ఇలా అనిపిస్తుంది
గుండెలో చెయ్యి పెట్టి
ప్రాణం తోడేసినట్టు
శ్వాసలో ఊపిరి
గాలిలో
కలిసిపోతున్నట్టు
దేదీప్యమానంగా
వెలుగులు విరజిమ్ముతున్నా
కంటి దివ్వెలు గుడ్డి
దీపాలుగా
ప్రభలు కోల్పోయినట్టు
మధురమైన సవ్వడులు కూడా
గుండె పొరను తాకనట్టు
చల్లని సమీరంలో
వేడి సెగలు మండినట్లు
జాబిలమ్మ వెన్నెలలో
ఎండమావులు
విచ్చుకున్నట్లు
విరిసే పెదవిలోనూ
వాడిన గులాబీలే
కనిపించినట్లు
అవును
నాకు ఇలాగే
అనిపిస్తుంది
పువ్వులా నవ్వులు
రువ్వే నువ్వు
మౌనదేవివైతే
వికసించే వదనం
ముభావమే అయితే
మనోప్రాంగణంలో
నర్తించే మనసు
వేదనాభరితమైతే
నాకు
ఇలాగే అనిపిస్తుంది
మనస్వినీ
No comments:
Post a Comment