Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 31 October 2020

నాలోని మరో మనిషి

 

నాలోని మరో మనిషి



వృత్తి ప్రవృత్తిల మధ్య సఖ్యత కుదరలేదేమో నేనిలా కూడలిలో బొమ్మలా మారిపోయాను...

వృత్తిపరంగా అత్యంత కాఠిన్యమే నాది. ఎవరినీ నమ్మను. ప్రతిదీ అనుమానమే నాకు... కరుడుగట్టిన నేరస్థులు పోలీసు అధికారుల సాన్నిహిత్యంతో బండబారిన మనిషిలా ప్రవర్తించాను. ఏదైనా క్రైమ్ వార్త ఉంటే అది నేరం చేసినవారి కోణంలో ఆలోచించడం అలవాటైపోయింది. ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించడం, బాధితులు అనబడేవారు నేరం చేసి ఉండవచ్చు కదా అనే దృక్పథంలో  రాటుదేలిపోయాను. ఈ పంథా వృత్తిలో నా ఇమేజ్ ని బాగా పెంచేసింది.. అయితే ఇది కాసేపే.. కొంచెం సమయం చిక్కితే నాలోని మరో మనిషి రెక్కలు విప్పుకునేవాడు.. అదే నా ప్రవృత్తి.. ఆకాశంలోని మబ్బుల్లో ఆకృతులను వెతుక్కోవడం.. చల్లని చందమామ నీడలో అక్షరాలను అల్లుకోవడం.. కాగితంపై రాసుకున్న భావుకతను చూసుకుని మురిసిపోవడం నా ప్రవృత్తిగా మారిపోయింది. ఒంటరిగా ఉన్నా పదిమందిలో ఉన్నా మనసులో జనించే భావాలను నాకు నేను చెప్పుకుంటూ అందరిలో ఉన్నా ఒంటరిగా మిగిలిపోయాను. వృత్తిలో ఉన్న కాఠిన్యం ప్రవృత్తిలో సున్నితమైపోయింది. ప్రతిదీ నమ్మేసాను.ఓహో అలా జరుగుతుందా జరుగుతుందిలే ఎందుకు జరగదు జరిగి తీరుతుంది అనే నమ్మకం గుండెలో పేరుకుపోయింది.... తీయగా పలకరించిన అందరినీ నా వాళ్ళే అనుకుని మురిసిపోయాను. ప్రతిక్షణం భావప్రపంచంలో చిన్న పిల్లాడిలా ఆడుకున్నాను. ఇక్కడే వృత్తి ప్రవృత్తిల మధ్య వైరుధ్యం పెరిగిపోయిందేమో.. ఇప్పుడు వృత్తి వెనుకబడిపోయింది ప్రవృత్తి పైచేయి సాధించింది. వృత్తి అన్నం పెడితే ప్రవృత్తి దారిద్ర్యాన్ని రుచి చూపింది. వృత్తిలో నా అక్షరాలు తూటాలుగా దూసుకుపోతే ప్రవృత్తిలో నా అక్షరాలు నాగుండెనే ఛిద్రం చేస్తున్నాయి. అవే అక్షరాలు లేపనం పూస్తున్నాయి... నవ్విస్తున్నాయి కవ్విస్తున్నాయి గుండెనిండా ఏడిపిస్తున్నాయి.. ఆ అక్షరాలు గొప్పవా ఈ అక్షరాలు గొప్పవా తెలియని సందిగ్ధత గందరగోళం రేపుతోంది. ఒకటి మాత్రం నిజం వృత్తి ప్రవృత్తిల రాపిడిలో నేను ఒక అగ్నిశిఖలా మారిపోయాను

Tuesday 27 October 2020

మరణమే ఓటమి

 

మరణమే ఓటమి


నా హృదిలో స్పందనలు కొనసాగినంత కాలం

నా గొంతులో శ్వాస ఉన్నంత కాలం

ప్రతి క్షణాన్ని

వెంటాడుతూ

వేటాడుతూనే ఉంటా

విజయశిఖరాన్ని ముద్దాడాలని

నాకు తెలుసు

మరణం మాత్రమే

నాకు ఓటమి...

