అడిగా వద్దు భాయ్ మాస్కులు కొను అని డైరెక్ట్ గా బదులిచ్చారు. వాళ్లలో ఎక్కడలేని ఆత్మాభిమానం కనిపించింది.. చెరో వంద రూపాయలిచ్చి ఓ నాలుగు

మాస్కులు తీసుకున్నా..

రెండు వందలు పెద్ద లెక్క కాదు.. కానీ ఆరెండు వందలు ఒక పేద కుటుంబం ఆకలిని తీరుస్తాయి..ఇంటికి వచ్చి ఆ మాస్కులు నా వాణీ చేతిలో పెట్టి బాగుంటే వాడుకో లేకపోతే పడేయ్ అని అన్నా.. అవి ఎంతకు కొన్నావు ఎందుకు కొన్నావు అని అడగకుండా.. వావ్ చాలా బావున్నాయ్ అన్నీ నాకే అంటూ వాటిని వాష్ చేసి హ్యాంగర్ కు తగిలించిన వాణిని చూస్తే మనసుకు ఎంతో తృప్తి కలిగింది..

Thursday 20 May 2021

ఇది కాదేమో జీవితమంటే

 

ఇది కాదేమో జీవితమంటే



నన్ను నేను సవరించుకుంటూ

నన్ను నేను సముదాయించుకుంటూ

నన్ను నేను

మళ్ళీ మళ్ళీ నిర్మించుకుంటూ

నన్ను నేను

ప్రశ్నించుకుంటూ

నన్ను నేను

సమాధానపర్చుకుంటూ

నన్ను నేను

పడేసుకుంటూ

నన్ను నేను

నిలబెట్టుకుంటూ

నన్ను నేను

మరిచిపోతూ

నన్ను నేను గుర్తు చేసుకుంటూ

గడిచిపోతూనే ఉన్నా

ఎన్నటికీ తెల్లారని పొద్దులా

ఇది కాదేమో జీవితమంటే...

Tuesday 18 May 2021

ఇది ఇండియా ఇక్కడింతే.

 

ఇది ఇండియా ఇక్కడింతే.

నీ కళ్ళ ముందే నీ వాళ్ళు పోతున్నారా

గొంతు చించుకోకు

నువ్వు పోలేదని సరి పెట్టుకో...

నీకూ బాలేదా

ఎప్పుడు పోతావో తెలియక భయపడుతున్నావా

భయపడకు

అది నీ కర్మ ఫలమని ధైర్యం చెప్పుకో...

దేశం మొత్తం శవాల కంపు కొడుతోందా

ఒంటి మీద ఆవు పేడ రాసుకో...

పాలనా వైఫల్యమని కోపం వస్తోందా

తప్పు తప్పు

పాలకులున్నది నీకోసం కాదని తెలుసుకో...

నీకే మందు లేదు విదేశాలకెందుకని

ఆగ్రహం బుసలు కొడుతోందా

అసలు వ్యాక్సిన్ తయారే కాలేదని సర్ది చెప్పుకో...

అన్నీ మూసుకో

మాటలు పెదాలు దాటకుండా చూసుకో

అక్షరాలను అదుపులో పెట్టుకో

నీకు మరో దారి లేదు

ఇది ఇండియా

ఇక్కడ ప్రశ్నిస్తే జైలుకు

పంపిస్తారు..

Monday 17 May 2021

ప్రేమాభిషేకం

 

ప్రేమాభిషేకం



మండుటెండలో

నుదుటన చల్లని వాన చినుకులు ముద్దాడితే...

చిటారుకొమ్మ రెమ్మల మాటున

వెన్నెలమ్మ పైట జారితే...

తడియారిన గొంతులో

తీయని అమృత ధారలు జాలువారితే...

నాట్యం మరిచిన పాదాలు

మంజీరాలతో పోటీపడితే...

కవి మనసున అక్షరాలు ఉబికి

అందమైన కావ్యం

ప్రాణం పోసుకోదా...

నా మనసుకు ఇవేవీ వద్దు

నువ్వు నవ్వితే చాలు

అక్షర పుష్పాలతో అది నీకు ప్రేమాభిషేకం చేస్తూనే ఉంటుంది

మనస్వినీ....

