ఒక్క
వరమివ్వు చాలు
విరిసిన వసంతాన్ని
వీడాలని లేదు
పచ్చని పొదరింటిని
దాటి వెళ్లాలని లేదు
ఎన్నాళ్ళో వేచిన
ఉదయమిది
ఎండిన కనుల కొలనులో
ఉబికిన అమృత ధార ఇది
ఈ అమృతధారను నేలపాలు
చేయాలని లేదు
అమృతంలోని ప్రతి
చుక్కనూ
ఆస్వాదించాలని ఉంది
వసంత హేళలో
విరిసిన ప్రతిపువ్వులో
మెరిసే నవ్వును
కావాలని ఉంది
పువ్వు పువ్వులో
మెరిసే నవ్వులో
నేనే కనిపించాలని ఉంది
అవును
ఈ అందమైన పూదోటను
వీడాలని లేదు
ఎండిన చెలమలు
ఎగసిపడే ధూళి మేఘాలు
జాడలే కానరాని బాటలు
కనుచూపు మేరలో కానరాని
వెలుగు రేఖలు
నీడలా వెన్నాడిన
వేదనలూ
అంతులేని రోదనలు
నిత్యం ఆవేదనమయం
నా హృదయం
ఇప్పుడే వికసించిన
వసంతానికి
సలాము చేస్తోంది
గులామునంటోంది
ఈ నవ్వులపువ్వుల
వసంతానికి
మనసు ప్రణమిల్లుతోంది
దేవుడా
ఈ వసంతాన్ని నాకు
శాశ్వతంగా ఇవ్వు
ఈ ఒక్క వరమివ్వు చాలు
నాకు
వరమియ్యని వేళ
వసంతం వాడిపోయే ఘడియ
నాకు
మరణమే ప్రసాదించు
ఇంకా నాకు
ఎడారి పయనం
చేతకాదు
మనస్వినీ
No comments:
Post a Comment