విరహసంద్రం
పిల్లగాలులతో కబుర్లు చెప్పుకుంటూ
కిటికీ దగ్గర కూర్చున్న నీవు
కొద్ది దూరంలో నిన్నే గమనిస్తున్న
నా కంటివెలుగు ఒక రేఖలా నీ వైపు కదిలింది
నీ కురుల పరదాలను దాటిన
నా చూపు నీ చెక్కిలిని మీటుతూ
నిన్నుదాటి కిటికీ బయటకు దూకింది
కొద్దిదూరంలో
భారంగా కదులుతున్న అలలు
నీ సువాసనను మోస్తున్న నా చూపు తగిలి
కొత్త జీవం వచ్చిందేమో
అలలు చైతన్యకెరటాలుగా ఎగసిపడుతున్నాయి
ఎంత సుందర మనోహర దృశ్యం
మనసులో ఎగసిపడుతున్న మధురభావాల తాకిడికి
రంగులుమారుతున్న ముఖారవిందం
కొంచెం పరికించి చూస్తే
మోహావేశం పెరిగి అల్లకల్లోలమైన
విరహసంద్రం
నిన్నుతాకుతూ కడలిని చేరిన నా కంటిచూపుకు
జల తరంగాలు ఆనలేదేమో
మరలా నిన్నే చేరుకున్నాయి
కొంచెం బిడియం
కొంచెం ఆవేశం
ఇంకొంచెం విరహం
అన్నీ కలగలిపిన నీ ముందు
సాగరపరువం చిన్నబోయింది
ఎందుకో ఇదే దృశ్యం
పదే పదే కనులముందు
కదలాడుతూ ఉంది
మనసు మైదానంలో మొలకలు వేసిన ఊహలు
ఎక్కడలేని శక్తిని పొందితే
కనులముందు నిజమై నర్తిస్తాయి
మనస్వినీ
No comments:
Post a Comment