Sunday 16 May 2021

యముని మహిషపు లోహగంటలు

 

యముని మహిషపు లోహగంటలు

అదిగో అక్కడ నట్టింట్లో

పీనుగులు విశ్రాంతి తీసుకుంటున్నాయి

జీవమున్న శవాలు

భయంతో పరుగులు తీస్తున్నాయి...

ఒకటేంటి

అంతటా శవాలు కచేరీ చేస్తున్నాయి

మృతదేహాల కరాళ నృత్యానికి

భూకంపం వచ్చిందేమో

కొంపలు కుప్పకూలుతున్నాయి...

అక్కడేమో

మనసున్న మారాజు

మనసులో మాటంటూ

మాయమాటలు చెబుతూ

ఇంద్రభవనానికి

నగిషీలు అద్దుతున్నాడు...

వందిమాగదులేమో

జయజయ కీర్తనలు పాడుతూ

అబ్బురపరిచే కొత్త శాస్త్రాలు రాస్తూ

ఇంకా బతికున్న జీవుల నెత్తిమీద రుద్దుతున్నారు...

పశువుల పేడతో చికిత్సకు శ్రీకారం చుట్టి

గోమూత్రంతో వ్యాక్సిన్ పుట్టించి

పాత సైన్స్ ను గోవులకు దాణాగా వేస్తున్నారు...

ఇక్కడ ఎవడి పాట వాడు పాడుతున్నాడు

ఎవడి లెక్కలు వాడు చెబుతున్నాడు...

పాపం

ఎందుకూ పనికి రాని

అభాగ్య జీవుల చెవుల్లో

నాటి చప్పట్లు తాళాలు

తపేళాల చప్పుళ్ళు

ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి

యముని మహిషపు

లోహగంటల్లా...

Thursday 13 May 2021

మై డియర్ ఆర్గాన్స్

మై డియర్ ఆర్గాన్స్


ఓ హార్ట్ ఎట్టాకూ

తొందర పడమాకు

ఓ మధు మేహమా

మరి కొన్ని మాసాలు ఆగు

నా కాలేయమా

ఇంకా డ్యూటీ చేయ్

ప్రియమైన కిడ్నీలూ

జస్ట్ కొన్ని రోజులు పని చేయండి

మై డియర్ ఆర్గాన్స్

ఇప్పుడు మీ టైం బాగోలేదు

మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు

మీరు నన్ను చంపేసినా

అది కరోనా అక్కౌంట్ లో కలిపేస్తారు

జాగ్రత్త...


జేఠాలాల్...

 

జేఠాలాల్...

ఇతన్ని చూస్తే అప్రయత్నంగానే పెదాలపై చిరునవ్వు వికసిస్తుంది. తన నడక, హావభావాలు చూస్తుంటే మనల్ని మనం మరిచిపోవడం ఖాయం. ముంబయిలోని గోకుల్ ధామ్ సొసైటీ లో ఉంటాడు. అక్కడే అశోక్ నగర్ ఏరియాలో ఎలక్ట్రానిక్ షాప్ నిర్వహిస్తుంటాడు. మనిషి చాలా మంచోడు. కానీ అతని జాతకంలో అన్నీ కష్టాలే. పొద్దున లేవగానే ఏదో ఒక సమస్యతో కింది ప్లాట్ లో ఉండే తన ఫ్రెండ్ తారక్ మెహతా దగ్గరికి పరుగులు తీయడం అతనికి అలవాటు. సమస్య మొదలు నుంచి అంతం దాకా రకరకాల ట్విస్టులు, నవ్వులే నవ్వులు... హిందీ ఎంటర్ టైన్ మెంట్ చానల్స్ చూసే వారికి ఈ జేఠాలాల్ ఎవరో బాగానే తెలుసు. అవును నేను సోని సబ్ టీవీలో నిరవధికంగా ప్రసారమయ్యే తారక్ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్ గురించి చెబుతున్నా.. కుటుంబంతో సహా కూర్చుని హాయిగా కామెడీ ఎంజాయ్ చేయవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పాత ఎపిసోడ్స్ అన్నీ ప్రసారమవుతున్నాయి.. గోకుల్ ధామ్ సొసైటీ లో జరిగే ఈ వినోదం లాక్ డౌన్ సమయంలో  రిలీఫ్ ఇవ్వడం ఖాయం. కాకపొతే హిందీ తెలిసి ఉండాలి. నేను ఈ షో చూస్తున్నంత సేపు నా తొక్కలో జిందగీని పూర్తిగా మరిచిపోతాను. ఇప్పుడు ఈ షో నాకు మంచి నేస్తమయ్యింది. వీలయితే చూడండి అందరూ మనసు తేలికపడుతుంది.

