నీ అనుమతి దానికి కావాలి
నాతో నీవు ఎప్పుడు
లేవని
ఎప్పుడూ నాతోనే ఉంటావు
నిత్యం నాలోనే ఉంటావు
నిన్ను నేను చూస్తూనే
ఉన్నా
రోజూ చూస్తూనే ఉన్నా
నాకు నీవు కనిపిస్తూనే
ఉన్నావు
ప్రతిక్షణం నేను
నీ అనుభూతిని
పొందుతూనే ఉన్నా
నీ ఉనికిని గమనిస్తూనే
ఉన్నా
నీ స్పర్శను
తెలుసుకుంటూనే ఉన్నా
అవును
నేను నిన్ను చూస్తూనే
ఉన్నా
కనురెప్పల పరదాలపై
భారంగా కదిలే కన్నీటి
చుక్కలో
నవ్వులు రువ్వే
పెదాలమాటున
చీకటిని అలుముకున్న
వేదనలో
గుండె గుడిలో జుగ్నూ
పురుగులా మెరిసే
ఎర్రని వెలుతురులో
మనసు పులకరింతలో
మనసుకు తగిలే
ప్రతిగాయంలో
నన్ను ముద్దాడే
అనురాగంలో
నర్మగర్భ పలుకుల్లో
ముల్లులా గుచ్చుకునే
నిందలలో
ఆకాశానికి ఎత్తేసే
ప్రశంసల జల్లులో
పడమటి కొండల్లో
కుంగిపోయే సూరీడులో
మబ్బులచాటు సేదతీరే
చందమామలో
ఎగసిపడే కడలి కెరటాలలో
కురిసే ప్రతి చినుకులో
మనసును తాకే మట్టి
వాసనలో
ఒకటేమిటి
నా ప్రతి అడుగులో
అడుగులజాడలో
నాకెప్పుడూ నీవు
కనిపిస్తూనే ఉంటావు
మనిషిని వీడి నీడ
మాయమైనా
నువ్వు మాత్రం నాతోనే
ఉంటావు
నాకు తెలుసు
నీకు నేను కావాలి
తెలుసు నాకు నీకు నేనే
కావాలి
నీకు అంత తేలికగా
దొరికిపోతానా మరణమా
మరణానికి ఏం తెలుసు
నేను ఓడిపోవాలంటే
నీ ఆనతి కావాలని
మనస్వినీ
No comments:
Post a Comment