మనస్విని@1000
నా మనసు క్షేత్రం నా మనసు
భావాల నిలయం
నా బ్లాగ్ మనస్విని
1000 పోస్టుల మైలురాయికి చేరుకుందని తెలియజేయడానికి
సంతోషిస్తున్నాను. మూడులక్షల చేరువలో వ్యూస్ ఉన్నాయి.. ఇది గొప్పవిషయం కాకపోవచ్చు.
ఎందుకంటే నేనో ప్రముఖ రచయితను కాను. పేరుమోసిన బ్లాగర్ నూ కాను. ఏదో నాకు తోచింది రాస్తుంటాను...
నేను తెలుగు పండితుడిని కూడా కాదు. యాసలు, ప్రాసలు, సందులు, గొందులు నాకు తెలియవు.
ఏదో తెలుగు మీడియంలో చదువుకున్నా కాబట్టి తెలుగులో రాయడం వచ్చు. అందుకే నాకు వచ్చింది
రాస్తున్నా.. ఎవరినో మెప్పించడానికో, ఎవరినో కించపర్చడానికో నేను అక్షరాలను వాడుకోలేదు,
నన్ను నేను తిట్టుకుని ఉండొచ్చు తప్ప ఏ ప్రయోజనం కోసమో రాసుకోలేదు, సానుభూతి అస్సలు
కోరుకోలేదు, జస్ట్ మనసులో పుట్టిన ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చానంతే.. ప్రేమ కుసుమాలు,
వేదనల సుడిగుండాలు, సామాజిక మంటలు ఎన్ని రాసుకున్నా ఎక్కువగా నా అక్షరాలు మధురిమలనే
పలికించాయి. నా భావాలు కొందరికి నచ్చి ఉండవచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు. కొందరు
నా భావాలను అభిమానిస్తే ఇంకొందరు చిన్న చూపు చూడవచ్చు. ఎవరు ఎలా తీసుకున్నా అందరూ నా
అక్షరాలను చదివేవారే... అందుకే అందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా.. ఇక్కడ మరో విషయం
అక్షరం కూడు పెట్టదని నాకూ తెలుసు, గతంలో ఈ విషయమై ఒక కవిత కూడా రాసుకున్నా.. అప్పట్లో
ఒక సంస్థ వారు కమర్షియల్ గా నా బ్లాగ్ నిర్వహణ చేస్తామని ప్రతిపాదించారు. నేను అది చేయలేకపోయాను.
ఎందుకంటే నా మనసులోని భావాలను అక్షరరూపంలో నా మనస్వినికి చెప్పుకుంటున్నా.. (మనస్విని
ఎవరు అనేది నా అక్షరాలకు దగ్గరగా ఉన్నవారికి తెలుసు, కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం
లేదనుకుంటా)ఇంత అమూల్యమైన నా భావాలకు విలువ కట్టడానికి మనసు ఒప్పుకోలేదు.... ఏది ఏమయినా
1000 పోస్టుల మైలు రాయికి చేరుకున్నా ఇది చాలు ఈ జీవితానికి... ఇక ముందు రాయకపోవచ్చు
ఇలా...
ఓ సామాన్యుడి బ్లాగ్ కు
స్పందించిన మనసులకు
వందనం అభివందనం
🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment