భువిలో పారిజాతం
అది వెలుతురు కాదు
అలాగని చీకటీ కాదు
చీకటివెలుగుల సంగమంలా
మసకమసకగా ఉన్న
వెలుతురులో
చీకటికాని నీలి
వెలుతురులో
కనిపించీ కనిపించని
నీవు
కొంచెం కొంచెం రూపం
దాలుస్తున్న నీ ఆకృతి
భువికి దిగిన పారిజాతంలా
నా మదిలో విరిసిన
ప్రణయ గీతంలా
అవును నువ్వే
అది నువ్వే
తెల్లని మేఘాలను
మరుమల్లియల
తెల్లదనాన్ని
తారలమ్మల మెరుపులను
ఒకటిగా చేసి
నిన్ను బొమ్మలా
మార్చాడేమో
ఆ దేవుడు
నిన్నే చూస్తున్నా
నీ అందాన్ని
ఆరాధిస్తున్నా
తెల్లని పాలమీగడ తెరల
నడుమ
పాలరాతి బొమ్మలా
నువ్వు
ఆ మల్లికలను మాలగా
అల్లుతూ
మల్లెలను సుతారంగా
మీటుతూ
ఒక్కొక్కటిగా కూర్చుతూ
ఏమని వర్ణించను నిన్ను
జాలువారుతున్న తారల
మెరుపులా
నవ్వుతున్న మల్లికల
సొగసులా
అప్పుడే విచ్చిన
పువ్వులా
బడలిక తీరిన రతీదేవిలా
నిశిరేయి ముచ్చటలా
నిన్ను చూస్తూ ఉంటే
ఏవేవో భావాలు
ఎన్నెన్నో సరాగాలు
మల్లికల మాలికలు ఎన్ని
అల్లినా
మేని సొగసులకు ఎన్ని
మెరుగులు వేసినా
ఏవీ నీకు అలంకారాలు
కాదు
నీ పరువం నడియాడే స్వర్గసీమే
మనస్వినీ
No comments:
Post a Comment