చెలి ఒడి దేవుని గుడి
నమాజు రివాజుల
దైవత్వం నీలో చూసాను
రాముని దివ్య చరణాల
మెరుపులు నీలో గాంచాను
జీసస్ ప్రేమ తత్వం
నీ పలుకుల్లో విన్నాను
అమ్మలోని కమ్మదనం
నీలోనే రుచి చూసాను
కనుల కొలను ఎగసిపడిన
వేళ
నీలో అపార కరుణను
పొందాను
మనసు మూగబోతే
నీ గుండె గానం
విన్నాను
కారు చీకటి అలుముకుంటే
నిన్ను కాగడాగా
మలుచుకున్నాను
మసీదు గోడల చల్లదనం
గుడిలోని పారవశ్యం
క్రీస్తు ఇంటి
ప్రేమమయం
ఒకటి కాదు
సృష్టి లోని సర్వస్వం
నీలోనే చూసాను
ప్రవక్తల ప్రేమ తత్వం
మహారుషుల ముక్తి
మార్గం
సమస్త దైవత్వం
నీలోనే పొందిన నేను
గుడి కంటే నీ ఒడి
మోక్షమని అనుకుంటే
సృష్టికర్తకు కోపం
రావచ్చు
నన్ను దైవద్రోహి అని
ఎవరైనా నిందించవచ్చు
మతవ్యతిరేకి అంటూ
శాపాలు పెట్టవచ్చు
దివ్యమైన ఆ గ్రంథాలను
బట్టిపట్టి చదివిన
వారికి కాదు
ఆ స్వర్ణ అక్షరాలను
మనసుపై ముద్రించుకున్న
వారికి
చెలి ఒడి కూడా దేవుని గుడియేనని
తెలుస్తుంది
మనస్వినీ
No comments:
Post a Comment