దేవుడికి థాంక్స్
నువ్వూ నేనూ
ఎవరూ లేని చోటు
అవును
ఏకాంతంలో నా కాంతతో
నేను
ఒకరినొకరం
చూసుకుంటున్నాం
కొద్దిసేపు అన్నీ
మరిచిపోయాం
ఒకరికోసం ఒకరం అనే
భావనలో మునిగిపోయాం
ఏదో చెబుతున్నావు
నువ్వు
సముద్రుడి హోరులో నీ
మాటలు కలిసిపోతున్నాయి
వినలేని నీ పలుకులను
నేను వింటూనే ఉన్నా నా
మనసుతో
నీ పలుకుల దొంతరలు
నవ్వుల పువ్వులు
మెత్తగా తగులుతున్నాయి
మనసుకు
నీ భావాలన్నీ
గమనిస్తున్నా
నీ హావభావాలు
పరికిస్తూనే ఉన్నా
నువ్వు నవ్వుతూనే
ఉన్నావు
ఇంకా ఏదో చెబుతూనే
ఉన్నావ్
నేను మౌనమునిలా పలుకులు
దాచుకున్నా
నా మనసు నీతో
ముచ్చట్లు చెబుతూనే ఉంది
మనసు భాషలో నీతో
మాట్లాడుతూ
నిన్నే చూస్తున్నా
కడలికెరటాలను మించిన
పొంగులు
నీ ఎదపై భారంగా
కదులుతున్నాయి
నిన్ను మించిన పరువం
వచ్చేసింది అంటూ
పిల్లగాలులు కడలిని
వీడి
నీ కురులను ముద్దాడుతూ
ఉంటే
లయబద్దంగా కదిలే నీ
ముంగురులు
కొత్త కథలేవో
అల్లుతూనే ఉన్నాయి
సాయం సంధ్య వెలుగుల్లో
నీ నయనాలు
చల్లని వెన్నెల
కురిపిస్తూ ఉంటే
నా కనురెప్పలపై కొత్త
స్వప్నాలేవో
కదలాడుతూనే ఉన్నాయి
నవ్వుతున్న నీ పెదాల
మెరుపులను చూసి
నింగిలోని మెరుపులు
చిన్నబోతూ ఉంటే
నా మనసులో ఏవో తెలియని
భావాలు
మొలకలు వేస్తూనే ఉన్నాయి
అవును
ఏకాంతవేళ నా కాంత
తళుకులు
ప్రకృతికే అందని
సొగసులు
ఇలాగే ఉంటాం మనం
ఇలాగే ఉందాం మనం
నిన్నూ నన్నూ కలిపిన
దైవానికి
రుణపడి ఉంటాం మనం
నా కోసం నిన్ను
దివి నుండి భువికి
దించిన
దేవుడికి థాంక్స్
చెప్పకుండా ఎలా ఉంటా
మనస్వినీ
No comments:
Post a Comment