Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 30 September 2020

సరదాగా...

 

సరదాగా...


నువ్వు ఏడిస్తే

ఈ లోకం నవ్వుతుంది

నువ్వు నవ్వితే

ఈ లోకం ఏడుస్తుంది

వేదనలన్నీ గుండెలో పూడ్చేసి

నవ్వేసేయ్ మనసారా

ఈ లోకాన్ని ఏడిపించేసేయ్

సరదా సరదాగా...

Sunday 27 September 2020

అక్షరసాగరం

 

అక్షరసాగరం


ఆవేశంతో ఎగిరెగిరిపడే అక్షరాలు కాదు

వేదనతో బరువెక్కిన అక్షరాలు నావి...

నా అక్షర సాగరం నిర్మలంగానే ఉంటుంది

అది నదిలా పరవళ్లు తొక్కదు

గుంభనంగానే ఉంటుంది

ఎందుకంటే ఎగసిపడే పిల్లనది సేద తీరేది సాగరంలోనే...

Saturday 26 September 2020

మృతదేహాన్ని

 

మృతదేహాన్ని



అవమానాల తోటలో పూసిన అభిమానాన్ని

అవహేళనల దారిలో

అలుపెరుగని బాటసారిని

వైఫల్యాల సమరంలో

ఓడిపోయిన విజేతను

అవును ఇప్పుడు నేను

జీవమున్న మృతదేహాన్ని...

కులమతాలకు అతీతం బాలు స్వరం...

 

కులమతాలకు అతీతం 

బాలు స్వరం...


కదిలింది

కరుణరథం

సాగింది

క్షమాయుగం

మనిషి కొరకు దైవమే

కరిగి వెలిగే కాంతిపథం...

ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ పాట వినిపిస్తే అక్కడే ఆగిపోతా.. ఈ పాటంటే అంత ఇష్టం నాకు. ఒక్క క్షణం జీసస్ అంటే ఏదో తెలియని ఆరాధ్య భావం చిగురిస్తుంది.. ఆర్తి,  ఆరాధన, క్షమాగుణం కలగలిసిన ఈ గీతం క్రైస్తవం ఔన్నత్యాన్ని తెలిపేదే.. ఈ పాట పాడింది ఒక బ్రాహ్మణుడు, అదే ఎస్ పి బాలుగారు.. అంత ఆరాధనగా తక్కువ పారితోషికంతో ఆయన ఈ పాట ఎందుకు పాడారు. ఆయన క్రైస్తవుడు కాదు, పాడిన తర్వాత తన జంధ్యం తెంచుకోలేదు, నుదుటన బొట్టూ చెరుపుకోలేదు... అంతెందుకూ నాకు ఆ పాటంటే ఎందుకు అంత ఇష్టం.. నేను క్రైస్తవుడిని కాదే.. అది గాన మాధుర్య ప్రభావం.. అలా లాక్కెళ్లి భావంలోకి లీనం చేసేదే బాలు స్వరం.. బాలు ఇస్లామిక్ పాటలు కూడా పాడారు అది మరువగలమా.. శంకరాభరణం భక్తిరసం, సాయిబాబా పై బాలు కురిపించిన భక్తి భావం  ఇవన్నీ నాకిష్టమే.. మరి నేను హిందువును కాదుగా.. మరి బాలు స్వరానికి ఎందుకు కులాలు ప్రాంతాలు అంటగడుతున్నారు.. బ్రాహ్మణ ఆధిపత్య ధోరణికి నేనూ వ్యతిరేకమే కానీ బ్రాహ్మణులకు కాదు. ఒకటి గుర్తుంచుకోండి పాట ఉన్నంత కాలం మనందరి గొంతుకల్లో బాలు ఉంటాడు కులమతాలకు అతీతంగా...

ఎందుకంటే బాలు స్వరం మన అందరిదీ.. బాలు స్వరానికి కులం లేదు మతం లేదు...

మేడిపండ్లు

 

మేడిపండ్లు


శ్వాస ఆడుతున్నదంటే

జీవించి ఉన్నట్టు కాదు

మృతకళేబరాలే సంచరిస్తున్నాయిక్కడ...

పెదాలు పువ్వుల్లా విరబూసాయంటే చిరునవ్వులు పూసాయని కాదు విరిసే పెదాల మాటున వేదనలెన్నో దాగున్నాయిక్కడ...

