తరగని సిరి
తరగని సిరిని
దక్కించుకున్నా
ఎనలేని సంపదను స్వంతం
చేసుకున్నా
నాదన్నది ప్రతిదీ
పదిలం చేసుకున్నా
ఎవరూ చోరీ చేయలేనిది
దోపిడీకి ఆస్కారమే
లేనిది
అవును అంతా నాదే
నేను లేకున్నా
నా సంపద వికసిస్తూనే
ఉంటుంది
అవును
నా సంపద నా అక్షరాలే
నా సిరి అక్షర
కుసుమాలే
పులకించిన మనసు
భావాలను
ఇంద్రధనుస్సు రంగులలో
అద్దుకున్నా
మనసులోని ప్రతి రంగునూ
అక్షరంగా మలుచుకున్నా
కన్నీటి తెరలలో కరిగిన
స్వప్నాలను
తడియారబెట్టి
పువ్వులుగా నాటుకున్నా
ఆవేశంలో రగిలిన మనసును
మమతలతో చల్లార్చి
నెత్తురు సంతకాలు
చేసుకున్నా
నా ఆనందం నా అక్షరమే
నా ఆగ్రహం నా అక్షరమే
నా హాస్యం నా అక్షరమే
నా కన్నీరు నా అక్షరమే
చివరకు నా జీవితం
నా అక్షరమే
నా అక్షర రత్నాలను
భావాలుగా మలుచుకుని
మనసుపుస్తకంలో పదిలం
చేసుకున్నా
నేనున్నా లేకున్నా
నా సిరిసంపదలు కలకాలం
ఉండవా
మనస్వినీ
No comments:
Post a Comment