తనివితీరా

 

తనివితీరా


ఏమో ఎప్పుడు

నా పలుకు మూగబోతుందో...

ఏమో ఏ చూపు

చివరి చూపు

అవుతుందో...

ఏమో ఏ ఘడియ

చివరి ఘడియ

అవుతుందో...

ఏమో ఏ గమ్యం

ఆఖరి మజిలీ

అవుతుందో...

అందుకే నన్ను నేను

చూసుకుంటున్నా

అపురూపంగా...

నాతో నేను

మాటాడుకుంటున్నా

మనసు నిండుగా

తనివి తీరా

మరణించాలని...

Wednesday 12 May 2021

నిశ్చలం నిర్జీవం

 

నిశ్చలం నిర్జీవం

దూరంగా చూస్తున్నా

తీక్షణంగానే చూస్తున్నా

నిన్నటిదాకా స్పష్టంగానే ఉన్న దృశ్యం ఇప్పుడు మసకబారినట్టు కనబడుతోంది

అవును కళ్ల ముందు

ఒక లక్ష్యం చెదిరిపోతున్నట్టు కనిపిస్తోంది

ఓ గమ్యం దిక్కుతోచక

విలవిలాలాడుతున్నట్టు కనిపిస్తోంది

కూలిన వైభవశిఖర

పునర్నిర్మాణ శిలలు మళ్ళీ

కరిగిపోతున్నట్టే కనిపిస్తోంది

జారుతున్న స్వప్నం

హాహాకారం చేస్తూ

నేలను ముద్దాడుతున్నట్టే

కనిపిస్తోంది

చేష్టలుడిగిన నేను

చూస్తూనే ఉన్నా

నిశ్చలంగా నిర్జీవంగా...

Tuesday 11 May 2021

నేను లాక్ డౌన్ ను వ్యతిరేకిస్తున్నా...

 

నేను లాక్ డౌన్ ను వ్యతిరేకిస్తున్నా...

అవును నేనింతే... లాక్ డౌన్ ను వ్యతిరేకిస్తా..

లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్న వారంతా పేద, మధ్యతరగతి వర్గాలపై ఏమాత్రం జాలి లేని వాళ్ళే. వాళ్ళకేంటి ఇంట్లో నిలువలు దండిగా ఉంటాయి. బ్యాంకుల్లో కరెన్సీ మూలుగుతూ ఉంటుంది. అవసరమైతే నోట్ల కట్టల మీద పడుకుంటారు. మరి పేదలు.... బయటికి వెళ్తే కానీ కడుపు నిండదు. ఉన్నోళ్లు వీరి తిండి గింజలకు భరోసా ఇవ్వగలరా...

కొరోనా పెరిగిపోతోంది లాక్ డౌన్ పెట్టకుంటే ఎలా తగ్గుతుంది అని వాదించవచ్చు..

వందలమంది చస్తున్నారు నీకు పట్టింపు లేదా రాక్షసుడా అని ఆడిపోసుకోవచ్చు.. నేను పట్టించుకోనుఈ చెత్త విమర్శల్ని.. ఈ కరోనా అసలు ఎందుకు వచ్చింది.. పేదలే తీసుకువచ్చారా.. సంపన్నులైన రాజకీయనాయకులు, అంతకంటే సంపన్నమైన ప్రభుత్వాలు కాదా ఈ దుస్థితికి కారణం... సెకండ్ వేవ్ ఉందని తెలిసినా ఎన్నికలు ఎందుకు పెట్టారు. ర్యాలీలు, బహిరంగ సభలు ఎందుకు పెట్టారు. ఇవన్నీ జనాభాలో 90%ఉన్న పేద, మధ్యతరగతి వాళ్ళు కోరుకున్నారా.. లేదే బలవంతంగా నెత్తి మీద రుద్దలేదా... ఇప్పుడెందుకు చేయని పాపానికి లాక్ డౌన్ పేరుతో శిక్ష.. ఎన్నికలు అయిపోయాయిగా ఇంకా కరోనా పెరుగుతూనే ఉందిగా అనొచ్చు..అవును నిజమే ఎవరికి వస్తోంది ఈ కరోనా...ఎక్కువగా డబ్బు బలుపుతో పార్టీలు, పంక్షన్ లు నిర్వహిస్తున్నారు రాదా మరి. నా కొడుకులకి ఈ టైం లోనూ పెళ్లిళ్లు కావాల్సింది వచ్చిందా.. ఏం ఇప్పుడు పెళ్లిళ్లు చేయకపోతే మీ పిల్లలు ఎవరినో తగులుకుని లేచిపోతారని భయమా.. ఇంత సంస్కారంగా పెంచారా మీ పిల్లల్ని...