Wednesday 21 October 2020

నాకు నేనే ప్రత్యేకం

 

నాకు నేనే ప్రత్యేకం



నాతో నేను గడిపే ప్రతి క్షణం నాకెంతో అమూల్యం

నాతో నేను చెప్పుకునే మాట నాకో సందేశం

నాపై నేను వేసుకునే ప్రశ్న

నాకెప్పటికీ ఒక గుణపాఠం

నా పెదాలపై విరిసే చిరునవ్వు

అది అంతులేని రహస్యం

నా కనుల జారే జలపాతం

నాకు ఎప్పటికీ స్వయంకృతాపరాధం

అందుకే నేను ఎందరిలో ఉన్నా నాతో నేను ఉండాలనే ప్రయత్నిస్తా

ఎందుకంటే

నాకు నేను ఏంతో ప్రత్యేకం...

Tuesday 20 October 2020

మళ్ళీ మళ్ళీ మరణించాలని

 

మళ్ళీ మళ్ళీ మరణించాలని



ప్రతి రాత్రి నిద్రపోయే ముందు అనుకుంటా

ఈ రాత్రే చివరి రాత్రి అవుతుందేమోనని...

రాత్రికి మరణిస్తూ

ప్రతి ఉదయం పుడుతూనే ఉన్నా

మళ్ళీ మళ్ళీ మరణించాలని...

Monday 19 October 2020

కేసీఆర్ దే తప్పేమో...

 

కేసీఆర్ దే  తప్పేమో...


ఎవరో ఆవారాగాళ్ళు అంటున్నారంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఇక్కడ తిండి తిని ఇక్కడే బతుకుతూ ఇక్కడి విపత్తుపై కుళ్ళు కామెంట్లు చేస్తున్న కొందరు ఆంధ్రా  ప్రముఖులను చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది.. వాడెవడో బ్రహ్మాజీ అంట బతికేది ఇక్కడే, సంపాదనా ఇక్కడే.. హైద్రాబాద్ మునిగిపోతే కుళ్ళు జోకులేస్తున్నాడు.. తనవంతు బాధ్యతగా చేయూతనివ్వాల్సింది పోయి పడవ కొంటా అంటాడు. అంత  బలుపు ఉంటే ఓ నాలుగు పడవలు కొని హైదరాబాద్ పోలీసులకు ఇవ్వొచ్చుగా.. ఇంకోడేమో కేసీఆర్ వల్లే నగరం మునిగింది అంటున్నాడు.. ఓ గాలి మనిషేమో హైదరాబాద్ ఇప్పుడు సేఫ్ కాదని అంటున్నాడు. ప్రతి అడ్డమైనోడు హైద్రాబాద్ దుస్థితిపై మానసిక వికారం బయటపెట్టుకుంటున్నాడు...మళ్ళీ మళ్ళీ చెబుతున్నా  హైద్రాబాద్ ఈ దుస్థితికి చేరుకోడానికి ఆంధ్రా పాలకులే కారణం. అసలు 1990 ప్రారంభం నుండే నగరంలో ఆక్రమణలు ఊపందుకున్నాయి. ఓ నేదురుమల్లి, ఓ కోట్ల ఒక ఎన్ టీ ఆర్, ఓ వైయస్సార్, ఒక చంద్రబాబు... వీళ్ళ హయాంలోనే ఎక్కువగా నాలాలు, చెరువులు కబ్జాకు గురయ్యాయి. అక్రమాలపై ఏ ప్రభుత్వమూ స్పందించలేదు. పైగా రిజిస్ట్రేషన్లు కూడా చేసి ఇచ్చారు. మరి ఈ టైం లో ఘనత వహించిన మజ్లిస్ పార్టీ ఏం చేసిందబ్బా అని అడగొచ్చు... చాలా చేసింది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరింది ఇప్పటిలాగానే.. మరి కేసీఆర్ కూడా అప్పట్లో ప్రభుత్వంలో భాగంగా ఉన్నాడు కదా అంటే నిజమే.. ఏమన్నా చేసే బలం ఉందా అప్పుడు కేసీఆర్ కి.. సరే తెలంగాణా  వచ్చాక ఏమన్నా మారిందా అంటే లేదు.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. ఆక్రమణలను తొలగించటం ఎవరికీ సాధ్యం కాని పరిస్థితికి చేరుకుంది నగరం.. ఇప్పుడు ఆంధ్రా మేధావులు చేస్తున్న కామెంట్లను చూస్తుంటే కేసీఆర్ ఒక తప్పు చేసాడని ఒప్పుకోక తప్పదు. తెలంగాణా ఉద్యమసమయంలో కేసీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఆంధ్ర వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఆ ప్రాంతానికి చెందిన నాయకులపై తరచుగా విరుచుకుపడేవారు. తెలంగాణా వస్తే ఏదో ఉపద్రవం తప్పదని ఈ వర్గాలు భయాందోళనలకు గురయ్యాయి. కానీ అధికారంలోకి రాగానే కేసీఆర్ వీరందరికి పెద్ద పీట వేశారు. సినిమా రంగానికి పెద్దన్నగా ఉంటాననని హామీ ఇచ్చారు. ఇదే ఆయన తప్పేమో.. తెలంగాణా వ్యతిరేకులపై ఆయన కక్ష సాధించలేదు. అదే చేసి ఉండాల్సిందేమో.నగరం చుట్టూ అనేక పరివాహక ప్రాంతాలు, చెరువులను ఎంతమంది ఆంధ్రా పెద్దలు ఆక్రమించలేదు. సాక్షాత్తు ఆంధ్ర ముఖ్యమంత్రి ఫామ్  హౌస్ కట్టుకున్న విషయం మరిచిపోవద్దు. సినిమా ప్రముఖులు చెరువులను కబ్జా చేసిన ఉదంతాలు కాదనలేనివా.. కేసీఆర్ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం తప్పే.. అనేకమంది ఆంధ్రా ప్రముఖులు ఇక్కడ కబ్జాదారులు... వీరినీ  కేసీఆర్ టచ్ చేయలేదు ఇదీ తప్పే... చెరువుల్లో వెలసిన కట్టడాల్లో వందలాది నిర్మాణాలు ఆంధ్రా వాళ్ళవే.. వీటిని కూడా కేసీఆర్ కదపలేదు అబ్బా కేసీఆర్ ఎన్ని తప్పులు చేసాడు. అందుకే నగరం మునిగిపోవడానికి కేసీఆర్ కారణమయ్యాడు.

అందుకేనేమో హైద్రాబాద్ మునిగిపోతే వికారమైన కామెంట్లు పెడుతున్నారు.

నిజానికి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రా ముఖ్యమంత్రి ఉన్నా ఇదే పరిస్థితి ఉండేది. వంద ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షం కురిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు. ఇవన్నీ తెలిసికూడా పిచ్చికూతలు కూస్తున్న ఆంధ్రా ప్రముఖులు కొందరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడం బెటరేమో.. ఇక్కడ సామాన్యులైన ఆంధ్ర సోదరులు ఆనందంగానే ఉన్నారు. అందరం మునుగుతున్నాం అందరం తేలుతున్నాం.సాధ్యమైతే చేయూతనివ్వండి.. బాధితులకు అండగా నిలవండి. లేకపోతే నోర్మూసుకుని కూర్చోండి.  గుట్టల మీద బంగ్లాల్లో కూర్చుని కామెంట్లు చేస్తున్న వెధవలు యస్ వెధవలు అనే పదాన్నే వాడుతున్నా సొంతూరికి షిఫ్ట్  అవ్వడం మంచిది.

వాళ్ళ సినిమాలు, వాళ్ళ వ్యాపారాలు ఇక్కడ లేకపోతే మాకు వచ్చే నష్టం ఏమీ లేదు..

Sunday 18 October 2020

వేట

 

వేట


జీవితమంటే ఆట కానే కాదు

ఇది ముమ్మాటికీ ఒక వేట

ఆటలాడకు ఇక్కడ

వేటాడుతూ ఉండు

వేట ఆపేసావో

జీవితం నిన్నే వేటాడేస్తుంది

Saturday 17 October 2020

నీ పూజకు కుసుమాలు

 

నీ పూజకు కుసుమాలు



నా భావాలకు బొమ్మలు వేయలేను

ఎందుకంటే నేను చిత్రకారుడిని కాను...

తెలుగు అక్షరమాల ఉంది కాబట్టి సరిపోయింది

నా మనసుకు అక్షరరూపం ఇవ్వగలుగుతున్నా...