మూడు పూటలా తింటున్నాడంటే ఆకలి తీరిందని కాదు ఆ అన్నం ముద్దలకు ముందే అవమానాలెన్నో దిగమింగుతున్నారిక్కడ...

బంధువులు ఎందరో ఉన్నారంటే అనుబంధాలు ఉన్నట్టు కాదు బంధాలను బంధనాలుగా చూసే వారిదే రాజ్యమిక్కడ...

తీయని పలుకుల మాటలు  కోయిలగానం కాదు మాటల మతలబు చేసే రాబందులున్నాయిక్కడ...

జీవితమంటే అందమైన పూదోట కాదు విప్పిచూడని మేడిపండ్లు ఎన్నెన్నో రాలిపోతూనే ఉన్నాయిక్కడ...

Friday 25 September 2020

ఇక సెలవనీ...

 

ఇక సెలవనీ...


ఓ మధురగళం మూగబోయింది

ఓ గంధర్వగానం కరిగిపోయింది

సంగీత సాగరంలో ఓ కెరటం ఆగిపోయింది

వెన్నెలలా జాలువారిన

రసమయ రాగం ఇక సెలవంటూ శూన్యంలోకి

జారుకుంది

ఓ అందమైన పాట పాలపిట్టలా రెక్కలు విప్పి  నింగిలోకి ఎగిసింది...

అల్లకల్లోలం

 

అల్లకల్లోలం



మనసులోని భావానికి

అక్షరాన్ని బహుమానంగా ఇవ్వాలని ఉంది...

చెప్పలేని మాటలను

అక్షర పల్లకిలో

ఊరేగించాలని ఉంది...

మసకబారిన స్వప్నానికి

అక్షర నివాళి

అందించాలని ఉంది...

భయమేస్తోంది మనసా

నా అక్షరం మర ఫిరంగిలా

పేలిపోతుందేమోననని...

నా భావం అల్లకల్లోలం చేస్తుందేమోననని...

Wednesday 23 September 2020

ప్రేమకోసమే

 

ప్రేమకోసమే


నన్ను ప్రేమించే వారిని క్షణంపాటు మరిచిపోతానేమో కానీ

నన్ను ద్వేషించే వారిని  మాత్రం ఎన్నటికీ మరచిపోను

ఎందుకంటే ద్వేషించే వారే నేను ఎలా బతకకూడదో నేర్పించే గురువులు

అందుకే ఆ ద్వేషాన్ని ప్రేమిస్తూనే ఉంటా

ఏనాటికైనా నన్నూ ప్రేమిస్తారేమోననని...

Tuesday 22 September 2020

ప్రేమిస్తూనే ఉంటా

 

ప్రేమిస్తూనే ఉంటా


నీ దరహాసం వికసిస్తే

నేను పువ్వులా వికసిస్తా

నీ కలువ కన్నుల వెన్నెల జారితే

నేను చందమామనై ఆడుకుంటా

నీ మోము ముభావమైతే

నేను కారుమబ్బునై కురిసిపోతా

నీలో జ్వాల రేగితే

నేను సమిధనై కాలిపోతా

కలతలన్నీ కలియబడి

గుండెల్లో కత్తులు దూస్తే

ఊపిరి నిలిచిపోయే చివరి ఘడియలోనూ

నిన్ను ప్రేమిస్తూనే ఉంటా

మనస్వినీ...

Sunday 20 September 2020

జీవనరాగం

 

జీవనరాగం



మనసు పులకిస్తే

పువ్వులా నవ్వుతా

వేదన పలకరిస్తే

మౌనమై మిగిలిపోతా

ఆహ్లాదమనిపిస్తే

వసంతమై విరబూస్తా

మనసు పాటపాడితే

రాగమై అందుకుంటా

గుండె రగిలితే

అగ్నిపర్వతమై పేలిపోతా

పలకరించిన  ప్రతినిమిమిషంలో

జీవితమై సాగిపోతా

వచ్చే ఘడియపై

నమ్మకమే లేదు నాకు

ఏ ఘడియ మృత్యువై

పలకరిస్తుందో

అందుకే

అందివచ్చిన ప్రతిఘడియలో

జీవనరాగం పాడుతూనే ఉంటా

మనస్వినీ...

