Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 27 May 2018

మట్టి ధూళిని కప్పుకుంటూ

మట్టి ధూళిని కప్పుకుంటూ

అక్కడెక్కడో మల్లెల సౌరభాలు
మత్తైన గుభాళింపులు
పొరలు పొరలుగా కమ్ముకుంటున్నాయి
మాలలుగా మారిన గులాబీ బాలలు
గుండెను ఆర్తిగా పెనవేసుకుంటున్నాయి
ఏదో ఒక సమూహం
అడుగులను అడుగుల్లో కలుపుతూ
జయజయ ధ్వానాలతో ముందుకు సాగుతోంది
పదఘట్టనలతో రేగుతున్న
మట్టి ధూళి కమ్మని వాసనతో
నేనున్నాను పదమంటోంది
దూరమవుతున్న సమూహాన్ని చూస్తూ
ఉండిపోయా
మట్టి ధూళితో నన్ను నేను కప్పుకుంటూ...


Tuesday 22 May 2018

అయితే నేనూ సంతోషంగానే ఉన్నా

అయితే నేనూ సంతోషంగానే ఉన్నా

అవమానాలను అభిమానాలుగానే మలుచుకోవాలి
జేబులో రూపాయి లేకున్నా లక్షాదికారిలా కనిపించాలి
గాడిద కాలే కాదు కుక్క కాలూ పట్టుకోవాలి
గుండెలో మంటలను చిరునవ్వులతో కప్పుకోవాలి
అపహాస్యాలనూ హాస్యాలుగానే భావించాలి
గుండెలు పగిలేలా రోదించాలని ఉన్నా మంద్రంగానే పలకాలి
కనులనీటినీ పన్నీరని నమ్మితీరాలి
ప్రతి పరాజయాన్నీ విజయంగానే చూడాలి
జీవితంలో నరకం చవిచూస్తున్నా దేవుడి స్వర్గంకై ఎదురుచూడాలి
ఎండమావిలో నీటి జాడ వెతకాలి
విషాదంలోనూ సంతోషాన్ని నటించాలి
అయితే నేనూ సంతోషంగానే ఉన్నా 

Thursday 17 May 2018

నేనే దేవుడిని

నేనే దేవుడిని

అవును నేనే దేవుడిని
మనిషిని ప్రేమిస్తా
మంచిని ఆరాధిస్తా
చెడును ధ్వేశిస్తా
మతాన్ని చూడను
కులాన్ని పట్టించుకోను
జేబులో చిల్లిగవ్వ లేకున్నా
మాటసాయంలో ముందుంటా
రాములోరి గుడిలో
అత్యాచారాలను ఆపని శక్తి
అల్లా పేరుతో మారణహోమాన్ని ఆపలేని భక్తి
శిలువపై అచేతనంగా వైరాగ్యమూర్తి
స్పందించటమే చేతకాని
మీ దేవుళ్ళకన్నా
మనిషిని మనిషిగా ప్రేమించే మనిషి కదా దేవుడు
అందుకే నేను దేవుడిని...

Wednesday 2 May 2018

బాల్యమా ఐ లవ్ యూ

బాల్యమా ఐ లవ్ యూ 

ఆకాశం పందిరికింద
నేలమీద దుప్పటి వేసి
చుక్కలను లెక్కిస్తూ
పాలపుంతలతో ఆడుకుని
అలసిసొలసి నిద్దురపోయే ఆ వెన్నెల రాత్రులు
కనులముందు తారాడుతున్నాయి ...
ఊరగుట్టకింద మామిడి తోపులో
కాయలు కోస్తుంటే తోటమాలి అదిరింపులకు
పరుగులు తీస్తే మోకాలి చిప్పలు పగిలిన
ఆ మండుటెండలు ఇంకా ఒంటిని తాకుతూనే ఉన్నాయి ...
చినుకు చినుకుతో పోటీపడుతూ ఆకాశాన్ని అందుకోవాలని
చెరువులోని చేపలు చేసే విన్యాసాలు
ఇంకా కనురెప్పలపై నాట్యం చేస్తూనే ఉన్నాయి...
గిల్లి దండాలు గిల్లి కజ్జాలు
అమ్మా నాన్నలు చేసే బడిత పూజలు
అన్నీ మరిచి మళ్ళీ వీధిలోకి మా అల్లరి అడుగులు
మనసులో ఇంకా గిలిగింతలు రేపుతూనే ఉన్నాయి
ఒక్కసారి గంతంలోకి తొంగి చూసిన మనసుకు
చిననాటి అనుభవాలు వాసంత సమీరాలై పలకరించాయి
జీవన సమరంలో అందరున్నా అనామకుడిగా మారిన నాకు
మళ్ళీ బాల్యంలోకి పరుగులు తీయాలని ఉంది