నీ హృదయం పదిలమేనా...
పరుగులు తీస్తూనే ఉన్నాను...
కాలానికి పోటీ పడుతూ
నా పాదాలు
పరుగులు తీస్తూనే ఉన్నాయి...
రాళ్ళు రప్పలున్న దారిలో
ముళ్ళు పరిచిన మార్గంలో
రుధిర ధారలైన
నా పాదాలు
ఆగనే లేదు...
మనస్సు చెప్పిన
మార్గంలో పయనాన్ని
ఆపనే లేదు...
అలసిపోనే లేదు...
ఎదురొచ్చిన
కడలి పొంగులను
దోచుకున్నాను
నీ పయ్యెదలుగా కప్పాలని...
నీలి మేఘాలను
గుండెలో దాచుకున్నాను
నీకు మబ్బు చీర కట్టాలని...
దినకరుడి లేత రంగులను
చేతులకు అద్దుకున్నాను
నీకు తిలకం దిద్దాలని...
కరి మబ్బుల మెరుపులను
కళ్ళలో దాచుకున్నాను
నీ లేత పెదాలపై అద్దాలని...
చీకటమ్మ రంగును
పులుముకున్నాను
నీకంటికి కాటుకగా
దిద్దాలని...
నెలవంక వెలుగులను
దోసిట పట్టాను
నీ ఒంటికి గంధంలా పూయాలని....
కొలనులో కలువను
కోసుకున్నాను
నీపాదాలను పూజించాలని...
మనసులో కోటి
ఆశలను నింపుకున్నాను
నీ మనసులో కొలువు దీరాలని...
అవాంతరాలను
ధిక్కరించి
నీ చెంతకు చేరిన అడుగులు...
ఒక్కసారిగా
నిలిచిపోయాయి...
అప్పుడు తెలిసింది నాకు
నువ్వు నీ గుండెలో
నాకు సమాధి కట్టావని...
ఆ సమాధిలో నేను
నివురులా మిగిలానని...
ఆ నివురులో నిప్పే
అగ్ని శిఖలా
ప్రాణం పోసుకుంటే...
నీ హృదయం
పదిలమేనా
మనస్వినీ...
No comments:
Post a Comment