Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 31 January 2015

మనసు గుట్టు విప్పలేవా...



మనసు గుట్టు విప్పలేవా...


పూల వనంలో వసంతం
విరిసింది...
వెన్నెల నీడలో వెలుగు
కురిసింది...
దినకరుడి కిరణంలో కాంతి
మెరిసింది...
పిల్లగాలి తరంగాలలో వెచ్చని కోరిక
మెదిలింది...
పూబాలలతో మైమరిచిన నిన్ను చూసి
భావావేశం ఉబికింది...
నీ మనో సంద్రం ఏమంటోంది...
ఏం చెబుతోంది నీ అంతరంగం...
పలకరిస్తున్నాయా
ఆ పూబాలలు...
పులకరిస్తున్నాయా
ఆ పుష్పరాజాలు...
తెలుపుకున్నావా
నీ మనసు బాసలు...
నీ మనసులో ఏమిటా
గిలిగింతలు...
నీ మేనిలో ఎందుకు
అన్ని పదనిసలు...
నాతో చెప్పలేవా
మనసు గుట్టు విప్పలేవా
నీ సొగసులకు రాజునైన నేను
నీ ఊసులను
నా గుండెలో
పదిలం చేసుకోనా ...
నా హృదయం నీకు
దర్పణం కాదా
మనస్వినీ...

మనసు పయనం...



మనసు పయనం...

నాటి జ్ఞాపకాలు
తీపి గురుతులు
మధురానుభవాలు
అన్నీ గురుతుకు వచ్చాయి...
ఒక్కో దృశ్యం
కన్నుల తెరల మీద
నర్తించసాగింది...
నేనెక్కడ అలసిపోతానోనని
కలవరంతో
నేను డ్రైవ్ చేయనా
అని గోముగా
అడిగిన నీ అమాయకత్వం...
మనసును దోచే
మధురగీతాలు...
ఊహాలోకంలో
విహారం చేసే
తీయని గజల్స్
గళం కలిపిన మన మనసులు
అన్నీ మదిలో మెదిలాయి నాకు...
మన వెనుకే ఉన్న
నడి వయసు జంటను ఉడికించేందుకు
కొంటెగా నువ్వు
నా చెక్కిలిని చుంబించటం
ఆ జంట కుళ్ళుకోవటం
అన్నీ కనిపించాయి నాకు...
డ్రైవింగ్ సీటులో నువ్వు
రహదారిపై విన్యాసం
ఎలా మరిచిపోతాను నేను...
అవును నువ్వు లేకుండా
తొలిసారి సుదీర్ఘ పయనం అది...
నేలను ముద్దాడుతున్న
మంచుమేఘాలు...
మంచు దుప్పటిని చీల్చుకుంటూ
మా ప్రయాణం...
ప్రియమిత్రుడు పక్కనే ఉన్నా
ప్రయాణంలో మన పదనిసలే
తోడుగా వచ్చాయి నాకు...
నీవు చేసిన అల్లరి
నీలో రేగిన కొంటెదనం
అన్నీ పలకరిస్తూనే ఉన్నాయి నన్ను...
నీవు చెంత లేకున్నా
ఆ మంచుతెరలపై
నువ్వే కనిపించావు నాకు...
నువ్వు నాతో లేకున్నా
నాతోనే ఉన్నావనిపించింది నాకు...
నువ్వక్కడ ఉన్నా
నీ మనసు నాతోనే
ప్రయాణం చేసింది...
అందుకే ఆ అనుభవాలను
నీకే అంకితం ఇస్తున్నా
మనస్వినీ...

Thursday 29 January 2015

సూర్యుడినే నేను...



సూర్యుడినే నేను...


ఆకాశ వీధిలో
మిలమిల మెరిసే తారకా...
నీ వెలుగు జిలుగులు
మరెవ్వరికీ లేవనీ
ఎందుకే నీకు మిడిసిపాటు...
నువ్వేంటో తెలుసుకో...
నీ వెలుగేంటో
నువ్వేంటో
నిజం నీకు తెలియదా...
తళుకు బెళుకులతో
వన్నె చిన్నెలతో...
మెరిసే నీవు
ఆకాశ  వీధిలో
అరుదైన అందానివే...
నీ అందమే వినువీధికి అందం...
ప్రకృతికి నీ మెరుపులే
అరుదైన సోయగం...
నీవు లేకపోతే
ఏమీ లేదు ఇది నిజం...
ఓ తారకా
ఒక్క నిజం మరువకు
స్వయం ప్రకాశమే లేదు నీకు...
నీతో నిత్యం దోబూచులాడే
నేలవంకకే ఆ శక్తి లేదు...
నీ మెరుపులు
నీ వెలుగులు
ఆ చందమామ సొగసులు
ఏవీ లేవు...
సూర్యుడే కన్ను మూస్తే
నీ మెరుపులెక్కడ...
ప్రభాత భానుడి
వెలుగుల చలవతో
మెరిసే నీకు ఉనికి ఎక్కడ...
తారకా
సూర్యుడే లేకపోతే
నీవే లేవు...
నా ఉనికిని తమ ఉషస్సు
అని భ్రమల్లో తేలిపోయే
చాలా మందికి
నేనే వెలుగుని...
నేనే నేర్పిన విద్యను
మరిచి తామే సర్వం
అని మిడిసిపడే
చాలా మంది అమాయకులకు
నేను సూర్యుడినే కాదా
మనస్వినీ...

Wednesday 28 January 2015

అడుగుజాడలు...


అడుగుజాడలు...

ఒంటరి పయనం నాది....
ఆగని ప్రయాణం నాది....
పూలు విరిసిన దారులు....
ముళ్ళు పరచిన బాటలు...
ఇసుక తిన్నెలు....
సముద్ర తీరాలు....
అన్నింటా నా అడుగుజాడలే....
ఓసారి వెనక్కి తిరిగి చూసాను....
నేలలో బలంగా దిగి ఉన్నాయి...
నా అడుగుజాడలు...
భారమైన నా మనసులా...
పిల్లగాలులు....
ఆర్తిగా తాకుతూ ....
కడిగేస్తున్నాయి
నా పాదాలను...
కాళ్ళకు అంటిన మట్టి
గాలికి ఎగిరిపోతుంది
రాలిపడిన నా జ్ఞాపకాల్లా...
తోడుంటానని మారాం చేస్తున్న
మనసును అక్కడే వదిలేసి
ముందుకే సాగిపోయాను
నిశీధిని వెతుక్కుంటూ....
నా మనసుకు తెలియదా...
నా మనసు నన్నే వెంటాడుతుందనీ....
మనస్వినీ.....