విరహగీతం
ఇంకా చీకట్లు పూర్తిగా
తొలగిపోనే లేదు
సూరీడు ఇంకా
నిద్దురలేవనేలేదు
గదిలో నేను ఇంకా
కన్నులు తెరుచుకోనేలేదు
ఆ కోయిలకు మాత్రం
తెల్లవారింది
మంద్రంగా మొదలైన
కోయిలస్వరం
మెల్లమెల్లగా
ఊపందుకుంది
శ్రావ్యమైన కోయిల
గానానికి
పక్షుల కిలకిల రావాలకి
అప్రయత్నంగానే కళ్ళు
తెరిచాను
అప్పుడే తెల్లారిందా
అని
నిమిషాలు గంటలుగా
గడుస్తున్నా
కోయిల గానం ఆగదు
ఆగదని నాకూ తెలుసు
రోజూ మాకిది మామూలే
మొదట్లో కోయిలగానం
హాయిగానే ఉంది
తర్వాత కొద్దిగా అసహనం
ఇప్పుడు ఆ గానమంటే
అభిమానం
ఎక్కడా లేని ఆరాధన
నిజం చెప్పాలంటే
ఆ కోయిలగానం గుండెను
తాకుతోంది
మనసును మెలియపెడుతోంది
నాకు తెలుసు ఆ కోయిల తన
నెచ్చెలిని పిలుస్తోందని
జతగోరిన మనసు
మనసైన తోడుకోసం
ఆక్రందనలు చేస్తోందని
మా ఇంటి మామిడి చెట్టు
కొమ్మలపై
ఆ కోయిల నిత్యం
పాడుతూనే ఉంది
అలుపెరుగకుండా
గానామృతం పంచుతూనే
ఉంది
శ్రావ్యమైన గొంతుకలో
ఏదో జీర పలుకుతోంది
అందరూ అది కోయిల
గానమని మురిసిపోయినా
ఆ గొంతుకలో తెలియని
వేదన
నా గుండెకు తగులుతూనే
ఉంది
అన్నిపక్షులు
వస్తున్నాయి చెట్టుపైకి
జతగా తోడూ నీడగా
కువకువలాడుతున్నాయి
ఆ కోయిలేమో ఒంటరిది
ఎన్నటికీ రాని
చెలియకోసం ఎదురు చూస్తూనే ఉంది
రోజులు గడుస్తున్నాయి
నెలలు మారిపోతున్నాయి
ఏమయ్యిందో ఏమో
ప్రియసఖి జాడ లేనే
లేదు
అది తిరిగి రానే రాదు
ఆశ చావని కోయిల
గొంతు ఎత్తి పాడుతూనే
ఉంది
విరహగానం వినిపిస్తూనే
ఉంది
నాకు తలుసు ఆ మనసు
విలపిస్తోందని
సజలనేత్రాలు
ఎండిపోతున్నాయని
కోయిల గుండె మండుతూనే
ఉందని
మనిషికే కాదు
ఆ కోయిలకూ మనసుందనీ
తోడు లేకపోతే
ఆ మనసూ విలపిస్తుందని
తెలిసిన నా మనసు
ఆ విరహగీతం ముగింపును
మనసారా కోరుతోంది
మనస్వినీ
No comments:
Post a Comment