గుచ్చుకునే పువ్వులే నా కవితలు...
అల్లకల్లోలమైన
ఏకాంతమందిరం...
కలవరపాటును
అహంకారంలో దాచుకుని
చెడుపై గెలిచిన భావనల్లో మునిగి
విజయ దరహాసంతో
ఆసీనమైన నీవు...
నేనే నిజం
నేనే సత్యం
అనుకుంటూ
శయనించే వేళ
నీకు రుచించని
నా మనసు పుస్తకం పుటలు
గాలికి అలా విచ్చుకున్నాయి...
నువ్వు అబద్దమని
బిరుదాంకితం చేసినా
నువ్వు అసహ్యించుకున్నా
మనసుపుస్తకంలో
నేను దాచుకున్న పువ్వులు
వీచిన గాలి అలల్లో
తేలియాడుతూ
నీ పాదాలపై ప్రణమిల్లుతున్నాయి...
అయిష్టమయినా
అప్రయత్నంగానే
నీవు సుతారంగానే
తాకుతున్నావు
నా మదిలో భావాలను
ఒక్కో పువ్వు
గీతంలా ఆలపిస్తూ ఉంటే
నీ చెవుల్లో మంద్రమైన
సంగీతంలా ధ్వనిస్తూ ఉంటే...
కాసేపు మైమరిచిపోయిన నీవు...
జ్ఞాపకాల లోకంలో విహరిస్తూ ఉంటే...
నీలో ఎక్కడో నక్కి ఉన్న మరో రూపం
కళ్ళు తెరిచి నిన్ను జాగృతం
చేస్తోంది...
లేని ఆవేశాన్ని అరువు తెచ్చుకున్న
నీవు
ఆ పువ్వులను కాలి గోటితో
తన్నేస్తావు...
మనసు చంపుకోలేని
ఆ పువ్వులు చెల్లా చెదురైనా
మళ్ళీ ఏకమై
ఒక మనోరాగమై
పూలహారమై
నీ మెడను హత్తుకోవాలని
నీ చుట్టే తిరుగుతూ ఉన్నాయి...
అహం అడ్డు వస్తున్నా
నీ మనసు వాటికోసం
ఎంతో కొంత
ఆరాటపడుతూనే ఉంటుంది...
నా భావనల పువ్వులను గుండెకు
హత్తుకోవాలన్న
నీ కోరికకు
నువ్వే అడ్డుపడతావు...
అయినా వాటివంకే
ఆశగా చూస్తావు...
ఆ పువ్వుల్లో
విరిసిన వసంతాలూ...
కొంటె సరసాలూ...
అలుపెరుగని నిశి పోరాటాలూ
నీకు కనిపిస్తూనే ఉంటాయి...
అయినా కవితలనే
నా పువ్వులను
స్వీకరిస్తూనే తిరస్కరిస్తావు...
నా మనోపుస్తకం
మానస పుత్రికలు
ఆ పువ్వులు ...
ఆ పువ్వుల రెక్కలు
ముల్లులా గుచ్చుకుంటాయేమోనని
నీకు భయం...
ఇదే నీకు జరుగును నిత్యం
మనస్వినీ...
No comments:
Post a Comment