భావభ్రమణం
ఒక అందమైన భావానికి
ప్రాణం పోయాలని అనుకున్నా
ఒక పసందైన కవితకు
రూపమివ్వాలని అనుకున్నా
మనసు పుస్తకంలోని అక్షరాలను
ఏరుకోవాలని
మౌనముద్రలోకి జారుకున్నా
కన్నులు మూసి
ఆలోచనల్లోకి వెళ్ళిపోయా
చిత్రంగా
అక్షరాలు గుర్తుకురాలేదు
భావాలు మనసులోకి రాలేదు
కంటితెరలపై నీరూపమే
లీలగా కదలాడింది
నీ నవ్వుల పువ్వులు
మెత్తగా తగిలాయి మనసుకి
గులాబీ పరిమళాను పోలిన నీ శ్వాస
మత్తుగా ముద్దాడింది నా దేహాన్ని
నీ కొంటె చూపులు సున్నితంగా దిగాయి
ఎదమైదానంలోకి
అప్పుడు తెలిసింది నాకు
మరేదీ రాయలేనని
నిన్ను మించిన భావమేదీ నాలో లేదని
నా భావాలు నీ చుట్టే పరిభ్రమిస్తున్నాయని
నా అక్షరాలూ నీ మనసు చుట్టే చక్కర్లు కొడుతున్నాయని
ఇంకేం చెయ్యగలను
ఇంకేం రాయగలను
నా అక్షరమాలికలను
నీకు అంకితమివ్వడం తప్ప
మనస్వినీ
No comments:
Post a Comment