Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 24 February 2021

నా మౌనం

 

నా మౌనం



నా మౌనం ఓటమి కాదు

నా నిశబ్ధం విషాదం కాదు

నా మౌనం ఒక శంఖారావం

నా నిశబ్ధం వేయి గొంతుకల సింహానాదం

నేనెప్పుడూ మౌనంగా లేనేలేను

నాలో నేను గర్జిస్తూనే ఉంటాను

మౌనమనే ముసుగు ధరిస్తూ...

Monday 15 February 2021

అల్లరి దయ్యం

 

అల్లరి దయ్యం

అబ్బో మామూలు అల్లరి కాదు

తను మాంచి మూడ్ లో ఉందంటే చాలు.. ఇంట్లో అల్లరే అల్లరి...

ఊహించని సెటైర్లతో దాడి చేస్తుంది

నేనేదో సెల్ఫీకి ట్రై చేస్తుంటే  మధ్యలో దూరడం తనకు మహా సరదా

ఇక నా వయస్సు మీద జోకులేయడం తనకు ఎంతో ఇష్టం...

ఎంత అల్లరి అంటే మా పిల్లలు కూడా అంత అల్లరి చేయరు

ఇక వాళ్ళతో కలిసిందంటే

ఇల్లు పీకి పందిరేయేడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది

Wwf చూస్తున్న అనుభూతి కలుగుతుంది

ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో

ఎందుకు కొట్టుకుంటారో తెలియదు కానీ యుద్ధం మాత్రం ఖాయం...

నవ్వుతూ తుళ్ళుతూ

ఆడుతూ పాడుతూ ఇంటిని నందనవనం చేసే తనకు మూడ్ బాగా లేకపోతే

వామ్మో ఊహించడం కష్టం

కారణం ఎవరైనా బాంబులు కురిసేది నాపైనే

అప్పుడు ఏ గోడ చాటునో

ఏ మంచం కిందనో తలదాచుకుంటూ

బిక్కుబిక్కుమని కాలం గడిపేస్తా..

ఏదైతేనేం

ఈరోజు నా అల్లరి దయ్యం

పుట్టినరోజు

ప్రియమైన దయ్యానికి

జన్మదిన శుభాకాంక్షలు

HAPPY BIRTHDAY DEAR

 

HAPPY BIRTHDAY DEAR

❤❤❤❤



నువ్వు నాకోసమే జన్మించావని అనిపిస్తుంది అప్పుడప్పుడూ...

నిన్ను కలిసిన తొలిక్షణం

నేను మరోసారి ప్రాణం పోసుకున్నానేమో...

ఎందుకంటే నిన్ను చూసినప్పుడల్లా

నీలో నేనే కనిపిస్తున్నా...

నీ చిరునవ్వులో పువ్వులా నవ్వుతూ

నీ కోపంలో నన్ను నేను పునీతం చేసుకుంటూ

నాలో నేను లేకుండా

నీలోనే కలిసిపోయాగా...

ఇప్పుడు నేను నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలా

నాకు నేను చెప్పుకోవాలా...

మరీ ఉడుక్కోకు సుమా...

చెప్పేస్తా నీకే

నీ విజయదరహాస చంద్రికలు

నిండా నూరేళ్లు కాంతులీనాలని మనసారా కోరుకుంటూ

జన్మదిన శుభాకాంక్షలు

మనస్వినీ....

Monday 8 February 2021

నిశిశోధన

 

నిశిశోధన


రాతిరి దట్టంగా అలుముకుందేమో

బాగా పొద్దుపోయినట్టే ఉంది...

ఆకాశ వీధిలో నక్షత్రాలు ఒళ్ళువిరుచుకుంటున్నాయి...

వెన్నెల కురిపించే చందమామ మబ్బుల చాటుకు జారాడు కాసింత సేద తీరుదామని...

ప్రకృతి సమస్తం బడలికగా

కనులు మూసుకున్నట్టు ఉంది...

నిద్రకు మెలకువకు మధ్యలో కొట్టుమిట్టాడుతున్న క్షణంలో

నా కను రెప్పలు భారమై

మగత ఆవరించిన వేళ...

మనసులో ఏదో చిన్న కదలిక

మెదడు నుంచి మనసుకో

మనసునుంచి మెదడుకో

ఏదో సంకేతం అందిన ఘడియ...

మనసు పొరపై ఏదో తెలియని భావపుష్పం చిగురించింది...

అందంగా అమరిన ఆ భావానికి అక్షరరూపమిచ్చి

మనసుపుస్తకంలో దాచుకుందామని అనుకున్నా..

ఏమయ్యిందో ఏమో

మనసును నిద్ర జయించింది

నా భావపుష్పం చీకట్లో

జారిపోయింది...

తెల్లవారు వేళ మనసులోకి తొంగి చూస్తే

ఆ భావం కనిపించనే లేదు

మరి అక్షరమాల ఎలా కట్టను...

రేయిలో చిగురించి

చీకటి తెరల్లో కలిసిపోయే

నా భావపుష్పాలను

ప్రతి ఉదయం వెతుకుతూనే ఉంటాను

మనస్వినీ...