నవచరితం
అవును
ఎవరు అవునన్నా కాదని తలబద్దలు కొట్టుకున్నా
నాకు ఆ గులాబీ పువ్వంటేనే ఇష్టం...
పూమాలికల మారాణి
ఎర్రని ఆ గులాబీ అంటే నాకు ప్రాణం...
ఎర్రని పూరేకుల సన్నని పరదాలలో
సేదతీరటం నాకిష్టం
పుప్పొడి రేణువులతో ఆకలి తీర్చుకోవటం నాకిష్టం...
పువ్వు రెక్కల ఒడిలో ఒదిగిపోయి
అమ్మలోని అనురాగాన్ని ఆస్వాదించటం నాకిష్టం...
అప్పుడే విచ్చుకున్న పిల్లరెక్కల లాలిత్యంలో
ప్రేయసి అధరాల అమృతం సేవించటం నాకిష్టం...
నాకు తెలుసు
గులాబీకి ముళ్ళున్నాయని...
రెక్కలనుంచి ఎమాత్రం జారినా
చాకులాంటి ముల్లు గుండెను ఛిద్రం చేస్తుందని...
అప్పటిదాకా ఉన్న ఆనందం ఆవిరైపోయి
వేదనలు రోదనలు తప్పవని...
పువ్వు చేసిన తప్పేముంది
ముళ్ళు గులాబీకి సహజసిద్ధ ఆయుధాలు...
నాకు అంతా తెలుసు
పువ్వులోని మాధుర్యం అనుభవించిన నేను
గుండెకోతకూ సిద్ధమే...
పువ్వు తన ముళ్ళను అస్త్రాలుగా మలుచుకున్నా
అవి నాపాలిట యమపాశాలే అని నాకు తెలుసు...
అయినా
ఆ పువ్వునే ప్రేమిస్తా
పువ్వు రెక్కలు నావే అయినప్పుడు
ఆ ముళ్ళు మాత్రం నావే కాదా...
వాడి వేడి ముళ్ళు నా ప్రాణం తీస్తాయనీ తెలుసు
అయినా ఆ పువ్వునే అక్కున చేర్చుకుంటా
ఆ పువ్వు కోసమే గుండెను పరుస్తా...
ఇది ఆత్మహత్యా సదృశ్యమని అనుకోను నేను
ఇది అమరత్వ మార్గమని నమ్ముతా...
మనసు చెప్పిన మార్గంలో అమరుడినై
నవ చరిత్రకు ప్రాణం పోస్తా
మనస్వినీ...
No comments:
Post a Comment