ఎక్కడుంది ప్రేమ
ఆరిపోయిన చితిమంటల
బూడిదలో
సగం కాలిన కపాలాన్ని
అడుగు
ప్రేమ ఎక్కడుందో
కమురువాసనలోనూ
పరిమళాలు వెదజల్లుతుంది
ప్రేమ విఫలమై
ఉరికొయ్యకు బిగిసిన
అమాయకురాలి
కపాలమది...
గతవైభవాన్ని
వెక్కిరిస్తూ ముళ్ళకంపలు పెరిగిన
స్మశాన వీధిలో
గుంభనంగా పెరిగిన
మర్రి ఊడలకు వేలాడిన
ప్రేతాత్మల జంటను
అడుగు
ప్రేమ ఎక్కడుందో
కన్నీరు మున్నీరుగా
విలపిస్తాయి
ఆ ప్రేమ మేమే అని
గుండెలు బాదుకుంటాయి...
అన్నదాత పంటలకు
ప్రాణంపోసే
క్రిమిసంహారిని అడుగు
ప్రేమ ఎక్కడుందో
ప్రేమ హృదయాల ప్రాణం
నేనే తీసానని
వేదనతో
విలపిస్తుంది...
గాలికి ఎగిరిపోయి
చిత్తుకాగితాలుగా మారిన
ప్రేమలేఖలను అడుగు
ప్రేమ ఎక్కడుందో
తనకు అంటిన రక్తం
మరకల్లో
ప్రేమాక్షరాలు
కరిగిపోయాయని
ఆ కాగితాలు తెల్ల మొహం
వేస్తాయి...
అవును ప్రేమ అజరామరం
స్మశానమే ప్రేమకు
నివాసం...
లైలా మజ్నూలు
దేవదాసులు
కథలు కథానికలయినా
నేడూ ప్రేమ యముని
మహిషం ముందు
తలవంచుతోంది...
ఒక్కసారి చూడు
రగులుతున్న చితి మంటల
వైపు
మండుతున్న ప్రేమ
గులాబీలే కనిపిస్తాయి...
ఓ మనిషీ
ప్రేమను ప్రేమగానే
చూడు
అది నీలోనూ మొలకలు
వేసిన భావమే
నీలోనూ పులకింతలు
రేపిన భావమే
వర్ణ భేదాలు లేని
ప్రేమ
ప్రతి హృదిలో
ప్రతి మృతిలో
వికసిస్తూనే ఉంది
జీవించనీ ప్రేమనీ
ఎక్కడుందో వెతకకు
ప్రేమని
అది నీలోనూ
నాలోనూ ఉంది
జవమూ జీవమూ
ప్రేమే కదా
మనస్వినీ...
No comments:
Post a Comment