Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 17 July 2022

పిచ్చివాడినైతే ఎంతబాగుండేది

 

పిచ్చివాడినైతే ఎంతబాగుండేది

కన్నుల నుంచి జారి పడిన స్వప్నాలను ఏరుకోలేను...

కనురెప్పల లోగిలిలో

మరో స్వప్నం నాటుకోలేను...

మోడుబారిన మనోవనంలో మరో అంకురం కోసం ఆరాటపడలేను...

ముళ్లబాట నాదారిలో

పూరెమ్మలు జల్లుకోలేను...

చీకటి పయనంలో

చిరుదీపమై వెలగలేను...

ఎగసిపడే హృదయానికి మత్తుమందు ఇవ్వలేను...

ఎంతబాగుండేది

నేను గతాన్ని పూర్తిగా మరిచిపోతే...

మాయామనుషుల లోకంలో అన్నీ మరిచి

పిచ్చివాడిగా మిగిలిపోతే ఎంత బాగుండేది...

Sunday 10 July 2022

ప్రపంచమా ఉలిక్కిపడు

 

ప్రపంచమా ఉలిక్కిపడు

తిరుగుబాటు ఒక స్వప్నమనీ

ప్రజాగ్రహం ఇక రానే రాదనీ

విప్లవం పుస్తకాలకే పరిమితమనీ

వ్యక్తిపూజ శిరోధార్యమని

మత్తులోపడి మునిగిపోయిన యువతరమా ఉలిక్కిపడు

లంకేయుల సమరనాదం ప్రపంచాన్ని వణికిస్తోంది

కడుపు మండితే

జెండాలు ఎజెండాలు లేకున్నా తిరుగుబాటు తప్పదని పిడికిలి బిగిస్తోంది

ఏ నాయకుడు లేకున్నా తనే నాయకుడై నిలుస్తోంది

ఏ జెండా ఎగురకున్నా

లంకేషుడి జెండా తలదించుకున్నది

లంకేయుల స్పూర్తి

జగతికి దీపమై వెలుగుతోంది...

నిశిని జయించిన శశిని

నిశిని జయించిన శశిని

నన్ను నేను ప్రేమించినంత కాలం...

నాకు నేను నచ్చినంత కాలం...

నా నడత మీద నాకు నమ్మకం ఉన్నంత కాలం...

నా ప్రశాంతతను భగ్నం చేసే దమ్ము ఎవరికీ...

సదా చిరునవ్వులు చిందిస్తూనే ఉంటా

నిశిని జయించే శశిలా...


Tuesday 5 July 2022

సమయాన్ని దోచుకుంటా

 

సమయాన్ని దోచుకుంటా



ఓ సమయమా

నువ్వెంత వేగంగా పయనించినా

ఎన్ని ఎత్తు పల్లాలు రుచి చూపినా

జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పినా

ఎన్ని ముళ్ళు గుండెలో గుచ్చినా

నీనుంచి అప్పుడప్పుడూ

మధురక్షణాలు దోచుకుంటూనే ఉంటా

నీ గాంభీర్యానికి చిరునవ్వులు అద్దుతూనే ఉంటా

నీ వేగానికి కళ్లెం వేస్తూనే ఉంటా

ఎందుకంటే నేను ఆనందాల దొంగను

నిన్ను కొల్లగొడుతూనే ఉంటా...

Tuesday 21 June 2022

పుష్ప రాజసం

 

పుష్ప రాజసం


పుష్ప విలాపమా

పుష్ప విలాసమా

ఏదైతేనేమి

వానదెబ్బకు రాలి కిందపడినా

చెదిరిపోలేదు పుష్ప రాజసం...

వాడిపోలేదు దాని సోయగం

(నా తోటలో వర్షానికి కిందపడిన పువ్వులను ఇలా మొబైల్ లో క్లిక్ చేసా )

Monday 20 June 2022

భ్రమరాన్ని కాను

 

భ్రమరాన్ని కాను



భ్రమరాన్ని కాను

విరిసిన ప్రతి పువ్వునూ కొరుకోను...