గుండె గుడిలో కొలువైన నీ ఆరాధనకు ఒక్కో అక్షరాన్ని పువ్వులుగా మలుచుకుంటున్నా...

నా అక్షరాలను పూదండలా  కూర్చి నీ మేడలో మాలలా అలంకరిస్తూ నీపై నాకున్న ఆర్తిని చాటుకుంటున్నా...

మనసులో వేదన జనిస్తే

అక్షర పుష్పాలను కన్నీటితో తడిపి నీ పాదపద్మములను అభిషేకిస్తున్నా...

నా అక్షరాలు ఎవరికి ఎలా కనిపించినా అవి మాత్రం నీ పూజకు విరిసిన కుసుమాలే...

అక్షరాలున్నాయి గనుక సరిపోయింది

అవే లేకపోతే నా భావాలను అదుపుచేయలేక గుండె పగిలి చచ్చిపోయేవాడినేమో

మనస్వినీ...

నువ్వే ఎందుకు కాకూడదు?

 

నువ్వే ఎందుకు కాకూడదు?



నా మనసును శ్రద్ధగా చదవాలి

నా మాటలను ఓపికగా వినాలి

నా ఆలోచనలను లోతుగా గ్రహించాలి

నన్ను తెలుసుకునేందుకు

నా అంత పైకి ఎదగాలి

నేను పడిపోతే కిందకు దిగి పలకరించాలి

నన్ను నాకోణంలో చూసి నన్ను తెలుసుకోవాలి

నాకొక నేస్తం కావాలి

మానవ మాత్రులకు ఇది సాధ్యం కాదు

దేవుడా నా నేస్తం నువ్వే ఎందుకు కాకూడదు?

Friday 16 October 2020

హైదరాబాద్ మునిగితే కేసీఆర్ ఏం చేస్తాడు?

 

హైదరాబాద్ మునిగితే కేసీఆర్ ఏం చేస్తాడు?


ఈ పోస్టు నిస్సందేహంగా సోషల్ మీడియాలోని ఆంధ్రా మేధావుల కోసమే రాస్తున్నా.. మళ్ళీ చెబుతున్నా నేను కేసీఆర్ అభిమానిని కాదు తెరాస కార్యకర్తనూ కాను. ఏదైనా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేస్తా.. ఇక విషయానికి వస్తే... హైదరాబాద్ మునిగిపోయింది, వందలాది కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ప్రజల కష్టాలు వర్ణనాతీతం. అయితే సోషల్ మీడియాలో ఆంధ్రా మేధావులు స్పందిస్తున్న తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఏమయ్యింది బంగారు తెలంగాణా అని ఒకరు, కేసీఆర్ నిద్రపోతున్నాడా అని ఒకరు, ఆంధ్రావాళ్ళని తిట్టి తెలంగాణా తెచ్చుకున్నారుగా ఇప్పుడేమయ్యింది అని మరొకడు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు.. కొందరు ఆంధ్రా మిత్రులు నగరంతో ఉన్న పాత అనుబంధాన్ని గుర్తు చేసుకుని విచారం వ్యక్తం చేస్తుంటే చాలా మంది మాత్రం తెలంగాణా ఏర్పడటంతోనే ఈ ఉపద్రవం వచ్చిందనే విధంగా విషం కక్కుతున్నారు. అసలు మీ సమస్య ఏంటి.. నగరం మునిగితే మీకు ఆనందంగా ఉందా.. లేక తెలంగాణా వచ్చిందనే అక్కసుతో ఇంకా కుతకుతలాడుతున్నారా..

అసలు హైదరాబాద్ ఇలా ఎందుకు తయ్యారయ్యిందనే విషయం తెలుసుకునే తెలివి మీకుందా..