రోజూ కూలీ నాలి చేసుకుని బతికేవాళ్ళు వేడుకలు ఉత్సవాలు జరుపుకోవటం లేదు. మరి ఎవరో చేసిన పాపానికి పేదలు ఎందుకు బలి కావాలి. ఇప్పుడు లాక్ డౌన్ తప్ప మరో పరిష్కారం లేదని fb వేదికగా గొంతు చించుకునే మేధావుల్లో ఎవరైనా లాక్ డౌన్ సమయం లో ఒక్క పేద కుటుంబాన్నైనా దత్తత తీసుకుని కనీసం తిండి గింజలకు భరోసా ఇవ్వగలరా.. జి లో దమ్మున్నోళ్లు చెప్పండి.. పెడతారేమో లాక్ డౌన్.. తప్పదేమో.. కనీసం పేద మధ్యతరగతి వర్గాల దైనందిక విషయాలను పరిగణలోకి తీసుకోండి.. భారీ షాపింగ్ మాల్స్ మూసేయండి. వస్త్ర దుకాణాలు మూసేసి పండగ షాపింగ్ నిషేదించండి. పండగ ముఖ్యం కాదు. తిండి ముఖ్యం. భవన నిర్మాణ పనులు, రోడ్డుసైడు మెకానిక్ షాపులు, రవాణా వ్యవస్థ, కొనసాగనియ్యండి..ఇవేవీ కుదరవు అని అంటారా.. కుటుంబానికి కనీసం నెలకు పదివేలు చొప్పున ఆర్ధిక సహాయం చేస్తూ తిండి గింజలు దొరికే వెసులుబాటు కల్పించి లాక్ డౌన్ చేయండి.. ఇవేవీ చేయరు కానీ లాక్ డౌన్ మాత్రం పెడతారు ధనికవర్గం చేసిన పాపాలకు నిరుపేద భారతాన్ని ఎందుకు బలి చేస్తారు..

ఇంట్లో కూర్చుని బలిసిన మాటలు కాదు పేదల గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇది సంపన్నుల భారత దేశం కాదు. ఇక్కడ ఫుల్లు మెజారిటీలు పేదలే. ఏ నిర్ణయమైనా పేదల పక్షపాతంగానే ఉండాలి.

Monday 10 May 2021

నిదురించు ఇండియా

 

నిదురించు ఇండియా



నువ్వలాగే నిదురపో

లేచి ఏం చేస్తావు

లేచినా ఏమీ చేయలేవు

లేవాలనుకున్నా ఇప్పుడు లేవలేవు

ఇప్పుడు నీ కాళ్ళలో ఆ సత్తువ లేదు

నీ కళ్ళలో ఆ వెలుగులు లేవు

ఉందో లేదో తెలియని ఒక సూక్ష్మ జీవి నీపై ఎగబాకింది

నీలో శక్తిని చంపేసింది

అది నీపై దాడికి దిగిందా

లేనేలేదు

ఆ పురుగు ముందు సాగిలపడ్డావ్

ఎర్ర తివాచీతో స్వాగతం పలికావ్

ఇప్పుడు దాన్నేం అంటావ్

పిలిచి వడ్డించింది నువ్వేగా

ఎన్నికలంటూ

మేళాలంటూ

కడుపునిండా మేపి ఆ పురుగును పులిగా మార్చేసావ్

ఇప్పుడేం పీకుతావ్

సన్యాసులు సన్నాసులు

నిరక్షర కుక్షులు

మృత్యు బేహేరులు

ఏలికలై నీకు జోలపాడుతున్నారు

హాయిగా మత్తుగా

నిదురించు ఇండియా...