పోకిరి మేఘాన్ని కానే కాను

ఎక్కడ పడితే అక్కడ కురిసిపోను...

నన్ను నమ్మి నన్ను మెచ్చినది కాగితం పువ్వైనా

పరిమళాలు అద్దకుండా ఉండలేను...

ఆర్తిగా చేతులు చాచి ఆప్యాయ్యంగా చూసిన పుడమిపై

చినుకులా రాలకుండా ఉండలేను...

Saturday 4 June 2022

నా మౌనం...

 

నా మౌనం...


 

నిన్ను ఓడించాలంటే

కుట్రలూ కుతంత్రాలు

చేయాల్సిన అవసరం లేదు...

అబద్ధాలతో చందమామ కథలు చెప్పాల్సిన పనిలేదు...

సానుభూతికోసం రానే రాని కన్నీటి బొట్టును రాల్చాల్సిన ఖర్మ పట్టనేలేదు...

ఎందుకు పోరాడాలి నీతో

నా మౌనం నిన్ను ప్రతి క్షణం

ఓడిస్తూనే ఉంటే...

Saturday 28 May 2022

సైకత శిల్పాన్ని కాదు

 

సైకత శిల్పాన్ని కాదు



ఓ పిచ్చి కెరటమా

అలవోకగా నన్ను అల్లుకుని

ముంచిపోదామని అనుకున్నావేమో...

మునిగేందుకు శిలజాన్ని కాదు

కరిగేందుకు సైకత శిల్పాన్ని కాదు

ఆ సముద్రమంత లోతును మనసులో నింపుకున్న నేను

అవసరమైతే ఒక సునామినే...

నా ఒక్క అడుగు చాలదా నిన్ను

నా పాదాక్రాంతం చేసేందుకు...

Wednesday 25 May 2022

అంకురం

 

అంకురం


వీలు కుదిరితే

వెనకకు పయనించాలని ఉంది...

కాలమనే కోటను చేధించి నా గతాన్ని తస్కరించాలని ఉంది

కనురెప్పల నుంచి జారిపడిన స్వప్నాలను

మళ్ళీ మనసునిండా దాచుకోవాలని ఉంది...

కాల గ్రంధంలో ఒక్కో పుటను తనిఖీ చేసి

మధురజ్ఞాపకాలను

సంగ్రహించాలని ఉంది...

వీలు కుదిరితే కాలాన్ని నిలిపేసి

నవజీవన అంకురానికి ప్రాణం పోయాలని ఉంది...

Saturday 21 May 2022

ఉప్పెన

 

ఉప్పెన



వసంతం కురుస్తోంది

కురిసిపోనీ అనుకున్నా

ఉప్పెన ముంచుకొచ్చిందని

మునిగేదాకా తెలుసుకోలేకపోయా...

రాజమర్గమే కదా అని

నడక సాగిస్తూనే ఉన్నా

అడుగులు తడబడేదాకా

దారితప్పిన బాటసారినని తెలుసుకోలేకపోయా..

Tuesday 10 May 2022

ఛల్కా హై జామ్... జిందగీకే నామ్...

 

ఛల్కా హై జామ్...

జిందగీకే నామ్...