Thursday 17 September 2020

గడ్డిపరక

 

గడ్డిపరక


నన్నెవరు ఎలా అనుకుంటున్నారు

నేనెవరికి ఎలా కనిపిస్తున్నా

నాలో నాయకుడిని చూస్తున్నారా

ప్రతినాయకుడిలా కనిపిస్తున్నానా

నన్ను విజేతగా చూస్తున్నారా

పరాజితుడినేనని

చులకన చేస్తున్నారా

మంచి వాడినే అనుకుంటున్నారా

మాయగాడినని భయపడుతున్నారా

ఎవరేం అనుకుంటే నాకేంటి

నేనేంటో నాకు తెలిసినంతకాలం

నన్ను తెలుసుకోలేని సమాజం ఇప్పుడు నాకు గడ్డి పరకతో సమానం...

Monday 14 September 2020

ఓ దీపం

 

ఓ దీపం


చందమామ కనులు మూసుకున్నాడా

అందుకేనేమో

వెన్నెలమ్మ నల్ల ముసుగేసింది...

ఆకాశం గుండెలు

పగిలేలా

రోదిస్తోందా

అందుకేనేమో

వాన ఆగకుండా కురుస్తోంది...

ఎప్పుడూ నవ్వుతున్నట్టు

పులకించే

మా ఇంట మామిడి

ముభావమైపోయిందా

అందుకేనేమో

తుది వీడ్కోలుకై

కన్నీరు పెడుతోంది...

నా అక్షరాలకు జీవం పోతోందా

అందుకేనేమో

మనసు భావాలను

రాయలేక పోతున్నాయి...

కన్నీటిని మరిచిన నా కళ్ళు

వెన్నెలను మరిపిస్తున్నాయా

అందుకేనేమో

ఎక్కడో ఒక దీపం

రెపరెపలాడుతోంది...

Sunday 13 September 2020

ఖైదీనే నేను

 

ఖైదీనే నేను


శిలా ప్రతిమను కానుగా

రక్తమాంసాలున్న మనిషినే

గాయమైతే వేదనే పలకరిస్తుంది...

రాతిబండ హృదయం కాదుగా

అది మెత్తని పుష్పమే

మెదడుకు సంకేతాలు పంపిస్తూనే ఉంటుంది..

మట్టి బుర్ర కాదుగా

మెదడు పనిచేస్తూనే ఉంది

అందుకే నాలోనూ ఆలోచనలు చెలరేగుతూనే ఉంటాయి...

నేను దేవుడిని కాదుగా

మామూలు మనిషినే

అందుకే నా చుట్టూ ఆలోచనలు పరిభ్రమిస్తూనే ఉంటాయి...

ఎక్కువగా ఆలోచిస్తున్నా అంటే ఆలోచిస్తున్నా మరి

నేనిప్పుడు ఆలోచనాశాలలో ఖైదీని

మనస్వినీ...

Wednesday 9 September 2020

చిరునవ్వుల తొలకరిలో

 

చిరునవ్వుల తొలకరిలో



చిరునవ్వులను

స్వాగత తోరణాలుగా కడుతున్నా

వచ్చే ప్రతి ఘడియ కోసం

అది ప్రమోదమైనా

ప్రమాదమైనా...

నీలి నింగి తారకలను తివాచీగా అల్లుతున్నా

అది వినోదమైనా

విషాదమైనా...

కంటి వెన్నెల వెలుగులను

దివిటీలుగా మలుచుకుంటున్నా

వచ్చేది విజయమైనా

పరాజయమైనా...

ఓటమిలోనూ గెలుపు చూస్తా

గెలుపులో ఓటమిని తలుచుకుంటా

అందుకే నేను

చిరునవ్వులు చిందిస్తూనే ఉంటా

మనస్వినీ...

Tuesday 8 September 2020

సూసైడ్ వారియర్స్...

 

హెచ్చరిక : ఈ పోస్ట్  కొందరి ఆరోగ్యానికి హాని కలిగించగలదు. పూర్తి మానసిక పరిపక్వతతో రాయడమైనది. అపరిపక్వ మానసులు ఇది చదవరాదు, చదివినా అనుసరించరాదు ఆరోగ్యానికి హానికరం. కేవలం నా అభిప్రాయంగానే పరిగణించగలరు.

సూసైడ్ వారియర్స్...