కన్నీటిభారతం

 

కన్నీటిభారతం


బయటకు వెళ్లిన నాన్న ఇంకా ఎందుకు తిరిగి రాలేదో తెలియదు...

ఇంట్లోనే ఉన్న అమ్మకు ఏమయ్యిందో ఆ చిన్నారికి తెలియదు....

కట్టుకున్న భర్త కళ్ళముందే ఊపిరి అందక నేలకొరిగితే

ఏం చేయాలో ఆ ఇల్లాలికి తెలియదు...

చేతికి అందివచ్చిన కొడుకు విలవిల లాడుతూ కళ్ళముందే ప్రాణాలు విడుస్తూ ఉంటే ఎలా కాపాడుకోవాలో ఆ తండ్రికి తెలియదు...

నాలుగిళ్ళ దూరంలోనే ఉన్న బంధువుల కుటుంబంలో ఒక్కరొక్కరుగా రాలిపోతున్నారని తెలిసినా ఏం చేయాలో తెలియదు...

ఏం చేయాలో తెలియక

ఎవరికి చెప్పుకోవాలో తెలియక

ఎవరి శరణు కోరాలో తెలియక

గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు

ఓదార్చేవారే లేక ఏడ్చి ఏడ్చి అలసిపోతున్నారు

రేపన్నది ఉందో లేదో తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు

ఒకరు కాదు వేలు కాదు

లక్షలు కాదు

నా సమస్త దేశం కన్నీటి భారతంగా మారిపోయింది...

Saturday 8 May 2021

నీ నవ్వులే నా భావాలు

 

నీ నవ్వులే నా భావాలు



నీ మాటలకు నా మనసుకు ఏదో తెలియని

లంకె ఉన్నట్టే ఉంది...

నా మనసు ఎంత ముభావంగా ఉన్నా

వేదన ఏదో గుండెలో గూడుకట్టి ఉన్నా

నువ్వు కబుర్లు చెబుతూ

హాయిగా నవ్వుతూ ఉంటే చాలు

గుండె తెరలపై గడ్డకట్టిన వేదన మంచులా కరిగిపోతుంది

అప్రయత్నంగానే పెదాలపై

చిరునవ్వు పువ్వులా విరబూస్తుంది

నా అక్షరాలకు విలువనివ్వవేమో

నా భావాలు మాత్రం

నీ మాటల్లో నుంచే

జన్మను పొందుతున్నాయి

మనస్వినీ...

Thursday 6 May 2021

వామపక్షాలు మనుషులు కారా?

 

వామపక్షాలు మనుషులు కారా?


హింస ఎక్కడైనా సమర్ధనీయం కాదు. కానీ బెంగాల్ హింసకు బిజెపికి బాధ్యత లేదా... టీఎంసీ అధికారంలోకి వచ్చిన తొలిన్నాళ్ళనుంచి కమ్యూనిస్టులను సమూలంగా నాశనం చేయాలనే కసితో ఆ పార్టీ కార్యకర్తలు వామపక్షాల కార్యకర్తలపై సాగించిన ఆరాచకాలు, హత్యాకాండ బిజెపికి తెలియదా... కేంద్రంలో అధికారంలో ఉండి కూడా కనీసం స్పందించలేదే.. ఇప్పుడు గొంతు చించుకుంటున్న గోదీ మీడియా అప్పుడు నోరెందుకు విప్పలేదు.. చూసీ చూడనట్లు వ్యవహరించారు కదా. అప్పుడెందుకు సమీక్షలు జరపలేదు. అప్పుడు చస్తుంది మీ శత్రు పార్టీ కార్యకర్తలు గనుకనా.. ఇప్పుడు ఒకరిద్దరు బిజెపి కార్యకర్తలు చస్తే నానా రభస చేస్తున్నవాళ్లు అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నారు. అంటే వామాపక్షాలు మీ శత్రువులు గనుక మీ మనసులో ఉన్నదే మమత చేస్తున్నది కాబట్టి అన్నీ మూసుకున్నారా. ఇప్పుడు బిజెపి కార్యకర్తలపై దాడులు అంటూ కిందా మీదా పడుతున్న గోదీ మీడియా అప్పుడెందుకు మాట్లాడలేదు. పప్పాకు కోపం వస్తుందన్న భయమా.. ఏం వామపక్ష కార్యకర్తలవి ప్రాణాలు కావా? వారు మనుషులు కారా? మీ పార్టీ వాళ్లయితేనే మనుషులా? వారివి మాత్రమే ప్రాణాలా?