బహారో ఫూల్ బర్సావో... మేరా మహబూబ్ ఆయాహయ్... మహమ్మద్ రఫీ తీయని స్వరం నుంచి మంద్రంగా జాలువారుతున్న గీతం.. టీవి తెరపై అరమోడ్పు కన్నులతో మత్తును వెదజల్లుతున్న వైజయంతీమాల ముగ్ధ  మనోహర రూపం... మా పెదాలను తాకుతున్న మధువు ను మించిన మైకం ఆ కన్నులలో నిండి ఉన్న అనుభూతి... అంతలోనే అదే గాత్రం మధురసాలను వీడి విషాదం కురిపించింది... మనసున్న మనిషి భగ్న హృదయుడే కదా ఖుష్ రహే తూ సదా యే దువా హై మేరీ అంటూ మోసం చేసిన మనసునే దీవిస్తూ రెండో పెగ్గు అందుకున్నా భారమైన మనసును తేలిక పరుస్తూ... అంతలోనే ఓ బంగరు రంగుల చిలకా అంటూ బాలు గారి స్వరం వాతావరణంలో గిలిగింతలు నింపింది.. మేము ఊరుకుంటామా ఓ దమ్ము వెలిగించి శృతి కలిపాం ఎవరేమనుకున్నా చల్తా అనుకుంటూ... మధ్యాహ్నం పన్నెండు గంటలకు మొదలైన మా మహేఫిల్ సాయంత్రం దాకా సాగింది....మా Anil Kumar వివాహమై ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక అపురూప సన్నివేశానికి ప్రాణం పోసాం.. మధ్య మధ్యలో రాజకీయాలు, చిన్న నాటి కహానీలు, యవ్వన ఫాంటసీలు ఒకటేమిటి మొత్తం జీవితం కనులముందు కదలాడింది మా కబుర్లలో.. అంతలోనే మా పోలీస్ ఫ్రెండ్ నవీన్ కుమార్ గుర్తుకు వచ్చాడు. ఫోన్ చేయగానే వచ్చి వాలాడు తన బిజీ షెడ్యూల్ ఉన్నా... పనిలో పని యాపిల్ ఫ్లేవర్ హుక్కా కూడా లాగించా... ఒక ఆత్మీయ ఘట్టానికి ప్రాణం పోసిన అనిల్ కి థాంక్యూ తో బన్తా హై.. షుక్రియా దోస్త్ జీవితాన్ని మరో మారు పరిచయం చేసినందుకు 🙏

Tuesday 19 April 2022

గులాబీ ముసుగులు

 

గులాబీ ముసుగులు


హృదయసీమలో మొలకలు వేసిన ప్రశ్నలు

విచ్చుకత్తులై నాట్యమాడుతున్నాయ్

ఎన్నటికీ దొరకని నగ్న సమాధానాలను

శోధిస్తూ...

గాయం చేసిన ముళ్ళు

గులాబీ ముసుగులతో నటనలాడుతున్నాయ్

లేని పరిమళాలను వెదజల్లుతూ...

Friday 8 April 2022

సర్వం నేను

సర్వం నేను


నిశి రాత్రిని నేను

నిశిలో మెరిసే శశినీ నేను...

జాలువారే వెన్నెల నేను

పసిడివెన్నెలను ఈదే చకోరం నేను...

నులి వెచ్చని ఉషోదయం నేను

సెగలు పుట్టించే వేసవి తాపం నేను...

కురిసే వానను నేను

మురిసే మట్టివాసనను నేను...

సమస్త విశ్వానికి ఉనికిని నేను

నేను కన్ను మూస్తే

                                       ప్రకృతి సర్వం శూన్యం... 

Monday 4 April 2022

ఎక్కడ తప్పిపోయిందో...

 

ఎక్కడ తప్పిపోయిందో...


దోసిట పట్టి

గుండెలో దాచుకుందామని అనుకున్నా

ఎలా జారిందో

ఎక్కడ దాగుందో...

నిశి వీధిలో దారి తప్పిందా

తారాలోకంలో చుక్కల పంచన చేరిందా...

వాడిన వసంతపు తోటలో కనులు తెరిచిన పువ్వుపై

స్వాతి ముత్యమై మెరిసిందా...

నానుంచి దూరమవ్వాలనే

ఆతృతలో పుడమివైపు జారిపడిందా...

నేలలోకి ఇంకిపోయి

నవ అంకురానికి జీవం పోస్తోందా...

తడియారుతున్న గుండెకు లేపనం అద్దాలని

కనుల కనుమల్లో అపురూపంగా దాచుకున్నా

ఎక్కడ తప్పిపోయిందో

నా కన్నీటి చుక్క...

