Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 15 June 2021

ఓ మహర్షీ...

ఓ మహర్షీ...



ఏది నువ్వు స్వప్నించిన లోకం

ఎక్కడ కరిగిపోయింది మరో ప్రపంచం

ఏ భూమిలో కూరుకుపోయింది

నీ జగన్నాధ రథచక్రం

ఎందుకు మూగబోయింది

నీ విప్లవశంఖారావం

ఎందుకు మసకబారింది

నీ అరుణపతాకం

ఎందుకు గడ్డకట్టింది ఇక్కడ నీ యువతరం రుధిరం

కొంతమంది అన్నావ్

ఇక్కడ పుట్టుకువస్తోంది

అంతా వృద్ధతరం

ఏమయ్యారు నీ ముందు యుగం దూతలు

అదిగో చూడు దేశంకోసం ధర్మంకోసం చేతులుకట్టుకు కూర్చుంది నీ నవతరం

ఓ మహర్షీ

ఇంకెక్కడుంది

నీ మహాప్రస్థానం....


Tuesday 8 June 2021

పిచ్చిమారాజునై

 

పిచ్చిమారాజునై



టైమ్ మెషిన్ ఉంటే బావుండనే అత్యాశ నాకు లేదు...

కాలాన్ని వెనక్కి తిప్పి బాల్యాన్ని చేరుకోవాలన్న కోరికాలేదు

నా బాల్యం నరకప్రాయమే గనుక...

కాసింత మాత్రమే వెనక్కుపోయి మళ్ళీ యవ్వన రసాలను సేవించాలనీ లేదు

అప్పుడు తాగినదంతా

కషాయమే గనుక...

కాలాన్ని స్థంభించి

ఇక్కడే ఇలాగే ఉండిపోవాలనీ లేదు

నా మనసు వేదనను తట్టుకోలేను గనుక...

అవకాశమే ఉంటే

సాధ్యమే అయితే

నా మెదడులోని మెమొరీ డిలీట్ అయితే చాలు

ఈ లోకాన్ని ఏలేస్తా

పిచ్చిమారాజునై...

Monday 7 June 2021

మా అమ్మ

 

మా అమ్మ



మా ఇంట్లో మల్బరీ చెట్టు పండ్లు మా అమ్మకు చాలా ఇష్టం.. కింద పడిన పండ్లను ముట్టుకునేది కాదు.. స్వయంగా చెట్టు కొమ్మలను వంచుతూ తాజా తాజా పండ్లను తెంపుకుని తినేది. బాగా పండి నల్లగా మెరిసే పండ్లంటే అమ్మకు మరీ మరీ ఇష్టం.. చిన్న పిల్లలా కొమ్మల మధ్య తిరుగాడుతూ మల్బరీ పళ్ళను తినేది. పళ్ళ రసం తో ఎర్రగా మారిన పెదాలతో బోసిగా నవ్వులు కురిపించే అమ్మను చూస్తే ఎంతో ముచ్చటేసేది...

అమ్మ ఎప్పుడో వెళ్ళిపోయింది తిరిగిరాని లోకాలకు.. ఆ చెట్టు మాత్రం  పూత పూస్తూనే ఉంది. ఎప్పటిలాగే మధురమైన పండ్లు ఇస్తూనే ఉంది... కానీ అమ్మ మాత్రం లేదు. చాలా వరకు మల్బరీ పండ్లు నేలపాలవుతున్నాయి... ఇప్పుడు ఆ చెట్టుపై వాలుతున్న పక్షుల్లోనే అమ్మ కనిపిస్తోంది..ఓ కోయిల బాగా పండిన పండ్లను ఏరికోరి తింటుంటే అచ్చం మా అమ్మ కూడా ఇలాగే  చేసేది కదా అని అనిపిస్తోంది. పక్షులు, ఉడుతలు పండ్లలో తీయని బాగాన్నే తింటూ మిగతా బాగాన్ని కింద పడేస్తున్నాయి. అమ్మ కూడా ఎప్పుడూ ఇలా పండ్లను కొరికి పడేసేది. ఆ పక్షుల్లో ఒక పక్షిగా అమ్మ కూడా వచ్చిందా అనే భ్రమ కలుగుతోంది... పండ్ల బరువుతో కిందికి వంగిన కొమ్మలతో భారంగా కనిపిస్తున్న మల్బరీ చెట్టును చూస్తుంటే అమ్మ రూపమే మదిలో కదలాడుతోంది... నా మంచి చెడును నా కోణంలో అర్ధం చేసుకునే నా మంచి నేస్తం అమ్మ ఎందుకో ఈరోజు బాగా గుర్తుకు వస్తోంది 😰

Saturday 5 June 2021

బయటకు వెళ్తున్నావా

 

బయటకు వెళ్తున్నావా




కారులోనా

పర్సు బరువుగానే ఉందా గుడ్

అలాగే వెళ్ళు...

