ప్రేమ
నల్లని మబ్బుల రాపిడిలో
ఉదయించిన మెరుపుల మాటున
రాలిపడే నీటి చినుకే ప్రేమ...
మెరుపులు పిడుగులై అవని గుండెను చీల్చితే
చల్లగా ముద్దాడుతూ సాంత్వన ఇచ్చే జలధార ప్రేమ...
అలిగిన మనస్విని పై కోపం కొండంత ఉన్నా
నుదుటిపై వల్లభుడు చేసే పెదాల సంతకమే ప్రేమ...
ఘర్షించిన సఖుడికోసం బెట్టువీడి
ఓ మెట్టుదిగి రెండుముద్దలు తినిపించాలన్న
చెలియ ఆరాటమే ప్రేమ...
ఇరుమనసుల ఘర్షణలో
ఎగసిపడిన ఆవేశంలో
సునామిలా పొంగి
చల్లగా కురిసిపోయేదే ప్రేమ...
సమాజం అగ్ని బాణాలు విసురుతున్నా
చిరునవ్వుతో సమాధానం చెబుతూ
మనసులో మూగగా రోధించే తీయని బాధే ప్రేమ...
రగిలే చితిమంటలలో
పచ్చగా మొలకలు వేసే
చల్లని పుష్పమే ప్రేమ...
ప్రేమ ఎలా ఉంటుంది
ప్రేమ ఎక్కడ ఉంటుంది
ప్రేమకు నిర్వచనం ఏమిటి
ఈ ప్రశ్నలకు మాటలు లేని
అందమైన అనుభవమే ప్రేమ...
శోధించరాదు అందరికీ దొరకదు ప్రేమ
అవసరమై కలిసి
విరసంలో విడిచిపోయే బంధం కాదు ప్రేమ...
ఎడారిలోనూ నీటి చెలమలు సృష్టించే
మధురమైన అనుబంధమే ప్రేమ...
No comments:
Post a Comment