Sunday 20 March 2022

ఎర్రచుక్కల నీడలో

 

ఎర్రచుక్కల నీడలో


అదిగో ఆ కీకారణ్యంలో

ఏదో పొలికేక వినిపిస్తోంది చూడు

రాజ్యం  ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది ఎందుకో...

తమ ఇజమే శాసనమని పిచ్చిరంగుల జెండాలు పట్టిన ఆ చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి ఎందుకో...

అదిగో చూడు

జనారణ్యంలో పుస్తకం పట్టిన ఆ యువహృదయం

చరిత్రను తిరగదోడుతోంది

పక్కదారి పట్టిన నేటి చరిత్ర అక్షరాలు జారిపడుతున్నాయి ఎందుకో...

అదిగదిగో చూడు పల్లెసీమల్లో

పడుచుపాటలు ఇంకా తూటాలు పేలుస్తూనే ఉన్నాయి

కరుడుగట్టిన ఆ గుండెల్లో ప్రకంపనలు ఎందుకో...

ప్రపంచమా తెలుసుకో

నువ్వెన్ని ఇజాలు రుచి చూసినా

ఎన్ని జెండాలు మోసినా

కమ్యూనిజం చచ్చిపోదు

ఎర్రజెండా అంతరించదు

పుడమిని చీల్చుకుని ఊపిరిపీల్చే మొలకలా

అరుణపతాకం

మళ్ళీ మళ్ళీ ఎగురుతూనే ఉంటుంది

ఎర్ర చుక్కల నీడలో...

Wednesday 9 March 2022

శిఖరంలా నిలిచియున్నా

 

శిఖరంలా నిలిచియున్నా


నరనరానా నయవంచన నింపుకున్న స్నేహం చేసిన మోసాలను చూస్తున్నా...

తట్టు తగిలి కింద పడితే పళ్ళికిలించి నవ్విన లోకాన్ని చూస్తున్నా...

చెదలు పట్టిన మనసులో పుట్టిన వికృత భావాలకు

కుప్పకూలుతున్న

సంస్కారాన్ని చూస్తున్నా...

గెలిచామని భ్రమిస్తూ పాతాళానికి పడిపోయిన

వాడినీ వీడినీ

నిన్నూ చూస్తున్నా

నేను మాత్రం శిఖరంలా నిలిచియున్నా...

Friday 4 March 2022

కథలన్నీ చెరిపేస్తా

కథలన్నీ చెరిపేస్తా


మనసు సంద్రంలో ఎన్ని సునామీలైనా చెలరేగనీ

ఎగిసిపడే అలలపై నడకలు నేర్చుకుంటా...

నా కన్నులు ఎన్ని కథలైనా చెప్పనీ

చిరునవ్వుల మెరుపులతో

ఆ కథలన్నీ చెరిపేస్తా...


Thursday 3 March 2022

మెల్లమెల్లగా కరిగిపో...

 

మెల్లమెల్లగా కరిగిపో...


అసహనమై నువ్వు అటూ ఇటూ కదులుతున్నావేమో

హృదయసీమలో ప్రకంపనలు నమోదవుతున్నాయి..

నా హృదయం నీకు బందీఖానా కాదు

అది నీ అందమైన ఆషియానా...

గుండె గోడలను చీల్చకు

హృదయ మైదానం ధ్వంసం చేయకు..

కాస్త పదిలం ప్రియతమా

నా హృదయం సున్నితం

సడీ చప్పుడు చేయకుండా

మెల్లమెల్లగా కరిగిపో...

నువ్వు చేసే అలజడికి

ప్రకంపనల తీవ్రత కాసింత పెరిగినా నేనే లేకుండా పోతాను...

Thursday 17 February 2022

చుక్కేసి పడుకో మనసా

 

చుక్కేసి పడుకో మనసా


నిగ్గదీసి అడిగి నిలదీయాలని ఉంది...

అబద్ధాలను నిప్పుతో కడిగేయాలని ఉంది...

నివురులో సమాధి అయిన నిజాలను నిప్పులా మండించాలని ఉంది...

