చివరి సలాం
గుండ్రని బంతి కాదు నా మనసు
గోడకు కొడితే మరలా అక్కడికే చేరదు
బంతిలా దొరలదు నా మనసు
ఎటుపడితే అటుపారిపోదు
తెల్లకాగితం మీద నల్లసిరా
కాదు నా అక్షరం
గుండెగుడిలో ప్రభవించిన దీపం నా భావం
నా అక్షరం రంగు మారదు
నా భావం గతిని మార్చుకోదు
తొలిపొద్దు నిస్సారంగా గడిచి
సంధ్యవేళలో దయచేసిన ఆమనికి
ప్రణమిల్లింది మనసు
నడకమానిన మనసు
కొత్త అడుగులకు తివాచీ పరిచింది
అడుగులు ముందుకే పడతాయి
ఆ అడుగులు విడివడితే
ఆగిపోతుంది గమనం
నిలిచిపోతుంది పయనం
మారదు నాహృదయం
మార్చలేదు ఏ పవనం
అనుమతి అవసరం లేదు
ఆదేశం పనికిరాదు
మనసు దిశలోనే నడుస్తున్నా
మనసు చెప్పిందే వింటున్నా
ఒత్తిడి లేదు మనసుపై
ప్రభావం లేదు మనసుపై
నా మనసును మనస్వినికే
అంకితం చేశా
మనసు గుట్టు తెలియక
మనసే బెట్టు చేస్తే
మనసు మరణమే అంతిమం
నా మనసుకు
దశను దిశనూ నేర్పే దృశ్యం
ఎవరికీ లేదు
ఎందుకంటే
నా మనసు శోధన
ఆగిపోయింది
మనస్వినీ
No comments:
Post a Comment