అవును వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకునేవారిని  యోధులుగానే పరిగణిస్తాను నేను. దీనికి నాదగ్గర హేతుబద్ధమైన కారణాలే ఉన్నాయి.. సాధారణంగా మన చుట్టుపక్కల ఆత్మ హత్యలు చేసుకునే వారిని చూస్తూ ఉంటాం. మీడియాలోనూ ఇలాంటి వార్తలు రోజూ కనిపిస్తూనే ఉంటాయి. అనవసరంగా చచ్చాడు పిరికోడు బతకాలనే గుండె ధైర్యం లేనోడు అని కామెంట్లు పడేస్తాం. కనీసం సమస్య ఏంటో ఎవరికైనా చెప్పుకోవాలిగా ఇలా చావడమేంటి... కనీసం మాకన్నా చెప్పుకోవాల్సింది ఏదో ఒక మార్గం చూపేవాళ్ళం కదా.. ఇలా సన్నాయి నొక్కులు చాలానే వింటాం.. మొత్తంమీద సూసైడ్ చేసుకున్న సదరు శాల్తీని పిరికివాడనో పిరికిదనో జెండర్ ను బట్టి సర్టిఫికెట్ ఇచ్చేస్తాం.. సమాజంలో ఉన్నాం కదా ఇలా సర్టిఫై చేయడం బాధ్యత అని బిల్డప్ ఇచ్చుకుంటాం.మరోవైపు మనం నెత్తిన మోస్తున్న ఘనమైన మతాలు కూడా ఆత్మ హత్యను మహా పాపంగా పరిగణిస్తున్నాయి. ఇంకోవైపు ఇండియన్ పీనల్ కోడ్ కూడా ఆత్మహత్యను నేరంగానే చెబుతోంది.

నేనైతే ఏకీభవించను ఈ వాదనతో.

ఒక్కసారి ఆత్మహత్యకు పాల్పడిన వారి కోణంలో ఆలోచించండి వారెంతటి ధైర్యవంతులో తెలుస్తుంది. ఎవరికైనా బతకాలనే ఉంటుంది, తనవారితో ఆనందంగా గడపాలనే ఉంటుంది. అయినా చస్తున్నారంటే వారెంత మానసిక క్షోభకు గురై ఉంటారో ఆలోచించండి. కొంతమంది ప్రేమ విఫలమై కొందరు అయినవాళ్లతో మోసానికి గురై ఆత్మ హత్య చేసుకుంటున్నా చాలామంది బలవన్మరణాలకు కారణం ఆర్ధిక ఇబ్బందులే.. గుప్పెడంతమంది తప్ప ఈ లోకంలో ఆర్ధిక సమస్యలున్నవారే అందరూ కాదని అనను. కానీ కొంతమందికి ఈ సమస్య గుదిబండగా మారుతుంది. ఎలాగైనా బతకాలి అన్న తపనతో అప్పులు చేస్తారు. అయినా సమస్య తీరదు. అప్పులు తీర్చే మార్గం కనిపించదు, ప్రేమతో పలకరించే వారు మొహం చాటేస్తారు. రక్తసంబంధీకులు పట్టించుకోరు. ఇంట్లో ఆకలి మంటలు.. ఏం చేయాలో అర్ధం కాదు. ఇలాంటి స్థితిలోనే మనిషి ధైర్యంగా ఆలోచిస్తాడు. తను పోతే అన్న ఆలోచన ఆ ధైర్యంతోనే పుడుతుంది. తను చస్తే తనవాళ్లు ఏమిటనే ఆలోచన కూడా వస్తుంది. తనుండి తనవారికి నరకం చూపడం కంటే చచ్చి బాగుపర్చాలని ఆశిస్తాడు, అలా జరుగుతుంది కూడా. అప్పటిదాకా పట్టించుకోని బంధువులు తను చావగానే పరిగెత్తుకుని వస్తారు. ఎక్కడలేని సానుభూతి చూపుతూ ఆ కుటుంబానికి పదో పరకో సహాయం చేస్తారు మంచివాళ్లనే క్రెడిట్ దక్కించుకోవాలిగా. ఇక ఆ ఫ్యామిలీ.. అది భార్య అయిన మొగుడైనా పిల్లలైనా నాలుగు రోజులు ఏడుస్తారు, తర్వాత మళ్ళీ జీవనపోరాటం చేస్తారు. అప్పటికంటే కొంత బెటర్ గానే.. కొంతమంది విషయంలో ఇది రివర్స్ కూడా అవ్వొచ్చు కానీ చాలా తక్కువ. ఆత్మ హత్య చేసుకునేవాడు ఇదంతా ఆలోచించి ఒక మొండి ధైర్యానికి వస్తాడు. అప్పుడే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు.కనీసం తనవాళ్లు సుఖంగా ఉండాలనే తపనే అలా చేయిస్తుంది. ఏమార్గం లేక ఎలాంటి ఆప్షన్ లేక ఆత్మ హత్య చేసుకుంటాడు. ఎందుకంటే ఈ సమాజం అతనికి ఏ అవకాశమూ ఇవ్వలేదు కనుక. ఇక మహాపాతకమంటూ ఘోషిస్తున్న మతాలు ఇక్కడ ఏదైనా ఆప్షన్ ఇస్తున్నాయా లేదే.. మహా భక్తులు హుండీల్లో కోట్లు కుమ్మరిస్తారే గాని పక్కవాడు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోరు. తాను ఆకలితో చస్తూ తనవారికి నరకం చూపిస్తూ మతం చెప్పింది కనుక చావకుండా ఉండాలా.. ఏదీ ఆ మతం పైసా విదల్చదే.. ఆత్మ హత్య కు ప్రయత్నించి విఫలమైతే బొక్కలోకి తోస్తుంది ఈ చట్టం, కానీ బతికేందుకు మాత్రం దారి చూపదు. ఎవడు కోరుకుంటాడు చావాలని సమాజమే అలా తయారు చేస్తోంది. అందుకే ధైర్యం చేసి చస్తున్నారు చాలామంది. సమస్యలున్నవారందరూ చావాలా అని అడగొచ్చు. చావొద్దు కానీ చచ్చేలా చేస్తున్నారు. అందుకే చస్తున్నారు. కడుపునిండా తిని సొల్లు కబుర్లు చెప్పే వారు తమ ఆత్మీయులు చావుకు దగ్గరలో ఉన్నారని తెలిసినా పట్టించుకోరు. రూపాయి పెడితే నాకేం లాభం అని ఆలోచిస్తారు. ఈ క్విడ్ ప్రోకో గేమ్ లో గెలిచినవారు లైఫ్ ఎంజాయ్ చేస్తారు, ఓడినవారు ధైర్యం చేసి గెలుస్తారు. అందుకే అంటాను వీలయితే చావకుండా ఆపండి.. ఆ జీవితానికి చేయూతనివ్వండి స్వలాభాపేక్ష లేకుండా.. అంతేగాని పిరికివాడు చచ్చాడు అంటూ సొల్లు కబుర్లు చెప్పకండి