అదిగో అక్కడ పంక్చర్ షాపు ఉంది చూడు

ఒకసారి అన్ని టైర్లలో గాలి ఎంతుందో చెక్ చేయించుకో

పెట్రోల్ ఉందా

ఉంటే నో ప్రాబ్లమ్...

ఎలాగూ బయటికి వచ్చావుగా

అక్కడ తోపుడు బండ్లపై అమ్ముతున్న పండ్లు కొనుక్కో

పిల్లలు తింటారులే...

ఒకటే మాస్కు ఉతికి ఉతికి ఎన్నిసార్లు వాడతావు

చౌరాస్తాలో ఓ డజను మాస్కులు కొనుక్కో

ఇంట్లో వాళ్ళకూ అవసరమేగా...

రెడ్ సిగ్నల్ పడింది

బ్రేక్ వేయి

అరెర్రే... పెన్నులు అమ్ముతున్న ఆ ముసలమ్మను కసురుకుంటావెందుకు

పది రూపాయలేగా ఆ రెండు పెన్నులు తీసుకో...

ఆ పాప ఏదో అమ్ముతోంది చూడు

కోనేసేయ్

పనికి వస్తాయిలే...

వెళ్ళు నీ పనులేవో తొందరగా చక్కబెట్టుకో

లాక్ డౌన్ టైమ్ దగ్గరపడింది...

ఏంటీ ఆలోచిస్తున్నావ్

అనవసరంగా డబ్బులు ఖర్చయిపోయాయనా...

నువ్వు మహా అయితే ఐదొందలు ఖర్చు పెట్టి ఉంటావ్

నీ పర్సులో ఒకటి రెండు నోట్లు తగ్గితే నష్టమేమీ లేదు

ఆ నోట్లు కొన్ని కుటుంబాలకు అన్నం పెట్టాయని తెలుసుకో..

చిల్లర వ్యాపారులను చిన్న చూపు చూడకుండా

నువ్వు పెట్టిన ఖర్చు ఆ కుటుంబాలకు ఆకలి బాధ లేకుండా చేసిన విషయం గుర్తించు

నీ పెదవులపై తప్పనిసరిగా

ఓ చిరునవ్వు వికసిస్తుంది...

వెంటాడు వేటాడు

 

వెంటాడు వేటాడు

ఓ మనిషీ

అతి భయంకర కీకారణ్యమే ఈ జీవితం

అడుగు తీసి అడుగు వెయ్యటం ఇక్కడ ఓ పోరాటం

ఇక్కడ పులులూ సింహాలు

పొంచి ఉంటాయి

ఏ పొదలో విషనాగు బుసకొడుతుందో

ఏ మూలన తేళ్ళు

నిద్రపోతున్నాయో

అందమైన నెమళ్ళు

నాట్యమాడుతాయి

పీక్కుతినే రాబందులూ

స్వాగతం పలుకుతాయి

ఇక్కడ దుప్పి రక్తం తాగుతుంది

వానపామూ పడగ విప్పుతుంది

కుందేలూ తొడకొడుతుంది

అందమైన పూలవనం పలకరిస్తుంది

పువ్వు చాటున ముల్లు

గాయం చేస్తుంది

ఇక్కడ ప్రతిదీ భయానకమే

అంతా మాయాజాలమే

అడుగు ముందుకు పడాలంటే పోరాటమే

బతికి బట్ట కట్టాలంటే

తొక్కేయ్

అణిచేయ్

వెంటాడు

వేటాడు

ఈ జీవితం

కీకారణ్యంలో

వేట వంటిదే

వేట ఆగిందా

జీవితం నిన్ను వేటాడేస్తుంది

Friday 4 June 2021

నా ప్రాణవాయువు నువ్వే

 

నా ప్రాణవాయువు నువ్వే

 

