వెన్నెల పొద్దు
నువ్వు గెలవాలి
నీ ప్రతిపదం విజయమే కావాలి
కష్టాల కడలిని దాటి
విజయతీరాలకు సాగాలి
నేలపై అర్భకులకు సవాలు విసురుతూ
విజయవిహంగమై ఎగరాలి
కన్నీరు కరిగి
కన్నులలో వెన్నెల పొద్దు పొడవాలి
గులాబీ రేకుల పెదాలపై
విజయదరహాసం మెరవాలి
చూడాలని ఉంది నీ గెలుపుని
ఆస్వాదించాలని ఉంది నీ విజయాన్ని
నీ వైభవంలో తన్మయం కావాలని ఉంది
నీ విజయపుష్పాలను తాకాలని లేదు
నీ గెలుపులో అధికారం నాకు వద్దు
నీ పాదాక్రాంతమయ్యే సమాజాన్ని
కసితీరా చూడాలని ఉంది
సాగిపోయే నీ కాన్వాయి ధూళిలో
మట్టిరేణువునై
నిలిచిపోవాలని ఉంది
ఇది నా అంతిమకోరిక
మనస్వినీ
No comments:
Post a Comment