Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 30 November 2021

నేను మరణించాను

 

నేను మరణించాను

నేను నవ్వుతున్నా

వెచ్చని నీరేదో చెంపను ముద్దాడే దాకా తెలియదు నేను ఏడుస్తున్నానని...

నేను నడుస్తున్నా

కాళ్లకింద భూమి జారిపోయేదాకా తెలియలేదు

నేను పడిపోయానని...

నేను పోరాడుతున్నా

విజయధ్వానాలు వినేదాకా తెలియదు

నేను ఓడిపోయానని...

నేను జీవిస్తూనే ఉన్నా

గుర్తింపు కోల్పోయేదాకా తెలియలేదు నేను మరణించానని...

మళ్ళీ చంపేస్తారా?

 

మళ్ళీ చంపేస్తారా?



కట్టడి పేరుతో కట్టిపడేసి చంపేశారు

మళ్ళీ పుట్టాలని అనుకుంటున్నా

లేచి నిలబడాలని చూస్తున్నా

ఇంకా నేను పుట్టనేలేదు

మళ్ళీ చంపేస్తారా

ఏంటిరా ఇదీ

నేను బతకడమే మీకు ఇష్టం లేదా...

ఓ పురుగు వచ్చిందన్నారు

అందరినీ కాటేస్తుందని భయపెట్టారు

ఎందరిని కాటేసిందో తెలియదు గానీ

మీరు నన్నెందుకు కాటేశారు?

వాక్సిన్ అన్నారు

డోసు పెంచారు

ఇప్పుడు బూస్టర్ అంటున్నారు

ఏం మీ మందులేవీ పనికిరావా

ఇప్పుడు ఓమిక్రాన్ అంటూ జడిపిస్తున్నారు...

సిగ్గూ శరం ఉందా మీకు

ఎన్నికల జాతర చేస్తారు

లక్షలమంది చేరి భజన చేస్తారు

దేవుడిపేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తారు

ర్యాలీలు రోడ్ షోలు

ఘనంగా చేస్తారు

మీకు లేదా కట్టడి?

ఎందుకురా నన్ను మాత్రమే చంపుతారు

లాక్ డౌన్ పేరుతో ఆయువు తీస్తారు

చచ్చిన నేను మళ్ళీ పుట్టాలంటేనే భయం వేస్తోంది

లాక్ డౌన్ పేరుతో మళ్ళీ చంపేస్తారేమోనని...

నాకు జీవించాలని ఉంది

 

నాకు జీవించాలని ఉంది



నాకింకా జీవించాలని ఉంది

చందమామ వెన్నెల్లో ఆడుకోవాలని ఉంది

నా అక్షరాలకు ప్రాణంపోసి అందమైన పుష్పాలను విరబూయాలని ఉంది

మాట్లాడాలని ఉంది

వినాలనీ ఉంది

ఆడాలని ఉంది

ఆడించాలని ఉంది

పాడాలని ఉంది

పాడించాలనీ ఉంది

అయితే

ఈ మృతజీవుల కళేబరాలతో నడవాలని లేదు

గుండెలేని మరజీవులను పలకరించాలని లేదు

మనసు కాలిన కమురు వాసన నిండిన లోకంలో బతకాలని లేదు...

Thursday 18 November 2021

జిందాదిలీ...

 

జిందాదిలీ...



పూవులు విరబూస్తున్నాయ్

మకరందం లేనే లేదు.,

వాయువులు వీస్తూనే ఉన్నాయ్

ప్రాణవాయువే లేదు...

పెదాలు నవ్వుతున్నాయ్

మురిపించే మెరుపే లేదు...

కన్నులు చూస్తూనే ఉన్నాయ్

గుండెను తడిమే చూపే  లేదు...

చిత్రం ఉంది

చిత్తమే లేదు...

జిందగీ ఉంది

జిందాదిలీ లేదు

Tuesday 2 November 2021

ఎక్కడా దేవుడు?

 

ఎక్కడా దేవుడు?



పుక్కిటి పురాణాలలో

బూజుపట్టిన పుస్తకాలలో

గుడి గంటల గణగణల్లో

మైకులో వినిపించే పిలుపుల్లో

ధూపదీప నైవేద్యాలలో

ఐదు పూటల నమాజుల్లో

మూగగా నిలిచే శిలాప్రతిమల్లో

బీటలు వారుతున్న కట్టడాలలో

శైలువపై వేలాడే బొమ్మలో

నువ్వు వెతుకుతూనే ఉండు

నేను మాత్రం దేవుడిని మనిషిలో

వెతుకుతూనే ఉంటా..