ఆత్మహత్య చేసుకున్నవాడు పిరికివాడు కాదు.. వాడే అసలైన ధైర్యవంతుడు..ఈ పోస్టు చూసి మీరు రకరకాలుగా స్పందిస్తారని నాకు తెలుసు. నా ఆలోచనలు అర్ధం కావాలంటే నా లెవెల్ కు ఎదిగి ఆలోచించండి. పోనీ మీలో ధైర్యం ఉందా ఏదైనా జీవితాన్ని నిలబెట్టేంత?  చితికిపోయిన లక్షల కుటుంబాలున్నాయి. ఒక్కరికీ చేయూతనిచ్చి మీరూ ధైర్యవంతులుకండి. అంత లేదని నాకు తెలుసు మీకూ తెలుసు.. ఎందుకంటే ఇక్కడ ఎవరి లెక్కలు వారికున్నాయి..

గమనిక : కొందరు మంచివాళ్ళున్నారు వారికి నా పాదాభివందనాలు. తాము జీవిస్తూ పక్కవాడి జీవితానికి చేయూతనిచ్చే దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళే అసలైన దేవుళ్ళు. కానీ వీరి సంఖ్య చాలా స్వల్పం..

సమాజం అంటే నేనే కదా

 

సమాజం అంటే నేనే కదా


ఓ మిత్రుడు అడిగాడు

నువ్వు చాలా బాగా రాస్తావు

కానీ ఎక్కువగా విషాదాలే రాస్తుంటావు,పైగా నీపైనే నువ్వు రాసుకుంటావు,  అప్పుడప్పుడూ రొమాన్స్ కూడా రాస్తావనుకో.. అయితే విషాదాలే ఎందుకు రాస్తావు..నీపై నువ్వు రాసుకోకుండా నీ అక్షరాలను సమాజానికి పనికి వచ్చే అంశాలపై ప్రయోగించవచ్చు కదా అని.. నేను సమాధానం చెప్పాను ఒకే మాటలో సమాజం అంటే  నేనే కదా అని...