నీ నుదుటిపై తడియారని

ముద్దు బొట్టులో

నన్ను నేను చూసుకోనా

నీ కురుల మేఘాలలో

తొలకరి చినుకునై

కురిసిపోనా

నీ మెడ వంపులపై వెచ్చని ఊపిరితో అక్షరాలు దిద్ది

అందమైన కవితలు రాసుకోనా

నీ కన్నుల వెన్నెలలో

సరిగంగ స్నానాలు చేసిపోనా

వసంతమే నువ్వైతే

తుమ్మెదను నేనై మత్తులో తూలిపోనా

నీ చల్లని చిరునవ్వులో

మెరుపునై మెరిసిపోనా

అయినా నేనెక్కడికి పోతాను

నీ శ్వాసే నాకు ప్రాణవాయువు కాదా

మనస్వినీ...

Thursday 3 June 2021

నాకు కోపం రావట్లేదు

 

నాకు కోపం రావట్లేదు


రోడ్డు మీద అడ్డం దిడ్డంగా పరుగులు తీస్తున్న ఆటోలను చూసి నాకిప్పుడు కోపం రావటం లేదు నాకు తెలుసు ఆ ఆటోవాల జీవనోపాదికి టైమ్ చాలా తక్కువని...

ఆటోలో ఒకరిపై ఒకరు కూర్చున్న పదిమందిని చూసి కోపం రావటం లేదు

నాకు తెలుసు సోషల్ డిస్టెన్స్ కన్నా టైమ్ లోపల గమ్యం చేరడమే వారికి ముఖ్యమని...

బారులు తీరిన వాహనాల ట్రాఫిక్ జామ్ చూసి కోపం రావటం లేదు

నాకు తెలుసు అదంతా బతుకుపోరాటంలో భాగమని...

షాపులవద్ద డిస్టెన్స్ పాటించని జనాలను చూసి కోపం నాకు రావటం

లేదు

నాకు తెలుసు అదంతా తిండిగింజల ఆరాటమని...

రోడ్డును ఆక్రమించి తోపుడు బళ్ళను పెట్టిన పండ్లు కూరగాయల వ్యాపారులను చూసి నాకు కోపం రావటం లేదు

నాకు తెలుసు అవి అమ్ముడుపోతేనే ఆ బడుగుల ఇంట్లో పొయ్యి వెలుగుతుందని...

రోడ్డు మీద గుంపులుగా నిలిచిన అడ్డాకూలీలను

చూసి నాకు కోపం రావటం లేదు

నాకు తెలుసు ఎక్కడైనా పని దొరకకపోదా అని వాళ్ళు ఆశతో ఎదురుచూస్తున్నారని...

సడలింపు టైమ్ లో జనసమూహలను చూసి నాకు కోపం రావటం లేదు

నాకు తెలుసు అది నిరుపేద భారతం ఆకలి పోరాటమని...

Wednesday 2 June 2021

చేప పగ

 

చేప పగ



ఓ అందమైన చేప తన సహచర చేపలతో నదిలో హాయిగా ఈదుతోంది.. దొరికిన ఆహారం తింటూ ఆనందంగా గడుపుతోంది. ఇంతలోనే ఆ చేపపై ఓ మనిషి వల విసిరాడు.. తన సహచర చేపలతో సహా అది వలకు చిక్కింది.. ఎన్నో కిలో మీటర్ల దూరం ఐసుగడ్డల బాక్సులో ప్రయాణించిన ఆ చేప చివరికి మార్కెట్ కు చేరింది.. వావ్..అంటూ ఓ మనిషి దానికి ధర చెల్లించాడు..అంతే ఆ చేప ముక్కలు ముక్కలు అయింది. మరణించిన ఆ చేప దేహంలోని ఆణువణువూ మనిషిపై పగబట్టింది.. ఘుమఘుమలాడే ఫిష్ కర్రిలో దాగి ఉన్న ఓ కుర్ర ముల్లు పగతో రగిలింది. ఎంతో కసితో మనిషి దవడకు గుచ్చుకుని గాయం చేసింది.. ముల్లు చేసిన గాయం బాధకు ఆ మనిషికి ఆ రాత్రి కాళరాత్రిగానే మిగిలిపోయింది. బాబోయ్ చేప ఎంత ఘోరంగా పగ తీర్చుకుంది.. ఆ చేపను కొన్న మనిషిని నేనే.. పంటి నొప్పితో విలవిలాలాడుతోందీ నేనే 😰