ఇప్పుడు పొంగిన చెరువులు, నీటమునిగిన కాలనీలు తెలంగాణా వచ్చాక కొత్తగా పుట్టుకు వచ్చినవి కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే భాగ్యనగరం నాశనమయ్యింది.. ఆంధ్రా పాలకుల హయాంలోనే నగరం చుట్టూ భూములు చెరువులు ఆక్రమణలకు గురయ్యాయాయి. సిటీలోని చెరువుల్లో సైతం ప్లాట్లు వెలిసాయి. వీటికి రిజిస్ట్రేషన్లు చేసిందీ ఆంధ్రా ప్రభుత్వాలే.. ఏం అప్పుడు ఆంధ్రా పాలకులు గడ్డి పీకుతున్నారా.. అంతెందుకు రెడ్డి ముఖ్యమంత్రి అయితే రెడ్లు, కమ్మ ముఖ్యమంత్రి అయితే కమ్మవాళ్ళు నగరం చుట్టూ భూముల్ని మింగేయలేదా.. అప్పుడు లేదా పాలకులకు తెలివి.. అవును తెలంగాణ వచ్చింది అయితే మీకు ఇంకా కడుపుమంట దేనికి.. మీ వాళ్ళు ఆక్రమించుకుని లేపిన ఆకాశ సౌధాలను నేల మట్టం చేయలేదనా?  ఇప్పుడు నగరాన్ని ప్రక్షాళన చేయాలంటే సిటీ చుట్టూ అక్రమంగా వెలసిన కాలనీలను నేలమట్టం చేయాలి అది సాధ్యమా.. అప్పుడు ఎన్ని ఆంధ్రా కుటుంబాలు వీధిన పడతాయో తెలుసా మీకు. ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా అని ఏదిపడితే అది రాసుకుని శునకానందం పొందటమేనా. కొంచం కూడా సిగ్గుండక్కరలేదా.. ఎప్పుడూ పడనంత భారీ వర్షాలు పడ్డాయి ఎవరు మాత్రం ఏం చేస్తారు. కేసీఆర్ దగ్గర ఏమన్నా మంత్రదండం ఉందా. చిన్న తూఫాన్ వస్తేనే చిగురుటాకులా వణికి పోయే మీ నగరాల గురించి ఆలోచించండి ముందు. మీ జగన్, చంద్రబాబులు తూఫానులను ఆపేసి మంత్రాలేమన్నా నేర్చుకున్నారా.. సిగ్గుండాలి పిచ్చి కూతలు కూయడానికి.. ఒకటి మళ్ళీ చెబుతున్నా మా హైదరాబాద్ సర్వనాశనం అయ్యింది ఆంధ్రా పాలకుల హయాంలోనే.. ఇక్కడ చాలా మంది ఆంధ్రవాళ్లున్నారు మేమంతా కలిసే ఉన్నాం, మునిగితే అందరం మునుగుతాం తేలితే అందరం తేలుతాం.. ఎక్కడో  కూర్చుని విషం చిమ్మకండి..

Wednesday 14 October 2020

విశ్వనగరమా నీవెక్కడా?

 

విశ్వనగరమా నీవెక్కడా?


విశ్వవిఖ్యాత సుందర స్వప్నమా

ఆకాశాన్ని ముద్దాడే భవనాల సముదాయమా

విశ్వనగరమా నీవెక్కడా

పొంగుతున్న నాలాల్లో కొట్టుకుపోయావా

మునిగిన కాలనీల్లో గల్లంతయ్యావా

కుంగిన రహదారుల్లో చతికిలపడ్డావా

మిల్లీ మీటర్లు దాటి సెంటీమీటర్ ను తాకగానే

గుండెపగిలి చచ్చిపోయావా

విశ్వనగరమా నీవెక్కడా...

Monday 12 October 2020

ఆలోచన మంచిదే..

 

ఆలోచన మంచిదే..



చక్కగా ఆలోచించటం ద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. జీవితాన్ని అందంగా తీర్చి దిద్దుకోవచ్చు.. అయితే ఆలోచన చెడ్డది కూడా... అతిగా ఆలోచించడం ద్వారా మెదడు గాడి తప్పుతుంది. ఆలోచనలు సవ్యదిశను కోల్పోతాయి.. మంచి చెడుగానూ చెడు మంచిగానూ కనిపించవచ్చు.. ఫలితంగా జీవితం అస్తవ్యస్తమూ కావచ్చు. ఆలోచించు మిత్రమా కానీ అతిగా ఆలోచించకు..

ఇది నీకూ నాకూ ఇంకెవరికో పరిమితమయ్యే అంశం కాదు,ఆలోచించే ప్రతి మనిషికీ వర్తించే విషయం...