Monday 7 September 2020

ధర్మాన్ని కాపాడాలంతే...

 

ధర్మాన్ని కాపాడాలంతే...


ధర్మం తప్పకు

ఆ ధర్మం నిన్ను కాపాడకున్నా ధర్మాన్ని విస్మరించకు...

ఆలోచన చేయకు

ధర్మం చెప్పింది రోబోలా అనుసరిస్తూ ఉండు...

బతుకు దుర్భరమవుతున్నా

ధర్మాన్ని అనుసరించు

ధర్మాత్ములెవరూ చేయూతనివ్వకున్నా...

పిల్లలకు తిండి పెట్టలేకున్నా

ధర్మాన్ని మాత్రం విడవకు

ఆ దేవుడు నీకేమీ చేయకున్నా...

క్షణం క్షణం నరకం వెంటాడుతున్నా

ధర్మం చూపిన బాటలోనే నడువు

దేవుడి స్వర్గం ఉందో లేదో తెలియకున్నా...

జీవన దర్పణం

 

జీవన దర్పణం


గుడ్లురిమి చూస్తుంది

బేలగా  కనిపిస్తుంది

విరగబడి నవ్వుతుంది

గుండెలు పగిలేలా ఏడుస్తుంది

మౌనమై చూస్తుంది

రౌద్రంగా బెదిరిస్తుంది

ప్రమోదమై పలకరిస్తుంది

వేదనగా విలపిస్తుంది

ఎందుకిలా కనిపిస్తోంది

నిమిషం నిమిషం ఇన్ని మార్పులెందుకు

నన్ను రకకాలుగా

చూపుతున్న నా అద్దానికి

దుమ్ముపట్టిందేమో

అద్దాన్ని తుడుద్దామని అనుకున్నా గానీ

అది నా జీవితానికి

దర్పణం పడుతోందని

తెలుసుకోలేకపోయా...

Sunday 6 September 2020

దివ్యలోకం

 

దివ్యలోకం


ఏది ప్రభూ

నీ దివ్యమైనలోకం

పంపించలేవా నాకై

నీ పుష్పక విమానం

చుక్కల పల్లకిలో ఊరేగాలని ఉంది

నీ చల్లని వెన్నెలలో ఆడుకోవాలని ఉంది

తెల్లని మబ్బులతో దోబూచులాడాలని ఉంది

నీలి నింగి చుక్కల్లో మెరిసిపోవాలని ఉంది

నీ అమృత జలాలు నాకు వద్దు

నీ పరిచారికల సేవలు వద్దే వద్దు

వ్యర్ధమైన ఈ లోకాన్ని వీడి

ఉందో లేదో  తెలియని

నీ లోకంలో సేదతీరాలని ఉంది

ఏది ప్రభూ

నీ దివ్యమైన లోకం...

ఎందుకో?

 

ఎందుకో?


నేనొక నాన్నను

ఐదు పదుల వయసు దాటేసా

జీవితం నేర్పిన పాఠాలతో

మనసు మొద్దుబారిపోయింది

అయినా

ఈ వయస్సులోనూ

నాన్న గుర్తుకు వస్తే

నాకు తెలియకుండానే

కన్నుల్లో తడి చేరుతోంది

ఎందుకో?

దేహంలోని శత్రువు

 

దేహంలోని శత్రువు



మెదడులోని ఆలోచనలు

శత్రు సైనికులై విరుచుకు పడుతుంటే

నరాలలో చెలరేగుతున్న

తీయని కణాలు

దేహాన్ని ఛిద్రం చేస్తుంటే

మానవమాత్రులకు

సాధ్యం కాదేమోగానీ

నా ఉద్రిక్త మానసమే

నన్ను చంపేస్తుంది

నిస్సందేహంగా...

Saturday 5 September 2020

గుణపాఠాలు నేర్పిన గురువుకి వందనాలు.

 

గుణపాఠాలు నేర్పిన

గురువుకి వందనాలు.

తప్పటడుగులు దాటి

తప్పుటడుగులు నేర్పి...

వైభవాలను చిదిమేసి

పరాభవాలను అందించి...

స్నేహపుష్పాలు పూయించి

వెన్నుపోటు రుచి చూపించి...

అభిమానాలు కలబోసి

అవమానాలు అందించి...