అప్పుడు ముద్దొచ్చిన మమత ఇప్పుడు ఎందుకు వెగటుగా మారింది. ఇప్పుడు జరుగుతున్న హింసకు అప్పుడే బిజెపి ఊపిరి పోసిందన్నది నిజం. ఈ నిజం తెలిసినా ఇప్పుడు బిజెపి దాని అనుకూల మీడియా చేస్తున్నది పచ్చి రాజకీయం.

Wednesday 5 May 2021

మనసుమైదానం

 

మనసుమైదానం



ఏమిటీ ప్రకంపనలు

ఎక్కడా ఈ విస్ఫోటనాలు

ఏమూలనుంచి ఈ విధ్వంస తరంగాలు

ప్రశాంతమైన నా వదనం ఎందుకు రంగులు మారుతోంది

వెన్నెల కురిసే కన్నులు ఎందుకు తడి పూసుకుంటున్నాయి

దేహం ఎందుకు సత్తువ కోల్పోతోంది

ఏమయ్యిందో ఏమో అని

భయం భయంగా

నా మనసు మైదానంలోకి

తొంగి చూసాను

అంతటా క్రూరమైన నల్లని చీకటి అలుముకుని ఉంది

ఎక్కడి నుంచో ఏవో తీక్షణమైన మెరుపులు

ఒకదానినొకటి ఢీ కొట్టుకుంటూ విధ్వసం సృష్టిస్తున్నాయి

అవి పరస్పర విరుద్ధ భావాజాలాలేమో

అలుపెరుగక కొట్టుకుంటున్నాయి

యుద్ధంలో జారిపడిన నిప్పుకణికలకు కాలిందేమో మనసు మైదానం

అంతటా కమురు వాసన ఆవరించింది

భయంతో వణికిన నేను

నా మనసులోనుంచి

బయటికి పారిపోయి వచ్చేసాను

ఇంత అల్లకల్లోలమా

అనుకుంటూ మనసు తలుపులను మూసివేసి

ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నా

యుద్ధంలో ఓడిన సేనానిలా...

Monday 3 May 2021

భయమా ధైర్యమా

 

భయమా ధైర్యమా



నేను ధైర్యంగానే ఉన్నానా

భయపడుతూ ఉన్నానా

ఎక్కడలేని ధైర్యం నాలో ఉందని మొండి ధైర్యంతో ఉన్నానా

ధైర్యంగా ఉన్నానని

నాకు నేను ధైర్యం చెప్పుకుంటున్నానా

నేను భయపడుతూనే ఉన్నానా

నాలో భయం తిష్ఠ వేసిందా

నేను భయపడతానేమో అనే భయంతో

భయపడుతూ ఉన్నానా

నాలో ఉందో లేదో తెలియని ధైర్యం భయంపై యుద్ధం చేస్తోందా

ధైర్యాన్ని చంపేయాలనే కసితో భయం ఎదురుదాడికి దిగిందా

నాలో ధైర్యమే గెలుస్తుందా

భయమే జెండా ఎగురేస్తుందా

భయమా ధైర్యమా

గెలుపు ఎవరిది

ధైర్యం ఓడిపోతుందేమోనని

భయంతో

భయం నన్నేం చేస్తుందనే ధైర్యంతో

నాకు నేను ధైర్యం చెబుతూ

అనుక్షణం భయపడుతూనే ఉన్నా భయం ఎక్కడ మింగేస్తుందోనని...