Friday 9 October 2020

మనస్విని@1000

 

మనస్విని@1000


నా మనసు క్షేత్రం నా మనసు భావాల నిలయం

నా బ్లాగ్ మనస్విని 1000  పోస్టుల మైలురాయికి చేరుకుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మూడులక్షల చేరువలో వ్యూస్ ఉన్నాయి.. ఇది గొప్పవిషయం కాకపోవచ్చు. ఎందుకంటే నేనో ప్రముఖ రచయితను కాను. పేరుమోసిన బ్లాగర్ నూ కాను. ఏదో నాకు తోచింది రాస్తుంటాను... నేను తెలుగు పండితుడిని కూడా కాదు. యాసలు, ప్రాసలు, సందులు, గొందులు నాకు తెలియవు. ఏదో తెలుగు మీడియంలో చదువుకున్నా కాబట్టి తెలుగులో రాయడం వచ్చు. అందుకే నాకు వచ్చింది రాస్తున్నా.. ఎవరినో మెప్పించడానికో, ఎవరినో కించపర్చడానికో నేను అక్షరాలను వాడుకోలేదు, నన్ను నేను తిట్టుకుని ఉండొచ్చు తప్ప ఏ ప్రయోజనం కోసమో రాసుకోలేదు, సానుభూతి అస్సలు కోరుకోలేదు, జస్ట్ మనసులో పుట్టిన ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చానంతే.. ప్రేమ కుసుమాలు, వేదనల సుడిగుండాలు, సామాజిక మంటలు ఎన్ని రాసుకున్నా ఎక్కువగా నా అక్షరాలు మధురిమలనే పలికించాయి. నా భావాలు కొందరికి నచ్చి ఉండవచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు. కొందరు నా భావాలను అభిమానిస్తే ఇంకొందరు చిన్న చూపు చూడవచ్చు. ఎవరు ఎలా తీసుకున్నా అందరూ నా అక్షరాలను చదివేవారే... అందుకే అందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా.. ఇక్కడ మరో విషయం అక్షరం కూడు పెట్టదని నాకూ తెలుసు, గతంలో ఈ విషయమై ఒక కవిత కూడా రాసుకున్నా.. అప్పట్లో ఒక సంస్థ వారు కమర్షియల్ గా నా  బ్లాగ్ నిర్వహణ చేస్తామని ప్రతిపాదించారు. నేను అది చేయలేకపోయాను. ఎందుకంటే నా మనసులోని భావాలను అక్షరరూపంలో నా మనస్వినికి చెప్పుకుంటున్నా.. (మనస్విని ఎవరు అనేది నా అక్షరాలకు దగ్గరగా ఉన్నవారికి తెలుసు, కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా)ఇంత అమూల్యమైన నా భావాలకు విలువ కట్టడానికి మనసు ఒప్పుకోలేదు.... ఏది ఏమయినా 1000 పోస్టుల మైలు రాయికి చేరుకున్నా ఇది చాలు ఈ జీవితానికి... ఇక ముందు రాయకపోవచ్చు ఇలా...

ఓ సామాన్యుడి బ్లాగ్ కు స్పందించిన మనసులకు

వందనం అభివందనం

🙏🙏🙏🙏🙏🙏🙏

ఊహాలోకం

 

ఊహాలోకం


ఊహాలోక విహారిని

కాల్పనిక జగత్తుకు రారాజుని

ఊహల్లోనే విహరిస్తా

కల్పనల్లోనే బతికేస్తా

ఎందుకంటే నా మనసు

ఊహలనే ప్రేమిస్తుంది

వాస్తవాలకంటే

ఊహలే అందంగా ఉంటాయిమరి...

Thursday 8 October 2020

భావగర్జన

 

భావగర్జన



తిరగబడుతున్న అక్షరాలకు జోలపాట పాడుతున్నా...

గర్జిస్తున్న భావాలను మనసు బోనులో బంధిస్తున్నా....

నాకు తెలుసు నా అక్షరాలు అల్లకల్లోలం చేస్తాయని...

నాకు తెలుసు నా భావాలు నాపైనే పంజా విసురుతాయని...