మసిపూసి మారేడుకాయ చేసి

వ్యక్తిత్వాన్ని ఏమార్చి...

కలిమిని కరిగించి

లేమిని అంటించి...

అడుగడుగునా నన్ను శాసించిన ఈ జీవితమే

నాకు మొదటి గురువు...

పాఠాలు నేర్పిన పెద్దలకు కాదు

గుణపాఠాలు నేర్పిన

ఈ జీవితానికి గురుపూజోత్సవ వందనాలు...

Thursday 3 September 2020

జర్నలిజమా

 

జర్నలిజమా


మరణశాసనమా

నీకేందయ్యా జర్నలిస్టువి

నువ్వు కుక్కను కొట్టినా

పైసలు రాలతాయని అంటారు

ఏ కుక్కను కొడితే పైసలు రాలతాయో అర్ధం కాక

దిక్కులు చూస్తున్నాడు

జర్నలిస్టు...

నువ్వో గొప్ప జర్నలిస్టువి

నీకేంటి ఒక్క ఫోన్ కాల్ చేస్తే లక్ష రూపాయలు వచ్చిపడతాయి అంటాడొకడు

ఎవరికీ ఫోన్ చేస్తే పైసలు వస్తాయో ఎవడూ చెప్పడు..

అవును జర్నలిస్టు రుబాబుగా బతుకుతాడు

దర్జాగా తిరుగుతాడు

జేబులో చిల్లిగవ్వ లేకున్నా

విలాసంగా నవ్వుతాడు...

అందరూ సలాం చేసేవారే

కనిపిస్తే అన్నా చాయ్ తాగుతావా అని ఆప్యాయంగా

అడిగేవారే కానీ

అతను తిన్నాడో లేదో

అడిగేవాడు కనిపించడు...

యాజామాన్యాలు జీతాలు ఇవ్వవు

కొందరికైతే ఉద్యోగాలే ఉండవు

ఎవరికీ ఇది పట్టదు

రిపోర్టర్ కదా అతనికేంటి అనుకుంటారు...

పాపం ఆ జర్నలిస్టు చేయి చాచలేడు

చేయి చాచినా ఎవడూ నమ్మడు..

దోపిడే ఉద్యోగంగా బతికే ఎర్నలిస్టులు ఉన్నారేమో

కాదని అనలేను

బతకలేక చావలేక నరకం అనుభవించే  జర్నలిస్టులే

చాలా మంది...

జర్నలిజమా

ఇది మరణశాసనమా...

విజేతను నేనే

 

విజేతను నేనే


బోనులో నిలబడి ఉన్నా

నన్ను నేను ప్రశ్నిస్తూ

ముద్దాయిని నేనే

న్యాయవాదిని నేనే

తీర్పు చెప్పే

న్యాయమూర్తినీ నేనే...

నాకు నేనే ప్రశ్నలు వేస్తున్నా

తడుముకోకుండా

సమాధానాలు ఇస్తున్నా

ప్రతి ప్రశ్నకూ జవాబును నేనే...

నాతో నేను సమరం చేస్తున్నా

నన్ను నేను కాపాడుకుంటున్నా

నాతో నేను చేస్తున్న

యుద్ధంలో పరాజయాన్ని

మూటగట్టుకున్న

విజేతను నేనే

మనస్వినీ...

పులకింతలు

 పులకింతలు

నీలి నింగి కరిమబ్బు దుప్పటి కప్పుకుని తన నీటి ముత్యాలను నేలపై విసురుతూ కవ్విస్తోంది

అవును సన్నని వాన నేలను ముద్దాడుతోంది

లయబద్దంగా పుడమిని తాకుతున్న వాన నీటి సవ్వడిలో నాకు నీ నవ్వే వినిపిస్తోంది

ఈ వానలో నువ్వు నాతో ఉంటే తడిసిన

మామిడాకులపై జారుతున్న నీటి ముత్యాలను చూస్తూ ఎన్నెన్ని భావాలను అల్లుకునేవాళ్ళం...

వానలో తడుస్తా అని అల్లరి చేసే నువ్వు వద్దని వారించే నేనూ

చల్లని వానలోనూ

ఎంత వెచ్చగా ఉంటాయి ఆ పరిసరాలు..

అదేంటోగానీ

ప్రకృతి పులకింతలోనూ

నాకు నీ తుళ్లింతలే కనిపిస్తాయి

మనస్వినీ..