మాటల మతలబుల చిక్కుముడి విప్పేయాలని ఉంది...

చిరునవ్వుల మాటున దాగిన విషపుష్పాలను నలిపేయాలని ఉంది...

గడిచిన కాలం చేసిన గాయాలను వెలికి తీయాలని ఉంది...

పువ్వులా పరిమళించే నా అక్షరాలను అగ్ని శిఖలుగా సంధించాలని ఉంది...

శాంతి మంత్రం పఠించు

గౌస్ భాయ్

మందేసిన వేళలో అక్షరాలను నిద్రపుచ్చడమే మేలు...

చుక్కేసి కైపెక్కి

ముసుగేసి పడుకో మనసా...

Saturday 12 February 2022

మళ్ళీ ఉదయిస్తా

 

మళ్ళీ ఉదయిస్తా

సాయం సంధ్య వేళలో

వెండివెలుగులు అద్దుకుంటున్నా

పిల్లగాలులతో పరాచికాలాడుతూ...

నాకు తెలుసు

ఈ వెలుగులు శాశ్వతం కాదనీ

నిశికన్య తన కురులతో

నన్ను కమ్ముకుంటుందనీ...

చీకటిపై కొత్త రంగులు

చిమ్ముతూ

సరికొత్త ఉదయాన్నై

మళ్ళీ మళ్ళీ ప్రభవిస్తూనే ఉంటా

నిన్నలో గతాన్ని సమాధి చేస్తూ

రేపటికి కొత్త ఊపిరి పోస్తూ...

Wednesday 9 February 2022

కురిసిపోనీ

 

కురిసిపోనీ

కన్నుల కొలనులో

సునామీ వస్తే రానీ

కనురెప్పల ఆనకట్టలు

తెగితే తెగిపోనీ

పొంగితే పొంగిపోనీ

కురిస్తే కురిసిపోనీ

అయితే

మనసు సంద్రంలో

కాస్త తడియారకుండా చూసుకో

ఎవరికి తెలుసు

రేపు కంటి కలువలు

ఒక చుక్కనీటి కోసం

అలమటించే ఘడియ పలకరిస్తుందేమో....

నవ్వుతుంది నవ్విస్తుంది

 

నవ్వుతుంది నవ్విస్తుంది

 


కనురెప్పల మాటున

దాచుకున్న నీటిపొరలను ఇట్టే పట్టేస్తుంది...

క్షణం క్షణం నా మనసును స్కానింగ్

చేసేస్తుంది...

నా అంతరంగాన్ని క్షుణ్ణంగా చదివేస్తుంది...

నేను ముభావంగా కూర్చుని ఉంటే

ఒక అలలా చుట్టముట్టేస్తుంది...

క్యా హోరా గౌస్ భాయ్ షేక్ అంటూ నా ఆలోచనలకు బ్రేక్ వేసేస్తుంది...

నవ్వుతుంది

నవ్విస్తుంది.

నానా అల్లరి చేస్తుంది

అమ్మలా లాలిస్తుంది

కొండంత భరోసా ఇస్తుంది...

అవును

నా చిట్టితల్లి

నాకు ఒక ధైర్యమై నిలుస్తోంది...

Tuesday 8 February 2022

ఏం చేయను...

 

ఏం చేయను...



మనసులో మండుతున్న మంటలను అక్షరాలుగా సంధించాలని అనుకుంటాను గానీ

శిథిల హృదయంలో ఏ మూలనో మిగిలి ఉన్న అనురాగం అంటుకుని

ఆ అక్షరాలు పుష్పాలై పరిమళిస్తున్నాయి

ఏం చేయను...

మనసును ముక్కలు చేసిన మనసుపై సమరం చేయానుకుంటాను గానీ

చెల్లాచెదురైన మనసు ముక్కలు మూకుమ్మడిగా

ఆ మనసునే ఆరాధిస్తున్నాయి

ఏం చేయను....