నాకు బాగా తెలుసు

నా భావ కుసుమాలు

నా సమాధిపై సేదతీరుతాయనీ...

Wednesday 7 October 2020

తోలుపక్షి

 

తోలుపక్షి

 

ఇదేంటీ నా అడుగుల సవ్వడికే దుమ్ము లేస్తోంది...

ఆ ఎండుటాకులు ఎందుకు  సుడిగాలిలో కలిసిపోతున్నాయి...

సగం విరిగిన ఆ కపాలం ఎందుకు రెక్కలు విచ్చిన పక్షిలా ఎగిరిపోతోంది...

ఆ కంకాళం ఎందుకు గజగజ వణుకుతూ

ఎక్కడికో పారిపోతోంది...

నాకేం అర్ధం కాక అయోమయంగా చూస్తున్నా ఇక్కడేం జరుగుతోందని...

కర్ణ కఠోర హాహాకారాలు

గుండెలదిరే ఆర్తనాదాలు ఒక్కసారన్నా వినాలనీ

దేవుడెలాగూ కనిపించడు

దయ్యాలనైనా చూడాలని

నిశి నీడల మాటున

స్మశాన వీధుల్లో శోధిస్తున్నా...

దయ్యాలున్నాయేమో

ఎందుకో నన్ను చూసి పారిపోతున్నాయనిపించింది...

ఓ చెట్టు కొమ్మకు తలకింద వేలాడుతూ బిక్కుబిక్కు మంటున్న తోలుపక్షిని అడిగా నీ నేస్తాలు దయ్యాలు ఎక్కడనీ...

నిన్ను చూడగానే అవి పారిపోయాయని బదులిచ్చింది ఆ పక్షి...

ఇదేంటీ నేనేం చేశాను అంటూ బిక్కమొహం వేసా...

నువ్వు మనిషివి కదా

ఆ దయ్యాలను మించిన వక్ర బుద్ధులు మీకున్నాయి

అందుకే ఇప్పుడు నా నేస్తాలు మనుషుల్ని చూసి దడుచుకుంటున్నాయని

కన్నీరు పెట్టుకుంది పాపం ఆ తోలుపక్షి...

విజయగర్వంతో వెనక్కి తిరిగా చిద్విలాసంగా నవ్వుకుంటూ....

Monday 5 October 2020

పోదాం చలో పై పైకి...

 

పోదాం చలో పై పైకి...


ఆకాశం అంచున అద్భుతం దాగుందట

చుక్కల పరదాల మాటున

స్వర్గలోకమున్నదంట

మతాబులా విరబూసే

మనసులే ఉన్నాయంట

నీదీ నాదీయనే తగవులే

లేని లోకమంట

పాపులే లేని

పరిశుద్ధ ఆత్మలంట

భువిలో పొందని

సౌఖ్యాల నిలయమంట

మరి మనమెందుకు ఇక్కడా

పరిశుద్ధ ఆత్మల్లారా ఏకం కండి

పోదాం చలో పై పైకి...

Saturday 3 October 2020

మౌనమై ఉండిపో

 

మౌనమై ఉండిపో

 


అలికిడి లేని భావాలకు కొత్త సవ్వడి నేర్పకు

స్వరం నింపుకున్న పలుకులను  పెదవిదాటనివ్వకు

ఎగసిపడుతున్న గుండియకు

తాండవనృత్యం నేర్పకు

మౌనమై ఉండిపో మనసా

మాటలు నేర్చిన లోకమిది...

అంతుచిక్కని గమ్యం

 

అంతుచిక్కని గమ్యం



నిశి వీధుల్లో విధి శోధనా ఇది

అలికిడి లేని తొలకరి వెలుగుల నిరీక్షణా ఇది...

ఎక్కడికి ఈ దారి తెలియని పయనం

అడుగుజాడలు ఎక్కడ జారిపోయాయో తెలియని వైనం...

అలసిన అడుగులకు కీచురాళ్ళ సాయం

ఎక్కడో తెలియని తీతువు పిట్టల గానం...

కళ్ళకు ఆనని వెండి వెన్నెల సొబగులు

రారమ్మంటూ చీకటమ్మ పిలుపులు...

ఎక్కడుంది మనసా అంతుచిక్కని గమ్యం

ఆగిపోదేమి ఈ పయనం...