నిశిశోధన
రాతిరి దట్టంగా అలుముకుందేమో
బాగా పొద్దుపోయినట్టే ఉంది...
ఆకాశ వీధిలో నక్షత్రాలు
ఒళ్ళువిరుచుకుంటున్నాయి...
వెన్నెల కురిపించే చందమామ
మబ్బుల చాటుకు జారాడు కాసింత సేద తీరుదామని...
ప్రకృతి సమస్తం బడలికగా
కనులు మూసుకున్నట్టు ఉంది...
నిద్రకు మెలకువకు మధ్యలో
కొట్టుమిట్టాడుతున్న క్షణంలో
నా కను రెప్పలు భారమై
మగత ఆవరించిన వేళ...
మనసులో ఏదో చిన్న కదలిక
మెదడు నుంచి మనసుకో
మనసునుంచి మెదడుకో
ఏదో సంకేతం అందిన ఘడియ...
మనసు పొరపై ఏదో తెలియని
భావపుష్పం చిగురించింది...
అందంగా అమరిన ఆ భావానికి
అక్షరరూపమిచ్చి
మనసుపుస్తకంలో దాచుకుందామని
అనుకున్నా..
ఏమయ్యిందో ఏమో
మనసును నిద్ర జయించింది
నా భావపుష్పం చీకట్లో
జారిపోయింది...
తెల్లవారు వేళ మనసులోకి
తొంగి చూస్తే
ఆ భావం కనిపించనే లేదు
మరి అక్షరమాల ఎలా కట్టను...
రేయిలో చిగురించి
చీకటి తెరల్లో కలిసిపోయే
నా భావపుష్పాలను
ప్రతి ఉదయం వెతుకుతూనే
ఉంటాను
మనస్వినీ...
No comments:
Post a Comment