అంతిమగమ్యం
శుక్రవారం
మధ్యాహ్నసమయం
మసీదుల్లో అజాన్ పిలుపు
దైవమే పిలుస్తున్న అనుభూతి
సైతాన్ ను జయించిన అనుభవం
ఇంకా నమాజుకు చాలా సమయమే ఉన్నా
అరగంట ముందుగానే మసీదుకు చేరుకున్నా
ఇంకా ఎవరూ రాలేదు
నేనూ ఒకరిద్దరు తప్ప
మండే ఎండలోనూ ప్రశాంతంగా ఉంది వాతావరణం
మెత్తని తివాచిపై గోడకు ఆనుకుని కూర్చున్నా
ఏదో తెలియని సాంత్వన మనసును ఆవరించింది
కొద్ది సేపు కనులు మూసుకున్నా
కళ్ళు తెరిచి చూస్తే
ఒక్కొక్కరు వస్తున్నారు
నాకు తెలిసినవారు కొందరు
తెలియనివారు మరికొందరు
హాయిగా అనిపించింది
అందరూ బంధువులుగానే కనిపించారు
ప్రతివారం వీరంతా వస్తారా
రారేమో
ఈవారం ఉన్నవారు మరువారం ఉండరేమో
తెలియని కొత్త మొహాలు కనిపిస్తాయేమో
అంతలోనే ఏదో తెలియనిభావం
ఈ రోజు నమాజుకు వచ్చిన నేను
మరువారం వస్తానా
ఏమో రానేమో
మనసును కుదుటపరుచుకున్నా
దైవానికి మాట ఇచ్చా
క్రమం తప్పకుండా వస్తానని
నీ బార్గాహ్ లో తలవంచుతా అని
శ్వాస ఆడినంతకాలమే కాదు
శ్వాస ఆగిన రోజు కూడా వస్తానని
అవును
నేను మాట తప్పను
జీవం కోల్పోయిన నా దేహం
అంతిమంగా చేరేది ఇక్కడికే
నా నమాజ్ ఎ జనాజా ఇక్కడే
నా అంతిమ గమ్యానికి చేరుకున్న
తన్మయత్వంలోనే
నమాజు పూర్తి చేసుకుని
ప్రసన్న వదనంతో
బయటికి అడుగులు వేసా
మనస్వినీ
No comments:
Post a Comment