నీవే కదా సర్వం
క్రీగంట విసిరే కొంటెబాణాలు
పెదాలలో కురిసే వలపు వానలు
మేనివిరుపులో మెరిసే సొగసు తళుకులు
పలుకుల్లో జనియించే వలపు పుష్పాలు
నడకలో జాలువారే హంసధ్వనిరాగాలు
కురులు అల్లుకునే అనురాగ స్వప్నాలు
సర్వం సమర్పయామి అంటూ
నీవు ఇచ్చే వలపు తాంబూలాలు
ఇదే కాదా మనసు కోరుకుంది
ఇక్కడే కాదా నా మనసు పరిమళించింది
నీలోనే కాదా నా మనసు పులకించింది
మత్తుగా ఊగే ధూపం పరిమళాలు లేకున్నా
ఒదిగిపోయే హంసతూలికా తల్పం ఆనవాళ్ళు లేకున్నా
చుట్టూరా బృందావన మాలికలు కానరాకున్నా
మత్తుపానీయముల గమ్మత్తు ప్రవహించకున్నా
నీతో పంచుకునే నేల నాకు హంస తూలికమే
నీ కన్నుల జారే మధువు నాకు మత్తుపానీయమే
నీ అధర ధరహాసాల పుష్పికలే
నాకు విరజాజి మాలికల సొగసులు
నాలో కలిసిపోతూ
నేనే అన్నట్టుగా లీనమవుతూ
వెచ్చగా తగిలే నీ ఊపిరే నాకు మత్తైన పరిమళం
అవును
నీవే కదా నా సర్వం
నీవే కదా నా జననం
నీవే కదా నా మరణం
మనస్వినీ
No comments:
Post a Comment