Sunday 2 May 2021

బాల్యం వెక్కిరిస్తోంది

 

బాల్యం వెక్కిరిస్తోంది

ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదు.. ఎందుకో నా బాల్యం కళ్ళ ముందు తిరుగుతోంది.. నా బాల్యాన్ని తలుచుకుంటే అప్పుడే నేను తృప్తిగా జీవించానేమో అని అనిపిస్తోంది. అలాగని నా బాల్యం అద్భుతంగా సాగలేదు, అన్నీ కష్టాలే.. అప్పుడు నేను మూడో తరగతిలో ఉన్నానేమో.. మా నాన్న చనిపోయారు. అప్పటిదాకా బాగానే సాగిన జీవితం రోడ్డుపాలయ్యింది. అప్పటికి మాకు సొంత ఇల్లు కూడా లేదు. తడికల గుడిసెలో తలదాచుకునే దుస్థితి. మేము ఐదుగురం పిల్లలం అమ్మ... బతుకు భారమంతా మా అన్నల మీద పడింది. అరకొర సంపాదన.. కష్టమైన జీవితం. కానీ నేను చదువు ఆపలేదు. పక్క ఊరిలో బడికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. కాళ్లకు ప్లాస్టిక్ చెప్పులు.. ఆ చెప్పులు చేసిన గాయాల బాధను దిగమింగుతూ కాలినడకన వెళ్ళేవాడిని. అయితే మా బతుకులు నన్ను నిత్యం వేదనకు గురి చేసేవి. వయస్సు పెరుగుతున్న కొద్ది నేను కూడా ఇంటికి అంతో ఇంతో తోడ్పాటు అందించాలని ఆరాటపడేవాడిని. ఈ క్రమంలోనే కాటేదాన్ లోని ఒక మోటార్ వైండింగ్ షాపులో కొన్నాళ్ళు పని చేసా వారానికి యాభై రూపాయలు వచ్చేవి. కొంతకాలం మాంసం నుంచి ప్రోటీన్ లు విడదీసే ఒక కంపెనిలో పని చేసా నైట్ డ్యూటీలో... జీతం నెలకు ఏడు వందలు.. తర్వాత బిస్కట్ కంపెనీలోనూ పని చేసా. జల్ పల్లి నుంచి కాటేదాన్ కు నడిచే వెళ్ళేవాడిని.ఇక టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడైతే ఆటో కూడా నడిపా.. పగలు స్కూలు రాత్రి ఆటో.. డబ్బులు బాగానే వచ్చేవి. ప్రతి పైసా అమ్మకు ఇచ్చేసేవాడిని.. తృప్రిగా ఉండేది నేనూ కొంత ఇంటి భారం మోస్తున్నానని.

అప్పుడు పెద్దన్నయ్య ఫక్రుద్దీన్ ఉదయం పత్రికలో చార్మినార్ ఏరియా రిపోర్టర్ గా పని చేస్తున్నారు. చిన్నన్న జహంగీర్ లారీ క్లీనర్ గా పనిచేసేవారు. వారిద్దరి సంపాదనే మాకు జీవనాధారం. అయితే నేనూ చిల్లర డబ్బులు సంపాదించి అమ్మకు ఇవ్వడం ద్వారా తృప్తి పడేవాడిని. అది పెద్ద సంపాదన కాకపోవచ్చు కానీ ప్రతి పైసా ఇంట్లో ఇచ్చేసేవాడిని. కడుపుకు ఆకలేస్తే ఒక డబల్ రొట్టె తిని నీళ్లు తాగి కాలం వెళ్ళదీసిన రోజులు ఎన్నో ఉన్నాయి. తప్పు చేయలేదు, ఎవరి పైసాపై ఆశపెట్టుకోలేదు, భారంగా గడిచే సమయాన్ని సవాలుగా స్వీకరించి స్వయం సమృద్ధికై ఆరాటపడ్డాను. తర్వాత చదువు పూర్తయ్యి ఉద్యోగ జీవితంలో బాగానే నిలదొక్కుకున్నా..కానీ సమయం మారడానికి ఎంతసేపు. నా జీవితంలోనూ మార్పు వచ్చింది. ఇప్పుడు జీవన సంధ్యాసమయం పలకరిస్తోంది.నాటి బాల్యంలో ఉన్న స్వయంప్రకాశం ఇప్పుడు లేదు. ఇప్పుడు చందమామనే సూర్యుడి వెలుతురు పడితే తప్ప ప్రకాశించలేను. అందుకే బాల్యం నన్ను వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడూ.. అయితే మరలా సూర్యుడినై వెలగాలని ఉంది. నాది ఉషోదయమా

అస్తమయమా అన్నది త్వరలో కాలమే చెప్పనున్నది.