Sunday 6 February 2022

పదిలం సుమా

 

పదిలం సుమా

కొంచెం కష్టమే సుమా

మనసులో మమతలు ఏ మూలనైనా ఇంకా మిగిలే ఉంటే

కాలం గీసిన చిత్రంలో నువ్వూ నేనూ విరబూసిన నవ్వులు ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటాయి...

కొంచెం భారంగానే ఉంటుంది

జ్ఞాపకం ఏదైనా మిగిలి ఉంటే

నువ్వూ నేను నడిచిన బాటకు అలవాటు పడిన పాదాలు నీ కొత్త పయనంలో కాస్త తడబడుతూనే ఉంటాయి...

కొంచెం కలవరం ఉంటుంది

వాస్తవాలు చెప్పుకోవాలంటే

అంతరాత్మ మనసు పొరల్లో మౌనంగా రోదిస్తూనే ఉంటుంది...

జాగ్రత్త సుమా

పరిస్థితులను విస్మరించే గుణమున్న నా మనసు ఇంకా నీ పదిలమే కోరుతోంది...

Tuesday 25 January 2022

పీడకల....

 

పీడకల....



అదేంటో సడెన్ గా మంచోడినైపోయా...

నాలోని అవలక్షణాలకు మంచిరంగు ముసుగేసుకున్నా... నా తప్పులన్నీ ఒప్పులుగా కనిపిస్తున్నాయి... కడిగిన ముత్యంలా మెరిసిపోతున్నా....

మనసులో గొప్ప గొప్ప భావాలు పుట్టుకువస్తున్నాయి...

ఉన్నట్టుండి ఈ సమాజాన్ని ఉద్ధరించి పారేయాలనే మహోన్నత ఆలోచన నన్ను ఉక్కిరిబిక్కిరి చేయడం మెదలు పెట్టింది.. మనసు ఉబలాటపడుతోంది మంచితనం అందరికీ పంచేయాలని... ఏం చేయాలి ఏం చేయాలి మనసు ఆగటం లేదు నేను మంచోడిననే విషయం అందరికీ చెప్పేయాలి..అవునూ సోషల్ మీడియా ఉందిగా... ట్విట్టర్ లో మనల్ని ఎవడూ దేఖడు... మరి ఇన్ స్ట్రాగ్రామ్... అక్కడ యూత్ హవా మనల్ని ఎవడూ చూడడు... అన్ని అవస్థలకు ఒకటే మందు మన ఫేస్ బుక్ ఉందిగా... అంతే నాలోని మంచితనం నిద్ర లేచింది... పోస్టుల మీద పోస్టులు స్టార్ట్....

మంచే చేయండి మంచి జరుగుతుందని చెప్పడం మొదలు పెట్టా నాలో మంచి ఎక్కడన్నా ఉందా అనేది వేరే విషయం... నేనెవరినీ మోసం చేయలేదు నేను మంచోడిని గనుక మోసపోయా అని మొసలి కన్నీరు కార్చా  నేను చేసిన మోసాలు అటకమీదకు విసిరేస్తూ... పనిలో పనిగా గూగుల్ లో సెర్చ్ చేసి మరీ బరువైన కొటేషన్స్ పోస్ట్ చేసా.... అబ్బబ్బా ఏమి లైక్స్... సూపర్ కామెంట్స్... అందరూ ఫిదా అయిపోయారు నా మంచితనం పోస్టులకు... పైగా టన్నుల కొద్ది సానుభూతి కూడా వర్షంలా తడిపేస్తోంది... తృప్తిగా అనిపించి మరో మంచిపోస్టు రాయాలని రెడీ అవుతున్నా.... అంతలోనే గావుకేక పెట్టి నిద్రలోనుంచి లేచి కూర్చున్నా.... బాబోయ్ ఇంత భయానక పీడకల వచ్చిందేమిటీ అని వణుకుతూ నన్ను నేను తడిమి చూసుకున్నా... నో డౌట్ నేనే... నేను మంచోడిలా మారింది కలలో మాత్రమే...

బతికిపోయాను....