Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday, 31 October 2020

నాలోని మరో మనిషి

 

నాలోని మరో మనిషి



వృత్తి ప్రవృత్తిల మధ్య సఖ్యత కుదరలేదేమో నేనిలా కూడలిలో బొమ్మలా మారిపోయాను...

వృత్తిపరంగా అత్యంత కాఠిన్యమే నాది. ఎవరినీ నమ్మను. ప్రతిదీ అనుమానమే నాకు... కరుడుగట్టిన నేరస్థులు పోలీసు అధికారుల సాన్నిహిత్యంతో బండబారిన మనిషిలా ప్రవర్తించాను. ఏదైనా క్రైమ్ వార్త ఉంటే అది నేరం చేసినవారి కోణంలో ఆలోచించడం అలవాటైపోయింది. ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించడం, బాధితులు అనబడేవారు నేరం చేసి ఉండవచ్చు కదా అనే దృక్పథంలో  రాటుదేలిపోయాను. ఈ పంథా వృత్తిలో నా ఇమేజ్ ని బాగా పెంచేసింది.. అయితే ఇది కాసేపే.. కొంచెం సమయం చిక్కితే నాలోని మరో మనిషి రెక్కలు విప్పుకునేవాడు.. అదే నా ప్రవృత్తి.. ఆకాశంలోని మబ్బుల్లో ఆకృతులను వెతుక్కోవడం.. చల్లని చందమామ నీడలో అక్షరాలను అల్లుకోవడం.. కాగితంపై రాసుకున్న భావుకతను చూసుకుని మురిసిపోవడం నా ప్రవృత్తిగా మారిపోయింది. ఒంటరిగా ఉన్నా పదిమందిలో ఉన్నా మనసులో జనించే భావాలను నాకు నేను చెప్పుకుంటూ అందరిలో ఉన్నా ఒంటరిగా మిగిలిపోయాను. వృత్తిలో ఉన్న కాఠిన్యం ప్రవృత్తిలో సున్నితమైపోయింది. ప్రతిదీ నమ్మేసాను.ఓహో అలా జరుగుతుందా జరుగుతుందిలే ఎందుకు జరగదు జరిగి తీరుతుంది అనే నమ్మకం గుండెలో పేరుకుపోయింది.... తీయగా పలకరించిన అందరినీ నా వాళ్ళే అనుకుని మురిసిపోయాను. ప్రతిక్షణం భావప్రపంచంలో చిన్న పిల్లాడిలా ఆడుకున్నాను. ఇక్కడే వృత్తి ప్రవృత్తిల మధ్య వైరుధ్యం పెరిగిపోయిందేమో.. ఇప్పుడు వృత్తి వెనుకబడిపోయింది ప్రవృత్తి పైచేయి సాధించింది. వృత్తి అన్నం పెడితే ప్రవృత్తి దారిద్ర్యాన్ని రుచి చూపింది. వృత్తిలో నా అక్షరాలు తూటాలుగా దూసుకుపోతే ప్రవృత్తిలో నా అక్షరాలు నాగుండెనే ఛిద్రం చేస్తున్నాయి. అవే అక్షరాలు లేపనం పూస్తున్నాయి... నవ్విస్తున్నాయి కవ్విస్తున్నాయి గుండెనిండా ఏడిపిస్తున్నాయి.. ఆ అక్షరాలు గొప్పవా ఈ అక్షరాలు గొప్పవా తెలియని సందిగ్ధత గందరగోళం రేపుతోంది. ఒకటి మాత్రం నిజం వృత్తి ప్రవృత్తిల రాపిడిలో నేను ఒక అగ్నిశిఖలా మారిపోయాను

No comments:

Post a Comment