విజయవైభవం
ఇదేనా
నా మనసు కోరుకుంది
అవునేమో
ఇదేనేమో
మనసు అభిలషించింది
చీకట్లో చిరుదివ్వెలా
కడలి కెరటాలను
నిద్రపుచ్చే
సవ్వడి చేయని మారుతంలా
వికసించిన కుసుమంలా
మారిన
నింగిలోని తారకలా
చందమామలోని
చల్లని వెన్నెలలా
వయ్యారాలు ఒలికించే
కొలనులోని కలువలా
మనసు పుష్పం
వికసిస్తోంది
ఎన్నడూ లేని ధైర్యం
ఎప్పుడూ లేని నమ్మకం
ఏనాడూ కనిపించని
విజయదరహాసం
మనసు వేదికపై
నర్తిస్తోంది
నిజమేనా
ఇది నమ్మకమేనా
ఒక మెట్టు దిగిన మనసు
వంద మెట్లు పైకి
ఎక్కిందా
ఇది విజయమే
మనసు సాధించిన మహా
విజయమే
ఈ విజయమే
అంతిమం
ఈ పరిణామమే శాశ్వతం
విజయం తుది మెట్టును
ముద్దాడిన మనసు
శిఖరంలా
తల ఎగురవేస్తోంది
ఇక వెనుకడుగు వెయ్యదు
మనసు
వెనక్కి తిరిగి చూడదు
మనసు
ఇక విజయమే చేజారితే
గెలుపు మెట్టు
జారిపోతే
మనసు పుష్పం వాడిపోతే
అది నా ఓటమి కాదు
అదీ నా గెలుపే
మరణంతోనే విజయాన్ని
గుండెల్లో పదిలంగా
దాచుకుంటా
మనస్వినీ
No comments:
Post a Comment